జైశ్రీరామ్.
శ్రీమద్భగవద్గీత
3వ అధ్యాయము. కర్మయోగము.
|| 3-5 ||
శ్లో. న హి కశ్చిత్క్షణమపి జాతు తిష్ఠ త్యకర్మ కృత్|
కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః.
తే.గీ. కర్మఁ జేయక యుండుట క్షణము కూడ
సాధ్యపడఁ బోదు జనులకు, సహజమిదియె,
ప్రకృతి జన్య గుణంబుల ప్రాభవమున
చేయఁబడుచుండు కర్మముల్ సిద్ధమిదియు.
భావము.
ఎవరూ ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేరు. ప్రకృతి జన్యమైన
గుణాల వలన అన్ని కర్మలు అవశ్యంగానే చేయబడుతున్నాయి.
|| 3-6 ||
శ్లో. కర్మేన్ద్రియాణి సంయమ్య, య ఆస్తే మనసా స్మరన్|
ఇన్ద్రియార్థాన్విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే.
తే.గీ. బయటి కింద్రియ నిగ్రహ వర్తనుఁడయి
యాత్మలో సంస్మరించెడి యధముఁ డిలను
మూర్ఖుఁ డరయఁగ కపటి తాన్, బుద్ధిహీను
డనగ నొప్పు నతని నిల గుణవిశాల!
భావము.
ఎవరైతే కర్మేంద్రియాలను నిగ్రహించి మనస్సులో ఇంద్రియ విషయాలను
స్మరిస్తూ ఉంటాడో,అతడు పరమ మూర్ఖుడు, కపటాచారి అని పిలవ
బడతాడు.
జైహింద్.