గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, డిసెంబర్ 2025, మంగళవారం

సంక్షిప్త రామాయణం పద్యానువాదం.... చింతా రామకృష్ణారావు. from...‎Tuesday, ‎20 ‎May, ‎2025

0 comments

 ‎Tuesday, ‎20 ‎May, ‎2025

సంక్షిప్త రామాయణం

ఆంధ్ర పద్యానువాదము.... చింతా రామకృష్ణారావు.

శ్రీమద్వాల్మీకీయ రామాయణే బాలకాండమ్ ।

ఓం శ్రీ సీతారామచంద్రపరబ్రహ్మణే నమః.

శా. శ్రీమన్మంగళ రామచంద్ర చరిత శ్రీఖండ సౌరభ్యమున్

సామాన్యుల్ వరపండితుల్ చదువుచున్ సంక్షేపరామాయణ

శ్రీమన్మంగళకావ్యమందు గొననౌన్ జిత్తంబులన్ బొంగుచున్,

నీమంబొప్ప తెనుంగు చేసెద హరీ! నిన్ భక్తితోఁ గొల్చుచున్.


ఉ.  శ్రీ గణనాయకా! నతులు, శ్రీరఘురాముని సచ్చరిత్రమున్

యోగులు భోగులున్ జదువ నొప్పిదమౌనటు సూక్ష్మసత్కథన్

రాగముతోడ వ్రాసెదను రమ్ము రచింపగ నిల్చి నా మదిన్,

నా గతి నీవె, విఘ్నములు నాయెడఁ గల్గకనీక కావుమా.


శా.  శ్రీమన్మంగళ శాంభవిన్! హరిసతిన్, శ్రీవాణి నాత్మస్థుఁడౌ

రామబ్రహ్మము నాత్మలోన గొలుతున్, రామోద్ధతిన్ తత్ కథన్

ధీమంతుల్ కవిపండితుల్ పొగడగా దేదీప్యమానంబుగా

శ్రీమంతంబుగ వ్రాయఁ జేయుటకు నా చిత్తంబులో నిల్పుచున్.


మ.  గురుదేవున్ వర రాఘవున్ దలచెదన్ గూర్మిన్ గృపన్ జూపగన్,

స్మరియింతున్ దలిదండ్రులన్ వినుత జన్మంబిచ్చి నన్ గాచుటన్,

వరణీయాద్భుత సత్కవీందుఁడగు నా వాల్మీకికిన్ మ్రొక్కెదన్,

పరమేశాని! రచింపఁ జేయుమిది నీ ప్రఖ్యాతి తెల్లంబుకాన్.


చం.  జయమగు పాఠకాళికి, ప్రశస్త కవీశ్వరపాళికిన్ ధరన్,

జయమగు రామ సత్కథను సౌమ్యముగా విను భక్తకోటికిన్,

జయమగు రామదర్శనము చక్కగ పొందిన వారికెప్పుడున్,

జయమగు మంచి కోరెడి ప్రశాంత మనస్కులకెల్లవేళలన్.


అథ ప్రథమస్సర్గః 

శ్లో.  తపస్స్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్ ।

నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవమ్ ॥ 1 ॥

శా.  శ్రీమన్మంగళుఁడున్ దపస్వి, నిరత శ్రీ సంహితాధ్యాయియున్,

ధీమంతుండును, వాగ్విదాంవరుఁడు, ఖ్యాతిన్ గన్న మౌనీంద్రుఁడున్,  

బ్రేమన్ గాంచెడి వాఁడు నౌ విధి సుతున్ శ్రీనారదున్ గోరె దే

వా! తెల్పంగదె యంచు  మౌనివరుఁడౌ వాల్మీకి జిజ్ఞాసతోన్. (1)

భావము.  తపశ్శీలుడును, వేదాధ్యయననిరతుడును, వాక్చతురులలో 

అగ్రేసరుడును, మునిశేఖరుడును, ఐన నారదుని గొప్ప తపస్వియైన 

వాల్మీకిమహర్షి జిజ్ఞాసతో ఇట్లు ప్రశ్నించెను. 


శ్లో.  కోఽన్వస్మిన్సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ।

ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః ॥ 2 ॥

తే.గీ.  ఎవఁడు గుణవంతుఁడవనిపై? నెవఁడు వీరుఁ?

డెవఁడు ధర్మజ్ఞుఁడెన్నగా? నిలఁ గృతజ్ఞుఁ

డెవఁడు? సత్యవా గ్జగతిలో నెవఁడు? తలప

దృఢతరంబగు సంకల్పధీరుఁడెవఁడు? (2)

భావము.  “ఓ మహర్షీ! సకలసద్గుణసంపన్నుడును, ఎట్టి విపత్కర 

పరిస్థితులలోను తొణకనివాడును, సామాన్య విశేష (లౌకికాలౌకిక) ధర్మములను 

ఎఱిగినవాడును, శరణాగతవత్సలుడును, ఎట్టి క్లిష్టపరిస్థితులయందును 

ఆడితప్పనివాడును, నిశ్చలమైన సంకల్పము గలవాడును అగు పురుషుడు 

ఇప్పుడు ఈ భూమండలమున ఎవడు?


శ్లో.  చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః ।

విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైకప్రియదర్శనః ॥ 3 ॥

తే.గీ.  నుత సదాచార ధనుఁడుఁ, బ్రాణుల కిలపయి

హితుఁడు, సకల శాస్త్రకుశలుఁ, డెన్న సర్వ

కార్య ధుర్యుఁడు, సంతోష కారి తనదు

దర్శనముచేత నెవ్వఁడు ధాత్రిపైన? (3)

భావము.  సదాచారసంపన్నుడును, సకలప్రాణులకును (తనయెడ విముఖులైన 

వారికిని) హితమును గూర్చువాడును, సకలశాస్త్ర కుశలుడును, సర్వకార్య 

ధురంధరుడును, తనదర్శనముచే ఎల్లరకును సంతోషమును గూర్చువాడును 

ఐన మహాపురుషుడెవడు?


శ్లో.  ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోఽనసూయకః ।

కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ॥ 4 ॥

తే.గీ.  విజిత క్రోధ సదాత్ముఁడు, విశ్వమునను

నుత సుశోభను విలసిల్లు నతులితాఽన

సూయుఁడ తని కోపమునకు  సురలు జడుతు

రట్టివాఁడెవ్వఁడిద్ధరనరయఁ జెపుమ. (4)

భావము.  ధైర్యశాలియు, క్రోధమును (అరిషడ్వర్గమును) జయించిన వాడును, 

శోభలతో విలసిల్లువాడును, ఎవ్వరిపైనను అసూయ లేనివాడును, రణరంగమున 

కుపితుడైనచో, దేవాసురులను సైతము భయకంపితులను జేయువాడును అగు 

మహాపురుషుడు ఎవడు ?


శ్లో.  ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే ।

మహర్షే త్వం సమర్థోఽసి జ్ఞాతుమేవంవిధం నరమ్ ॥ 5 ॥

తే.గీ.  ఇట్టి విషయముల్ మీ నుండి యెఱుఁగ నిచ్ఛఁ

గలిగి యుంటిని, నాపైన కరుణఁ జూపి,

చెప్పుటకు మీరె తగుదురు, చెప్పుఁడంచు

వేడుకొనుచుంటి ననె ముని వేడ్క మీర. (5)

భావము.  ఈ విషయములనుగూర్చి తెలిసికొనుటకు నేను మిక్కిలి 

కుతూహలపడుచున్నాను. ఓ మహర్షీ! మీరు సర్వజ్ఞులు, ఇట్టి. మహాపురుషుని

గుఱించి తెలుపగల సమర్థులు మీరే."


శ్లో.  శ్రుత్వా చైతత్త్రిలోకజ్ఞో వాల్మీకేర్నారదో వచః ।

శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్ ॥ 6 ॥

తే.గీ.  పలుకు వాల్మీకి మాటలన్ బరవశమున

మూడులోకాల నెఱిఁగిన మునివరుండు

విని, మహర్షీ! వచించెద వినుమటంచు

పలికె నాతనితోఁ దాను బదులుగాను. (6)

భావము.  త్రిలోకజ్ఞుడైన నారదుడు వాల్మీకి పలుకులను ఆలకించి, ఎంతయు 

సంతోషించెను. పిమ్మట అతడు "ఓ మహర్షీ! సరే! వినుము” అని వాల్మీకితో ఇట్లనెను.


శ్లో.  బహవో దుర్లభాశ్చైవ యే త్వయా కీర్తితా గుణాః ।

మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః ॥ 7 ॥

తే.గీ.  ఓ మునివర! నీవనినట్టి యుత్తమగుణ

చయము నరులలో దుర్లభం బయినఁ గాని

స్మృతికిఁ దెచ్చుకొని వచింతు చిత్తమలర,

శ్రద్ధతోడను వినుదువు, చక్కఁగాను.  (7)

భావము.  “ఓ మునీ ! నీవు ప్రస్తుతించిన బహువిధములైన ఆ ఉదాత్త గుణములు 

ఒక్కరియందే కుదురుకొనియుండుట సాధారణముగ దుర్లభము. ఐనను 

స్మృతికి దెచ్చుకొని, అట్టి గుణములు గల ఉత్తమపురుషుని గూర్చి తెలిపెదను 

వినుము.


శ్లో.  ఇక్ష్వాకువంశప్రభవో రామో నామ జనైః శ్రుతః ।

నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ ॥ 8 ॥

తే.గీ.  ధరణినిక్ష్వాకుకులభవుఁ డరయ రాముఁ

డనుపమానుండు, జగతిని వినుతిఁ గాంచె,

సన్నియతమతి, వీరుఁడు, సత్వ, తేజ

భర జితేంద్రియుఁడును, ధైర్యశూరుఁడతఁడు. (8)

భావము.  ఇక్ష్వాకు వంశము మిక్కిలి వాసిగాంచినది. లోకోత్తర పురుషుడైన 

శ్రీరాముడు అందవతరించి, ఎంతయు జగత్ప్రప్రసిద్ధుడాయెను. అతడు 

మనోనిగ్రహము గలవాడు, గొప్ప పరాక్రమవంతుడు, మహాతేజస్వి, ధైర్యశాలి, 

జితేంద్రియుడు.


శ్లో.  బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణః ।

విపులాంసో మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః ॥ 9 ॥

చం.  నిరుపమ బుద్ధిశాలియును నీతివిశారదుఁడున్, మహాహనుం

డరయగ వాగ్విదాంవరుఁడు, నాతఁడు శత్రు నిబర్హణుండు, శ్రీ

వరలెడువాడుచూడ ఘనబాహుఁడు, సన్నుత కంబు కంఠుఁడున్,

వరనుతబాహుశోభితుఁడు భాస్కరవంశజ దివ్యతేజుఁడున్.(9)

భావము.  ప్రతిభామూర్తి, నీతిశాస్త్ర కుశలుడు, చిఱునవ్వుతో మితముగా 

మాటాడుటలో నేర్పరి, షడ్గుణైశ్వర్యసంపన్నుడు, శత్రువులను సంహరించువాడు, 

ఎత్తైన భుజములు గలవాడు, బలిష్ఠమైన బాహువులు గలవాడు, శంఖమువలె 

నునుపైన కంఠముగలవాడు, ఉన్నతమైన హనువులు (చెక్కిలి పైభాగములు) 

గలవాడు.

(20-9-2025)


శ్లో.  మహోరస్కో మహేష్వాసో గూఢజత్రురరిందమః ।

ఆజానుబాహుః సుశిరాః సులలాటః సువిక్రమః ॥ 10 ॥

తే.గీ.  గొప్ప వక్షంబు, పెనువిల్లు, గూఢ జత్రు

వమరిన యరి దమనుఁడును ననుపమమగు

ఘనతరాజానుబాహువు, వినుత సుశిరుఁ

డు సులలాటుఁడు, రాముండు, నసముఁడరయ. (10)

భావము.  విశాలమైన వక్షఃస్థలము గలవాడు, బలమైన ధనుస్సుగలవాడు, పుష్టిగా గూఢముగానున్న సంధియెముకలుగలవాడు, అంతశ్శత్రువులను అదుపుచేయ

గలవాడు, ఆజానుబాహువు,  అందమైన గుండ్రని శిరస్సు గలవాడు, 

అర్థచంద్రాకారములో ఎత్తైన నొసలు గలవాడు, గజాదులకు వలె గంభీరమైన 

నడక గలవాడు.


శ్లో.  సమః సమవిభక్తాంగః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ ।

పీన వక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః ॥ 11 ॥

తే.గీ.  సముచితంబైన యవయవ సౌష్టవంబు,

స్నిగ్ధవర్ణ, ప్రతాపముల్, చెన్నుమీరు

పీనవక్ష, సునేత్రముల్, వినుతలక్ష్మి

నొప్పు శుభలక్షణుఁడు రాముఁ డి ప్పుడమిని. (11)

భావము.  శ్రీరాముడు అంతగా పొడవుగాని, పొట్టిగాని గాక ప్రమాణమైన దేహము గలవాడు, సమానమైన కరచరణాది- అవయవ సౌష్ఠవము గలవాడు, కనువిందుగావించు దేహకాంతి గలవాడు, పరాక్రమశాలి, పరిపుష్టమైన వక్షఃస్థలము గలవాడు, విశాలమైన కన్నులుగలవాడు, పొంకమైన అవయవముల పొందిక గలవాడు, సాటిలేని శుభ లక్షణములు గలవాడు, 

(20-10-2025)


శ్లో.  ధర్మజ్ఞః సత్యసంధశ్చ ప్రజానాం చ హితే రతః ।

యశస్వీ జ్ఞానసంపన్నః శుచిర్వశ్యః సమాధిమాన్ ॥ 12 ॥

తే.గీ.  సత్యసంధుఁడు ధర్మజ్ఞ సాధుశీలి,

క్షితి ప్రజాహిత రతుఁడును, కీర్తియుతుఁడు, 

జ్ఞానధనుఁడును, శుచియును, సాధువశ్యుఁ

డును, సమాధినొప్పెడి ఘనుఁడు రఘువరుఁడు. (12)

భావము. రాముఁడు ధర్మమునెఱిగినవాఁడు.  సత్యమునకు కట్టుబడువాఁడు. ప్రజలహితముపైన ఆసక్తి కలవాఁడు.  కీర్తిమంతుఁడు. జ్ఞానసంపద కలవాఁడు. స్వయముగా పవిత్రుడు, భక్త (ఆశ్రిత) పరాధీనుడు, ఏకాగ్రచిత్తుడు.


శ్లో.  ప్రజాపతిసమః శ్రీమాన్ ధాతా రిపునిషూదనః ।

రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా ॥ 13 ॥

తే.గీ.  బ్రహ్మసదృశుఁడు, కనఁగ శ్రీపతిసముండు,

ఫాలనేత్రుండు శత్రునిర్మూలనమున

లోకజీవసంరక్షణాలోలుఁడరయ,

ధర్మరక్షుఁడు రాముండు ధాత్రిపైన. (13)

భావము. రాముఁడు  ప్రజాపతి బ్రహ్మతో సమానమైనవాఁడు.  విష్ణువువలె అఖండైశ్వర్య సంపన్నుఁడు, శత్రువులను పరిమార్చుటలో హరునివంటివాడు, లోకమునందలి జీవులను రక్షించువాడు, ధర్మమును పరిరక్షించువాఁడు.


శ్లో.  రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా ।

వేదవేదాంగతత్త్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః ॥ 14 ॥

తే.గీ. తనదు ధర్మ సంరక్షకుఁడనవరతము,

స్వజన రక్షకుం డరయగ, సత్వమూర్తి,

వేదవేదాంగ తత్త్వజ్ఞ సాధు హితుఁడు,

మహి ధనుర్వేద నిష్ఠిత మహితుఁడరయ. (14)

భావము.  తనయొక్క ధర్మమును రక్షించువాఁడు. స్వజనులను రక్షించువాఁడు. వేదములయొక్క, వేదాంగములయొక్క తత్త్వమునెఱిఁగినవాఁడు. ధనువేదమునందు శ్రద్ధ కలవాఁడు.

శ్లో.  సర్వశాస్త్రార్థతత్త్వజ్ఞో స్మృతిమాన్ప్రతిభానవాన్ ।
సర్వలోకప్రియః సాధురదీనాత్మా విచక్షణః ॥ 15 ॥
తే.గీ.  సర్వశాస్త్రార్థ తత్త్వజ్ఞుఁడుర్విపైన,
స్మృతియుతుండు, తానన్నిటన్ ప్రతిభుఁడెన్న,
సకల లోకప్రియుండును, సాధుమూర్తి,
తా వివేకియు, కనఁగ నుదార గుణుఁడు. (15)
భావము.  సకలశాస్త్రములను సాకల్యముగా ఎఱిగినవాడు, శాస్త్రాదివిషయములయందు ఏమరుపాటు లేని వాడు, సమస్త వ్యవహారములయందు చక్కని స్ఫూర్తిగలవాడు, సమస్తజనులకును ప్రీతి పాత్రుడు, సౌమ్య స్వభావము గలవాడు, ఉదారస్వభావుడు, సదసద్వివేక సంపన్నుడు.

శ్లో.  సర్వదాభిగతః సద్భిః సముద్ర ఇవ సింధుభిః ।
ఆర్యః సర్వసమశ్చైవ సదైకప్రియదర్శనః ॥ 16 ॥
తే.గీ.  సంద్రమును చేరునదులట్లు సకల సత్పు
రుషులు రాఘవున్ జేరుదురు సతతంబు,
సకల జనులను రాముండు చక్కఁగఁ గను,
నాతనిని గాంచఁ బ్రీతియే యమరుచుండు. (16)
భావము.  నదులు సముద్రమును గలిసినట్లు సత్పురుషులు నిరంతరము శ్రీరాముని చేరుచుందురు. అతడు అందటికిని పూజ్యుడు, ఎవ్వరి యెడలను వైషమ్యములుగాని తారతమ్యములు గాని లేక మెలగువాడు, ఎల్లవేళల అందఱికిని ఆయన దర్శనము ప్రీతిని గొల్పుచుండు వాఁడు రాముఁడు. 

శ్లో.  స చ సర్వగుణోపేతః కౌసల్యానందవర్ధనః ।
సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ ॥ 17 ॥
తే.గీ.  సకల సద్గుణుఁ డాతఁడు, సంద్రమటుల
మహిత గంభీరుఁడెన్నఁగ, మహిని ధైర్య
మందు హిమవంతుఁడరయంగ, ననుపముఁడగు
మాన్య కౌసల్యసుతుఁడు, సమ్మాన్య ఘనుఁడు. (17)
భావము.  కౌసల్యానందనుడైన ఆ రాముడు సర్వ సద్గుణవిలసితుడు, అతడు సముద్రుని వలె గంభీరుడు, ధైర్యమున హిమవంతుడు.

శ్లో.  విష్ణునా సదృశో వీర్యే సోమవత్ప్రియదర్శనః ।
కాలాగ్నిసదృశః క్రోధే క్షమయా పృథివీసమః ॥ 18 ॥
తే.గీ.  వీర్యమందున విష్ణువు, ప్రీతిఁ గొలుపు
చంద్రునట్టులన్ గనినచో, సాంద్రమయిన
క్రోధమందున కాలాగ్ని, గొప్పదయిన
భూమియే రఘురాముండు పుడమి క్షమను, (18)
భావము.  పరాక్రమమున శ్రీమహావిష్ణువు, చంద్రునివలె ఆహ్లాదకరుడు, సుతిమెత్తని హృదయము గలవాడేయైనను తన ఆశ్రితులకు అపకారము చేసినవారియెడల ప్రళయాగ్నివంటివాడు. సహనమున భూదేవి వంటివాడు. 

శ్లో.  ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః ।
తమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమమ్ ॥ 19 ॥
తే.గీ.  త్యాగమున కుబేరుండు, సత్యమున ధర్మ
దేవతయె, పరాక్రమమున, దివ్యమయిన
సత్య సత్సుగుణములతోనిత్యముండు
రాఘవుండిల ధర్మసంరక్షకుండు. (19)
భావము.  కుబేరునివలె త్యాగస్వభావముగలవాడు, సత్యపాలనమున ధర్మదేవత వంటివాడు. అమోఘపరాక్రమశాలియైన శ్రీరాముడు ఇట్టి సద్గుణములతో ఒప్పుచుండువాడు. 

శ్లో.  జ్యేష్ఠం శ్రేష్ఠగుణైర్యుక్తం ప్రియం దశరథః సుతమ్ ।
ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతి ప్రియ కామ్యయా ॥ 20 ॥
తే.గీ.  అన్నదమ్ములనాద్యుండు ననుపమమగు
శ్రేష్ఠగుణుఁడు, దాశరధి సత్ప్రియముతోడ
ప్రజలకిల యుక్త హితములు ప్రబలఁ జేయు,
ప్రకృతికినిప్రియ కామ్యముల్ వరలఁ జేయు. (20)
భావము.  రాముఁడు సోదరులలో పెద్దవాడు, దశరథునకు ప్రియపుత్రుడు. ప్రజలకు హితమును గూర్చుటలో నిరతుడు, ప్రకృతికి ప్రియకామ్యములు వరలఁ జేయువాఁడు.

శ్లో.  యౌవరాజ్యేన సంయోక్తుమైచ్ఛత్ప్రీత్యా మహీపతిః ।
తస్యాభిషేకసంభారాన్ దృష్ట్వా భార్యాఽథ కైకయీ ॥ 21 ॥
తే.గీ.  ప్రీతితో రాజు యోచించె వినుత యౌవ
రాజ్యపట్టాభిషేకమ్ము రామునకును
చేయవలెనంచు, సతి కైక చేయుచున్న
పనులు గాంచెను, మందర పల్కులువిని. (21)
భావము.  అట్టి సకల సుగుణాభిరాముడు ఐన శ్రీరామచంద్రునకు తన మంత్రులవిజ్ఞప్తి మేరకు ప్రజల క్షేమము గోరి దశరథుడు మిక్కిలి ప్రసన్నుడై యువరాజపట్టాభిషిక్తునిగా చేయుటకు సిద్ధపడెను. దశరథుని భార్యయగు కైకేయి  రామునకు చేయుచున్న యౌవరాజ్యపట్టాభిషేక సంబారము చూచెను.

శ్లో.  పూర్వం దత్తవరా దేవీ వరమేన మయాచత ।
వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనమ్ ॥ 22 ॥
తే.గీ.  రెండువరములు పూర్వము నిండుమదిని
కైకకిచ్చె దశరథుఁడు, కైక కోరె
నిప్పుడారామునడవికి చప్పుననిపి
భరతునే యువరాజుగా వసుధ నిలుప. (22) 
భావము.  పూర్వము (శంబరాసురుని జయించిన సందర్భమున) దశరథుడు ఆమెకు రెండు వరములను ఇచ్చియుండెను. రాముని వనములకు పంపుమనియు, భరతుని యువరాజ పట్టాభిషిక్తునిగా జేయుమనియు ఆ రెండు వరములను ఇప్పుడు ఆమె తన భర్తనుకోరెను.

శ్లో.  స సత్యవచనాద్రాజా ధర్మపాశేన సంయతః ।
వివాసయామాస సుతం రామం దశరథః ప్రియమ్ ॥ 23 ॥
తే.గీ.  సత్యసంధుఁడు, సద్గుణసంస్తుతుండు,
ధర్మబద్ధుఁడయినయట్టి దశరథునకు
పంప నవసరపడె సుతున్ మాట కొరకు
నడవికిన్, గర్మ తప్పింప నలవి కాదు. (23)
భావము.  సత్యసంధుడైన ఆ దశరథమహారాజు ధర్మమునకు కట్టుబడి, ప్రియతమసుతుడైన శ్రీరాముని వనములకు పంపవలసి వచ్చెను. 

శ్లో.  స జగామ వనం వీరః ప్రతిజ్ఞామనుపాలయన్ ।
పితుర్వచననిర్దేశాత్కైకేయ్యాః ప్రియకారణాత్ ॥ 24 ॥
తే.గీ.  తండ్రిమాటను పాలించు తనయుఁడగుచు
వనమునకునేగె తా తండ్రి ప్రతిన నెఱిగి
నిలుపుచును, కైకకున్ బ్రీతిని గొలుపుచును,
రమ్యగుణగణ్యమహితుఁడారాముఁడెలమి. (24)
భావము.  వీరుడైన శ్రీరాముఁడు కైకేయికి ప్రియమును గూర్చుటకై, తాను చేసిన ప్రతిజ్ఞను అనుసరించి, పితృవాక్య పరిపాలనకై వనవాసమునకు బయలుదేరెను. 

శ్లో.  తం వ్రజంతం ప్రియో భ్రాతా లక్ష్మణోఽనుజగామ హ ।
స్నేహాద్వినయసంపన్నః సుమిత్రానందవర్ధనః ॥ 25 ॥
తే.గీ.  వినయసంపన్న భక్తుఁడు, వినుతమూర్తి
లక్ష్మణుఁడు రాముననుఁజుఁడు లక్ష్య మొప్ప
యన్నపై ప్రేమ, భక్తియు మిన్నుఁ దాక
వనమునకునేగె రామునిననుసరించి. (25)
భావము.  సుమిత్రాసుతుడైన లక్ష్మణుడు శ్రీరామునకు ప్రియసోదరుడు, మిక్కిలి వినయసంపన్నుడు, రామునియందు భక్తితత్పరుడు. రాముఁడడవికి జనుచుండ తానును అన్నననుసరించె అడవికి ఏగెను.
(21-10-2025)

శ్లో.  భ్రాతరం దయితో భ్రాతుః సౌభ్రాత్రమనుదర్శయన్ ।
రామస్య దయితా భార్యా నిత్యం ప్రాణసమాహితా ॥ 26 ॥
తే.గీ.  కనగనిది సోదరునికిని గణ్యమైన
ప్రీతితో సోదరుని ప్రేమ విరియుటగును,
రామునకుఁ బ్రియ పత్నియౌ రమణి సీత
నిత్యమతనికిఁ బ్రాణమై నిలుచునెపుడు. (26)
భావము.  సోదరుడికి ప్రియమైన సోదరభావాన్ని చూపించడం. రాముడికి ప్రియమైన భార్య సీత, ఎల్లప్పుడూ ప్రాణంలా ఉండేది.

శ్లో.  జనకస్య కులే జాతా దేవమాయేవ నిర్మితా ।
సర్వలక్షణసంపన్నా నారీణాముత్తమా వధూః ॥ 27 ॥
తే.గీ.  సీత జనకుని వంశ సంజాత, దేవ
మాయ వలె నిర్మితాంగన, మహిత గణ్య
దివ్య సల్లక్షణాన్విత, దీపకళిక,
స్త్రీలలోఁ గన నుత్తమ స్త్రీ ధరిత్రి. (27)
భావము.  జనకునివంశమున పుట్టిన సీత దేవ మాయ వలె అపూర్వమైన సౌందర్యము గలది, సర్వ శుభలక్షణ శోభిత.  స్త్రీలలో ఉత్తమురాలు. 

శ్లో.  సీతాఽప్యనుగతా రామం శశినం రోహిణీ యథా ।
పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన చ ॥ 28 ॥
తే.గీ.  శశిని రోహిణి వలె సీత చక్కగాను
పతిననుసరించి వెడలెను వనమునకును,
పౌరులును కొంత దూరము వచ్చినారు,
తాను కూడ వచ్చెనటుల దశరథుండు. (28)
భావము.  సీతయును చంద్రుని అనుసరించు రోహిణి వలె పతియగు రాముని అనుసరించి అడవికి పయనమయ్యెను. పౌరులును (ఆయనను విడిచియుండలేక) చాల దూరము ఆయనను అనుగమించిరి. దశరథుడును అనుసరించెను. 

శ్లో.  శృంగిబేరపురే సూతం గంగాకూలే వ్యసర్జయత్ ।
గుహమాసాద్య ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియమ్ ॥ 29 ॥
తే.గీ.  గంగ యొడ్డున కలయట్టి శృంగిభేర
పుర నిషాదాధిపుని, భక్తవరుని గుహుని
ధర్మనిరతుఁడు రాముండు దరికిఁ జేరె,
రథమునంపెను వెనుకకు, ప్రాకటముగ. (29)
భావము.  ధర్మాత్ముడైన శ్రీరాముడు గంగాతీరమున గల శృంగిబేరపురమున తనకు భక్తుడు, నిషాదులకు రాజు ఐన గుహుని గలిసికొనెను. పిమ్మట రథసారథిని (రథమును) వెనుకకు పంపివేసెను.
22 - 10 - 2025.

శ్లో.  గుహేన సహితో రామః లక్ష్మణేన చ సీతయా ।
తే వనేన వనం గత్వా నదీస్తీర్త్వా బహూదకాః ॥ 30 ॥
తే.గీ. నదులనే దాటి రాముండు కదిలి తాను. 
గుహునితో పాటు సీతతో కూర్మితమ్ము
డయిన లక్ష్మణ సహితుఁడై యడవియడవి
నడచుకొనుచును ముందుకు వెడలి వెడలి.  (30)
భావము.  శ్రీరాముడు సీతాలక్ష్మణులతోడను, గుహునితోడను గూడి జలసమృద్ధి గల నదిలను దాటి అడవి నుండి అడవికి నడచుకొనుచు సాగిపోవుచు. (తరువాత పద్యముతో అన్వయము).

శ్లో.  చిత్రకూటమనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ ।
రమ్యమావసథం కృత్వా రమమాణా వనే త్రయః ॥ 31 ॥
తే.గీ.  ఋషి భరద్వాజునాజ్ఞచే నసమ చిత్ర
కూట మునకు చేరిరచట గొప్పదైన
పర్ణశాలను నిర్మించి, వరలిరందు
సుఖముగా వారు మువ్వురున్, శోభిలుచును. (31)
భావము.  పిమ్మట భరద్వాజ మహర్షి ఆదేశమును అనుసరించి, సీతారామలక్ష్మణులు మందాకినీ నదీతీరమునగల చిత్రకూటమునకు చేరిరి. అచట చక్కనిపర్ణశాలను నిర్మించుకొని ఆ ముగ్గురును నివసింపసాగిరి.

శ్లో.  దేవగంధర్వసంకాశాస్తత్ర తే న్యవసన్సుఖమ్ ।
చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తథా ॥ 32 ॥
తే.గీ.  దేవగంధర్వ సములయి దివ్యగతిని
పర్ణశాలనుమువ్వురున్ వరలుచుండి,
రటుల చిత్రకూటంబున నలరు సుతుని
కొఱకు దశరథుం డార్తిని కూరుకొనెను. (32)
భావము. ఆ మువ్వురూ దేవగంధర్వసదృశులై సుఖముగా ప్రశాంతముగా ఆ పర్ణశాలయందు జీవింపసాగిరి. సీతారామలక్ష్మణులు చిత్రకూటమునకు చేరగా (అయోధ్యలో) దశరథమహారాజు పుత్ర శోకమునకు లోనయ్యెను.

శ్లో.  రాజా దశరథః స్వర్గం జగామ విలపన్సుతమ్ ।
మృతే తు తస్మిన్భరతో వసిష్ఠప్రముఖైర్ద్విజైః ॥ 33 ॥
తే.గీ.  దశరథుండు శోకించుచు తనయునికయి,
స్వర్గమును చేరె మృతినొంది, సత్వరంబె
వరవశిష్ఠాదిఋషులట భరతునికడ
కరిగి కలిసి రా మహితుని నర్థితోడ. (33)
భావము. దశరథమహారాజు పుత్ర శోకకారణముగా సుతునికై విలపించుచు స్వర్గస్థుడాయెను. దశరథుడు మృతి చెందిన పిమ్మట వసిష్ఠుడు మొదలగు బ్రాహ్మణోత్తములు భరతుని కలిసిరి. 

శ్లో.  నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః ।
స జగామ వనం వీరో రామపాదప్రసాదకః ॥ 34 ॥
తే.గీ.  కొనుము రాజ్యాధికారమ్ము కొమరుమిగుల
భరత! యని పల్కిరా మునుల్, భరతుఁ డటులఁ
గొనఁగ నిచ్చగింపక యేగె వనమునకును 
రాముననుమతిన్ బాదుకల్ రహిని గొనఁగ. (34)
భావము.  వసిష్ఠుడు మొదలగు బ్రాహ్మణోత్తములు రాజ్యాధికారమును స్వీకరింపుమని భరతుని నియోగించిరి. అందులకు ఆ మహావీరుడు సమ్మతింపలేదు. రాజ్యకాంక్ష లేని ఆ భరతుడు పూజ్యుడైన రాముని అనుగ్రహమును పొందగోరినవాడై, వనములకు బయలుదేరెను.
23 - 10 - 2025.

శ్లో.  గత్వా తు స మహాత్మానం రామం సత్యపరాక్రమమ్ ।
అయాచద్భ్రాతరం రామం ఆర్యభావపురస్కృతః ॥ 35 ॥
తే.గీ.  నుత పరాక్రమునిని, సత్యనుతుని, రాముఁ
నార్యభావపురస్కృతుండనుపముఁడగు
భరతుఁడల చేరి, శ్రీరామ వరుఁ డడుగక
నే వచించెను నుతమతిన్ నిరుపమముగ. (35)
భావము.  ఆ భరతుఁడు సత్యపరాక్రమశాలి, మహాత్ముఁడు, సోదరుఁడు ఐన రాముని వద్దకు వెళ్లి, మహోన్నతమైన గౌరవ భావనతో రాముఁడు అడకకుండగనే తాను ఇట్లు పలికెను. 

శ్లో.  త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచోఽబ్రవీత్ ।
రామోఽపి పరమోదారః సుముఖస్సుమహాయశాః ॥ 36 ॥
తే.గీ.  రాజు వీవేను, ధర్మజ్ఞ రమ్యుఁడవును
నీవె, యనిపల్కె భరతుండు, నిరుపముఁడగు
రామునిని గాంచి, యతఁ డుదారగుణయుతుఁడు, 
వాసిఁగాంచిన సుముఖుండు, భవ్యమూర్తి. (36) 
భావము. నీవే రాజువు, ధర్మము తెలిసిన వాడవు, అని రాముని ఉద్దేశించి భరతుడు పలికెను. రాముఁడు మిక్కిలి ఔదార్యము గలవాడును, ఎల్లప్పుడూ ప్రసన్నముగా ఉండువాడును, వాసిగాంచినవాడు. 

శ్లో.  న చైచ్ఛత్పితురాదేశాద్రాజ్యం రామో మహాబలః ।
పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్త్వా పునః పునః ॥ 37 ॥
తే.గీ.  తండ్రియాజ్ఞచేఁ, బాలనన్ తాను గొనక,
నుత మహాబలుఁడగు రాముఁడతులితముగ
న్యాసముగ పాదుకలనిచ్చె, నచ్చచెప్పె,
రాముఁడంపగ భరతుని రాజ్యమునకు. (37)  
భావము.  మహాబలుఁడు అయిన శ్రీరాముఁడు తండ్రి ఆదేశమును అనుసరించి రాజ్యాధికారమును చేపట్టుటకు ఇష్టపడలేదు. అనంతరము రాముఁడు తనకు ప్రతినిధిగా తన పాదుకలను న్యాసముగా భరతునకు ఒసంగి, పలువిధములుగా నచ్చజెప్పెను.

శ్లో.  నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః ।
స కామమనవాప్యైవ రామపాదావుపస్పృశన్ ॥ 38 ॥
తే.గీ.  రాముడంపెను భరతుని రాజ్యమునకు,
కోరికీడేరకున్నను గొనుచు రామ
పాదుకలను, రాముని దివ్యపాదములకు
వందనముచేసి మరలెను భరతుఁడపుడు. (38)
భావము. 
శ్రీరాముడు భరతుని రాజ్యమునకు తిరిగి  వెళ్ళమని ఒప్పించెను. భరతుఁడు  'అయోధ్యకు శ్రీరాముని తీసుకొని రావలెను' - అను తన లక్ష్యము నెరవేఱకున్నను, రామపాదములను స్పృశించి, నమస్కరించి వెనుతిరిగెను.

శ్లో.  నందిగ్రామేఽకరోద్రాజ్యం రామాగమనకాంక్షయా ।
గతే తు భరతే శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియః ॥ 39 ॥
తే.గీ.  ఇంద్రియజితుఁడు, శ్రీమంతుఁ డిద్ధరిత్రి
సత్యసంధుఁడు భరతుఁడు సహనశీలు
డెదురు చూచుచు నన్నకై  మదిని నిలిపి
ప్రోలునేలె నందిగ్రామముననె యుండి. (39)
భావము.  శ్రీమంతుడు, సత్యసంధుడు జితేంద్రియుడైన భరతుడు అతను వెళ్ళిపోయిన తర్వాత రాముడు తిరిగి వచ్చుననెడి ఆశతో నందిగ్రామంలోనే రాజ్యాన్ని పాలించాడు.

శ్లో.  రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ ।
తత్రాగమనమేకాగ్రో దండకాన్ప్రవివేశ హ ॥ 40 ॥
తే.గీ.  చూచి రాముఁడు తమనట చూడవచ్చు
జనుల వలన తాపసులకు జరుగు భంగ
మనుచు నటనుండి చనె దండకాటవికిని,
తమ్ముఁడును సీత తనతోడఁ దరలి రాగ. (40)
భావము.  
శ్రీరాముడు తన దర్శమునకై తఱచుగా పౌరులు జానపదులు అచటికి వచ్చుచుండుట గమనించి, ఆ కారణముగా అచటి మునులతపశ్చర్యలకు విఘ్నములు ఏర్పడునని భావించెను. పిమ్మట అతడు దండకారణ్యము చేరుటకు నిశ్చయించుకొనెను. సావధానముగా సీతా లక్ష్మణులతో గూడి దండకారణ్యమును జేరెను. 

శ్లో.  ప్రవిశ్య తు మహారణ్యం రామో రాజీవలోచనః ।
విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శ హ ॥ 41 ॥
తే.గీ. రమ్య రాజీవ నేత్రుఁడు రాముఁడటుల
దండకారణ్యమును జేరి, తాను చంపె
నట విరాదుఁడన్ రాక్షసు నమితభక్తి
ని శరభంగ ఋషిన్ గనె నియతి తోడ. (41)
భావము.  దండకవనమున ప్రవేశించిన పిమ్మట రాజీవలోచనుడైన శ్రీరాముడు 'విరాధుడు' అను రాక్షసుని సంహరించెను. శరభంగమహర్షిని దర్శించెను. 

శ్లో.  సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్యభ్రాతరం తథా ।
అగస్త్యవచనాచ్చైవ జగ్రాహైంద్రం శరాసనమ్ ॥ 42 ॥
తే.గీ.  కనె సుతీక్షునగస్త్యుని, వినయమొప్ప,
కనె నచట నగస్త్యభ్రాతను, నయవినుతుఁ
డయిన రాముం డగస్త్యుని యాజ్ఞనతని
ఘన శరాసన, హరివిల్లులను గ్రహించె. (42)
భావము.  శ్రీరాముడు సుతీక్షుని, అగస్త్యమునిని, ఆయనసోదరుని దర్శించెను. అగస్త్యుని ఆదేశానుసారము ఆయన నుండి ఇంద్రచాపమును గ్రహించెను. 
26 - 10 - 2025.

శ్లో.  ఖడ్గం చ పరమప్రీతస్తూణీ చాక్షయసాయకౌ ।
వసతస్తస్య రామస్య వనే వనచరైః సహ ॥ 43 ॥
తే.గీ.  అనుపమాక్షయ సాయకమైన యమ్ము
లపొది, కత్తి, రామునకిష్టము పరికింప,
వనచరులతోడనడవిలో వసనముండె
రామచంద్రుండు, వరణీయ రమ్యగుణుఁడు. (43)
భావము.  ఖడ్గము మరియు అక్షయ బాణాలు కలిగిన తూణీరము (బాణాల గూడు) రాముడికి ఎంతో ప్రీతికరమైనవి. శ్రీరాముడు వనచరులతో కలిసి అడవిలో నివసించుచుండెను.
27 - 10 - 2025.

శ్లో.  ఋషయోఽభ్యాగమన్సర్వే వధాయాసురరక్షసామ్ ।
స తేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తథా వనే ॥ 44 ॥
తే.గీ.  రక్కసులఁ జంపఁ గోరిరి రాము నచట
చేరి ఋషులెల్ల, రాముఁడా కోరికవిని
దైత్యసంహారమునుఁ జేయఁ దానునచట
వనచరులతోడ నివసించె వనమునందు. (44)
భావము.  రాక్షసుల సంహారము చేయమని కోరడం కోసము అనేకమంది ఋషులు వచ్చి రామునివద్దకు చేరిరి. అప్పుడు రాముడు ఆ రాక్షసు సంహారార్థం అడవిలో వనచరులతో సహా నివసిస్తున్నపుడు, ఆ ఋషుల ప్రార్థనలను, అభ్యర్థనలను అంగీకరించాడు.

శ్లో.  ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధః సంయతి రక్షసామ్ ।
ఋషీణామగ్నికల్పానాం దండకారణ్యవాసినామ్ ॥ 45 ॥
తే.గీ.  అగ్నికల్ప ఋషులు దండకాటవిన్ వ
సించు వారి కోరిక మేర త్రుంచుదునిల
రాక్షసులనని రాముఁడు ప్రతినబూని,
జన్మ పరమార్థమును గని సంస్తుతముగ. (45)
భావము.  దండకారణ్యంలోని అగ్నితుల్యులైన ఋషుల కోరిక మేరకు, రాముఁడు యుద్ధంలో రాక్షసులను సంహరిస్తానని ప్రతిజ్ఞ చేసెను.

శ్లో.  తేన తత్రైవ వసతా జనస్థాననివాసినీ ।
విరూపితా శూర్పణఖా రాక్షసీ కామరూపిణీ ॥ 46 ॥
తే.గీ.  ఆ జనస్థానవాసియై యచట రాముఁ
డుండగా కామరూపిణి యుండె నచట
శూర్పణఖ, యామె ముకుచెవుల్ ఛురికతోడ
కోసినారు, కురూపిగాఁ జేసినారు. (46)
భావము.  అప్పుడు రాముడు అక్కడ జనస్థానంలో నివసిస్తూ ఉండగా కామరూపిణి అయిన శూర్పణఖ అనే రాక్షసిని విరూపురాలిగా మార్చారు.

శ్లో.  తతః శూర్పణఖావాక్యాదుద్యుక్తాన్సర్వరాక్షసాన్ ।
ఖరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసమ్ ॥ 47 ॥
తే.గీ.  శూర్పణఖ మాటలను విని శూరులైన
త్రిశిరస, ఖర, దూషణులు కలిసి, యనేక
రాక్షసులతోడ వచ్చిరి రాముని గని,
యుద్ధమును జేసి, చంప సన్నద్ధులగుచు. (47)
భావము.  అనంతరము శూర్పణఖచే రెచ్చగొట్టబడిన ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు అను రాక్షసప్రముఖులు అసంఖ్యాక రాక్షసులతోగూడి, యుద్ధసన్నద్ధులై వచ్చిరి. 

శ్లో.  నిజఘాన రణే రామస్తేషాం చైవ పదానుగాన్ ।
వనే తస్మిన్నివసతా జనస్థాననివాసినామ్ ॥ 48 ॥
తే.గీ.   అంతటను రాముఁడొక్కఁడే యచటనున్న
త్రిశర, ఖర, దూషణులను, పదియునునాల్గు
వేల రాక్షస సైన్యమున్ నేలకొరఁగఁ
జంపె, దివ్యమహాద్భుత శక్తినొప్పి. (48)
భావము.  అంతట శ్రీరాముడు ఒక్కడే జనస్థాన నివాసులైన పదునాలుగు వేలమంది రాక్షసయోధులను, ఖరదూషణ త్రిశిరులను రణభూమికి బలిగావించెను. 

శ్లో.  రక్షసాం నిహతాన్యాసన్సహస్రాణి చతుర్దశ ।
తతో జ్ఞాతివధం శ్రుత్వా రావణః క్రోధమూర్ఛితః ॥ 49 ॥
తే.గీ.   త్రిశర, ఖర, దూషణులను, పదియునునాల్గు
వేల రాక్షస సైన్యమున్ నేలకొరఁగఁ
రాముఁడే చంపెనను వార్త రావణుండు
శూర్పణఖచెప్ప కోపవశుఁడుగనయెను. (49) 
భావము.  రావణుడు తన దాయాదులైన ఖరదూషణ త్రిశిరులను శ్రీరాముడు వధించిన వార్తను శూర్పణఖ ద్వారా విని, క్రోధముతో ఉడికిపోయెను. 

శ్లో.  సహాయం వరయామాస మారీచం నామ రాక్షసమ్ ।
వార్యమాణః సుబహుశో మారీచేన స రావణః ॥ 50 ॥
తే.గీ.  తనకు సాయము చేయమంచనియె రావ
ణుండు మారీచుని గని, ఘనుండు రాముఁ
డతనితో వైరమొప్పదంచతని నపుడు
తగ నివారింపఁ జూచె నతనిని గనుచు. (50)
భావము.  పిమ్మట అతడు మారీచుడు అను రాక్షసుని కడకు వెళ్ళి, (సీతాపహరణ విషయమై) అతని సహాయమును అర్ధించెను. అప్పుడామారీచుడు "శ్రీరాముడు నీకంటెను శక్తిమంతుడు, అంతటివానితో విరోధము నీకు తగదు." అని పలికి, రావణుని పెక్కువిధముల వారించెను. 

శ్లో.  న విరోధో బలవతా క్షమో రావణ తేన తే ।
అనాదృత్య తు తద్వాక్యం రావణః కాలచోదితః ॥ 51 ॥
తే.గీ.  రామచంద్రునితోడ వైరంబు తగదు,
రావణా! నీకన వినఁడు, రావణుండు,
కాలచోదితుఁడై తాను కదలె నపుడు
తోడ మారీచుఁ గొనిపోయె, దురితమతిని. (51)
భావము.  వాని హెచ్చరికలను పెడచెవిన బెట్టి, ఆయువుమూడిన రావణుడు మారీచుని వెంటబెట్టుకొని పోయెను, 
28 - 10 - 2025.

శ్లో.  జగామ సహమారీచః తస్యాశ్రమపదం తదా ।
తేన మాయావినా దూరమపవాహ్య నృపాత్మజౌ ॥ 52 ॥
తే.గీ.  రాము నాశ్రమమునకు నా రావణుండు
చేరె మారీచునిఁ గొని, సుదూరమునకు
రామలక్ష్మణులరుగఁ, నాశ్రమము వీడ
చేసె మారీచు మాయచే, శీఘ్రముగను. (52)
భావము.  ఆ విధముగా రావణుఁడు మారీచునితోసహా శ్రీరాముని ఆశ్రమ (పంచవటి) సమీపమునకు చేరెను. పిమ్మట రావణుడు మాయావియైన మారీచుని సహకారముతో రామలక్ష్మణులను వారి ఆశ్రమము నుండి దూరముగా పోవునట్లు చేసెను, 

శ్లో.  జహార భార్యాం రామస్య గృధ్రం హత్వా జటాయుషమ్ ।
గృధ్రం చ నిహతం దృష్ట్వా హృతాం శ్రుత్వా చ మైథిలీమ్ ॥ 53 ॥
తే.గీ.  రామునాలిని గొనిపోయె రావణుఁడిల,
నడ్డువచ్చిన గృద్ధ్రమున్ హతమొనర్చి,
మృతిని పొందు జటాయువున్ క్షితిని గాంచి,
రాముఁ డెఱిఁగె సీతనుఁ గూర్చి,  రగులుచు మది. (53)
భావము. రావణుఁడు సీతాదేవిని అపహరించుకొని పోయెను. దారిలో తనకు అడ్డుతగిలిన 'జటాయువు' అను గృధమును ప్రాణములు పోవునట్లుగా గాయపఱచెను. చంపఁబడిన గృధ్రం (జటాయువు)ను చూచి, మైథిలి (సీత) అపహరించబడిన దని రాముఁడు వినెను.

శ్లో.  రాఘవః శోకసంతప్తో విలలాపాకులేంద్రియః ।
తతస్తేనైవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషమ్ ॥ 54 ॥
తే.గీ.  శోకసంతప్త రాఘవుఁ డాకులుఁడయె
మృతినిపొంద జటాయువు, క్షితి నతండు
దహనసంస్కారమును జేసె తప్తుఁడగుచు
చిత్తమున విలపించుచు సీత కొఱకు. (54)
భావము.  జటాయువుమృతికి శ్రీరాముడు వ్యాకులపాటుతో శోకసంతప్తుడై విలవిలలాడెను. ఇట్లు శోకమున మునింగియు శ్రీరాముడు జటాయువునకు అంత్యసంస్కారములను నిర్వహించెను. 

శ్లో.  మార్గమాణో వనే సీతాం రాక్షసం సన్దదర్శహ
కబంధం నామ రూపేణ వికృతం ఘోర దర్శనమ్.
తే.గీ.  సీత జాడకై వెదకుటఁ జేయుచున్న
రామచంద్రుఁడు కాంచెను రక్కసునట
వికృతముగనున్నవానిని భీకరమగు
రూపుఁడగు కబందునిని, విరోధ మతిని.  (55)
భావము. రాముఁడు అడవిలో సీతమ్మ కొఱకు వెతుకుతూ, చూచుటకు వికృతముగా ఘోరముగా ఉన్న కబందుఁడు అనే రాక్షసుని చూచెను.

శ్లో.  తం నిహత్య మహాబాహుః దదాహ స్వర్గతశ్చ సః ।
స చాస్య కథయామాస శబరీం ధర్మచారిణీమ్ ॥ 56 ॥
తే.గీ.  ఆ కబంధుని హతమార్చి యతనికి దివి
ప్రాప్తమగునట్లు చేసె దహనమొనర్చి,
యట్టి రామునికిని దెల్పె నాకబందు
డా శబరి ధర్మవర్తిని నరయు మనుచు. (56)
భావము.  మహాబాహువైన శ్రీరాముడు ఆ దానవుని హతమార్చి, ఆ కళేబరమును దహింపజేసి అతనికి స్వర్గప్రాప్తి కలిగించెను.ఆ కబంధుడు శ్రీరామునితో ధర్మచారిణి అయిన శబరిని గూర్చి తెలిపెను.

శ్లో.  శ్రమణీం ధర్మనిపుణామభిగచ్ఛేతి రాఘవమ్ ।
సోఽభ్యగచ్ఛన్మహాతేజాః శబరీం శత్రుసూదనః ॥ 57 ॥
తే.గీ.  ధర్మనిష్ణాతురాలైన తల్లి శబరి
దర్శనము చేసుకొనుమంచతఁడు వచించె,
శత్రుసూదన, ధర్మనిష్ణాత రాముఁ
డరిగెశబరిని గాంచగ, ననుపమముగ. (57)
భావము.  ధర్మంలో నిష్ణాతురాలైన శబరిని కలవమని రామునకు సూచించెను. శత్రువులను రూపుమాపువాడును, మహాతేజశ్శాలియు ఐన శ్రీరాముడు శబరికడకు వెళ్లెను. 
29 - 10 - 2025.

శ్లో.  శబర్యా పూజితః సమ్యగ్రామో దశరథాత్మజః ।
పంపాతీరే హనుమతా సంగతో వానరేణ హ ॥ 58 ॥
తే.గీ. దశరధాత్మజ రాముండు తగిన రీతి
శబరి పూజలనందెను సన్నుతముగ
పంపయొడ్డున రాముండు వానరుఁడగు
హనుమను కలిసి యుండెను వినుతముగను. (58)
భావము. దశరధపుత్రుఁడగు రాముఁడు ఉచితరీతిలో శబరిచే పూజింపఁబడెను. పంపాసరస్సు తీరమున శ్రీరాముడు వానరుడైన హనుమంతుని కలిసికొనెను. 

శ్లో.  హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగతః ।
సుగ్రీవాయ చ తత్సర్వం శంసద్రామో మహాబలః ॥ 59 ॥
తే.గీ. హనుమ సూచనన్ సుగ్రీవునపుడు కలిసె
ఘనపరాక్రమమవంతుఁడు గౌరవముగ
రామచంద్రుండు, తెలిపె పరాత్పరుండు
తనదు వృత్తాంతమంతయున్ వినగ నతఁడు. (59)
భావము.  ఆ వానరోత్తముఁడైన హనుమంతుని సూచనను అనుసరించి రాముడు సుగ్రీవుని కడకు వెళ్లెను. మహావీరుడైన శ్రీరాముడు సుగ్రీవునకు తన వృత్తాంతమును అంతయును దెలిపెను. 

శ్లో.  ఆదితస్తద్యథావృత్తం సీతయాశ్చ విశేషతః ।
సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః ॥ 60 ॥
తే.గీ.  మొదటినుండియు జరిగిన సుదతియైన
సీతవృత్తాంతమంతయున్ జెప్పె రాముఁ 
డపుడు సుగ్రీవుఁడదియంత విపులముగను
వినుచు సర్వంబునెఱిఁగెను, విస్త్రుతముగ. (60)
భావము. సీతాపహరణ గాథను ఆద్యంతము సుగ్రీవునకు రాముఁడు పూర్తిగా వివరించెను. సుగ్రీవుడును శ్రీరాముడు చెప్పిన విశేషములను అన్నింటిని వినెను.

శ్లో.  చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికమ్ ।
తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి ॥ 61 ॥
తే.గీ.  అగ్నిసాక్షిగ స్నేహంబు ననుపముఁడగు
రామచంద్రునితో చేసె రమ్యగతిని 
ప్రేమతోడుత సుగ్రీవుఁడా మహాత్ముఁ
డన్నతో తన వైరంబునపుడు చెప్పె. (61)
భావము.  సుగ్రీవుఁడు శ్రీరామునితో సంతోషముతో అగ్నిసాక్షిగా మైత్రిని నెఱపెను. ఆ తర్వాత అతఁడు రామునితో అన్నయగు వాలితో తనకుఁ గల వైరమును గూర్చి చెప్పెను.

శ్లో.  రామాయావేదితం సర్వం ప్రణయాద్దుఃఖితేన చ ।
ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి ॥ 62 ॥
తే.గీ.  కనుల నీరున్న సుగ్రీవుఁ గాంచి యపుడు,
రాముఁడడిగి కారణమును ప్రేమతోడ,
తెలుసుకొని వాలినే చంపి తీరుదునని
చేసెను ప్రతిజ్ఞ నాతండు శ్రీకరముగ. (62)
భావము.  దుఃఖించుచున్న వాలియొక్క దుఃఖమునకు గల కారణమంతయును ప్రేమగా అడిగి రాముఁడు తెలుసుకొనెను. అనంతరము రాముడు “వాలిని వధింతును” అని ప్రతిజ్ఞ చేసెను. 

శ్లో.  వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః ।
సుగ్రీవః శంకితశ్చాసీన్నిత్యం వీర్యేణ రాఘవే ॥ 63 ॥
తే.గీ.  వాలి బలపరాక్రమములు పలుక నేర
నంత ఘనమని సుగ్రీవు డనియె రామ
చంద్రుఁడు వినంగ, రాముని శక్తి వాలి
ని వధియింప చాలునొకొ? యని మదిఁ దలచె. (63)
భావము.  పిమ్మట సుగ్రీవుడు వాలియొక్క (అసాధారణ) బలపరాక్రమములను గూర్చి శ్రీరామునకు వివరించెను. వాలిని హతమార్చుటకు శ్రీరామునకుగల పరాక్రమము విషయమున సుగ్రీవునిమనస్సులో సందేహము మెదలుచుండెను. 

శ్లో.  రాఘవః ప్రత్యయార్థం తు దుందుభేః కాయముత్తమమ్ ।
దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభమ్ ॥ 64 ॥
తే.గీ.  రామునకు వాలి శక్తిని రహిని జూప
వాలి చంపగ దుందుభిన్ నేలపైన
పర్వతము వోలెపడి యుండి భయము గొలుపు
గుట్టగానున్న యెముకల గూడు చూపె. (64)
భావము.  ఆయన బలపరాక్రమములను తెలిసికొనుటకొఱకు వాలిచే హతుడైన 'దుందుభి' యను రాక్షసుని మహాపర్వతసదృశమైన కళేబరమును సుగ్రీవుడు రాముఁనకుఁ జూపెను.

శ్లో.  ఉత్స్మయిత్వా మహాబాహుః ప్రేక్ష్య చాస్థి మహాబలః ।
పాదాంగుష్ఠేన చిక్షేప సంపూర్ణం దశయోజనమ్ ॥ 65 ॥
తే.గీ.  దుందుభి కళేబరము గాంచి, మందహాస
ముఖుఁడగుచు రామచంద్రుఁడు పూర్తిగాను
పడగ పదియోజనములది పన్నుగాను
కాలి గోటితో చిమ్మెను ఘనతరముగ. (65)
భావము.  మహాపర్వతసదృశమైన ఆ అస్థిపంజరమును జూచి, మహాబాహువైన రాముడు ఒక చిఱునవ్వు నవ్వి, 'ఇంతేనా' అని యనుచు దానిని తన కాలి బొటనవ్రేలి కొనతో అవలీలగా చిమ్మెను. అప్పుడా కళేబరము పూర్తిగా పదియోజనముల దూరమున పడిపోయెను.

శ్లో.  బిభేద చ పునః సాలాన్సప్తైకేన మహేషుణా ।
గిరిం రసాతలం చైవ జనయన్ ప్రత్యయం తదా ॥ 66 ॥
తే.గీ.  మదిని సుగ్రీవునకుఁ గల మసకవంటి
సందియము బాప రాముండు శరము వీడ
నేడుతాడులన్ ద్రుంచి తానేకబిగిని,
పర్వతమును బాతాళమున్ వ్రయ్యఁ జేసె. (66)
భావము.  సుగ్రీవునకు పూర్తిగా విశ్వాసము కలిగించుటకై రాముడు ఒకే గొప్ప బాణంతో ఏడు సాల వృక్షాలను చీల్చివేసాడు. తద్వారా, (ఆ బాణం యొక్క శక్తికి) పర్వతాన్ని, పాతాళాన్ని కూడా(జనింపఁ జేసెను) వ్రయ్యఁజేసెను. 

శ్లో.  తతః ప్రీతమనాస్తేన విశ్వస్తః స మహాకపిః ।
కిష్కింధాం రామసహితో జగామ చ గుహాం తదా ॥ 67 ॥
తే.గీ.  రామునసదృశమైన పరాక్రమమును
చూచి సుగ్రీవుఁడానంద వీచిఁ దేలె,
కొండలకుమధ్య గుహవలె నుండునట్టి
తనదు కిష్కింధ రాముని గొనుచు జేరె. (67)
భావము.  అప్పుడా సుగ్రీవుడు లోకోత్తరమైన శ్రీరాముని పరాక్రమమును జూచి, ఎంతయు సంతోషించెను. .  పిమ్మట అతడు రామునితో గూడి కొండలమధ్య గుహవలెనున్న కిష్కంధను సమీపించెను. 

శ్లో.  తతోఽగర్జద్ధరివరః సుగ్రీవో హేమపింగళః ।
తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః ॥ 68 ॥
తే.గీ.  హేమపింగళవర్ణకపీశుఁడైన
మహిత సుగ్రీవుఁ డరిచెను మారుమ్రోగ
దిశలు, నాధ్వనిన్ విని వాలి యసమబలుఁడు
తనదు గృహము బైటకు వచ్చె దర్పమెలయ. (68)
భావము.  బంగారు పింగళవర్ణములు గలవాడు, కపిశ్రేష్ఠుడు ఐన సుగ్రీవుడు బిగ్గరగా గర్జించెను. ఆ మహానాదమును విని, వానరప్రభువైన వాలి తన గృహము నుండి బయటికి వచ్చెను. 

శ్లో.  అనుమాన్య తదా తారాం సుగ్రీవేణ సమాగతః ।
నిజఘాన చ తత్రైనం శరేణైకేన రాఘవః ॥ 69 ॥
తే.గీ.  తారనొప్పించి వాలి యు ద్ధమును చేయ
వెడలె సుగ్రీవునొద్దకు, వెనుకనుండి 
రాముఁడొక్కబాణము వేసి వ్రాలఁ జేసె
నేలపైనను వాలిని నియతితోడ. (69)
భావము.  'సుగ్రీవునితో యుద్ధము చేయుటకు వెళ్లవలదు' అని వారించుచున్న తారను సమాధానపఱచి, వాలి సుగ్రీవునితోతలపడెను. అప్పుడు రాఘవుడు వాలిని ఒకే ఒక్క బాణముతో వధించెను. 

శ్లో.  తతః సుగ్రీవవచనాద్ధత్వా వాలినమాహవే ।
సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవః ప్రత్యపాదయత్ ॥ 70 ॥
తే.గీ.  వినుతి చేయగ సుగ్రీవుఁ డనుపమముగ
వాలి వధ చేసె రాముండు, ప్రవరముగను
నపుడు కిష్కింధ రాజుగా నచట నిలిపె
వినుత సుగ్రీవు నా రాముఁడనితరముగ. (70)
భావము.  సుగ్రీవుని ప్రార్థనను అనుసరించి వాలిని వధించిన పిమ్మట శ్రీరాముడు సుగ్రీవుని కిష్కింధకు రాజునుగా జేసెను.

శ్లో.  స చ సర్వాన్సమానీయ వానరాన్వానరర్షభః ।
దిశః ప్రస్థాపయామాస దిదృక్షుర్జనకాత్మజామ్ ॥ 71 ॥
తే.గీ.  వానరేంద్ర సుగ్రీవుఁడు వనములందు
వివిధ దేశములఁగల కపివరులెల్ల
నటకువచ్చునట్టులఁ జేసి, యతుల సీత
జాడ కనిపెట్టుటకుఁ బంపె సకల దిశలు. (71)
భావము.  అనంతరము వానరప్రభువైన సుగ్రీవుడు వివిధ ప్రదేశముల యందున్న వానరులనందఱిని రప్పించి, సీతాన్వేషణకై వారిని నలుదెసలకు పంపెను.

శ్లో.  తతో గృధ్రస్య వచనాత్సంపాతేర్హనుమాన్బలీ ।
శతయోజనవిస్తీర్ణం పుప్లువే లవణార్ణవమ్ ॥ 72 ॥
తే.గీ.  సీతనన్వేషణము చేయ ఖ్యాత బలుఁడు
హనుమ సంపాతి సూచన ననుసరించి
నూరు యోజనాల్గలుగు విస్తార మైన
లవణ జలధిని లంఘించె లాఘవముగ. (72)
భావము.  పిమ్మట (సీతాదేవిని వెదకుటకై జాంబవదాదులతో దక్షిణదిశకు వెళ్లిన) మహాబలసంపన్నుడైన హనుమంతుడు, సంపాతి సూచన మేరకు నూఱు యోజనముల విస్తీర్ణముగల లవణసముద్రమును ఒక్క గంతులో దాటెను.

శ్లో.  తత్ర లంకాం సమాసాద్య పురీం రావణపాలితామ్ ।
దదర్శ సీతాం ధ్యాయంతీం అశోకవనికాం గతామ్ ॥ 73 ॥
తే.గీ.  రావణాసురపాలిత లంకఁ జేరె
హనుమ, సీతకైవెదకెడి యవసరమున
రామ జపమును జేయుచు క్రాలుచుండ
చూచె నాతఁడు సీత నశోకవనిని. (73)
(1వ పాదమున ర-ల అభేదయతి.  {కం. రభసంబున నతని శరము*లను గడు నొంచెన్.. భారతము - ద్రోణ. 2.73} )
భావము.  అంతట ఆ రామబంటు రావణునిచే పాలింపబడుచున్న లంకకు చేరెను. క్రమముగా సీతాదేవికొఱకు వెదకుచు అతడు అశోక వనమున అడుగిడి, అచట రామధ్యానమున నిమగ్నమైయున్న జానకిని కనుగొనెను.

శ్లో.  నివేదయిత్వాఽభిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ ।
సమాశ్వాస్య చ వైదేహీం మర్దయామాస తోరణమ్ ॥ 74 ॥
తే.గీ.  మైథిలికి రామ సుగ్రీవ మైత్రిఁ దెలిపి,
హనుమ రామముద్రిక నిచ్చె ఘనముగాను,
సీతనోదార్చి వెడలుచు ఖ్యాతిగాను
లంకనేకాల్చెనాతఁడు జంకు లేక. (74)
భావము.  పిదప ఆంజనేయుడు సీతాదేవికి 'రామసుగ్రీవుల మైత్రిని దెలిపి, రామనామాంకితమైన ఉంగరమును ఆమెకు ఆనవాలుగా సమర్పించెను. ఆమెకై శ్రీరాముడు పరితపించుచున్న తీరును వివరించి, ఆమెను ఓదార్చెను, పిమ్మట అశోకవనమును ధ్వంసము చేసెను.

శ్లో.  పంచ సేనాగ్రగాన్హత్వా సప్త మంత్రిసుతానపి ।
శూరమక్షం చ నిష్పిష్య గ్రహణం సముపాగమత్ ॥ 75 ॥
తే.గీ.  పంచ సేనాగ్రగాములన్ ప్రతిభతోడ
నేడుగురుమంత్రిపుత్రుల నిలకు కూల్చి,
చూర్ణముగ నక్షయకుమారశూరుఁ జేసి,
మూర్ఛ నటియించె బ్రహ్మాస్త్రమునకు హనుమ. (75)
భావము.  హనుమంతుడు ఐదుగురు సేనాగ్రగాములను, ఏడుగురు మంత్రి పుత్రులను వధించి, శూరుఁడైన అక్షకుమారుడిని చూర్ణము చేసిన తర్వాత ఇంద్రజిత్ వేసిన బ్రహ్మాస్త్రముచే బుద్ధిపూర్వకముగా గ్రహణమునకు లోనయెను.

శ్లో.  అస్త్రేణోన్ముక్తమాత్మానం జ్ఞాత్వా పైతామహాద్వరాత్ ।
మర్షయన్రాక్షసాన్వీరో యంత్రిణస్తాన్యదృచ్ఛయా ॥ 76 ॥
తే.గీ.  విధి వరమున బ్రహ్మాస్త్రము వీడెననుచు
హనుమ గ్రహియించి నటియించె తనకు మూర్ఛ
వచ్చినట్టుల, రాక్షస బాధల నతఁ
డోర్చుకొనుచునే, చంపె తానొప్పిదముగ. (76)
భావము.  నిరుపమాన పరాక్రమశాలియైన వాయునందనుడు బ్రహ్మవరప్రభావమున బ్రహ్మాస్త్రమునుండి అప్రయత్నముగా తాను విముక్తుడైనట్లు తెలిసికొనెను. ఐనప్పటికిని హనుమంతుడు రామకార్యమును సాధించుటకై బ్రహ్మాస్త్రమునకు బద్ధుడైయున్నట్లు నటించుచు, రాక్షసులుపెట్టు బాధలను సహించెను. హనుమంతుడు రాక్షసులను యాంత్రికముగా నాశనం చేసెను.

శ్లో.  తతో దగ్ధ్వా పురీం లంకాం ఋతే సీతాం చ మైథిలీమ్ ।
రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్మహాకపిః ॥ 77 ॥
తే.గీ.  పిదప లంకను దహియించె, విడిచి సీత
యున్నవనమును హనుమ, మన్ననముగ
రామునకుఁ బ్రీతిఁ గొలిపెడి రమ్య వార్తఁ
దెలుప రాముని కడకేగ తిరిగి వచ్చె. (77)
భావము.  (రావణాజ్ఞననుసరించి, రాక్షసులు తనతోకకు నిప్పంటింపగా) మారుతి తనవాలాగ్నితో సీతాదేవి ఉన్న స్థలమునుదప్ప లంకను దగ్ధము గావించెను. సీతాదేవి కుశలవార్తను దెలిపి, శ్రీరామునకు ప్రీతినిగూర్చుటకై ఆ హనుమంతుడు అతి శీఘ్రముగా ఆ ప్రభువుసమీపమునకు మఱలివచ్చెను. 

శ్లో.  సోఽభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణమ్ ।
న్యవేదయదమేయాత్మా దృష్టా సీతేతి తత్త్వతః ॥ 78 ॥
తే.గీ.  రామచంద్రునికడ కేగి రమ్యగతిని
తా ప్రదక్షిణన్ జేయుచు తనియ ప్రభువు
చూచినాడను సీతను శుభదరామ!
యనుచు తెలిపెను హనుమ జ్ఞేయంబు కాగ. (78) 
భావము.  మహాబుద్ధి శాలియైన పవనసుతుడు 'కనుగొంటిని సీతమ్మను' అని పలికి, రామునకు ప్రదక్షిణమొనర్చెను. సీతాదేవి యెడబాటునకు లోనయ్యును. నిశ్చలుడై యున్న ఆ ప్రభువునకు ఆ వాయుసుతుడు యావద్వృత్తాంతమును వివరించెను. 
30 - 10 - 2025.

శ్లో.  తతః సుగ్రీవసహితో గత్వా తీరం మహోదధేః ।
సముద్రం క్షోభయామాస శరైరాదిత్యసన్నిభైః ॥ 79 ॥
తే.గీ.  హనుమ మాటలకానంద మంది రాము
డరిగె సుగ్రీవసహితుఁడై యబ్ధిదరికి
సూర్య తీక్ష్ణ బాణములు ప్రశోభితముగ
వేసి క్షోభ సాగరునకుఁ బెంచెనతఁడు. (79)
భావము.  హనుమంతుడు తెలిపిన సమాచారమును గ్రహించిన పిమ్మట, శ్రీరాముడు సుగ్రీవాదులతోగూడి, మహాసముద్ర తీరమునకుచేరెను. అనంతరము అతడు సూర్యకిరణములవలె తీక్షములైన బాణములతో సముద్రమును అల్లకల్లోలమొనర్చెను. 

శ్లో.  దర్శయామాస చాత్మానం సముద్రః సరితాం పతిః ।
సముద్రవచనాచ్చైవ నలం సేతుమకారయత్ ॥ 80 ॥
తే.గీ.  సాగరుఁడు రామచంద్రుని సన్నిధి నట
నిలిచి, సూచించె వారధి నిర్మితికిని,
నలుని సాయంబుతో సేతువలఘు రీతి
పూర్తి చేసెను రాముండు స్ఫూర్తితోడ. (80)
భావము.  సముద్రుడు తన భయంకరమైన రూపమును ప్రదర్శించి, శ్రీరామునితో నీకు సహాయం చేయుదునని, దారి ఇచ్చెదనని చెప్పి, నలుని ద్వారా సేతువును నిర్మించమని సూచించెను. సముద్రుని సూచనలను అనుసరించి, శ్రీరాముడు సముద్రముపై నలునిద్వారా సేతువును నిర్మింపజేసెను. 

శ్లో.  తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే ।
రామః సీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్ ॥ 81 ॥
తే.గీ. రాముఁడా సేతువున చేరె లంక, యచట
యుద్ధమున రావణునిఁ జంపె, నొప్పిదముగ
చేరి తన సతిన్, పరునింటఁ జేరియున్న
సీత నతులితన్ గైకొనన్ సిగ్గుపడెను. (81)
భావము.  .  శ్రీరాముడు ఆ సేతువు ద్వారా లంకను జేరి, రావణుని రణరంగమున హతమార్చెను. తదనంతరము సీతను సమీపించి, పరుల పంచనున్న ఆమెను స్వీకరించుటకు (లోకాపవాద శంకతో) సిగ్గుపడి వెనుకాడెను. 

శ్లో.  తామువాచ తతో రామః పరుషం జనసంసది ।
అమృష్యమాణా సా సీతా వివేశ జ్వలనం సతీ ॥ 82 ॥
తే.గీ.  పరుల పంచను గలవని పరుషముగను
పలికె రాముండు జనుల కవగతమవగ,
సీత ఘనత, యా మాటలన్ జెలగె మదిని
మంట సీతకామెయె దూకి మంటను బడె. (82)
భావము. శ్రీరాముడు (సీతాదేవి సౌశీల్యమునుగూర్చి ఎల్లరకును విశ్వాసము కలిగించుటకై అందఱియెదుట) పరుష వచనములను పలికెను. సాధ్వియైన ఆ సీతాదేవి ఆకఠినోక్తులను భరింపజాలక అగ్నిలో ప్రవేశించెను.

శ్లో.  తతోఽగ్నివచనాత్సీతాం జ్ఞాత్వా విగతకల్మషామ్ ।
బభౌ రామః సంప్రహృష్టః పూజితః సర్వదైవతైః ॥ 83 ॥
తే.గీ.  అగ్ని ప్రత్యక్షమై పల్కెనందరు విన,
జనకజాత్మజ సీతమ్మ సాధ్వియనుచు,
రాముడానందమొందెను, రామవిభుని
ననిమిషులు పూజ చేసిరి యనుపముఁడని. (83)
భావము.  పిదప అగ్నిదేవుడు ప్రత్యక్షమై "సీతాదేవి త్రికరణశుద్ధిగా పరమసాధ్వి, దోషరహిత" అని ప్రకటించెను. అంతట శ్రీరాముడు పరమసంతుష్టుడాయెను. దేవతలందరిచేతను పూజింపఁబడెను.

శ్లో.  కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరమ్ ।
సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః ॥ 84 ॥
తే.గీ. మూడులోకాలఁ గలయట్టి మునులు,  దేవ
తలు, చరాచర గణములు ధర మహాత్ముఁ
డయిన రాముని వర్తన, నియతిఁ జూచి
సంతసించిరి మిక్కిలి,  సంస్తుతముగ. (84)
భావము.  మహాత్ముఁడైన శ్రీరాముని ఆ గొప్ప కర్మ వలన ముల్లోకములు, దేవతలు, ఋషులు సంతోషించిరి.

శ్లో.  అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణమ్ ।
కృతకృత్యస్తదా రామో విజ్వరః ప్రముమోద హ ॥ 85 ॥
తే.గీ. రాక్షసేంద్ర విభీషణున్ లంకకుఁ బతిఁ
జేసె రాజ్యాభిషేకమ్ము చేసి రాముఁ
డతులితానందమును బొందె నటుల తాను
చేయనెంచిన దానిని చేసి ధరను. (85)
భావము.  పిదప శ్రీరాముడు రాక్షసశ్రేష్ఠుడైన విభీషణుని లంకా రాజ్యమునకు పట్టాభిషిక్తుని గావించెను. అట్లు కృతకృత్యుడైన రాముడు ప్రసన్నమనస్కుడయ్యెను.

శ్లో.  దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ ।
అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేణ సుహృద్వృతః ॥ 86 ॥
తే.గీ.  దేవతలనుండి వరములు తీసుకొనిన
రాముఁ డా యనిన్ మృతులైన సోమములను
బ్రతుకఁ జేసి యయోధ్యకుఁ బ యనమయెను
పుష్పకమున మిత్రాళితోఁ బొంగుచు మది. (86)
భావము.  తన విజయమును శ్లాఘించుటకై వచ్చిన దేవతలనుండి వరములను పొంది, శ్రీరాముడు ఆ వరప్రభావముతో రణరంగమున మృతులై పడియున్న వానరులను పునర్జీవితులను గావించెను. పిమ్మట శ్రీరాముడు సుగ్రీవవిభీషణాదిమిత్రులతో, వానరులందఱితో గూడి పుష్పకవిమానముపై అయోధ్యకు బయలుదేరెను. 

శ్లో.  భరద్వాజాశ్రమం గత్వా రామః సత్యపరాక్రమః ।
భరతస్యాంతికం రామో హనూమంతం వ్యసర్జయత్ ॥ 87 ॥
తే.గీ. మహితమగు భరద్వాజాశ్రమమును జేరి
సత్యమూర్తిపరాక్రమ శాలి రాముఁ
డా హనుమను బంపెను భరతాంతికమున
కు తన మాట నిల్పుకొనుచునతులితముగ. (87)
భావము.  శ్రీరాముడు తనవారితో భరద్వాజాశ్రమమునకు చేరెను. "పదునాలుగుసంవత్సరములు పూర్తియైన వెంటనే అయోధ్యకు తప్పక తిరిగి వత్తును" అని భరతునకు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకొనుటకై శ్రీరాముడు ముందుగా హనుమంతుని భరతునియొద్దకు పంపెను. 

శ్లో.  పునరాఖ్యాయికాం జల్పన్సుగ్రీవసహితశ్చ సః ।
పుష్పకం తత్సమారుహ్య నందిగ్రామం యయౌ తదా ॥ 88 ॥
తే.గీ. అటుల వారు నందిగ్రామ మరుగువేళ
పుష్పకమునందు రాముండు పూజ్యమిత్ర
వరులు, సుగ్రీవుడాలింప, జరిగిన కత
లెన్నుచును జెప్పు రాముండు మిన్నగాను. (88)
భావము.  శ్రీరాముడు పుష్పక విమానంలో సుగ్రీవుడితో కలిసి నందిగ్రామానికి తిరిగి వెళుతున్నప్పుడు, జరిగిన సంఘటనలన్నింటినీ మళ్ళీ చెబుతున్నాడు.

శ్లో.  నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితోఽనఘః ।
రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ ॥ 89 ॥
తే.గీ.  పూజ్యమైన నందిగ్రామమున జటలను 
విడిచిపెట్టి, సోదరులతో కలిసి పాప
రహితముగనున్న రాముండు రమ్యమైన
జనకజను పొంది, పొందె రాజ్యమును మరల. (89)
భావము.  చక్కగా పితృవాక్యపరిపాలనమొనర్చివచ్చిన మహానుభావుడగు శ్రీరాముడు నందిగ్రామమున తనసోదరులను కలిసికొని, జటాదీక్షను పరిత్యజించెను. పిమ్మట సీతాదేవితోగూడి పట్టాభిషిక్తుడై రాజ్యాధికారమును చేపట్టెను.

శ్లో.  ప్రహృష్టముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః ।
నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః ॥ 90 ॥
తే.గీ.  ప్రజలు రామరాజ్యమున నిర్భయముతోడ,
సంతసముతోడ, తృప్తితో, సకల ధర్మ
వర్తనన్, రోగ రహితులై భాసిలు, నట
లేదు దుర్భిక్షమనునది, లేదహితము. (90)
భావము.  శ్రీరాముడు రాజైనందున అతని పాలనలో లోకులంతా సంతోషముతో, సంతృప్తిగా, ధార్మికముగా ఉండిరి. విగత రోగులు, రోగరహితులు అయి యుండిరి. దుర్భిక్షమనునది లేక, భయరహితులై యుండిరి.

శ్లో.  న పుత్రమరణం కించిద్ద్రక్ష్యంతి పురుషాః క్వచిత్ ।
నార్యశ్చావిధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః ॥ 91 ॥
తే.గీ.  పుత్రశోకంబులే లేక పురుషులుంద్రు,
స్త్రీలు వైధవ్యమే లేక చెలగుచుందు
రెప్పుడును పతివ్రతలుగా, నిప్పులనగ,
రామ రాజ్యంబునందున రమ్యగతిని. (91)
భావము.  రామరాజ్యమున పుత్రమరణములు లేకుండును.  స్త్రీలు భర్తలను కోల్పోకుండా ఎప్పుడూ పతివ్రతలుగా ఉంటారు.

శ్లో.  న చాగ్నిజం భయం కించిన్నాప్సు మజ్జంతి జంతవః ।
న వాతజం భయం కించిన్నాపి జ్వరకృతం తథా ॥ 92 ॥
తే.గీ.  లేదు భయమగ్నివలనను, లేదు నీటి
వలన భయమెన్న, లేదిల వాయు భయము,
భయము లేదు జ్వరాదులన్, ప్రభువు రామ
చంద్రుని పరిపాలనమునన్, శాంతి యొప్పు. (92)
భావము.  అగ్నిప్రమాదములు లేవు. జలప్రమాదములు లేవు. అటులనే వాయుభయములు లేవు. జ్వరాదుల వలన బాధలు లేవు.

శ్లో.  న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా ।
నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ ॥ 93 ॥
తే.గీ.  ఉండ వాకలిచే బాధ, లుండ వటులె
చోరభయములు, ధనధాన్య శొభ మిగుల
నొప్పు నగరాల రాష్ట్రాల గొప్పగాను,
రామ పరిపాలనంబున రాజిలు ధర. (93)
భావము.  ఆకలిదప్పుల బాధలు ఉండవు. అటులనే చోరభయములు ఉండవు - (ఆధ్యాత్మిక-ఆధిదైవిక-ఆధి భౌతిక బాధలు లేకుండును.) రాజ్యములోని నగరములు, రాష్ట్రములు ధనధాన్యములతో తులతూగుచుండును. 

శ్లో.  నిత్యం ప్రముదితాః సర్వే యథా కృతయుగే తథా ।
అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః ॥ 94 ॥
తే.గీ.  అంద రిద్ధర నిత్య మానందముగనె
యుందు రరయ కృత యుగమునందు వోలె,
నశ్వమేధశతాధికమటులె పెక్కు 
స్వర్ణ యాగముల్ రాముండు సలుపుచుండు. (94)
భావము.  కృతయుగమునందు వలె రామరాజ్యమున కూడా అందరూ నిత్యమూ తృప్తిగా సంతోషముగా ఉందురు. అనేకములైన అశ్వమేధాదిక్రతువులను, సువర్ణక యాగములను(1) శ్రీరాముడు నిర్వహించును. 

శ్లో.  గవాం కోట్యయుతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి ।
అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః ॥ 95 ॥
తే.గీ.  కోట్లకొలది గోదానముల్ కోరిచేయు
బ్రాహ్మణోత్తములకుఁ, గాంచు బ్రహ్మపదము,
నపరిమిత ధనదానంబునాచరించి
కీర్తిఁ బొందును రాముండు, స్ఫూర్తిఁ గొలుపు. (95)
భావము.  బ్రాహ్మణోత్తములకును పండితులకును కోట్లకొలది గోవులను దానము చేసి, బ్రహ్మలోకమును పొందును, అతడు బ్రాహ్మణులకు అపరిమితమైన ధనధాన్యములను దాన మొనర్చి, వాసికెక్కును.

శ్లో.  రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః ।
చాతుర్వర్ణ్యం చ లోకేఽస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి ॥ 96 ॥
తే.గీ.  నూరు రెట్లు రాడ్వంశమున్ ధీర రాము
డధికముగఁ జేయు, భూమిపై నలరు నాల్గు
వర్ణములవారు కులధర్మపరులుగఁ దగ
నడచునట్టులఁ జేయునీ నాయకమణి. (96)
భావము.  రాఘవుడు క్షత్రియవంశములను నూరురెట్లు వృద్ధిపఱచును. నాలుగువర్ణముల వారిని ఈ లోకమున తమతమ వర్ణధర్మముల ప్రకారము నడిపించును.

శ్లో.  దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ ।
రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి ॥ 97 ॥
తే.గీ.  ప్రజలకానందముప్పొంగి పరవశింపఁ
బదియునొకవేలవత్సరాల్ పాలనమును
రామచంద్రుండు చేసి తా రహిని బ్రహ్మ
లోకమును బొందు, జగతికి శ్రీకరముగ.  (97)
భావము.  ఆ ప్రభువు పదునొకండువేల సంవత్సరములకాలము ప్రజానురంజకముగా పరిపాలన సాగించి, అనంతరము వైకుంఠమునకు చేరును.

శ్లో.  ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితమ్ ।
యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే ॥ 98 ॥
తే.గీ.  కన పవిత్రమైనది, పాప కలుష హారి
యైనదియు, పుణ్యమొసఁగెడి జ్ఞానమిచ్చు
వేదముల సమ్మతినిగన్న శ్రీద గ్రంథ
మిద్ది, పఠియింప పాపము లెలమి వాయు. (98) 
భావము.  పవిత్రమైనది, పాపములను పోఁగొట్టునది,పుణ్యప్రదమైనది, వేదములచేత కూడా సమ్మతింపఁబడినది యగు యీ రామాయణమును ఎవరు పఠింతురో వారు సమస్త పాపములనుండి విముక్తులగుదురు.

శ్లో.  ఏతదాఖ్యానమాయుష్యం పఠన్రామాయణం నరః ।
సపుత్రపౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే ॥ 99 ॥
తే.గీ.  ఇట్టి రామాయణంబు పఠించిరేని
ఆయురభివృద్ధి, సేమంబు నంచితమగు
లాభములు కల్గు, పుత్రపౌత్ర జనులకును,
ముక్తి కలుగును పరివారమునకుఁ గూడ. (99)
భావము.  ఈ రామాయణమును పఠించినవారికి ఆయుష్యాభివృద్ధి కలుగును, వారిపుత్రపౌత్రులకును, పరివారములకును క్షేమలాభములు ప్రాప్తించును. మఱియు అంత్యకాలమున మోక్షప్రాప్తియు కలుగును.

శ్లో.  పఠన్ ద్విజో వాగృషభత్వమీయాత్
స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్ ।
వణిగ్జనః పణ్యఫలత్వమీయాత్
జనశ్చ శూద్రోఽపి మహత్త్వమీయాత్ ॥ 100 ॥
తే.గీ.  ద్విజులు పఠియించిరేని వాగ్దీప్తి కలుగు, 
క్షత్రియులు పొందు రాజ్యంబు ఘనతరముగ,
వైశ్యులకు పణ్యఫలమబ్బి వరలఁజేయు,
శూద్రులకు కీర్తి, ప్రజలలో శోభ కలుగు. (100)
భావము.  ఈ రామాయణమును పఠించిన ద్విజులు వేదవేదాంగముల యందును, శాస్త్రములయందును పండితులు అగుదురు. క్షత్రియులు రాజ్యాధికారమును పొందుదురు. వైశ్యులకు వ్యాపారలాభములు కలుగును. శూద్రులు తోడివారిలో శ్రేష్ఠులు అగుదురు. 
ఈ రామాయణమును పఠించినవారును, వినినవారును పొందెడి ఫలము అనంతము, అద్వితీయము. 
31 - 10 - 2025..

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే నారదవాక్యం నామ ప్రథమః సర్గః ॥
ఇది శ్రీమద్వాల్మీకి రామాయణమున ఆదికావ్యమున బాలకాందళొనారదవాక్యమనబడు ప్రథమ సర్గకు సంబంధించినది.
సమాప్తము.
కృతికర్త.  
చిత్రకవితాసమ్రాట్....కవికల్పభూజ....పద్యకవితాభిరామ....చిత్రకవితా సహస్రఫణీ....పుంభావ భారతి.
చింతా రామ కృష్ణా రావు. భాషాప్రవీణ .,P.O.L.,  M.A., విశ్రాంత ఆంధ్రోపన్యాసకుఁడు.
ఫ్లాట్ నెం. ఆ 601. శిల్పాస్ ఆర్వీధర్మిష్ఠ... డీమార్టుకు ఎదురుగా.. మియాపూర్, హైదరాబాద్. 49.
తెలంగాణా. భారత దేశము. చరవాణి 8247384165

రచనలు.

 1) అగ్నిసూక్తము  ..  పద్యానువాదము.
 2) అనంత ఛందము౨౨౦౦ కొఱకు శతకము.
 3) అశ్వధాటి సతీ శతకము.( ప్రాస నియమముతో, ప్రతీపాదమున మూడు ప్రాసయతులతో ఒక్క 
     రోజులో వ్రాసినది.)
 4) ఆంధ్ర సౌందర్యలహరి. సంస్కృతశ్లోక, పదచ్ఛేద, అన్వయక్రమ, పద్య, ప్రతిపదార్థ, 
      భావసహితము.
 5) ఆంధ్రామృతమ్,  పద్యవిపంచి, యువతరంగమ్. బ్లాగులలో అనేక స్వీయ రచనలు.
 6) ఈశావాస్యోపనిషత్ పద్యానువాదము. తే. 04 - 11 - 2025.
 7) కాళిదాసు కాళీ అశ్వధాటికి తెలుఁగు పద్యానువాదము.
 8) క్షీరాబ్ధిపుత్రీరమా! శతకము.
 9) గణపతి అష్టోత్తరశతనామాన్విత పద్యావళి. శాంకరీ శతకము. (ఒక్కరోజులో వ్రాసినది) తే. 31 - 8 - 
      2025.
 10) చంపక భారతీ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
 11) నేరెళ్ళమాంబ సుప్రభాతమ్.(సంస్కృతంలో)
 12) పురుష సూక్త ఆంధ్ర పద్యానువాదము.
 13) ప్రజ పద్య సీస గర్భిత ఆటవెలది కృష్ణ శతకము.
 14) బాలభావన శతకము.
 15) మూకపంచశతి పద్యానువాదము.
 16) మృడ శతకము. శ్రీ అరుణాచలేశ్వరాష్టోత్తరశతనామాంచిత పద్యపుష్పార్చన.(తే.08 - 8 - 2025.)
 17) మేలిమిబంగారం మన సంస్కృతి. సంస్కృత సూక్తిశ్లోకములకు తెలుఁగు పద్యానువాదము.
 18) రమాలలామ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
 19) రాఘవా! శతకము.
 20) రామకృష్ణ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
 21) రుద్రమునకు తెలుగు భావము.
 22) లలితా శ్రీచంద్రమౌళీశ్వర శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
 23) వసంతతిలక సూర్య శతకము.
 24) విజయభావన శతకము.
 25) వృద్ధబాలశిక్ష శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
 26) వేదస్తుతి, షోడశ చిత్రకవితలు. 
 27) శ్రీఅవధానశతపత్రశతకము.
 28) శ్రీచక్రబంధ అష్టలక్ష్మీ స్తోత్రము.
 29) శ్రీచక్ర బంధ సప్తస్వర సర్వమంగళాష్టకము.
 30) శ్రీచక్రబంధ మంగళాష్టకము.
 31) శ్రీచక్రబంధ శ్రీరామ దశకము.
 32) శ్రీమదాంధ్రభగవద్గీత చింతా(తనా)మృతం.
 33) శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము.(అష్టోత్తరశత నృసింహనామాంచిత 
       118 ఛందో గర్భ చిత్ర సీసపద్య శతకము.) 
 34) శ్రీమన్నారాయణ శతకము.(ద్విత్వనకార ఏక ప్రాసతో)
 35) శ్రీమన్నారాయణీయ పద్యానువాదము.
 36) శ్రీయాజ్ఞవల్క్య శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
 37) శ్రీరామ పట్టాభిషేకం. తేదీ.10-3-2025మరియు 11-3- 2025.తేదీల మధ్యవిరచితము.
 38) శ్రీలక్ష్మీ సహస్ర నామాంచిత సహస్రపద్యదళ పద్మము.
 39) శ్రీలలితా సహస్ర నామాంచిత పద్యసహస్రదళపద్మము.
 40) శ్రీవేణుగోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. (బంధచిత్రకృతి ఒకే శతకమున 
       మూడు మకుటములతో మూడు శతకములు.) 
 41) శ్రీ శిరిడీశ దేవ శతకము,(వారం రోజులలో వ్రాసినది.)
 42) శ్రీ శివాష్టోత్తరశతపంచచామరావళి (శివశతకము.) (ఒక్క రోజులో వ్రాసినది.)
 43) శ్రీ శివాష్టోత్తరశతనామాన్వితాష్టోత్తరశత విభిన్నవృత్త శివశతకము.
 44) సుందర కాండ.(రామాన్వయముగా కందపద్యములు, 
       సీతాన్వయముగా తేటగీతి పద్యములు, హనుమదన్వయముగా ఉత్పలమాలలుతో 
       సుందరోత్పల నక్షత్రమాల.)
 45) సురగవి నవ రత్నమాలిక. (చిత్రకవితా ప్రసూనములు.)
 46) సువర్ణమాలా స్తుతి. శంకరుల శ్లోకములకు పద్యానువాదము
 47) స్వతంత్ర భారత వజ్రోత్సవము సందర్భముగా రకార ప్రాసతో అష్టోత్తర శత  
       పాదఉత్పలమాలిక. 
 48) శాంభవీ శతకము.(మధ్యాక్కర గర్భ చంపకోత్పలాలు.)(ఏకదిన విరచితము)తే.20 – 4 – 2025. 
 49) సంక్షిప్త రామాయణము. పద్యానువాదము. 
 50) శివసహస్రము పద్యార్చన.



శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య ... విషయం. చిత్రకవితాసమ్రాట్ శ్రీ చింతా రామకృష్ణారావు గారిని గూర్చి నేనేమంటానంటే...

0 comments

జైశ్రీరామ్ 

నేనేమంటానంటే...       వెంకటప్పయ్య టేకుమళ్ళ

     చిత్ర కవితా సమ్రాట్ శ్రీ చింతా రామకృష్ణరావుగారి పద్యాలను విశ్లేషించుకునే ముందుగా చిత్రకవిత గురించి కొంత చెప్పాలి. 

     ఒక పద్యంలో ఉండే అక్షరాలు, పదాలు, వాటి అమరికల గురించి అసాధారణమైన షరతులకు లోబడి రాసే, లేదా చెప్పే, పద్యాన్ని చిత్రకవితగా నిర్వచించొచ్చు. కే.వి.ఎస్ రామారావుగారు చిత్రకవిత్వంపై అద్భుతవ్యాసం వ్రాశారు. దానిలోని కొన్ని విశేషాలు మీరు తెలుసుకుని తీరాలి.  ఉదాహరణకి, అష్టావధాన ప్రక్రియలో దత్తపది, న్యస్తాక్షరి, నిషిద్ధాక్షరి, సమస్యాపూరణం పద్యాలు చిత్రకవిత కిందికి వస్తాయంటే అవధానులు ఆక్షేపణ చెయ్యొచ్చుగానీ,  దత్తపదిలో పృఛ్ఛకుడు ఇచ్చిన పదాలు ఆ పద్యంలో వచ్చి తీరాలి; న్యస్తాక్షరిలో అక్షరాలూ, వాటి స్థానాలూ నిర్దేశించిన విధంగా ఉండితీరాలి; నిషిద్ధాక్షరిలో పృఛ్ఛకుడు నిషేధించిన అక్షరాల్ని వాడటానికి లేదు; సమస్యా పూరణానికి పృఛ్ఛకుడిచ్చిన పాదాలో, పాదభాగమో ఎలా ఇచ్చారో అలా పూర్తి పద్యంలో వచ్చి తీరాలి. నా ఉద్దేశంలో ఇవన్నీ చిత్రకవితలో భాగాలే! 

     మనకు తెలిసినంత వరకు తెలుగు కావ్యాల్లో చిత్రకవిత్వం తొలిసారిగా కన్పించేది నన్నెచోడుని “కుమారసంభవం” లో. ఇతను కూడ నన్నయ కాలానికి చాలా దగ్గరి వాడు. ఇతను నాగభూషణుడైన శివుణ్ణి ఒక నాగబంధ పద్యంలో స్తుతిస్తాడు; అంటే, కొన్ని చుట్టలు చుట్టుకున్న ఒక పాము బొమ్మ గీసి ఆ పాము శరీరం మీద అడ్డగళ్ళు పెట్టి ఒక్కో గళ్ళో ఒకో అక్షరం రాస్తారు; ఆ పాము తల నుంచి తోక వరకు వరసగా చదువుకుంటూ వెళ్తే పద్యం వస్తుంది. అలాగే చక్రధరుడైన విష్ణువుని ఒక చక్రబంధ పద్యంతో స్తుతిస్తాడు నన్నెచోడుడు. మరొక విశేషమైన పద్యంలో, “భక్తుడి శరీరంలో భగవంతుడు ఉంటాడు” అని చెప్తూ దానికి ఒక కందగర్భ చంపకమాల ని వాడాడు.అనగా చంపకమాల పద్యంలో ఓ కందం కూడా ఇమిడి ఉంటుందన్న మాట. ఆ పద్యం ఇది. "హరు మనమార గొల్చు; డరుదాతని గొల్చయు నాది బోడగా - బొరియునె భూరి భోగ పుర భూతి విభుత్వము పొంది పేర్మితోన్ - పరజన దారుణోగ్ర శరపాత నియుక్త పదంబు నందు తా - బొరయడు వారకోర్చి పొరి భూతగణేశ్వరు పొందు నాత్మలోన్"  దీన్లో ఉన్న కందం ఇది. "మనమార గొల్చు డరుదా - తని గొల్చయు నాది బోడగా బొరియునె భూ - జన దారుణోగ్ర శర పా - తనియుక్త పదంబు నందు తా బొరయడు వా! అలాంటి చమత్కారాలున్నదే చిత్ర కవిత్వం. 

     భారతంలో ఎక్కడా చిత్రకవిత్వం వాడలేదని అంటారు. భాగవతంలో పోతన గారు కొన్ని సర్వలఘు కందాల్ని రాశారు. వాటిలో గజేంద్రమోక్షణ ఘట్టంలో “అడిగెద నని కడువడి జను” అనే పద్యం ఆ సందర్భానికి అద్భుతంగా అతికింది. 15వ శతాబ్దం వాడైన భైరవకవి “శ్రీరంగ మహాత్మ్యం” లో శివుణ్ణి ఒక సర్వలఘుకందంలో స్తుతిస్తాడు. 16వ శతాబ్దం వరకు చిత్రకవిత్వాన్ని కావ్యాల్లో వాడినా, అది చెదురుమదురుగా, కేవలం ఒక సందర్భానికి అవసరం అనుకుంటే తప్ప, వాడలేదు. ఆ తర్వాత మాత్రం, “చిత్రకవిత్వం కోసమే చిత్రకవిత్వం” అన్నట్టుగా విజృంభించారు మన కవులు. అప్పుడే పింగళి సూరన “రాఘవపాండవీయం” అనే ద్వ్యర్థి కావ్యం రాశాడు. అంటే ప్రతి పద్యం లోనూ రామాయణానికి సంబంధించిన అర్థం ఒకటి, భారతానికి సంబంధించిన అర్థం మరోటి ఉంటాయన్న మాట. అతన్ని చూసి “నేనేం తక్కువ తిన్లే”దంటూ భట్టుమూర్తి “హరిశ్చంద్రనలోపాఖ్యానం” రాశాడు హరిశ్చంద్రుడి కథనీ నలచరిత్రనీ కలిపి ముడేస్తూ. ఇంక ఆ తర్వాత ఎన్నో వచ్చాయి ఇలాటి రెండర్థాలు, మూడర్థాలు, నాలుగర్థాల కావ్యాలు. వీటన్నిట్లో “రాఘవపాండవీయం” ఒక్కటే మామూలు మనుషులకి కొంతైనా కొరుకుడు పడేది. ఐతే పింగళి సూరన ” కళాపూర్ణోదయం” లో చేసిన ప్రయోగాలు సందర్భానుకూలంగా ఉండి కొంతవరకు ఉల్లాసాన్ని కలిగించగలవు. నలుగురు కవులు ఓ రాజుని చూట్టానికి వెళ్తే ఒక మంత్రి వాళ్ళకి అడ్డు తగుల్తుంటాడు. ఇలా కాదని వాళ్ళు పల్లెటూరి వాళ్ళ వేషాల్లో ఆ రాజు దగ్గరికెళ్ళి ఓ పద్యం యిలా చెప్తారు "మాయమ్మాన సు నీవే - రాయలవై కావ దేవరా జేజేజే - మాయాతుమ లానిన యది - పాయక సంతోసమున్న ఫల మిలసామీ" చదువేమీ రాని వాళ్ళ మాటల్లా అనిపించే ఈ పద్యం నిజానికి తెలుగు పద్యం గానూ, సంస్కృత శ్లోకం గానూ కూడా చదువుకోవచ్చు. ముందుగా, తెలుగు పద్యానికి అన్వయం ఇది దేవరా, జేజేజే, ఇలసామీ (భూమిని పాలించే వాడా), నీవే రాయలవై కావ, సంతోసము, పాయక (విడవకుండా), మాయాతుమలు (మా ఆత్మలు), ఆనినయది (తాకింది), ఉన్నఫలము, మాయమ్మ, ఆన, సు! అని అర్ధం వస్తుంది. ఇదే పద్యం సంస్కృతంలో ఐతే హే, సునీవే (శుభప్రదమైన మూలధనము కలవాడా), ఆయమ్ (రాబడిని), మామాన (లెక్కపెట్టుకో వద్దు), అలవా (ముక్కలు కాని), రాః (ధనము), ఏకైవ (ఒక్కటే), అవత్ (కష్టాల్లో రక్షించేది);  అజేజే (యజ్ఞం చేసే), రాజే (రాజు కోసం), మా (లక్ష్మి), ఆయాతు (వస్తుంది), మలాని న (పాపాలు అంటవు); పాయక (ఓ రక్షకుడా), సః (మంచివాళ్ళు), యది (దర్శనానికొస్తే), అసముత్ (సంతోషం లేకుండా), నఫల (వాళ్ళని చూడకుండా ఉండొద్దు), మిల (వాళ్ళతో కలువు), అమీ (వచ్చిన మేము), సా (ఆ లక్ష్మీ దేవే అనుకో) ఇంత వ్యవహారం ఉంది ఆ చిన్ని కందంలో! ఈ సందర్భంలో మరో వింతైన పద్యం కూడా గమనించండి "తా వినువారికి సరవిగ - భావనతో నానునతి విభా వసుతేజా - దేవర గౌరవ మహిమన - మా వలసిన కవిత మరిగి మాకు నధీశా" దీన్ని తిరగేస్తే ఓ సంస్కృత శ్లోకం ఔతుంది! "శాధీనకు మా గిరి మత - వికనసి లవమాన మహిమ వర గౌరవ దే - జాతే సువ భావి తినను - నాతో నవభాగ విరస కిరివానువితా" వీటికిక్కడ అర్థాలు చెప్పటం కష్టం.

     చిత్రకవిత్వానికి స్వర్ణయుగం 17, 18 శతాబ్దాలు. “ఉషాపరిణయం” లో దామెరల అంకన్న ఒక కందపద్యంలో 108 కందాల్ని బంధించాడు. అంటే, ఏ అక్షరం దగ్గర మొదలై ముందుకు వెళ్ళినా, వెనక్కి వెళ్ళినా ఓ కందం వస్తుందన్న మాట.

     అలాగే, గణపవరపు వేంకటకవి “ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం” అనే కావ్యం రాశాడు. దీన్లో ఇతను చెయ్యని చిత్రకవితా ప్రదర్శనం లేదు. వెయ్యి పైగా పద్యాల్ని ఇముడ్చుకున్న ఓ సీసం కూడా ఉన్నదిందులో! ఆ తర్వాత ఇంకా ఎన్నో చిత్రకవితా విశేషాల్తో కావ్యాలొచ్చాయి. ఉదాహరణకి రావిపాటి లక్ష్మీనారాయణ “భారతగర్భ రామాయణం” లో పద్యాలు రామాయణార్థంలో ఉంటే ప్రతి పద్యంలోను ఇమిడి ఉన్న మరో పద్యం భారతార్థాన్నిస్తుంది!ఇలా ఎన్నో రకాల చిత్ర విచిత్ర పాండిత్య విన్యాసాలు సాగేయి మన చిత్రకవిత్వం లో. వందల కొద్ది చిత్రాలు గీసుకుని వాటిలో పట్టే పద్యాల్ని తయారు చేశారు అసలు నిజమైన చిత్రకవిత ఇదేనంటారు కొందరు. ఈ ప్రక్రియలో కవి కంట బడ్డ ఏ వస్తువైనా చిత్రకవితకి అర్హమే! గుళ్ళు, గోపురాలు, రథాలు, చక్రాలు, ఖడ్గాలు, ఛురికలు, చెట్లు, సర్పాలు, గోవులు (గోమూత్రం కూడా), కోతులు, ఇంకా ఎన్నెన్నో ఆకారాలు చిత్రకవిత్వానికి పనికొచ్చినయ్.  ఆరుద్ర తన సమగ్రాధ్ర చరిత్రలో చిత్రకవిత్వం గురించి చెబుతూ చిత్రకవిత్వంలో చిత్రాలే తప్ప కవిత్వానికి తావుండదన్నాడు. అయినా ఇప్పటికి ఎంతో మంది చిత్రకవిత్వం పట్ల ఆకర్షితులౌతూనే ఉన్నారు. సరి ఇంతటితో చిత్రకవిత్వమును గూర్చిన పరిచయం ముగిస్తాను.

     సుదీర్ఘ ఉపోద్ఘాతాననంతరం విషయంలోకి వెళ్దాం. పద్యంతో పరిచయం ఉన్న ఏ కవికైనా చింతా కాదు కాదు చిత్రకవిత రామకృష్ణారావు గారి గురించి తెలిసే ఉంటుంది. ఆయన 2008 సం నుండి "ఆంధ్రామృతం" పేరుతో బ్లాగు నిర్వహిస్తూ ఈనాటికి అనేక ఉపయోగరమైన టపాలను పెడుతున్నారు. యలమంచిలి సమీపంలోని సర్వసిద్ధి అనే ప్రాంతానికి చెందిన వీరు చోడవరం కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పని చేసి పదవీ విరమణ తర్వాత హైదరబాదులో స్థిరపడ్డారు. ఆయన 2016 చివరిలో అనుకుంటాను 118 ఛందస్సులతో 108 సీసగర్భ పద్యాలతో యాదాద్రి నృసింహ శతకం వ్రాసి రికార్డు సృష్టించడం నాకు బాగా జ్ఞాపకం. ఇంక ఇంతకంటే ఆయన్ను గురించిన ఇంట్రో ఎందుకు చెప్పండి?

     కవిగారు వ్రాసిన పద్యాలను చూద్దాం. ఆయన అష్టవిధ నాయికలను శ్రీకృష్ణుని అష్ట మహిషులతో పోల్చి మూడు చంపకమాలలలోను, ఐదు ఉత్పలమాలలతోను కవిత్వ చెప్పారు. మొదట స్వాధీనపతికను రుక్మినిగా సంభావించారు. ఆవైనం కొంచెం చూద్దాం.  "తన యనురాగ హేలను ముదంబును గూర్చెడి రుక్మిణీ సతిన్ - మనమున నిల్పి, యామె యభిమాన సుఖప్రద మందిరంబహో! -  వినుత ముకుంద! వీడవుగ, విజ్ఞత క్రోల్పడి భామ ప్రేమచే - తనకు వశుండవై చెలగ తాను రహించెను నీదు ప్రేమచే" అన్నారు. రుక్మిణీదేవి సామాన్యమైనదా వలచి వలపించుకొన్న భాగ్యశాలి. దంతవక్తృని సంహరించి, జరాసంధుణ్ణి, శిశుపాలురలను యుద్ధంలో నిలువరించి తెచ్చుకున్న అనుంగు ప్రేయసి. శ్రీకృష్ణుడు రుక్మిణీ సతిని సదా మనస్సులో నిల్పుకొండాటట. ఆమెకు వశుడై, వశ్యుడై నడుచుకుంటూ ఉంటే ఆమె ప్రేమాతిశయంతో ఆయన వర్ధిల్లాడట.  

     వాసకసజ్జికను సత్యభామగా వర్ణిస్తూ "తానిచ్చనలంకరించుకొని, నేర్పుగ తల్పమలంకరించి పల్ - ముచ్చటతోడ నిన్ గవసి పోఁడిమినొప్ప నుపేక్ష చేయ నీవిచ్చట కృష్ణ!" అన్నారు. కృష్ణుడుకి ప్రీతిప్రదంగా అలంకరించుకొని, తలమూ అలంకరించి, పోడిమి అంటే ఒప్పు, సంపద, సౌఖ్యం అని చాలా అర్ధాలున్నై - ఉపేక్ష చేయడం ఎందుకు ? అని ఆమె వేదనను వివరించారు.  శ్రీకృష్ణుని అష్టభార్యలలో సత్యభామ పాత్ర చిత్రణ తెలుగునాట సాహిత్యంలో ఎంత విశిష్టమైన పాత్ర సంతరించుకొంది మనకు తెలుసు. స్వాధీనపతికయైన నాయికగా, భావిస్తారు ఆమెను. సరస శృంగారాభిమానవతిగాను, విభునికి తనపైనున్న ప్రేమకారణంగా గర్వం మూర్తీభవించినదానిగాను సత్యభామ పాత్ర ఉంటుంది. సత్యభామజడ కూచిపూడి సాంప్రదాయ నృత్యంలో ఎంత ప్రాచుర్యం ఉన్నది అందరికి తెలిసిందే! స్వాధీన పతికను వాసకసజ్జిక చేసిన కవి చమత్కారం గొప్పది. 

     విరహోత్కంఠితను జాంబవతిగా వర్ణిస్తూ "విరహము చేత కల్గనిట వేగిరపాటు, భరింప లేనిదై -సరగున చేరె పాన్పునకు చప్పున జాంబవతీలలామ. నీ - వరుగుము కృష్ణ! యామెమదినాత్రతఁ గాంచి సుఖింపఁ జేయగా" అన్నారు.  విరహం కలిగిన నాయిక పానుపు చేరింది. అయ్యా! కృష్ణా తాము వెళ్ళండి. ఆమె విరహం తీర్చండి అని బ్రతిమాలుతున్నాడు. జాంబవతి కథ మనకు తెలిసిందే! రామాయణం నాటి  జాంబవంతుడు తనకు దొరికిన శమంతకమణి  జాంబవతికి బహూకరిస్తాడు. జాంబవంతుడిని 28 రోజుల యుధ్ధంలో ఓడించి, జాంబవతిని చేపడతాడు శ్రీకృష్ణుడు.  ఈమె గొప్ప వీణా విద్వాంసురాలు. 

     ఇక విప్రలబ్ధను మిత్రవిందతో పోల్చి కృష్ణా మరచిపోయావా! మిత్రవిందకు మాటిచ్చావు. ఈనాటి రాత్రికి వస్తానని. ఆమె పరిస్థితి గమనించు కొంచెం "తరుణిని విప్రలబ్ధగను ధాత్రిని మార్చితివీవె కృష్ణ. సుం - దరమగు మేని సొమ్ములను తా పెకలించి విదల్చె కోపియై" అన్నాడు. వేసుకొన్న నగా నట్రా విసిరేసింది. వెళ్ళి ఓదార్చటం, కైవసం చేసుకోవడం చాలా ముఖ్యం అంటున్నాడు. ఈమె శ్రీకృష్ణుని మేనత్త కూతురు.  స్వయంవరంలో శ్రీకృష్ణుని వరమాల వేసి వరించిందీమె.  

     ఇక భద్రను ఖండితగా వివరించారు. భద్ర శ్రుతకీర్తి అనే రాజు పుత్రిక. ఈమె సకల సలక్షణ సమన్విత. జాగ్రత్త గల నడవడిక కలది. కృష్ణుడికి మేనమరదలి వరుస. ఆమెను "భద్రతఁ గొల్పి సాధువుల వర్ధిలఁ జేయగ రాత్రి నీ వహో - నిద్రను మాని యుండుటను నీ కను లెఱ్ఱగ నుండు టెన్ని నీ - భద్ర ‘పరాంగనన్ కలిసి వచ్చితివంచు’ బ్రమించి కోపియై - ఛిద్రము చేసె వస్తువులు శ్రీహరి! ఖండితనెట్లు మోసెదో?" అన్నారు. స్వామి సాధురక్షణకై వెళ్ళియుండగా ఆ రాత్రి కన్నులెర్రబడి యుండగా ఆమె వేరే గోపకాంతతో కులికి వచ్చాడనుకొని ఫ్రిజ్, డ్రెస్సింగ్ టబుల్ సారీ! హంసతూలికాతల్పము,అలంకరణ పేటికలు నాశనం చేసిందట అదీ కథ. 

     కలహాంతరితగా నాగ్నజితిని వర్ణించారు. పద్యంలో ఆమె పేరు ప్రస్తావన లేకపోయినప్పటికి ఆమె నాగ్నజితే! ఆమె కోసల దేశాధీశుడైన నగ్నజితి అనే మహారాజు రాజ్యంలో వృషభాలు మదించిన ఏనుగుల మాదిరిగా ఊరిమీదపడి ప్రజలను బాధిస్తుండగా ఆ నాగ్నజితు యెవరైతే వృషభాలను బంధిస్తారో వారికి తన కుమార్తెనిచ్చి పెళ్ళి చేస్తానని చాటించాడు. పెళ్ళికి ఆశ పడకపోయినా లోకోపకారార్ధం దేవకీ సుతుడు వెళ్లి అనాయాసంగా వృషభాలను బంధించాడు. రాజుగారు అన్నమాట ప్రకారం తన కుమార్తె నాగ్నజితినిచ్చి అంగరంగ వైభవంగా పెళ్ళి చేశాడు. ఇక ఆమె ఏమంటున్నదంటే "కోపము చెందె నీ మరులు గొల్పెడి మాటలకా సుదంత.. సం- తాపము తోడ నిన్ విడిచె దర్పముతో. మదిలోన నిన్ను తా - కోపము వీడి రావలచి చింతిలుచుండెను. గాంచితే హరీ!- హా! పరమేశ! యంచు కలహాంతరితాత్మఁ గృశించె. గాంచితే?" అన్నారు. కోపంతో ఏవో నాలుగుమాటలన్నది. ఆమె చింతిస్తూ కృశించి పోతున్నది హరీ! వచ్చి ఏలుకో ఆమెను అంటునారు.  

     ప్రోషితభర్తృక గా కాళింది నిలిచింది. కాళింది సూర్యుని కూతురు. ఆమె విష్ణుమూర్తి భర్త గావాలని తపస్సు చేసింది. కృష్ణార్జునులు యమునా నదిలో స్నానం చేయటానికి వెడితే ఆవిడ కామవాంచతో కృష్ణుని చూచింది. అర్జునుడు ఆమె వివరాలు అడిగి ఆమె మనోగతాభిప్రాయం కృష్ణునికి చెప్పి యిద్దరికీ సంధానం చేశాడు. గోపాలుడు ఆమె భక్తికి మెచ్చి ఆమెను ద్వారక తీసికెళ్ళి వివాహం చేసుకున్నాడు. ఆమెను కవి "కాళింది మనంబునన్ వగచె క్లేశమునొందుచు నీవు లేక తాన్. సందడి చేయు నీవచట చక్కని ప్రోషిత భర్తృకన్ గనన్" అన్నారు. అయ్యా! కృష్ణా నీవు నీ రాచకార్యాలమీద ఇళ్ళు విడిచి వెళ్ళావు. ఆమె మనోవ్యధతో మంచం పట్టింది. వచ్చి ఆమెతో సందడి చెయ్యి కాసేపు అంటున్నారు. 

     ఇక చివరిగా అభిసారికగా లక్షణ. ఆమెను "సన్నుతితోడ నిన్ను కను సన్నల రమ్మను చోటు చేరగా - నన్నులమిన్న లక్షణ సమస్త భయంబులు వీడి వచ్చి నీ - కన్నుల ముందటన్ నిలిచె కష్టములెన్నిటినైన నోర్చి. సం-పన్నతనొప్పు నామెకగు భవ్యముగా నభిసారికా ప్రియా" అంటున్నారు. లక్షణ బృహత్సేనుని ముద్దుల కూతురు. ఈమె శ్రీకృష్ణుని గుణగణాలు, మాయలు, రూపురేఖలు, సామర్ధ్యము నారదుని వల్ల విని అతనినే పెండ్లాడ గోరింది. ఆమె తండ్రి ఒక మత్స్య యంత్రం ఏర్పాటు చేసి దానిని కొట్టిన వానికి కూతురుని ఇస్తానని చాటించాడు. అనేక దేశాధీశులు, రాజకుమారులు ప్రయత్నించి విఫలమయ్యాక నందనందనుడు సునాయాసంగా మత్స్యాన్ని పడేశాడు. లక్షణ తన లక్ష్యం సిద్ధించిందని ఆనందించి వరమాల వేసి వరించింది. శ్రీకృష్ణుడు తనకు అడ్డు వచ్చిన రాజులందరినీ యెదురించి లక్షణని తీసుకుని ద్వారక చేరాడు.మరి మత్స్యయంత్రం కొట్టి తెచ్చిన నాయికను మల్లారి ఆమెను అభిసారికగా మారిస్తే ఎలా చెప్పండి? ఆమె అంత ఇష్టంతో, సమస్త భయాన్ని వీడి రమ్మన్న చొటుకుకు వచ్చింది కదా? అక్కడికి చేరుకోవాలి కదా! అంటునారు చిత్రకవితాసమ్రాట్ శ్రీ చింతారామకృష్ణారావు. ఇదీ ఇవాళ్టి కథా కమామిషూ. ఇక శెలవు.

జైహింద్.

వల్లభవఝుల అప్పులనరసింహ మూర్తి. తే.03-2-2010ని నాపై వ్రాసిన పద్యములు.

0 comments

జైశ్రీరామ్. 

03-2-2010-

శ్రీయుతులు..

మీరు దయతో పంపిన పద్యములు చదివితిని. చాల సంతసించితిని. నా భావనమును రత్నత్రయములో తెలియజేయుచున్నాను. చిత్త,,,పుడు.

మః 

పరమానందము గూర్చినారు. వరలన్ కందంబునన్ గీతమున్

తిరమాచంపకమందుఁ జేర్చి, బుధులన్ దిగ్భ్రాంతి చేకూర్చుచున్, 

సరిరారెవ్వరు ధీనిథీ! గురువరా! సత్కావ్యతేజోనిథీ!

వరమౌ భారతి దివ్యభావమొసగన్, బ్రార్థింతు సన్మాత్రమా!


భవదభిమాన పాత్రమగు పల్లెను మెచ్చితి నచ్చని డా. కవివర! ద్వర్థి భావయుత కబ్బములల్లుడి కావ్యరీతులన్ 3.6: వృత్తము అందు జాతులను వృత్తులు రీతులు తెన్గా గీతికల్ చిత్రము కంబం దివుర జేసెడి శక్తిని గూర్చి నట్టి యా చిత్రజు చర్చహారికి, విశిష్ట శుభాశ్రమ భక్త కవిజన్ కుత్తుక బంటి భావనలు గూర్పగ గొును రామ కృష్ణకూ!

విద్వద్విధేయుఁడు

 వల్లభవఝుల అప్పులనరసింహ మూర్తి.

జైహింద్.

నా అశ్వధాటి సతీ శతకముపై డా.సూరం శ్రీనివాసులుగారి సమీక్ష.

0 comments

 అశ్వధాటి

సంస్కృత రూపకాల్లో  ప్రరోచనాత్మక వచనాలుంటాయి. ఒక వాస్తవికతను ప్రతిపాదిస్తూ.  ' చింతా రామకృష్ణారావు గారు సతీశతకాన్ని గురిపించి ప్రస్తావించినప్పుడు అలాగే నాలుగు మాటలు వ్రాద్దామని పియింది.

కవి చింతా రామా కృష్ణారావు గారు భక్తిలోనికి బంధకవిత్వాన్ని నడిపిచగలవారు. నామాలకు రూపాన్ని కలిగించఁగలవారు. రూపాలలో చైతన్యాన్ని నింపగలవారు. ఎదుగుదలకూ, ఒదుగుదలకు తనలో తావునివ్వగలవారు. కవులకు తలలోని నాలుక వంటివారు. నిరంత రాద్యయనశీలి. వాఙ్మయ తపస్సునకు అధిష్టానం. ' అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్​ । స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే ॥ 15 అన్న గీతావాక్యమే ఆదర్శమైనవారు.

     ఇక శతకవిషయం సతీదేవి. పార్వతిపూర్వ రూపం . అధావమానేన పితుః ప్రయుక్తా I  దక్షస్య కన్యా భవ పూర్వపత్నీ II  సతీ సతీయోగ విసృష్ట దేహా I  తాం జన్మనే శైలవధూం ప్రపద్యేII అని కాళిదాసవచనం. తన తండ్రియే అవమానిస్తే భరించలేక ఆత్మత్యాగం చేసిన అభిమానవతి సతి. ధనపతి సఖుడైనా తన కున్నదే తనదని తిరిపె మెత్తే భర్త చూపిన బాటలోనే, తన భర్త ఎంతటి వాడైనా తన విలువయే తనదని నమ్మిని దేవి సతి. ఆ సతీదేవి విషయమైనప్పుడు ఇక కవిత కదం త్రొక్కటానికి అభ్యంతర మేముంది.

     ఇక ఛందస్సు అశ్వథాటి. సంస్కృతంలో శిఖరిణి, అశ్వధాటి విశిష్ఠ గతితో ఆకర్షించేవి. చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవన వాటీషు నాకి పటలీ. మొదలైన అశ్వధాటి అందరినీ కదుపు తుంది. వాని రాజతీర్ణరు రచించిన దశావతారస్తుతి అశ్వధాటికే అందాలు దిద్దుతుంది. అటువంటి ఛందస్సులో శతకం వ్రాయటం, గతి తప్పని గతిలో తీర్చి దిద్దటం అంత తేలిక ఏమీ కాదు.

     అయినా చింతా వారి ప్రయోగశీలత, భాషా ఛందస్సులపై పట్టు అశ్వధాటివైపే వారిని నడిపాయి. భక్తి భావానికి సామాజికతను కూడా జోడించి సతీదేవీశతకాన్ని ఆవిష్కరించారు రామకృష్ణారావు గారు.

     లోకంబులో కృతులనేకంబులున్న విక నీకేల చింత యన కో లోకేశ్వరీ కృతులు నీకై రచింపగను నాకిమ్ము శక్తి  కృపతో, నీకై రచింపగను లేకున్నచో బ్రతుకు నాకేల నమ్మ భువిపై, చీకాకులన్ బడక నీకై రచించుటిది నాకిచ్చు మూర్తిని సతీ! ఇది చింతా వారి ముక్తి వాంఛ కృతి నిర్మాణంలో. ఇది వ్యక్తిగతం. 

     ఇక సామాజికంగా కూడా 'వారి చింత, చింతన ప్రత్యక్షర సత్యాలుగా కనిపిస్తాయి. ధర్మాను వర్తులిల మర్మింబెఱుంగ రిక ధర్మార్థమే బ్రతుకూచున్, దుర్మార్గు లట్టి యెడ దుర్మార్గమున్ నెరపి ధర్మంబునే గెలుతురే, ధర్మంబె యోడిన యధర్మంబు రాజగును ధర్మంబునే నిలుపుమా, మర్మజ్ఞులన్ దునుమ ధర్మంబు నిల్చును, సుకర్మల్ వెలుంగును సతీ:

అశ్వధాటి అదే వేగంతో ప్రగతిపథంలో పయనించాలని ఆశిస్తూ, అభినందిస్తూ

(సూరం శ్రీనివాసులు).

నమోఽస్తు తే జగన్మాతా! శార్దూల వృత్త మాలిక..... రచన .. చింతా రామకృష్ణారావు.

0 comments

జైశ్రీరామ్. 

నమోస్తు తే జగన్మాతా!

శార్దూల వృత్త మాలిక.

అమ్మా! నిన్ గనుచుందు సర్వమున నాహా! పొంగుచున్ సర్వదా. 

సమ్మాన్యంబగు సుస్వరూపముగ, భాషా మందిరోద్భాస! వే 

దమ్మున్ గల్గిన తేజ మీవె, మహిళా తత్వార్ధ సంభాసితా! 

ఇమ్మున్ భారత నారిగా ప్రబలితే! ఈశాని! నీ తేజసం 

బెమ్మిన్ దాల్చిన కాంతలే శుభములన్ హృష్టాత్ములై పంచుచున్, 

దమ్ముం జూపఁగఁ జాలువారు, కవితా దర్పంబునన్ వెల్గుచున్ 

సమ్మానంబుల నందువారు, విలసత్ సత్కార్యముల్ చేయువా 

రమ్ముల్ బట్టి రణంబు చేయుప్రతిభుల్ హర్మ్యాది నిర్మాణముల్, 

సమ్మోదంబుగఁ జేయఁ గల్లు మహితల్, సత్కార్య నిష్ణాతులున్, 

కమ్మందేనియ పల్కులన్ సుజనులన్ కారుణ్యముం జూచువా 

రమ్మా యంచును బిల్చినంతనె మదిన్ హర్షించి ప్రేమామృతం 

బమ్మై పంచెడి వార లక్షయ కృపన్ త్యాగాకృతిన్ వెల్లువా 

రమ్మోహాదులు గెల్చినట్టి ఘనులున్, యత్నించి దైవంబునే 

రమ్మంచున్ బిలువంగ జాలు ప్రతిభల్, ప్రాణంబులన్ నిల్పు భా 

సమ్మల్, సంతత సన్నుతాత్ములు, కృపా సామ్రాజ్య రాజ్ఞీమణుల్, 

నమ్మన్ వారిని వమ్ము చేయక కృపాణమ్మై సదా కాచువా 

రమ్మా! నీ ప్రతి రూపులై వెలుగు మాయందున్ సదా, దైవ కా 

ర్యముల్ చేయగ జేతురమ్మ గని సౌర్యంబిచ్చి సత్ప్రేరణన్. 

తమ్ముం దాము తలంచుచాత్మనిను మాతా! గాంచి పూజ్యంబుగా 

సొమ్ముల్ దాల్తురు ప్రేమతోడ మదిలో శోభిల్ల నీరూపు వే 

దమ్మున్ వెల్గెడి దేవదేవి! కృపతో, తత్వార్థ పూర్ణాకృతిన్ 

మమ్మున్ గానగ నీవె వీరగుచు ప్రేమన్ మాకు గన్పింతు వో 

యమ్మా! నీవె కృపాంతరంగవయి మోహాదుల్ విడన్ జేయుమా,

నమ్మంజాలని దుష్టసంస్కృతులచే నశ్వంబగున్ సర్వమున్,

క్రమ్మున్ వేగమె మానవాళిని, మహత్కాఠిన్య గాఢాంధమున్

క్రమ్మంజేయును, పాపభీతి నణచున్, బ్రఖ్యాతి పోకార్పుచున్ 

వమ్ముంజేయు మహత్వ సంస్కృతి గతిన్ వర్ధిల్లు కాంతాళిపై 

క్రమ్మున్, దుర్గతిపాలు సేయు నవతన్ గాంక్షింపగా చేయుచున్, 

నమ్మంజాలని ధర్మహీనగతులన్ నర్తింపంగా చేయు, మౌ 

నమ్ముందాల్పగ జేయు శిష్టజనులన్, నక్షత్ర వారాశి నాన్ 

క్రమ్మంజేయును దూరదర్శనములన్ గానంగ సిగ్గనట్లుల్. 

మమ్ముం జూడుడటంచు రేగునటులన్ మౌనంబుగా చేయు, మా 

యమ్మా గాంచగరాని తీరునను మోహాంధంబునే గొల్పుచున్ 

సమ్మోహమ్మును గొల్పి దుష్ట గతులన్ చాంచల్యతన్ గ్రాలు, హే 

యమ్మౌ దుర్గతి పాలు సేయుచును మాయన్ గొల్పు. పూబోడులన్ 

సమ్మోదమ్మున కాచుమమ్మ  కరుణన్. సంధించు బాణమ్ములన్. 

సమ్మాన్యుల్ మహిళామణుల్ ధరణిపై శశ్వన్నయోపాసకుల్. 

క్రమ్మం జేయకు మమ్ము దుర్గుణ తతిని కాపాడుచున్ వారలన్. 

నెమ్మిన్ దుర్మద దూర సంస్కృతిని క్షీణింపన్ గృపన్ జేయుమా,

కొమ్మా! వందన మాచరింతు జననీ! కూర్మిన్. భవానీ సతీ! 

ఇట్లు . 

చింతా రామకృష్ణారావు.

జైహింద్.

శ్రీ భద్రం వేణుగోపాలాచార్యులు, M.A., Bed., నాపై (చాలాకాలం క్రితం వారున్నప్పుడు)వ్రాసిన గర్భకవిత.

0 comments

జైశ్రీరామ్. 

బ్రహ్మశ్రీ చింతా రామ కృష్ణ కవి వరేణ్యులకు,

శ్రీరస్తు. 

మీకవితా సాధనా సంపత్తికి,నమ స్కారాలు-ఆర్యా!

తేటగీతి గర్భ కందము .

కం|| తమకు వరమయ్యె మీ కవి

త, మధురమగు భావనమ్ము, తాండవమున పం 

తముగను భద్రమనుచును, స

తము నిర్వహణ మొనరు! ఫలితము శుభమౌటన్. 

కందగర్భస్థ తేటగీతి .

తమకు వరమయ్యె మీకవిత మధురముగు 

భావనమ్ము తాండవమున పంతముగను 

భద్ర మనుచును. సతము నిర్వహణ మొనరు! 

ఫలితము శుభమౌటన్ భగవంతుకృపను .


కంద గీత గర్భ చంపకమాల.

చ|| మిము మన మందెదో తలప మేఘున వారుణ ధారలౌను, కా 

ర్యము ఫలమై, జనున్ క్రమము నందున శబ్దము రామకృష్ణ"  నా

మము వినువీధిలో విబుధ మాన్య నివేదన వేడ్క జేయు, ద్వా 

నము శుభమౌను 'చింత'లకు నల్లుడలాశలు ధాత్రియందునన్.

చంపకమాల గర్భస్థ 

కందము.  మనమందెదో తలపమే!

ఘన వారుణ ధారలౌను కార్యము ఫలమై, 

విను వీధిలో విబుధ మా

న్య  నివేదన వేడ్కఁ జేయు ధ్యానము శుభమౌ.

చంపకమాల గర్భస్థ 

తే.గీ.  తలపమేఘన వారుణ ధారలౌను  

క్రమము నందున శబ్దము' రామ కృష్ణ 

విబుధ మాన్య నివేదన వేడ్క జేయు 

తలకు నల్గడలాశలు ధాత్రియందు.


మీరు చేసిన రచనలు మేలు చేసినవిగ చెప్పక తప్పదు, 

నాకు చిన్న నాటి తలపు గుర్తుకు వచ్చి నాకు తోచు. నట్లు చంపక వాసన నిట్లు చేసితిని,

ఆ.వె.  బంధ కవిత జేయు పరిణితి, సొంతము

జేసు కొన్న మీరు చేవ గలిగి, 

చేయగల్గి, మీరు చేయక పోవుట 

పూయ గల్లి చెట్టు పూయరాదె!

మీకు శారదాదేవి. సమీకృతముగ సాహితీశక్తి, నొసగుత! సర్వ శుభము లెప్పుడు ప్రీతిగా నిచ్చి మీ ప్రాపు గనుచు, బంధు మిత్రుల కెల్ల సౌభాగ్యమొసగుత.

అష్టావధాని

భద్రం వేణుగోపాలాచార్యులు, M.A., Bed.,

గణేశ్ నగర్ ఆమదాలవలస

శ్రీకాకుళం జిల్లా 532185

జైహింద్.

విద్యారణ్యంలో...కుమారి లక్ష్మీ అహల అద్భుత అష్టావధానం.. || Darshanam Tv

0 comments

జైశ్రీరమ్.
జైహింద్.

8, డిసెంబర్ 2025, సోమవారం

శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి..Day 2 ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణ.

0 comments

జైశ్రీరామ్
జైహింద్.

శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి..Day 1 ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణ.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

7, డిసెంబర్ 2025, ఆదివారం

బాలవిద్వన్మూర్తి చి వింజమూరి సంకీర్త్య్ ప్రప్రథమ ప్రత్యక్ష అష్టావధానం | తప్పక చూడాల్సిన ...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

జన్మదిన శుభాకాంక్షలు దేవభాషలో. Janmadinamidam by Swami Tejomayanandaji of Chinmaya mission - birthday s...

0 comments

జైశ్రీరామ్.
జన్మదినమిదం అయి ప్రియా సఖే 
శంతనోతు తే సర్వదా ముదం
ప్రార్ధయామహే భవ శతాయుషీ
ఈశ్వరస్సదా త్వాం చ రక్షతు 
పుణ్య కర్మణా కీర్తిమార్జయ 
జీవనం తవ భవతు సార్ధకమ్.
జైహింద్.

అఖండ భారత ... భారతీయ స్వాభిమాన గళం.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

ప్రార్థన.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

6, డిసెంబర్ 2025, శనివారం

బ్రహ్మశ్రీ దేవవ్రతమహేష్ రేఖే 19 yrs. old Chi. దండక్రమ పారాయణం.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

బ్రహ్మశ్రీ దేవవ్రత్ మహేశ్ రేఖే శుక్లయజుర్వేద దండక్రమ పారాయణ. Who is Devavrat mahesh rekhe | what is Dandakrama parayana in vedam Telu...

0 comments

జైశ్రీరామ్
జైహింద్.

దండక్రమం వన్డే మ్యాచ్ కాదు Danda Krama is not a one day match #dandakram...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

5, డిసెంబర్ 2025, శుక్రవారం

చిరంజీవి వింజమూరి సంకీర్త్య్ శర్మ (వయసు 13ఏండ్లు) అష్టావధానము.

0 comments

 

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

శా.  శ్రీంకామేశ్వరి దీవనాళిఁ గొని, రాశీభూత చైతన్యమై
సంకీర్త్యాఖుఁడు వింజమూరి వర వంశస్ఫూర్తి శ్రీభారతీ
సంకేతంబుగ సద్వధానవిధిలో సంస్తుత్యుఁడై వెల్గుతన్,
జంకున్ గొంకు నెరుంగనట్టి ఘనుఁడై సమ్మాన్యుఁడై, ధాత్రిపై.

శ్రీ తటవర్తి శ్రీకల్యాణ్ చక్రవర్తి.
శ్రీమన్మంగళ వంశ్యుఁడైన తటవర్తి స్ఫూర్తి కల్యాణ్ సదా
ప్రేమన్ శిక్షణ సద్వధానమున దీప్తింన్ గాంచ శిష్యాళికిన్
క్షేమంబున్ గలిగింప నిచ్చు ప్రతిభోత్సేకంబుతోనొప్ప నా
ధీమంతున్ జగదంబ కాచుత ధరన్ దేదీప్యమానంబుగా.
జైహింద్.

4, డిసెంబర్ 2025, గురువారం

చిరంజీవి నరసింహదేవర జయలక్ష్మి (వయసు11ఏండ్లు)సంస్కృత అష్టావధానం 2వ భాగము. First Sanskrit Astavādhanam — Part 1 | Jayalakshmi

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

చిరంజీవి నరసింహదేవర జయలక్ష్మి (1సంవత్సరములు.)సంస్కృతావధానం. 1వ భాగము.First Sanskrit Astavādhanam — Part 1 | Jayalakshmi

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

శేషప్పకవి కృత నరసింహశతక గానము.

0 comments

జైశ్రీరామ్.

001
సీ. శ్రీమనోహర । సురా - ర్చిత సింధుగంభీర ।
భక్తవత్సల । కోటి - భానుతేజ ।
కంజనేత్ర । హిరణ్య - కశ్యపాంతక । శూర ।
సాధురక్షణ । శంఖ - చక్రహస్త ।
ప్రహ్లాద వరద । పా - పధ్వంస । సర్వేశ ।
క్షీరసాగరశాయి । - కృష్ణవర్ణ ।
పక్షివాహన । నీల - భ్రమరకుంతలజాల ।
పల్లవారుణపాద - పద్మయుగళ ।

తే. చారుశ్రీచందనాగరు - చర్చితాంగ ।
కుందకుట్మలదంత । వై - కుంఠధామ ।
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

002
సీ. పద్మలోచన । సీస - పద్యముల్ నీ మీద
జెప్పబూనితినయ్య । - చిత్తగింపు
గణ యతి ప్రాస ల - క్షణము జూడగలేదు
పంచకావ్య శ్లోక - పఠన లేదు
అమరకాండత్రయం - బరసి చూడగలేదు
శాస్త్రీయ గ్రంధముల్ - చదువలేదు
నీ కటాక్షంబున - నే రచించెద గాని
ప్రజ్ఞ నాయది గాదు - ప్రస్తుతింప

తే. దప్పుగలిగిన సద్భక్తి - తక్కువౌనె
చెఱకునకు వంకపోయిన - చెడునె తీపు?
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

003
సీ. నరసింహ । నీ దివ్య - నామమంత్రముచేత
దురితజాలము లన్ని - దోలవచ్చు
నరసింహ । నీ దివ్య - నామమంత్రముచేత
బలువైన రోగముల్ - పాపవచ్చు
నరసింహ । నీ దివ్య - నామమంత్రముచేత
రిపుసంఘముల సంహ - రింపవచ్చు
నరసింహ । నీ దివ్య - నామమంత్రముచేత
దండహస్తుని బంట్ల - దరమవచ్చు

తే. భళిర । నే నీ మహామంత్ర - బలముచేత
దివ్య వైకుంఠ పదవి సా - ధింపవచ్చు
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

004
సీ. ఆదినారాయణా । - యనుచు నాలుకతోడ
బలుక నేర్చినవారి - పాదములకు
సాష్టాంగముగ నమ - స్కార మర్పణ జేసి
ప్రస్తుతించెదనయ్య - బహువిధముల
ధరణిలో నరులెంత - దండివారైనను
నిన్ను గాననివారి - నే స్మరింప
మేము శ్రేష్ఠుల మంచు - మిదుకుచుంచెడివారి
చెంత జేరగనోను - శేషశయన

తే. పరమ సాత్వికులైన నీ - భక్తవరుల
దాసులకు దాసుడను జుమీ - ధాత్రిలోన
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

005
సీ. ఐశ్వర్యములకు ని - న్ననుసరింపగలేదు
ద్రవ్య మిమ్మని వెంట - దగులలేదు
కనక మిమ్మని చాల - గష్టపెట్టగలేదు
పల్ల కిమ్మని నోట - బలకలేదు
సొమ్ము లిమ్మని నిన్ను - నమ్మి కొల్వగలేదు
భూము లిమ్మని పేరు - పొగడలేదు
బలము లిమ్మని నిన్ను - బ్రతిమాలగాలేదు
పసుల నిమ్మని పట్టు - పట్టలేదు

తే. నేను గోరిన దొక్కటే - నీలవర్ణ
చయ్యనను మోక్షమిచ్చిన - జాలు నాకు
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

006
సీ. మందుండనని నన్ను - నింద చేసిననేమి?
నా దీనతను జూచి - నవ్వ నేమి?
దూరభావములేక - తూలనాడిన నేమి?
ప్రీతిసేయక వంక - బెట్ట నేమి?
కక్కసంబులు పల్కి - వెక్కిరించిన నేమి?
తీవ్రకోపముచేత - దిట్ట నేమి?
హెచ్చుమాటలచేత - నెమ్మె లాడిన నేమి?
చేరి దాపట గేలి - చేయనేమి?

తే. కల్పవృక్షంబువలె నీవు - గల్గ నింక
బ్రజల లక్ష్యంబు నాకేల? - పద్మనాభ ।
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

007
సీ. చిత్తశుద్ధిగ నీకు - సేవజేసెదగాని
పుడమిలో జనుల మె - ప్పులకు గాదు
జన్మపావనతకై - స్మరణజేసెద గాని
సరివారిలో బ్రతి - ష్థలకు గాదు
ముక్తికోసము నేను - మ్రొక్కి వేడెదగాని
దండిభాగ్యము నిమి - త్తంబు గాదు
నిన్ను బొగడగ విద్య - నేర్చితినేకాని
కుక్షినిండెడు కూటి - కొఱకు గాదు

తే. పారమార్థికమునకు నే బాటుపడితి
గీర్తికి నపేక్షపడలేదు - కృష్ణవర్ణ ।
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

008
సీ. శ్రవణ రంధ్రముల నీ - సత్కథల్ పొగడంగ
లేశ మానందంబు - లేనివాడు
పుణ్యవంతులు నిన్ను - బూజసేయగ జూచి
భావమందుత్సాహ - పడనివాడు
భక్తవర్యులు నీ ప్ర - భావముల్ పొగడంగ
దత్పరత్వములేక - తలగువాడు
తనచిత్తమందు నీ - ధ్యాన మెన్నడు లేక
కాలమంతయు వృధా - గడపువాడు

తే. వసుధలోనెల్ల వ్యర్ధుండు - వాడె యగును
మఱియు జెడుగాక యెప్పుడు - మమతనొంది.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

009
సీ. గౌతమీస్నానాన - గడతేఱుద మటన్న
మొనసి చన్నీళ్లలో - మునుగలేను
తీర్థయాత్రలచే గృ - తార్థు డౌదమటన్న
బడలి నేమంబు లే - నడపలేను
దానధర్మముల స - ద్గతిని జెందుదమన్న
ఘనముగా నాయొద్ద - ధనములేదు
తపమాచరించి సా - ర్ధకము నొందుదమన్న
నిమిషమైన మనస్సు - నిలుపలేను

తే. కష్టములకోర్వ నాచేత - గాదు నిన్ను
స్మరణచేసెద నా యధా - శక్తి కొలది.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

010
సీ. అర్థివాండ్రకు నీక - హాని జేయుట కంటె
దెంపుతో వసనాభి - దినుట మేలు
ఆడుబిడ్డలసొమ్ము - లపహరించుట కంటె
బండ గట్టుక నూత - బడుట మేలు
పరులకాంతల బట్టి - బల్మి గూడుట కంటె
బడబాగ్ని కీలల - బడుట మేలు
బ్రతుకజాలక దొంగ - పనులు చేయుట కంటె
గొంగుతో ముష్టెత్తు - కొనుట మేలు

తే. జలజదళనేత్ర నీ భక్త - జనులతోడి
జగడమాడెడు పనికంటె - జావు మేలు
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

011
సీ. గార్దభంబున కేల - కస్తూరి తిలకంబు?
మర్కటంబున కేల - మలయజంబు?
శార్ధూలమునక కేల - శర్కరాపూపంబు?
సూకరంబున కేల - చూతఫలము?
మార్జాలమున కేల - మల్లెపువ్వులబంతి?
గుడ్లగూబల కేల - కుండలములు?
మహిషాని కేల ని - ర్మలమైన వస్త్రముల్?
బకసంతతికి నేల - పంజరంబు?

తే. ద్రోహచింతన జేసెడి - దుర్జనులకు
మధురమైనట్టి నీనామ - మంత్రమేల?
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

012
సీ. పసరంబు వంజైన - బసులకాపరి తప్పు
ప్రజలు దుర్జనులైన - ప్రభుని తప్పు
భార్య గయ్యాళైన - బ్రాణనాధుని తప్పు
తనయుడు దుష్టయిన - తండ్రి తప్పు
సైన్యంబు చెదిరిన - సైన్యనాధుని తప్పు
కూతురు చెడుగైన - మాత తప్పు
అశ్వంబు చెడుగైన - నారోహకుని తప్పు
దంతి దుష్టయిన మా - వంతు తప్పు

తే. ఇట్టి తప్పులెఱుంగక - యిచ్చవచ్చి
నటుల మెలగుదు రిప్పు డీ - యవని జనులు.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

013
సీ. కోతికి జలతారు - కుళ్లాయి యేటికి?
విరజాజి పూదండ - విధవ కేల?
ముక్కిడితొత్తుకు - ముత్తెంపు నత్తేల?
నద్ద మేమిటికి జా - త్యంధునకును?
మాచకమ్మకు నేల - మౌక్తికహారముల్?
క్రూరచిత్తునకు స - ద్గోష్ఠు లేల?
ఱంకుబోతుకు నేల - బింకంపు నిష్ఠలు?
వావి యేటికి దుష్ట - వర్తనునకు?

తే. మాట నిలుకడ కుంకరి - మోటు కేల?
చెవిటివానికి సత్కథ - శ్రవణ మేల?
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

014
సీ. మాన్యంబులీయ స - మర్ధుడొక్కడు లేడు
మాన్యముల్ చెఱుప స - మర్ధు లంత
యెండిన యూళ్లగో - డెఱిగింప డెవ్వడు
బండిన యూళ్లము - బ్రభువు లంత
యితడు పేద యటంచు - నెఱిగింప డెవ్వండు
కలవారి సిరు లెన్న - గలరు చాల
దనయాలి చేష్టల - తప్పెన్న డెవ్వడు
బెఱకాంత ఱంకెన్న - బెద్ద లంత

తే. యిట్టి దుష్టుల కధికార - మిచ్చినట్టి
ప్రభువు తప్పు లటంచును - బలుకవలెను.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

015
సీ. తల్లిగర్భమునుండి - ధనము తే డెవ్వడు
వెళ్లిపోయెడినాడు - వెంటరాదు
లక్షాధికారైన - లవణ మన్నమె కాని
మెఱుగు బంగారంబు - మ్రింగబోడు
విత్త మార్జనజేసి - విర్రవీగుటె కాని
కూడబెట్టిన సొమ్ము - తోడరాదు
పొందుగా మఱుగైన - భూమిలోపల బెట్టి
దానధర్మము లేక - దాచి దాచి

తే. తుదకు దొంగల కిత్తురో - దొరల కవునొ
తేనె జుంటీగ లియ్యవా - తెరువరులకు?
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

016
సీ. లోకమం దెవడైన - లోభిమానవు డున్న
భిక్ష మర్థిమి జేత - బెట్టలేడు
తాను బెట్టకయున్న - తగవు పుట్టదుగాని
యొరులు పెట్టగ జూచి - యోర్వలేడు
దాతదగ్గఱ జేరి - తన ముల్లె చెడినట్లు
జిహ్వతో జాడీలు - చెప్పుచుండు
ఫలము విఘ్నంబైన - బలు సంతసమునందు
మేలు కల్గిన జాల - మిణుకుచుండు

తే. శ్రీరమానాథ । యిటువంటి - క్రూరునకును
భిక్షుకుల శత్రువని - పేరు పెట్టవచ్చు.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

017
సీ. తనువులో బ్రాణముల్ = తరళిపొయ్యెడివేళ
నీ స్వరూపమును ధ్యా - నించునతడు
నిమిషమాత్రములోన - నిన్ను జేరును గాని
యముని చేతికి జిక్కి - శ్రమలబడడు
పరమసంతోషాన - భజన జేసెడివారి
పుణ్య మేమనవచ్చు - భోగిశయన
మోక్షము నీ దాస - ముఖ్యుల కగు గాని
నరక మెక్కడిదయ్య - నళిననేత్ర

తే. కమలనాభ నీ మహిమలు - గానలేని
తుచ్ఛులకు ముక్తిదొరకుట - దుర్లభంబు.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

018
సీ. నీలమేఘశ్యామ । - నీవె తండ్రివి మాకు
కమలవాసిని మమ్ము - గన్నతల్లి
నీ భక్తవరులంత - నిజమైన బాంధవుల్
నీ కటాక్షము మా క - నేకధనము
నీ కీర్తనలు మాకు - లోక ప్రపంచంబు
నీ సహాయము మాకు - నిత్యసుఖము
నీ మంత్రమే మాకు - నిష్కళంకపు విద్య
నీ పద ధ్యానంబు - నిత్యజపము

తే. తోయజాతాక్ష నీ పాద - తులసిదళము
రోగముల కౌషధము బ్రహ్మ - రుద్రవినుత.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

019
సీ. బ్రతికినన్నాళ్లు నీ - భజన తప్పను గాని
మరణకాలమునందు - మఱతునేమొ
యావేళ యమదూత - లాగ్రహంబున వచ్చి
ప్రాణముల్ పెకలించి - పట్టునపుడు
కఫ వాత పైత్యముల్ - గప్పగా భ్రమచేత
గంప ముద్భవమంది - కష్టపడుచు
నా జిహ్వతో నిన్ను - నారాయణా యంచు
బిలుతునో శ్రమచేత - బిలువనొ

తే. నాటి కిప్పుడె చేతు నీ - నామభజన
తలచెదను, జెవి నిడవయ్య । - ధైర్యముగను.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

020
సీ. పాంచభౌతికము దు - ర్బలమైన కాయం బి
దెప్పుడో విడుచుట - యెఱుకలేదు
శతవర్షములదాక - మితము జెప్పిరి గాని
నమ్మరా దామాట - నెమ్మనమున
బాల్యమందో మంచి - ప్రాయమందో లేక
ముదిమియందో లేక - ముసలియందొ
యూరనో యడవినో - యుదకమధ్యముననో
యెప్పుడో విడుచుట - యేక్షణంబొ

తే. మరణమే నిశ్చయము బుద్ధి - మంతుడైన
దేహమున్నంతలో మిమ్ము - దెలియవలయు.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

021
సీ. తల్లిదండ్రులు భార్య - తనయు లాప్తులు బావ
మఱదు లన్నలు మేన - మామగారు
ఘనముగా బంధువుల్ - గల్గినప్పటికైన
దాను దర్లగ వెంట - దగిలి రారు
యముని దూతలు ప్రాణ - మపగరించుక పోగ
మమతతో బోరాడి - మాన్పలేరు
బలగ మందఱు దుఃఖ - పడుట మాత్రమె కాని
యించుక యాయుష్య - మియ్యలేరు

తే. చుట్టములమీది భ్రమదీసి - చూర జెక్కి
సంతతము మిమ్ము నమ్ముట - సార్థకంబు.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

022
సీ. ఇభరాజవరద । ని - న్నెంత బిల్చినగాని
మాఱు పల్క వదేమి - మౌనితనమొ?
మునిజనార్చిత । నిన్ను - మ్రొక్కి వేడినగాని
కనుల జూడ వదేమి - గడుసుదనమొ?
చాల దైన్యమునొంది - చాటు చొచ్చినగాని
భాగ్య మియ్య వదేమి - ప్రౌఢతనమొ?
స్థిరముగా నీపాద - సేవ జేసెద నన్న
దొరకజాల వదేమి - ధూర్తతనమొ?

తే. మోక్షదాయక । యిటువంటి - మూర్ఖజనుని
కష్టపెట్టిన నీకేమి - కడుపునిండు.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

023
సీ. నీమీద కీర్తనల్ - నిత్యగానము జేసి
రమ్యమొందింప నా - రదుడగాను
సావధానముగ నీ - చరణ పంకజ సేవ
సలిపి మెప్పంపంగ - శబరిగాను
బాల్యమప్పటినుండి - భక్తి నీయందున
గలుగను బ్రహ్లాద - ఘనుడగాను
ఘనముగా నీమీది - గ్రంథముల్ గల్పించి
వినుతిసేయను వ్యాస - మునినిగాను

తే. సాధుడను మూర్ఖమతి మను - ష్యాధముడను
హీనుడను జుమ్మి నీవు - న న్నేలుకొనుము.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

024
సీ. అతిశయంబుగ గల్ల - లాడనేర్చితిగాని
పాటిగా సత్యముల్ - పలుకనేర
సత్కార్య విఘ్నముల్ - సలుప నేర్చితిగాని
యిష్ట మొందగ నిర్వ - హింపనేర
నొకరి సొమ్ముకు దోసి - లొగ్గ నేర్చితిగాని
చెలువుగా ధర్మంబు - సేయనేర
ధనము లియ్యంగ వ - ద్దనగ నేర్చితిగాని
శీఘ్ర మిచ్చెడునట్లు - చెప్పనేర

తే. బంకజాతాక్ష । నే నతి - పాతకుడను
దప్పులన్నియు క్షమియింప - దండ్రి వీవె ।
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

025
సీ. ఉర్విలో నాయుష్య - మున్న పర్యంతంబు
మాయ సంసారంబు - మరగి నరుడు
సకల పాపములైన - సంగ్రహించును గాని
నిన్ను జేరెడి యుక్తి - నేర్వలేడు
తుదకు గాలునియొద్ది - దూత లిద్దఱు వచ్చి
గుంజుక చని వారు - గ్రుద్దుచుండ
హింస కోర్వగ లేక - యేడ్చి గంతులువేసి
దిక్కు లేదని నాల్గు - దిశలు చూడ

తే. దన్ను విడిపింప వచ్చెడి - ధన్యు డేడి
ముందు నీదాసుడై యున్న - ముక్తి గలుగు.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

026
సీ. అధిక విద్యావంతు - లప్రయోజకులైరి
పూర్ణశుంఠలు సభా - పూజ్యులైరి
సత్యవంతులమాట - జన విరోధంబాయె
వదరుబోతులమాట - వాసికెక్కె
ధర్మవాదనపరుల్ - దారిద్ర్యమొందిరి
పరమలోభులు ధన - ప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగ - భూత పీడితులైరి
దుష్టమానవులు వ - ర్ధిష్ణులైరి

తే. పక్షివాహన । మావంటి - భిక్షుకులకు
శక్తిలేదాయె నిక నీవె - చాటు మాకు.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

027
సీ. భుజబలంబున బెద్ద - పులుల జంపగవచ్చు
పాముకంఠము జేత - బట్టవచ్చు
బ్రహ్మ రాక్షసకోట్ల - బాఱద్రోలగవచ్చు
మనుజుల రోగముల్ - మాన్పవచ్చు
జిహ్వ కిష్టముగాని - చేదు మ్రింగగవచ్చు
బదను ఖడ్గము చేత - నదమవచ్చు
గష్టమొందుచు ముండ్ల - కంపలో జొరవచ్చు
దిట్టుబోతుల నోళ్లు - కట్టవచ్చు

తే. బుడమిలో దుష్టులకు జ్ఞాన - బోధ తెలిపి
సజ్జనుల జేయలే డెంత - చతురుదైన.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

028
సీ. అవనిలోగల యాత్ర - లన్ని చేయగవచ్చు
ముఖ్యుడై నదులందు - మునుగవచ్చు
ముక్కుపట్టుక సంధ్య - మొనసి వార్వగవచ్చు
దిన్నగా జపమాల - ద్రిప్పవచ్చు
వేదాల కర్థంబు - విఱిచి చెప్పగవచ్చు
శ్రేష్ఠ్ క్రతువు లెల్ల - జేయవచ్చు
ధనము లక్షలు కోట్లు - దానమియ్యగవచ్చు
నైష్ఠికాచారముల్ - నడుపవచ్చు

తే. జిత్త మన్యస్థలంబున - జేరకుండ
నీ పదాంభోజములయందు - నిలపరాదు.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

029
సీ. కర్ణయుగ్మమున నీ - కథలు సోకినజాలు
పెద్ద పోగుల జోళ్లు - పెట్టినట్లు
చేతు లెత్తుచు బూజ - సేయగల్గినజాలు
తోరంపు కడియాలు - దొడిగినట్లు
మొనసి మస్తకముతో - మ్రొక్క గల్గినజాలు
చెలువమైన తురాయి - చెక్కినట్లు
గళము నొవ్వగ నిన్ను - బలుక గల్గినజాలు
వింతగా గంఠీలు - వేసినట్లు

తే. పూని నిను గొల్చుటే సర్వ - భూషణంబు
లితర భూషణముల నిచ్చ - గింపనేల.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

030
సీ. భువనరక్షక । నిన్ను - బొగడనేరని నోరు
వ్రజ కగోచరమైన - పాడుబొంద
సురవరార్చిత । నిన్ను - జూడగోరని కనుల్
జలములోపల నెల్లి - సరపుగుండ్లు
శ్రీరమాధిమ । నీకు - సేవజేయని మేను
కూలి కమ్ముడువోని - కొలిమితిత్తి
వేడ్కతో నీకథల్ - వినని కర్ణములైన
గఠినశిలాదుల - గలుగు తొలలు

తే. పద్మలోచన నీమీద - భక్తిలేని
మానవుడు రెండుపాదాల - మహిషమయ్య.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

031
సీ. అతివిద్యనేర్చుట - అన్నవస్త్రములకే
పసుల నార్జించుట - పాలకొఱకె
సతిని బెండ్లాడుట - సంసార సుఖముకే
సుతుల బోషించుట - గతులకొఱకె
సైన్యముల్ గూర్చుట - శత్రుజయమునకే
సాము నేర్చుటలెల్ల - చావుకొఱకె
దానమిచ్చుటయు ముం - దటి సంచితమునకే
ఘనముగా జదువుట - కడుపు కొఱకె

తే. యితర కామంబు గోరక - సతతముగను
భక్తి నీయందు నిలుపుట - ముక్తి కొఱకె
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

032
సీ. ధరణిలో వేయేండ్లు - తనువు నిల్వగబోదు
ధన మెప్పటికి శాశ్వ - తంబు గాదు
దారసుతాదులు - తనవెంట రాలేరు
భ్రుత్యులు మృతిని ద - ప్పింపలేరు
బంధుజాలము తన్ను - బ్రతికించుకోలేరు
బలపరాక్రమ మేమి - పనికి రాదు
ఘనమైన సకల భా - గ్యం బెంత గల్గిన
గోచిమాత్రంబైన - గొనుచుబోడు

తే. వెర్రి కుక్కల భ్రమలన్ని - విడిచి నిన్ను
భజన జేసెడివారికి - బరమసుఖము.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

033
సీ. నరసింహ । నాకు దు - ర్ణయములే మెండాయె
సుగుణ మొక్కటిలేదు - చూడ జనిన
నన్యకాంతల మీద - నాశ మానగలేను
నొరుల క్షేమము చూచి - యోర్వలేను
ఇటువంటి దుర్బుద్ధు - లిన్ని నా కున్నవి
నేను జేసెడివన్ని - నీచకృతులు
నావంటి పాపిష్ఠి - నరుని భూలోకాన
బుట్టజేసితి వేల - భోగిశయన ।

తే. అబ్జదళనేత్ర । నాతండ్రి - వైన ఫలము
నేరములు గాచి రక్షింపు - నీవె దిక్కు.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

034
సీ. ధీరత బరుల నిం - దింప నేర్చితి గాని
తిన్నగా నిను బ్రస్తు - తింపనైతి
బొరుగు కామినులందు - బుద్ధి నిల్పితి గాని
నిన్ను సంతతము ధ్యా - నింపనైతి
బెరికిముచ్చట లైన - మురిసి వింటినిగాని
యెంచి నీకథ లాల - కించనైతి
గౌతుకంబున బాత - కము గడించితిగాని
హెచ్చు పుణ్యము సంగ్ర - హింపనైతి

తే. నవనిలో నేను జన్మించి - నందు కేమి
సార్థకము గానరాదాయె - స్వల్పమైన.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

035
సీ. అంత్యకాలమునందు - నాయాసమున నిన్ను
దలతునో తలపనో - తలతు నిపుడె
నరసింహ । నరసింహ । - నరసింహ । లక్ష్మీశ ।
దానవాంతక । కోటి - భానుతేజ ।
గోవింద । గోవింద । - గోవింద । సర్వేశ ।
పన్నగాధిపశాయి । - పద్మనాభ ।
మధువైరి । మధువైరి । - మధువైరి । లోకేశ ।
నీలమేఘశరీర । నిగమవినుత ।

తే. ఈ విధంబున నీనామ - మిష్టముగను
భజనసేయుచు నుందు నా - భావమందు.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

036
సీ. ఆయురారోగ్య పు - త్రార్థ సంపదలన్ని
కలుగజేసెడి భార - కర్త వీవె
చదువు లెస్సగ నేర్పి - సభలో గరిష్ఠాధి
కార మొందించెడి - ఘనుడ వీవె
నడక మంచిది పెట్టి - నరులు మెచ్చేడునట్టి
పేరు రప్పించెడి - పెద్ద వీవె
బలువైన వైరాగ్య - భక్తిజ్ఞానములిచ్చి
ముక్తి బొందించెడు - మూర్తి వీవె

తే. అవనిలో మానవుల కన్ని - యాసలిచ్చి
వ్యర్థులను జేసి తెలిపెడి - వాడ వీవె.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

037
సీ. కాయ మెంత భయాన - గాపాడిననుగాని
ధాత్రిలో నది చూడ - దక్క బోదు
ఏవేళ నేరోగ - మేమరించునొ? సత్త్వ
మొందంగ జేయు నే - చందమునను
ఔషధంబులు మంచి - వనుభవించిన గాని
కర్మ క్షీణంబైన గాని - విడదు;
కోటివైద్యులు గుంపు - గూడివచ్చిన గాని
మరణ మయ్యెడు వ్యాధి - మాన్పలేరు

తే. జీవుని ప్రయాణకాలంబు - సిద్ధమైన
నిలుచునా దేహ మిందొక్క - నిమిషమైన?
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

038
సీ. జందె మింపుగ వేసి - సంధ్య వార్చిన నేమి
బ్రహ్మ మందక కాడు - బ్రాహ్మణుండు
తిరుమణి శ్రీచూర్ణ - గురురేఖ లిడినను
విష్ణు నొందక కాడు - వైష్ణవుండు
బూదిని నుదుటను - బూసికొనిన నేమి
శంభు నొందక కాడు - శైవజనుడు
కాషాయ వస్త్రాలు - గట్టి కప్పిన నేమి
యాశ పోవక కాడు - యతివరుండు

తే. ఎన్ని లౌకికవేషాలు - గట్టుకొనిన
గురుని జెందక సన్ముక్తి - దొరకబోదు.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

039
సీ. నరసింహ । నే నిన్ను - నమ్మినందుకు జాల
నెనరు నాయందుంచు - నెమ్మనమున
నన్ని వస్తువులు ని - న్నడిగి వేసటపుట్టె
నింకనైన గటాక్ష - మియ్యవయ్య
సంతసంబున నన్ను - స్వర్గమందే యుంచు
భూమియందే యుంచు - భోగశయన ।
నయముగా వైకుంఠ - నగరమందే యుంచు
నరకమందే యుంచు - నళిననాభ ।

తే. ఎచట నన్నుంచిననుగాని - యెపుడు నిన్ను
మఱచి పోకుండ నీనామ - స్మరణనొసగు.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

040
సీ. దేహ మున్నవఱకు - మోహసాగరమందు
మునుగుచుందురు శుద్ధ - మూఢజనులు
సలలితైశ్వర్యముల్ - శాశ్వతం బనుకొని
షడ్భ్రమలను మాన - జాల రెవరు
సర్వకాలము మాయ - సంసార బద్ధులై
గురుని కారుణ్యంబు గోరుకొనరు
జ్ఞాన భక్తి విరక్తు - లైన పెద్దల జూచి
నింద జేయక - తాము నిలువలేరు

తే. మత్తులైనట్టి దుర్జాతి - మనుజులెల్ల
నిన్ను గనలేరు మొదటికే - నీరజాక్ష.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

041
సీ. ఇలలోన నే జన్మ - మెత్తినప్పటినుండి
బహు గడించితినయ్య - పాతకములు
తెలిసి చేసితి గొన్ని - తెలియజాలక చేసి
బాధ నొందితి నయ్య - పద్మనాభ
అనుభవించెడు నప్పు - దతి ప్రయాసంబంచు
బ్రజలు చెప్పగ జాల - భయము గలిగె
నెగిరి పోవుటకునై - యే యుపాయంబైన
జేసి చూతమటన్న - జేతగాదు

తే. సూర్యశశినేత్ర । నీచాటు - జొచ్చి నాను
కలుషములు ద్రుంచి నన్నేలు - కష్టమనక.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

042
సీ. తాపసార్చిత । నేను - పాపకర్ముడనంచు
నాకు వంకలబెట్ట - బోకుచుమ్మి
నాటికి శిక్షలు - నన్ను చేయుటకంటె
నేడు సేయుము నీవు - నేస్తమనక
అతిభయంకరులైన - యమదూతలకు నన్ను
నొప్పగింపకు మయ్య - యురగశయన ।
నీ దాసులను బట్టి - నీవు దండింపంగ
వద్దు వద్దన రెంత - పెద్దలైన

తే. దండ్రివై నీవు పరపీడ - దగులజేయ
వాసిగల పేరు కపకీర్తి - వచ్చునయ్య.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

043
సీ. ధరణిలోపల నేను - తల్లిగర్భమునందు
బుట్టినప్పటినుండి - పుణ్యమెఱుగ
నేకాదశీవ్రతం - బెన్న డుండుగ లేదు
తీర్థయాత్రలకైన - దిరుగలేదు
పారమార్థికమైన - పనులు చేయగలేదు
భిక్ష మొక్కనికైన - బెట్టలేదు
జ్ఞానవంతులకైన - బూని మ్రొక్కగలేదు
ఇతర దానములైన - నియ్యలేదు

తే. నళినదళనేత్ర । నిన్ను నే - నమ్మినాను
జేరి రక్షింపవే నన్ను - శీఘ్రముగను.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

044
సీ. అడవిపక్షుల కెవ్వ - డాహార మిచ్చెను
మృగజాతి కెవ్వడు - మేతబెట్టె
వనచరాదులకు భో - జన మెవ్వ డిప్పించె
జెట్ల కెవ్వడు నీళ్ళు - చేదిపోసె
స్త్రీలగర్భంబున - శిశువు నెవ్వడు పెంచె
ఫణుల కెవ్వడు పోసె - బరగ బాలు
మధుపాళి కెవ్వడు - మకరంద మొనరించె
బసుల మెవ్వ డొసంగె - బచ్చిపూరి

తే. జీవకోట్లను బోషింప - నీవెకాని
వేఱె యొక దాత లేడయ్య - వెదకిచూడ.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

045
సీ. దనుజారి । నావంటి - దాసజాలము నీకు
కోటి సంఖ్య గలారు - కొదువ లేదు
బంట్లసందడివల్ల - బహుపరాకై నన్ను
మఱచి పోకుము భాగ్య - మహిమచేత
దండిగా భ్రుత్యులు - దగిలి నీకుండంగ
బక్కబం టేపాటి - పనికి నగును?
నీవు మెచ్చెడి పనుల్ - నేను జేయగలేక
యింత వృథాజన్మ - మెత్తినాను

తే. భూజనులలోన నే నప్ర - యోజకుడను
గనుక నీ సత్కటాక్షంబు - గలుగజేయు.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

046
సీ. కమలలోచన । నన్ను - గన్నతండ్రివిగాన
నిన్ను నేమఱకుంటి - నేను విడక
యుదరపోషణకునై - యొకరి నే నాశింప
నేర నా కన్నంబు - నీవు నడపు
పెట్టలే నంటివా - పిన్న పెద్దలలోన
దగవు కిప్పుడు దీయ - దలచినాను
ధనము భారంబైన - దలకిరీటము నమ్ము
కుండలంబులు పైడి - గొలుసు లమ్ము

తే. కొసకు నీ శంఖ చక్రముల్ - కుదువబెట్టి
గ్రాసము నొసంగి పోషించు - కపటముడిగి.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

047
సీ. కువలయశ్యామ । నీ - కొలువు చేసిన నాకు
జీత మెందుకు ముట్ట - జెప్పవైతి
మంచిమాటలచేత - గొంచెమియ్యగలేవు
కలహమౌ నిక జుమ్మి - ఖండితముగ
నీవు సాధువు గాన - నింత పర్యంతంబు
చనవుచే నిన్నాళ్లు - జరుపవలసె
నిక నే సహింప నీ - విపుడు నన్నేమైన
శిక్ష చేసిన జేయు - సిద్ధమయితి

తే. నేడు కరుణింపకుంటివా - నిశ్చయముగ
దెగబడితి చూడు నీతోడ - జగడమునకు.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

048
సీ. హరి । నీకు బర్యంక - మైన శేషుడు చాల
బవనము భక్షించి - బ్రతుకుచుండు
ననువుగా నీకు వా - హనమైన ఖగరాజు
గొప్పపామును నోట - గొఱుకుచుండు
అదిగాక నీ భార్య - యైన లక్ష్మీదేవి
దినము పేరంటంబు - దిరుగుచుండు
నిన్ను భక్తులు పిల్చి - నిత్యపూజలు చేసి
ప్రేమ బక్వాన్నముల్ - పెట్టుచుండ్రు

తే. స్వస్థముగ నీకు గ్రాసము - జరుగుచుండు
గాసు నీ చేతి దొకటైన - గాదు వ్యయము.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

049
సీ. పుండరీకాక్ష । నా - రెండు కన్నుల నిండ
నిన్ను జూచెడి భాగ్య - మెన్నడయ్య
వాసిగా నా మనో - వాంఛ దీరెడునట్లు
సొగసుగా నీరూపు - చూపవయ్య
పాపకర్ముని కంట - బడకపోవుదమంచు
బరుషమైన ప్రతిజ్ఞ - బట్టినావె?
వసుధలో బతిత పా - వనుడ వీ వంచు నే
బుణ్యవంతులనోట - బొగడ వింటి

తే. నేమిటికి విస్తరించె నీ - కింత కీర్తి
ద్రోహినైనను నా కీవు - దొరకరాదె?
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

050
సీ. పచ్చి చర్మపు దిత్తి - పసలేదు దేహంబు
లోపల నంతట - రోయ రోత
నరములు శల్యముల్ - నవరంధ్రములు రక్త
మాంసంబు కండలు - మైల తిత్తి
బలువైన యెండ వా - నల కోర్వ దింతైన
దాళలే దాకలి - దాహములకు
సకల రోగములకు - సంస్థానమె యుండు
నిలువ దస్థిరమైన - నీటిబుగ్గ

తే. బొందిలో నుండు ప్రాణముల్ - పోయినంత
గాటికే గాని కొఱగాదు - గవ్వకైన.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

051
సీ. పలురోగములకు నీ - పాదతీరమె కాని
వలపు మందులు నాకు - వలదు వలదు
చెలిమి సేయుచు నీకు - సేవ జేసెద గాన
నీ దాసకోటిలో - నిలుపవయ్య
గ్రహభయంబునకు జ - క్రము దలచెదగాని
ఘోరరక్షలు గట్ట - గోరనయ్య
పాముకాటుకు నిన్ను - భజన జేసెదగాని
దాని మంత్రము నేను - తలపనయ్య

తే. దొరికితివి నాకు దండి వై - ద్యుడవు నీవు
వేయికష్టాలు వచ్చినన్ - వెఱవనయ్య.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

052
సీ. కూటికోసరము నే - గొఱగాని జనులచే
బలుగద్దరింపులు - పడగవలసె?
దార సుత భ్రమ - దగిలియుండగగదా
దేశదేశములెల్ల - దిరుగవలసె?
బెను దరిద్రత పైని - బెనగియుండగగదా
చేరి నీచులసేవ - చేయవలసె?
నభిమానములు మది - నంటియుండగగదా
పరుల జూచిన భీతి - పడగవలసె?

తే. నిటుల సంసారవారిధి - నీదలేక
వేయివిధముల నిన్ను నే - వేడుకొంటి.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

053
సీ. సాధు సజ్జనులతో - జగడమాడిన గీడు
కవులతో వైరంబు - గాంచ గీడు
పరమ దీనుల జిక్క - బట్టి కొట్టిన గీడు
భిక్షగాండ్రను దుఃఖ - పెట్ట గీడు
నిరుపేదలను జూచి - నిందజేసిన గీడు
పుణ్యవంతుల దిట్ట - బొసగు గీడు
సద్భక్తులను దిర - స్కారమాడిన గీడు
గురుని ద్రవ్యము దోచు - కొనిన గీడు

తే. దుష్టకార్యము లొనరించు - దుర్జనులకు
ఘనతరంబైన నరకంబు - గట్టిముల్లె.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

054
సీ. పరులద్రవ్యముమీద - భ్రాంతి నొందినవాడు
పరకాంతల నపేక్ష - పడెడువాడు
అర్థుల విత్తంబు - లపహరించెడువాడు
దానమియ్యంగ వ - ద్దనెడివాడు
సభలలోపల నిల్చి - చాడిచెప్పెడివాడు
పక్షపు సాక్ష్యంబు - పలుకువాడు
విష్ణుదాసుల జూచి - వెక్కిరించెడివాడు
ధర్మసాధుల దిట్ట - దలచువాడు

తే. ప్రజల జంతుల హింసించు - పాతకుండు
కాలకింకర గదలచే - గష్టమొందు.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

055
సీ. నరసింహ । నా తండ్రి - నన్నేలు నన్నేలు
కామితార్థము లిచ్చి - కావు కావు
దైత్యసంహార । చాల - దయయుంచు దయయుంచు
దీనపోషక । నీవె - దిక్కు దిక్కు
రత్నభూషితవక్ష । - రక్షించు రక్షించు
భువనరక్షక । నన్ను - బ్రోవు బ్రోవు
మారకోటిసురూప । - మన్నించు మన్నించు
పద్మలోచన । చేయి - పట్టు పట్టు

తే. సురవినుత । నేను నీచాటు - జొచ్చినాను
నా మొఱాలించి కడతేర్చు - నాగశయన ।
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

056
సీ. నీ భక్తులను గనుల్ - నిండ జూచియు రెండు
చేతుల జోహారు - సేయువాడు
నేర్పుతో నెవరైన - నీ కథల్ చెప్పంగ
వినయమందుచు జాల - వినెడువాడు
తన గృహంబునకు నీ - దాసులు రా జూచి
పీటపై గూర్చుండ - బెట్టువాడు
నీసేవకుల జాతి - నీతు లెన్నక చాల
దాసోహ మని చేర - దలచువాడు

తే. పరమభక్తుండు ధన్యుండు - భానుతేజ ।
వాని గనుగొన్న బుణ్యంబు - వసుధలోన.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

057
సీ. పక్షివాహన । నేను - బ్రతికినన్నిదినాలు
కొండెగాండ్రను గూడి - కుమతినైతి
నన్నవస్త్రము లిచ్చి - యాదరింపుము నన్ను
గన్నతండ్రివి నీవె - కమలనాభ ।
మరణ మయ్యెడినాడు - మమతతో నీయొద్ది
బంట్ల దోలుము ముందు - బ్రహ్మజనక ।
ఇనజభటావళి - యీడిచికొనిపోక
కరుణతో నాయొద్ద - గావ లుంచు

తే. కొసకు నీ సన్నిధికి బిల్చు - కొనియు నీకు
సేవకుని జేసికొనవయ్య - శేషశయన ।
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

058
సీ. నిగమాదిశాస్త్రముల్ - నేర్చిన ద్విజుడైన
యజ్ఞకర్తగు సోమ - యాజియైన
ధరణిలోపల బ్రభా - త స్నానపరుడైన
నిత్యసత్కర్మాది - నిరతుడైన
నుపవాస నియమంబు - లొందు సజ్జనుడైన
గావివస్త్రముగట్టు - ఘనుడునైన
దండిషోడశమహా - దానపరుండైన
సకల యాత్రలు సల్పు - సరసుడైన

తే. గర్వమున గష్టపడి నిన్ను - గానకున్న
మోక్షసామ్రాజ్య మొందడు - మోహనాంగ ।
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

059
సీ. పంజరంబున గాకి - బట్టి యుంచిన లెస్స
పలుకునే వింతైన - చిలుకవలెను?
గార్దభంబును దెచ్చి - కళ్లెమింపుగవేయ
దిరుగునే గుర్రంబు - తీరుగాను?
ఎనుపపోతును మావ - టీ డు శిక్షించిన
నడచునే మదవార - ణంబువలెను?
పెద్దపిట్టను మేత - బెట్టి పెంచిన గ్రొవ్వి
సాగునే వేటాడు - డేగవలెను?

తే. కుజనులను దెచ్చి నీ సేవ - కొఱకు బెట్ట
వాంఛతో జేతురే భక్త - వరులవలెను?
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

060
సీ. నీకు దాసుడ నంటి - నిన్ను నమ్ముకయుంటి
గాన నాపై నేడు - కరుణజూడు
దోసిలొగ్గితి నీకు - ద్రోహ మెన్నగబోకు
పద్మలోచన । నేను - పరుడగాను
భక్తి నీపై నుంచి - భజన జేసెద గాని
పరుల వేడను జుమ్మి - వరము లిమ్ము
దండిదాతవు నీవు - తడవుసేయక కావు
ఘోరపాతకరాశి - గొట్టివైచి

తే. శీఘ్రముగ గోర్కు లీడేర్చు - చింత దీర్చు
నిరతముగ నన్ను బోషించు - నెనరు నుంచు.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

061
సీ. విద్య నేర్చితి నంచు - విర్రవీగగలేదు
భాగ్యవంతుడ నంచు - బలుకలేదు
ద్రవ్యవంతుడ నంచు - దఱచు నిక్కగలేదు
నిరతదానములైన - నెఱపలేదు
పుత్రవంతుడ నంచు - బొగడుచుండగలేదు
భ్రుత్యవంతుడ నంచు - బొగడలేదు
శౌర్యవంతుడ నంచు - సంతసింపగలేదు
కార్యవంతుడ నంచు - గడపలేదు

తే. నలుగురికి మెప్పుగానైన - నడువలేదు
నళినదళనేత్ర । నిన్ను నే - నమ్మినాను.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

062
సీ. అతిలోభులను భిక్ష - మడుగబోవుట రోత
తనద్రవ్య మొకరింట - దాచ రోత
గుణహీను డగువాని - కొలువు గొల్చుట రోత
యొరుల పంచలక్రింద - నుండ రోత
భాగ్యవంతునితోడ - బంతమాడుట రోత
గుఱిలేని బంధుల - గూడ రోత
ఆదాయములు లేక - యప్పుదీయుట రోత
జార చోరుల గూడి - చనుట రోత

తే. యాదిలక్ష్మీశ । నీబంట - నైతినయ్య ।
యింక నెడబాసి జన్మంబు - లెత్త రోత.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

063
సీ. వెర్రివానికి నేల - వేదాక్షరంబులు?
మోటువానికి మంచి - పాట లేల?
పసులకాపరి కేల - పరతత్త్వబోధలు?
విటకాని కేటికో - విష్ణుకథలు?
వదరు శుంఠల కేల - వ్రాత పుస్తకములు?
తిరుగు ద్రిమ్మరి కేల - దేవపూజ?
ద్రవ్యలోభికి నేల - ధాతృత్వ గుణములు?
దొంగబంటుకు మంచి - సంగ తేల?

తే. క్రూరజనులకు నీమీద - గోరి కేల?
ద్రోహి పాపాత్మునకు దయా - దుఃఖ మేల?
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

064
సీ. నా తండ్రి నాదాత - నాయిష్టదైవమా
నన్ను మన్ననసేయు - నారసింహ ।
దయయుంచు నామీద - దప్పులన్ని క్షమించు
నిగమగోచర । నాకు - నీవె దిక్కు
నే దురాత్ముడ నంచు - నీమనంబున గోప
గింపబోకుము స్వామి । - కేవలముగ
ముక్తిదాయక నీకు - మ్రొక్కినందుకు నన్ను
గరుణించి రక్షించు - కమలనాభ ।

తే. దండిదొర వంచు నీవెంట - దగిలినాను
నేడు ప్రత్యక్షమై నన్ను - నిర్వహింపు.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

065
సీ. వేమాఱు నీకథల్ - వినుచు నుండెడివాడు
పరుల ముచ్చటమీద - భ్రాంతి పడడు
అగణితంబుగ నిన్ను - బొగడ నేర్చినవాడు
చెడ్డమాటలు నోట - జెప్పబోడు
ఆసక్తిచేత ని - న్ననుసరించెడివాడు
ధనమదాంధులవెంట - దగుల బోడు
సంతసంబున నిన్ను - స్మరణజేసెడివాడు
చెలగి నీచులపేరు - దలపబోడు

తే. నిన్ను నమ్మిన భక్తుండు - నిశ్చయముగ
గోరి చిల్లర వేల్పుల - గొల్వబోడు.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

066
సీ. నే నెంత వేడిన - నీ కేల దయరాదు?
పలుమాఱు పిలిచిన - బలుక వేమి?
పలికిన నీ కున్న - పద వేమిబోవు? నీ
మోమైన బొడచూప - వేమి నాకు?
శరణు జొచ్చినవాని - సవరింపవలె గాక
పరిహరించుట నీకు - బిరుదు గాదు
నీదాసులను నీవు - నిర్వహింపక యున్న
బరు లెవ్వ రగుదురు - పంకజాక్ష ।

తే. దాత దైవంబు తల్లియు - దండ్రి వీవె
నమ్మియున్నాను నీపాద - నళినములను.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

067
సీ. వేదముల్ చదివెడు - విప్రవర్యుండైన
రణము సాధించెడు - రాజెయైన
వర్తకకృషికుడౌ - వైశ్యముఖ్యుండైన
బరిచగించెడు శూద్ర - వర్యుడయిన
మెచ్చుఖడ్గము బట్టి - మెఱయు మ్లేచ్ఛుండైన
బ్రజల కక్కఱపడు - రజకుడైన
చర్మ మమ్మెడి హీన - చండాలనరుడైన
నీ మహీతలమందు - నెవ్వడైన

తే. నిన్ను గొనియాడుచుండెనా - నిశ్చయముగ
వాడు మోక్షాధికారి యీ - వసుధలోన.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

068
సీ. సకలవిద్యలు నేర్చి - సభ జయింపగవచ్చు
శూరుడై రణమందు - బోరవచ్చు
రాజరాజై పుట్టి - రాజ్య మేలగవచ్చు
హేమ గోదానంబు - లియ్యవచ్చు
గగనమం దున్న చు - క్కల నెంచగావచ్చు
జీవరాసుల పేళ్లు - చెప్పవచ్చు
నష్టాంగయోగము - లభ్యసింపగవచ్చు
మేక రీతిగ నాకు - మెసవవచ్చు

తే. తామరసగర్భ హర పురం - దరులకైన
నిన్ను వర్ణింప దరమౌనె - నీరజాక్ష ।
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

069
సీ. నరసింహ । నీవంటి - దొరను సంపాదించి
కుమతి మానవుల నే - గొల్వజాల
నెక్కు వైశ్వర్యంబు - లియ్యలేకున్నను
బొట్టకుమాత్రము - పోయరాదె?
ఘనముగా దిది నీకు - కరవున బోషింప
గష్ట మెంతటి స్వల్ప - కార్యమయ్య?
పెట్టజాలక యేల - భిక్షమెత్తించెదు
నన్ను బీదను జేసి - నా వదేమి?

తే. అమల । కమలాక్ష । నే నిట్లు - శ్రమపడంగ
గన్నులకు బండువై నీకు - గానబడునె?
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

070
సీ. వనరుహనాభ । నీ - వంక జేరితి నేను
గట్టిగా నను గావు - కావు మనుచు
వచ్చినందుకు వేగ - వరము లియ్యకకాని
లేవబోయిన నిన్ను - లేవనియ్య
గూర్చుండబెట్టి నీ - కొంగు గట్టిగ బట్టి
పుచ్చుకొందును జూడు - భోగిశయన ।
యీవేళ నీ కడ్డ - మెవరు వచ్చినగాని
వారికైనను లొంగి - వడకబోను

తే. గోపగాడను నీవు నా - గుణము తెలిసి
యిప్పుడే నన్ను రక్షించి - యేలుకొమ్ము.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

071
సీ. ప్రహ్లాదు డేపాటి - పైడి కానుక లిచ్చె?
మదగజం బెన్నిచ్చె - మౌక్తికములు?
నారదుం డెన్నిచ్చె - నగలు రత్నంబు? ల
హల్య నీ కే యగ్ర - హార మిచ్చె?
ఉడుత నీ కేపాటి - యూడిగంబులు చేసె?
ఘనవిభీషణు డేమి - కట్న మిచ్చె?
పంచపాండవు లేమి - లంచ మిచ్చిరి నీకు?
ద్రౌపది నీ కెంత - ద్రవ్య మిచ్చె?

తే. నీకు వీరంద ఱయినట్లు - నేను గాన?
యెందు కని నన్ను రక్షింప - విందువదన ।
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

072
సీ. వాంఛతో బలిచక్ర - వర్తిదగ్గర జేరి
భిక్షమెత్తితి వేల - బిడియపడక?
యడవిలో శబరి ది - య్యని ఫలా లందియ్య
జేతులొగ్గితి వేల - సిగ్గుపడక?
వేడ్కతో వేవేగ - విదురునింటికి నేగి
విందుగొంటి వదేమి - వెలితిపడక?
అడుకు లల్పము కుచే - లుడు గడించుక తేర
బొక్కసాగితి వేల - లెక్కగొనక?

తే. భక్తులకు నీవు పెట్టుట - భాగ్యమౌను
వారి కాశించితివి తిండి - వాడ వగుచు.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

073
సీ. స్తంభమం దుదయించి - దానవేంద్రుని ద్రుంచి
కరుణతో బ్రహ్లాదు - గాచినావు
మకరిచే జిక్కి సా - మజము దుఃఖించంగ
గృపయుంచి వేగ ర - క్షించినావు
శరణంచు నా విభీ - షణుడు నీ చాటున
వచ్చినప్పుడె లంక - నిచ్చినావు
ఆ కుచేలుడు చేరె - డటుకు లర్పించిన
బహుసంపదల నిచ్చి - పంపినావు

తే. వారివలె నన్ను బోషింప - వశముగాదె?
యంత వలపక్ష మేల శ్రీ - కాంత । నీకు?
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

074
సీ. వ్యాసు డే కులమందు - వాసిగా జన్మించె?
విదురు డే కులమందు - వృద్ధి బొందె?
గర్ణు డేకులమందు - ఘనముగా వర్ధిల్లె?
నా వసిష్ఠుం డెందు - నవతరించె?
నింపుగా వాల్మీకి - యే కులంబున బుట్టె?
గుహు డను పుణ్యు డే - కులమువాడు?
శ్రీశుకు డెక్కట - జెలగి జన్మించెను?
శబరి యేకులమందు - జన్మమొందె?

తే. నే కులంబున వీ రింద - ఱెచ్చినారు?
నీకృపాపాత్రులకు జాతి - నీతు లేల?
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

075
సీ. వసుధాస్థలంబున - వర్ణహీనుడు గాని
బహుళ దురాచార - పరుడు గాని
తడసి కాసియ్యని - ధర్మశూన్యుడు గాని
చదువనేరని మూఢ - జనుడు గాని
సకలమానవులు మె - చ్చని కృతఘ్నుడు గాని
చూడ సొంపును లేని - శుంఠ గాని
అప్రతిష్ఠలకు లో - నైన దీనుడు గాని
మొదటి కే మెఱుగని - మోటు గాని

తే. ప్రతిదినము నీదు భజనచే - బరగునట్టి
వాని కే వంక లేదయ్య - వచ్చు ముక్తి.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

076
సీ. ఇభకుంభములమీది - కెగిరెడి సింగంబు
ముట్టునే కుఱుచైన - మూషకమును?
నవచూతపత్రముల్ - నమలుచున్న పికంబు
గొఱుకునే జిల్లేడు - కొనలు నోట?
అరవిందమకరంద - మనుభవించెడి తేటి
పోవునే పల్లేరు - పూలకడకు?
లలిత మైన రసాల - ఫలము గోరెడి చిల్క
మెసవునే భమత ను - మ్మెత్తకాయ?

తే. నిలను నీకీర్తనలు పాడ - నేర్చినతడు
పరులకీర్తన బాడునే - యరసి చూడ?
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

077
సీ. సర్వేశ । నీపాద - సరసిజద్వయమందు
జిత్త ముంపగలేను - జెదరకుండ
నీవైన దయయుంచి - నిలిచి యుండెడునట్లు
చేరి నన్నిపు డేలు - సేవకుడను
వనజలోచన । నేను - వట్టి మూర్ఖుడ జుమ్మి
నీస్వరూపము జూడ - నేర్పు వేగ
తన కుమారున కుగ్గు - తల్లి వోసినయట్లు
భక్తిమార్గం బను - పాలు పోసి

తే. ప్రేమతో నన్ను బోషించి - పెంచుకొనుము
ఘనత కెక్కించు నీదాస - గణములోన.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

078
సీ. జీమూతవర్ణ । నీ - మోముతో సరిరాక
కమలారి యతికళం - కమును బడసె
సొగసైన నీ నేత్ర - యుగముతో సరిరాక
నళినబృందము నీళ్ల - నడుమ జేరె
గరిరాజవరద । నీ - గళముతో సరిరాక
పెద్దశంఖము బొబ్బ - పెట్ట బొడగె
శ్రీపతి । నీదివ్య - రూపుతో సరి రాక
పుష్పబాణుడు నీకు - బుత్రు డయ్యె

తే. నిందిరాదేవి నిన్ను మో - హించి విడక
నీకు బట్టమహిషి యయ్యె - నిశ్చయముగ.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

079
సీ. హరిదాసులను నింద - లాడకుండిన జాలు
సకల గ్రంథమ్ములు - చదివినట్లు
భిక్ష మియ్యంగ ద - ప్పింపకుండిన జాలు
జేముట్టి దానంబు - చేసినట్లు
మించి సజ్జనుల వం - చించకుండిన జాలు
నింపుగా బహుమాన - మిచ్చినట్లు
దేవాగ్రహారముల్ - దీయకుండిన జాలు
గనకకంబపు గుళ్లు - గట్టినట్లు

తే. ఒకరి వర్శాశనము ముంచ - కున్న జాలు
బేరుకీర్తిగ సత్రముల్ - పెట్టినట్లు.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

080
సీ. ఇహలోకసౌఖ్యము - లిచ్చగించెద మన్న
దేహ మెప్పటికి దా - స్థిరత నొంద
దాయుష్య మున్న ప - ర్యంతంబు పటుతయు
నొక్కతీరున నుండ - దుర్విలోన
బాల్యయువత్వదు - ర్బలవార్ధకము లను
మూటిలో మునిగెడి - ముఱికికొంప
భ్రాంతితో దీని గా - పాడుద మనుమొన్న
గాలమృత్యువుచేత - గోలుపోవు

తే. నమ్మరా దయ్య । యిది మాయ - నాటకంబు
జన్మ మిక నొల్ల న న్నేలు - జలజనాభ ।
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

081
సీ. వదనంబు నీనామ - భజన గోరుచునుండు
జిహ్వ నీకీర్తనల్ - సేయ గోరు
హస్తయుగ్మంబు ని - న్నర్చింప గోరును
గర్ణముల్ నీ మీది - కథలు గోరు
తనువు నీసేవయే - ఘనముగా గోరును
నయనముల్ నీదర్శ - నంబు గోరు
మూర్ధమ్ము నీపద - మ్ముల మ్రొక్కగా గోరు
నాత్మ నీదై యుండు - నరసి చూడ

తే. స్వప్నమున నైన నేవేళ - సంతతమును
బుద్ధి నీ పాదములయందు - బూనియుండు.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

082
సీ. పద్మాక్ష । మమతచే - బరము నందెద మంచు
విర్రవీగుదుమయ్య - వెర్రిపట్టి
మాస్వతంత్రంబైన - మదము గండ్లకు గప్పి
మొగము పట్టదు కామ - మోహమునను
బ్రహ్మదేవుండైన - బైడిదేహము గల్గ
జేసివేయక మమ్ము - జెఱిచె నతడు
తుచ్ఛమైనటువంటి - తో లెమ్ముకలతోడి
ముఱికి చెత్తలు చేర్చి - మూట కట్టె

తే. నీ శరీరాలు పడిపోవు - టెఱుగ కేము
కాముకుల మైతి మిక మిమ్ము - గానలేము.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

083
సీ. గరుడవాహన । దివ్య - కౌస్తుభాలంకార ।
రవికోటితేజ । సా - రంగవదన ।
మణిగణాన్విత । హేమ - మకుటాభరణ । చారు
మకరకుండల । లస - న్మందహాస ।
కాంచనాంబర । రత్న - కాంచివిభూషిత ।
సురవరార్చిత । చంద్ర - సూర్యనయన ।
కమలనాభ । ముకుంద । - గంగాధరస్తుత ।
రాక్షసాంతక । నాగ - రాజశయన ।

తే. పతితపావన । లక్షీశ । - బ్రహ్మజనక ।
భక్తవత్సల । సర్వేశ । - పరమపురుష ।
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

084
సీ. పలుమాఱు దశరూప - ములు దరించితి వేల?
యేకరూపము బొంద - వేల నీవు?
నయమున క్షీరాబ్ధి - నడుమ జేరితి వేల?
రత్నకాంచన మంది - రములు లేవె?
పన్నగేంద్రునిమీద - బవ్వళించితి వేల?
జలతారుపట్టెమం - చములు లేవె?
ఱెక్కలు గలపక్షి - నెక్కసాగితి వేల?
గజతురంగాందోళి - కములు లేవె?

తే. వనజలోచన । యిటువంటి - వైభవములు
సొగసుగా నీకు దోచెనో - సుందరాంగ?
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

085
సీ. తిరుపతి స్థలమందు - దిన్నగా నే నున్న
వేంకటేశుడు మేత - వేయలేడొ?
పురుషోత్తమమున కే - బోయనజాలు జ
గన్నాథు డన్నంబు - గడపలేడొ?
శ్రీరంగమునకు నే - జేర బోయిన జాలు
స్వామి గ్రాసము బెట్టి - సాకలేడొ?
కాంచీపురములోన - గదిసి నే గొలువున్న
గరివరదుడు పొట్ట - గడపలేడొ?

తే. యెందు బోవక నేను నీ - మందిరమున
నిలిచితిని నీకు నామీద - నెనరు లేదు.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

086
సీ. తార్క్ష్యవాహన । నీవు - దండిదాత వటంచు
గోరి వేడుక నిన్ను - గొల్వవచ్చి
యర్థిమార్గమును నే - ననుసరించితినయ్య
లావైన బదునాల్గు - లక్ష లైన
వేషముల్ వేసి నా - విద్యాప్రగల్భత
జూపసాగితి నీకు - సుందరాంగ ।
యానంద మైన నే - నడుగ వచ్చిన దిచ్చి
వాంఛ దీర్పుము - నీలవర్ణ । వేగ

తే. నీకు నావిద్య హర్షంబు - గాక యున్న
తేపతేపకు వేషముల్ - దేను సుమ్మి.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

087
సీ. అమరేంద్రవినుత । నే - నతిదురాత్ముడ నంచు
గలలోన నైనను - గనుల బడవు
నీవు ప్రత్యక్షమై - నులువకుండిన మానె
దొడ్డగా నొక యుక్తి - దొరకెనయ్య ।
గట్టికొయ్యను దెచ్చి - ఘనముగా ఖండించి
నీస్వరూపము చేసి - నిలుపుకొంచు
ధూప దీపము లిచ్చి - తులసితో బూజించి
నిత్యనైవేద్యముల్ - నేమముగను

తే. నడుపుచును నిన్ను గొలిచెద - నమ్మి బుద్ధి
నీ ప్రపంచంబు గలుగు నా - కింతె చాలు.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

088
సీ. భువనేశ । గోవింద । - రవికోటిసంకాశ ।
పక్షివాహన । భక్త - పారిజాత ।
యంభోజభవ రుద్ర - జంభారిసన్నుత ।
సామగానవిలోల । - సారసాక్ష ।
వనధిగంభీర । శ్రీ - వత్సకౌస్తుభవక్ష ।
శంఖచక్రగదాసి - శార్జ్ఞహస్త ।
దీనరక్షక । వాసు - దేవ । దైత్యవినాశ ।
నారదార్చిత । దివ్య - నాగశయన ।

తే. చారు నవరత్నకుండల - శ్రవణయుగళ ।
విబుధవందిత పాదబ్జ । - విశ్వరూప ।
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

089
సీ. నాగేంద్రశయన । నీ - నామమాధుర్యంబు
మూడుకన్నుల సాంబ - మూర్తి కెఱుక
పంకజాతాక్ష । నీ - బలపరాక్రమ మెల్ల
భారతీపతి యైన - బ్రహ్మ కెఱుక
మధుకైటభారి । నీ - మాయాసమర్థత
వసుధలో బలిచక్ర - వర్తి కెఱుక
పరమాత్మ । నీ దగు - పక్షపాతిత్వంబు
దశశతాక్షుల పురం - దరుని కెఱుక

తే. వీరి కెఱుకగు నీకథల్ - వింత లెల్ల
నరుల కెఱు కన్న నెవరైన - నవ్విపోరె?
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

090
సీ. అర్థు లేమైన ని - న్నడుగవచ్చెద రంచు
క్షీరసాగరమందు - జేరినావు
నీచుట్టు సేవకుల్ - నిలువకుండుటకునై
భయదసర్పముమీద - బండినావు
భక్తబృందము వెంట - బడి చరించెద రంచు
నెగసి పోయెడిపక్షి - నెక్కినావు
దాసులు నీద్వార - మాసింపకుంటకు
మంచి యోధుల కావ - లుంచినావు

తే. లావు గలవాడ వైతి వే - లాగు నేను
నిన్ను జూతును నాతండ్రి । - నీరజాక్ష ।
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

091
సీ. నీకథల్ చెవులలో - సోకుట మొదలుగా
బులకాంకురము మెన - బుట్టువాడు
నయమైన నీ దివ్య - నామకీర్తనలోన
మగ్నుడై దేహంబు - మఱచువాడు
ఫాలంబుతో నీదు - పాదయుగ్మమునకు
బ్రేమతో దండ మ - ర్పించువాడు
హా పుండరీకాక్ష । - హా రామ । హరి । యంచు
వేడ్కతో గేకలు - వేయువాడు

తే. చిత్తకమలంబునను నిన్ను - జేర్చువాడు
నీదులోకంబునం దుండు - నీరజాక్ష ।
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

092
సీ. నిగమగోచర । నేను - నీకు మెప్పగునట్లు
లెస్సగా బూజింప - లేను సుమ్మి
నాకు దోచిన భూష - ణములు పెట్టెద నన్న
గౌస్తుభమణి నీకు - గలదు ముందె
భక్ష్యభోజ్యముల న - ర్పణము జేసెద నన్న
నీవు పెట్టితి సుధ - నిర్జరులకు
గలిమికొద్దిగ గాను - కల నొసంగెద నన్న
భార్గవీదేవి నీ - భార్య యయ్యె

తే. నన్ని గలవాడ వఖిల లో - కాధిపతివి ।
నీకు సొమ్ములు పెట్ట నే - నెంతవాడ ।
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

093
సీ. నవసరోజదళాక్ష । - నన్ను బోషించెడు
దాతవు నీ వంచు - ధైర్యపడితి
నా మనంబున నిన్ను - నమ్మినందుకు దండ్రి ।
మేలు నా కొనరింపు - నీలదేహ ।
భళిభళీ । నీ యంత - ప్రభువు నెక్కడ జూడ
బుడమిలో నీ పేరు - పొగడవచ్చు
ముందు జేసిన పాప - మును నశింపగ జేసి
నిర్వహింపుము నన్ను - నేర్పుతోడ

తే. బరమసంతోష మాయె నా - ప్రాణములకు
నీ​ఋణము దీర్చుకొన నేర - నీరజాక్ష ।
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

094
సీ. ఫణులపుట్టలమీద - బవ్వళించినయట్లు
పులుల గుంపున జేర - బోయినట్లు
మకరివర్గం బున్న - మడుగు జొచ్చినయట్లు
గంగదాపున నిండ్లు - గట్టినట్లు
చెదలభూమిని జాప - చేర బఱచినయట్లు
ఓటిబిందెల బాల - నునిచినట్లు
వెర్రివానికి బహు - విత్త మిచ్చినయట్లు
కమ్మగుడిసె మందు - గాల్చినట్లు

తే. స్వామి నీ భక్తవరులు దు - ర్జనులతోడ
జెలిమి జేసినయ ట్లైన - జేటు వచ్చు.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

095
సీ. దనుజసంహార । చక్ర - ధర । నీకు దండంబు
లిందిరాధిప । నీకు - వందనంబు
పతితపావన । నీకు - బహునమస్కారముల్
నీరజాతదళాక్ష । - నీకు శరణు
వాసవార్చిత । మేఘ - వర్ణ । నీకు శుభంబు
మందరధర । నీకు - మంగళంబు
కంబుకంధర । శార్జ్గ - కర । నీకు భద్రంబు
దీనరక్షక । నీకు - దిగ్విజయము

తే. సకలవైభవములు నీకు - సార్వభౌమ ।
నిత్యకల్యాణములు నగు - నీకు నెపుడు.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

096
సీ. మత్స్యావతార మై - మడుగులోపల జొచ్చి
సోమకాసురు ద్రుంచి - చోద్యముగను
దెచ్చి వేదము లెల్ల - మెచ్చ దేవతలెల్ల
బ్రహ్మ కిచ్చితి వీవు - భళి । యనంగ
నా వేదముల నియ్య - నాచారనిష్ఠల
ననుభవించుచు నుందు - రవనిసురులు
సకలపాపంబులు - సమసిపోవు నటంచు
మనుజు లందఱు నీదు - మహిమ దెలిసి

తే. యుందు రరవిందనయన । నీ - యునికి దెలియు
వారలకు వేగ మోక్షంబు - వచ్చు ననఘ ।
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

097
సీ. కూర్మావతారమై - కుధరంబుక్రిందను
గోర్కితో నుండవా - కొమరు మిగుల?
వరహావతారమై - వనభూములను జొచ్చి
శిక్షింపవా హిర - ణ్యాక్షు నపుడు?
నరసింహమూర్తివై - నరభోజను హిరణ్య
కశిపుని ద్రుంపవా - కాంతి మీఱ?
వామనరూపమై - వసుధలో బలిచక్ర
వర్తి నఱంపవా - వైర ముడిగి?

తే. యిట్టి పను లెల్ల జేయగా - నెవరికేని
తగునె నరసింహ । నీకిది - దగును గాక ।
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

098
సీ. లక్ష్మీశ । నీదివ్య - లక్షణగుణముల
వినజాల కెప్పుడు - వెర్రినైతి
నా వెర్రిగుణములు - నయముగా ఖండించి
నన్ను రక్షింపు మో - నళిననేత్ర ।
నిన్ను నే నమ్మితి - నితరదైవముల నే
నమ్మలే దెప్పుడు - నాగశయన ।
కాపాడినను నీవె - కష్టపెట్టిన నీవె
నీపాదకమలముల్ - నిరత మేను

తే. నమ్మియున్నాను నీపాద - నళినభక్తి
వేగ దయచేసి రక్షింపు - వేదవిద్య ।
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

099
సీ. అమరేంద్రవినుత । ని - న్ననుసరించినవారు
ముక్తి బొందిరి వేగ - ముదముతోను
నీపాదపద్మముల్ - నెఱ నమ్మియున్నాను
నాకు మోక్షం బిమ్ము - నళిననేత్ర ।
కాచి రక్షించు నన్ - గడతేర్చు వేగమే
నీ సేవకుని జేయు - నిశ్చలముగ
గాపాడినను నీకు - గైంకర్యపరుడ నై
చెలగి నీపనులను - జేయువాడ

తే. ననుచు బలుమాఱు వేడెద - నబ్జనాభ ।
నాకు బ్రత్యక్ష మగుము నిన్ - నమ్మినాను.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

100
సీ. శేషప్ప యను కవి - చెప్పిన పద్యముల్
చెవుల కానందమై - చెలగుచుండు
నే మనుజుండైన - నెలమి నీ శతకంబు
భక్తితో విన్న స - త్ఫలము గలుగు
జెలగి యీ పద్యముల్ - చేర్చి వ్రాసినవారు
కమలాక్షుకరుణను - గాంతు రెపుడు
నింపుగా బుస్తకం - బెపుడు బూజించిన
దురితజాలంబులు - దొలగిపోవు

తే. నిద్ది పుణ్యాకరం బని - యెపుడు జనులు
గషట మెన్నక పఠియింప - గలుగు ముక్తి.
భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస ।
దుష్టసంహార । నరసింహ - దురితదూర ।

జైహింద్.