గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, అక్టోబర్ 2014, మంగళవారం

ధిఙ్మండలం పరిమళై: ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. ధిఙ్మండలం పరిమళై: సురభీ కరోషి
సౌందర్య మాహవసి లోచన లోభ నీయం
అహో! రసాల ఫలవర్య! తవాస్మి దూయే
యత్తుందిలంచ కఠినం హృదయం బిభర్షి.
ఉ. రమ్య రసాల సౌరభము ప్రాకును నల్దిశలున్ మనోజ్ఞమై,
సౌమ్య మనోజ్ఞరూపమున చక్కగ నేత్ర సుపర్వమిద్ధరన్
సామ్యము లేనిదయ్యు వివశంబగు టెంక కఠోర చిత్తయై
రమ్యత క్రోల్పడేను, కనరాని కఠోరత కీడు చేయునే! 
భావము. ఓ రసాల ఫలమా! నీ సువాసనలతో దిక్కులను పరిమళింప చేయుచున్నావు. నీ సౌందర్యంతో అందరిని ఆకట్టుకొని అనందింపజేస్తున్నావు. ఇలా అందరిచే పొగడ బడే నీకీర్తి చాలగొప్పది; కానీ నీవు కఠినమైన టెంక అనే మనస్సు కలిగి ఉండడం మాత్రం బాధగా ఉంది.
జైహింద్.

20, అక్టోబర్ 2014, సోమవారం

వాపీ కూప తటాకాద్యై ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్. 
శ్లో. వాపీ కూప తటాకాద్యైర్వాజపేయశతైర్మఖైః
గవాం కోటి ప్రదానేన భూమిహర్తా న శుద్ధ్యతి. (పారాశర స్మృతి 12-49)
గీ. కూప, వాపీతటాకముల్ కొలిప మరియు
వాజపేయాది క్రతువులు వంద చేయ
గోవులను కోటి దానంబు కోరి చేయ,
పరుల కేదారహరు దోష హరణమగునె?
భావము. మడుగు బావి, నూయి, చెరువు మున్నగునవి నిర్మించినను, వాజపేయాది వంద యజ్ఞములు చేసినను,కోటి గంగి గోవులను దానము చేసినను, పరుల భూమిని అపహరించుట వలన వచ్చెడి పాపమును పోకొట్టుట సాధ్యము కాదు.
జైహింద్.

19, అక్టోబర్ 2014, ఆదివారం

కూపస్తటాక ముద్యానం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. కూపస్తటాక ముద్యానం, మండపం చ ప్రపా తథా
జలదాన మన్నదానం, అశ్వత్థారోపణం తథా
పుత్రశ్చేతి చ సంతానం, సప్తవేదవిదో వీదుః.
గీ. నూయి, యుద్యానము, చెరువు, స్వీయ సుతుఁడు, 
మండపము, చలివేంద్రమ్ము మహిత రావి
సప్త సంతతు లొకటున్న చాలు మనకు
ముక్తిఁ గొలుపును గాంచుడు పూజ్యులార!
భావము. నూయి, చెరువు, ఉద్యానవనం, మండపం, చలివెంద్రము, ఆశ్వత్థారోపణం, పుత్రుడు, అనే ఈ ఏడును సప్తసంతానములని వేదవేత్తలు చెప్తున్నారు.
పుత్రుడు పితృ కర్మలద్వారా నరకం నుండి ఉద్ధరించి స్వర్గాన్ని కలుగచేస్తాడని విశ్వాసం. వాడది సవ్యంగా చెయ్యకపోతే... అంతే వాడిని కని తెచ్చిపెట్టుకొన్న నరకం ఏదైతే వుందో, అది మనకి అక్కడా తప్పనట్లే. మిగిలిన ఆరు ఆయా ప్రదేశాలలో మనపేరు చిరస్థాయిగా ఉండేట్లు చేస్తాయి. మన పేరు ఎంతకాలం వినపడితే అంతకాలం స్వర్గలోక వాసం అని ధర్మశాస్త్రాదులు చెప్పుచున్నవి. 
జైహింద్.

18, అక్టోబర్ 2014, శనివారం

గుణా గుణజ్ఞేషు గుణా భవంతి .. మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. గుణా గుణజ్ఞేషు గుణా భవంతి - తే నిర్గుణం ప్రాప్య భవంతి దోషాః.
ఆస్వాద్య తోయాః ప్రభవంతి నద్యః. - సముద్రమాసాద్భవంత్యపేయాః.  
గీ. గుణము లగుచుండె గుణములు గుణ గణుకడ.
నిర్గుణుల జేరి దోషమై నిలుచునదియె.
త్రాగ తగు యేటి నీరముల్ సాగిసాగి
జలధి చేరి యయోగ్యమౌనిలను త్రాగ.
భావము. గుణజ్ఞుని చేరి గుణములు సద్గుణములుగా భాసిల్లును. గుణములు నిర్గుణుని చేరిన చేరినంతనే దోషములగుచున్నవి. నదీ జలము త్రాగుటకు యోగ్యమైనవై ఒప్పుచుండును. ఆ జలములే సముద్రుని చేరగానే త్రాగుటకయోగ్యములగుచున్నవికదా!
జైహింద్.

17, అక్టోబర్ 2014, శుక్రవారం

తే.19-10-2014 నందమూరులో విశ్వనాధ 38వ వర్ధంతి సభ.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! కవిసామ్రాట్ విశ్వనాధగారి స్వగ్రామమైన నందమూరులో విశ్వనాధ 38 వ బర్ధంతి సభనుిర్వహిస్తున్నారు. అవకాశమున్నవారు ఈ కార్యక్రమానికి వెళ్ళగలరు.
జైహింద్.

16, అక్టోబర్ 2014, గురువారం

యథా హ్యేకేన చక్రేణ, మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. యథా హ్యేకేన చక్రేణ న రథస్య గతిర్భవేత్ 
ఏవం పురుష కారేణ వినా దైవం న సిద్ధ్యతే. 
గీ. చక్రమొకటున్న రథమెట్లు సరిగ పోదొ
దైవ బలమొక్కటను సిద్ధి దక్కబోదు
నరుని యత్నము కావలె నరసి చూడ.
పిదప దైవంబు తోడౌను వివిధ గతుల. 
భావము. ఒక్క చక్రముతో మాత్రమే గల రథము నడక ఏవిధముగ సాధ్యము కాదో అదే విధముగా పురుష ప్రయత్నము లేకుండా దైవము వలన మాత్రమే కార్యములు సిద్ధింప బడవు. 
జైహింద్.

15, అక్టోబర్ 2014, బుధవారం

అక్రోధేన జయేత్ క్రోధమ్. మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. అక్రోధేన జయేత్ క్రోధమ్. అసాధుమ్ సాధునా జయేత్.
జయేత్ కదర్యం దానేన, జయేత్ సత్యేనచానృతమ్.
గీ. కోపమును శాంతిచే గెల్చుకొనగవచ్చు.
సాధువృత్తినచే గెల్తుమసాధుతతిని,
పిసినితనమును దానాన పెకల వచ్చు.
నృతముతోడనె గెలుతుమనృతమునిలను.
భావము. శాంత స్వభావముతో క్రోధమును జయింప వచ్చును. సాధు స్వభావముతో అసాధుస్వభావమును జయింప వచ్చును. పిసినిగొట్టుతనమును దానముతో జయింప వచ్చును. అబద్ధమును సత్యముతో జయింప వచ్చును.
జైహింద్.



14, అక్టోబర్ 2014, మంగళవారం

అంగం గలితం పలితం ముండం. మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. అంగం గలితం పలితం ముండం
దశనవిహీనం జాతం తుండం
వృధ్ధో యాతి గృహిత్వా దండం
తదపి న ముంచత్యాశాపిండం.
గీ. తనువు చిక్కు, తల నెఱియు, దంతతతియు
ఊడు, నడువ దండముఁ గొను, వడుకుచుండు
నట్టి వృద్ధత్వమొందియు నతులమైన
యాశ వీడదు, పెఱుగుచుండదియె వింత. 
భావము. శరీరము కృశించి, చిక్కి ముడతల పడినను, తల పూర్తిగా నెరసి పోయినను, పండ్లు ఊడిపోయి నోరు బోసియైనను, ముసలి తనం వచ్చి కర్రను పట్టుకుని గాని నడువలేక పోయినను ఆశమాత్రము అతనిని వదలదు.
జైహింద్.

13, అక్టోబర్ 2014, సోమవారం

తెలుగు విశ్వవిద్యాలయం లో జరుగుచున్న జాతీయ సదస్సుకు ఆహ్వానం.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! కన్నడ - తెలుగు విశ్వ విద్యాలయముల ఆధ్వర్యములో జరుగుచున్న జాతీత సదస్సుకు 
అవకాశము కలవారు తప్పక వెళ్ళగలరని ఆశిస్తూ, 
ఈ కార్యక్రమావళిని 
మీ ముందుంచుచున్నాను.
జైహింద్.

12, అక్టోబర్ 2014, ఆదివారం

యతిభ్యశ్చాధమం ప్రోక్తం. మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. యతిభ్యశ్చాధమం ప్రోక్తం వానప్రస్థశ్చ మధ్యమం 
గృహస్థాత్ స్వీకరో మంత్రం ప్రకుర్వీత గురూత్తమాత్.
ఆ. మంత్ర ముపదేశమునుగొను మహితులకును
యతుల వల్లను గొనుటది యధమమరయ.
మధ్యమము వానప్రత్శుచే మహిని గొనిన.
ఉత్తమము గృహస్థునినుండి యొనరఁ గొనిన.
భావము. యతులదగ్గర మంత్రోపదేశం అధమం, వానప్రస్థుని వల్ల ఉపదేశం మధ్యమం, గృహస్థునివల్ల ఉపదేశం ఉత్తమపధ్ధతి. 
యతులదగ్గర మంత్రోపదేశం సంసారులకు శ్రేయోదాయకం కాదు. స్త్రీలకు సన్న్యాసార్హత లేదు వారికికూడా సన్న్యాస దీక్షను ఇచ్చేస్తున్నారు. ధర్మదూరులైన ఇటువంటి వారి పాదపూజల పటాటోపాలకి, ఆడంభరాలకి ఆశ్చర్యపడటం ఆకర్షితులుకావటం చెయ్యకండి, ఇది మనకు మేలుకంటే కీడే ఎక్కువచేస్తుంది.
జైహింద్.

11, అక్టోబర్ 2014, శనివారం

సముద్ర మదనే లాభే హరిర్లక్ష్మీం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. సముద్ర మదనే లాభే  హరిర్లక్ష్మీం హరో విషం
భాగ్యం ఫలతి సర్వత్ర న విద్యా న చ పౌరుషం. 
ఆ. జలధి మథన వేళ జనియించి వరలక్ష్మి
హరిని చేరె, విషము హరుని చేరె. 
భాగ్యఫలమె దక్కు. పౌరుష, విద్యలు
పనికిరావు భాగ్య ఫలము ముందు.
భావము.  సముద్రమును మథించినప్పుడు విష్ణువు లక్ష్మిని పొందాడు, శివుడు విషాన్ని పొందాడు. కాబట్టి ఎక్కడైనా అదృష్టమే ఫలిస్తోంది, విద్య కాని పౌరుషం కాని కాదు. 
జైహింద్.

10, అక్టోబర్ 2014, శుక్రవారం

అతి రూపోద్ధతాత్ సీతా ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. అతి రూపోద్ధతాత్ సీతాతిగర్వా ద్రావణో హతః,
అతిదానాద్బలి ర్బద్ధశ్చాతి సర్వత్ర వర్జయేత్.  
క. అతి గర్వముచే రావణు 
డతి సౌందర్యమున సీత, యతి దానముచే 
క్షితి బలియును, బాధ పడిరి. 
అతి అన్నిట విడువ వలయు నరయుఁడు సుజనుల్.
భావం. ఆపూర్వమైన సౌదర్యం వల్ల సీత ఇక్కట్ల పాలైంది. మితిమీరిన గర్వంవల్ల రావణుడు నిహతుడైనాడు. పరిమితి లేని దానంవల్ల బలి చక్రవర్తి బంధింపబడ్డాడు. కనుక అతి అన్నివేళలా విడిచిపెట్టవలసిందే. 
జైహింద్.

9, అక్టోబర్ 2014, గురువారం

శ్రీరాముని వంశ వృక్షము.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! భాగవత గణనాధ్యాయి బ్రహ్మశ్రీ సాంబశివరావుగారు ప్రచురించిన శ్రీరాముని వంశ వృక్షము విషయ పరిగ్రహణార్థులకుపయుక్తముగానుండునని ఇందు నిక్షిప్తము చేసియున్నాను.
జైహింద్.

8, అక్టోబర్ 2014, బుధవారం

ఉపానహౌ చ వాసశ్చ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. ఉపానహౌ చ వాసశ్చ ధృత మన్యై ర్న ధారయేత్,
ఉపవీత మలంకారం స్రజం కరకమేవ చ. 
గీ. పాదరక్షలు, పూవులు, వస్త్రములును, 
జంధ్యములు నలంకారముల్ చక్కనివని,
పరులు ధరియించు వాటిని వాడ రాదు. 
కోరి దారిద్ర్యమును తెచ్చుకొనుటె యగును.
భావము. ఒకరు ధరించిన పాదరక్షలు ధరించుట, ఒకరు కట్టిన వస్త్రమును కట్టుట, ఒకరి యజ్ఞోపవీతమును ధరించుట, ఒకరు ఉపయోగించిన అలంకారములను, పూలమాలలను ధరించుట. వేరొకరి కమండలువు ఉపయోగించుట. ఇవి ఎవ్వరును చేయరాదు. ఈ విధమైన పనులు కోరి దారిద్ర్యమును ఆహ్వానించుటయే. 
జైహింద్.

7, అక్టోబర్ 2014, మంగళవారం

యస్మాచ్చ యేన చ యదా చ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. యస్మాచ్చ యేన చ యదా చ యథా చ యచ్చ
యావచ్చ యత్ర చ శుభాశుభ మాత్మకర్మ,
తస్మాచ్చ తేన చ తదా చ తథా చ తచ్చ,
తావచ్చ తత్ర చ కృతాంతవశా దుపైతి. (మహాభారతం)
క. చేసెడి పుణ్యము పాపము 
చేసిన కొలదిగనె మనలఁ జేరును ఫలమై. 
వాసిగ యనుభవమగునది. 
ధ్యాస కలిగి సుచరితముల తనిసిన శుభమౌన్.
భావం. పుణ్య పాప కృత్యములను ఎందువలన, దేనిచేత, ఎప్పుడు, ఎట్లు, ఎంతవరకు, ఎచ్చట ఆచరిస్తున్నాడో దానికి అనుగుణంగానే ఆ యా కర్మల ఫలాలను అందువలన, అప్పుడు, అట్లు, అంతవరకు, అక్కడ విధినిర్దేశంగా అనుభవిస్తూనే ఉంటున్నాడు. 
జైహింద్.

6, అక్టోబర్ 2014, సోమవారం

సాహితీ ప్రియులైన మీకు ఒక శుభవార్త.

2 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! 
సాహితీ ప్రియులైన మీకు ఒక శుభవార్త.
హైద్రాబాద్ అవధాన సరస్వతి పీఠాధిపతి 
బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ ఆధ్వర్యంలో 
నవంబర్ 2 నుంచి 9 వరకు 
ఢిల్లీలో 
అవధాన రాజధాని పేరుతో 
అవధాన ప్రక్రియ నిర్వహించబడుతోంది. 
ఈ అవధానం సంస్కృతం, తెలుగు, హిందీ భాషల్లో 
ఏకకాలంలో నిర్వహించబడుతుంది. 
పృచ్ఛకులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయా భాషల్లో సమాధానం ఇవ్వడం జరుగుతుంది. 
దత్తపది, సమస్యాపూరణం, నృత్యపది, స్వరపది అంశాలతో పాటు 
ఈప్రక్రియలో నూతనంగా చిత్రపది, క్రీడాపదిని ప్రవేశపెట్టుచున్నారు. 
చిత్రాల ద్వారా, క్రీడా అంశాల ద్వారా అవధానం చేయడమనే నూతన ప్రక్రియను 
అవధాని నాగఫణిశర్మ చేయనున్నారు.  
ఆసక్తి కలవారు అవకాశమున్నవారు ఈ సదవకాశమును తప్పక వినియోగించుకొనేటందుకు వీలుగా ఈ వర్తమానం మీ ముందుంచినాను.
ఈ కార్యక్రమం అవధానిగారి మేధా సంపత్తికి గీటురాయి కాగలదు. యావత్ భారతీయులకు మన ఆంధ్రభాష, సంస్కృతి, సంప్రదాయము, ఆంధ్ర కవులకుండే ప్రతిభావ్యుత్పత్తులు స్పష్టమగునని చెప్పుట అతిశయోక్తి కానేరదు.
ఈ కార్యక్రమము నిర్విఘ్నముగా శుభప్రదముగా నిర్వహింపబడుగాక.
జైహింద్.

5, అక్టోబర్ 2014, ఆదివారం

భార్యావియోగశ్చ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. భార్యావియోగశ్చ,  జనాపవాదొ, ఋణస్య శేషః కుజనస్య సేవా,
దారిద్ర్యకాలే ప్రియ దర్శనం చ, వినాగ్నినా పంచ దహన్తి కాయమ్॥
గీ. ఆలి యెడబాటు, మరియు జనాపవాదు,
ఋణము భారము, దుస్సేవ, భౄణ హత్య, 
లేమిలో మిత్ర దర్శనం బీ మనుజుల 
నిప్పు లేకయే కాల్చురా నిరుపమముగ. 
భావము. భార్యా వియోగం, లోకనింద, ఋణ శేషం, నీచుల సేవ, దారిద్ర్యమందు ప్రియదర్శనం, ఇవి నిప్పులేకుండానే మనని కాల్చేస్తాయి. 
జైహింద్.

4, అక్టోబర్ 2014, శనివారం

ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం, మంత్రమౌషధసంగమౌ ,
దానమానావమానాశ్చ, నవ గోప్యా మనీషిభిః. 
గీ. ఆయువు, సిరి, గృహ చ్ఛిద్ర, యౌషధమును,  
మానమును సంగమంబవమానము మరి
దానమును,  మంత్రమును బృహద్జ్ఞానులెపుడు
తెలుప రాదంద్రు భువిపైన. తెలియుడయ్య.
భావము. ఆయువు , సంపద , గృహచ్ఛిద్రము , మంత్రము , ఔషధము , సంగమము , దానము , మానము , అవమానము - ఈ తొమ్మిదింటినీ బుద్ధిమంతులు రహస్యముగ నుంచవలెను . 
జైహింద్.

3, అక్టోబర్ 2014, శుక్రవారం

ఆంధ్రామృత పాఠకులకు యావత్ సజ్జనావళికి విజయ దశమి శుభాకాంక్షలు.

2 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు ఈ విజయ దశమి ఉత్సవము. మీరు నిరంతరము మంచినే ఆశ్రయిస్తూ చెడుపై విజయం సాధిస్తూ ఉండాలని, సంతోషంగా జీవితం గడపాలని మనసారా కోరుకొంటున్నాను.    ఈ సందర్భంగా మీకు, ఆంధ్రామృత పాఠకులకు యావత్ సజ్జనావళికి విజయ దశమి శుభాకాంక్షలు.
పరమదాయామృతాస్పద. కృపాసుధ వర్షిణి, శంభురాణి  స
చ్చరణములంటి మ్రొక్కెదను, చక్కగ మిమ్మిల కావుమంచు,  స
ద్వరము లొసంగుమంచు వరదాయినియై నిరతంబు నిల్చుచున్,
పరమ విశేష సద్గుణము వర్ధిలఁజేయుమటంచు నిత్యమున్.
జై జగన్మాతా! 
జైహింద్.

2, అక్టోబర్ 2014, గురువారం

దరిద్రాయ కృతం దానం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. దరిద్రాయ కృతం దానం, శూన్యలింగస్య పూజనం,
అనాథ ప్రేత సంస్కారం, అశ్వమేధసమం విదుః .
గీ. పేదకొసగెడి దానము ప్రీతి కరము. 
శూన్య లింగార్చనంబు సన్మాన్యమతము.
దిక్కు లేని శవదహన మెక్కుడిలను.
అశ్వ మేధసుఫలదములరసి చూడ.
భావము. బీదవానికి దానం చేయటం, పాడుపడిన గుడిలోని లింగమును పూజించుట, దిక్కులేని శవమును దహనము చేయడము, యీ మూడున్ను అశ్వమేధముతో సమమైన ఫలమునిస్తాయి .
జైహింద్.