గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, సెప్టెంబర్ 2018, సోమవారం

భాగవత గణనాధ్యాయి నిర్వహణలో జరిగిన భాగవత జయంత్యుత్సవము 2018.

 జైశ్రీరామ్.
ఆర్యులారా! శుభోదయమ్.
మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
భాగవత గణనాధ్యాయి శ్రీ ఊలపల్లి సాంబశివరావు, శ్రీ రాళ్ళబండి శ్రీనివాస్ గార్ల నిర్వహణలో జరిగిన 2018 భాగవత జయంత్యుత్సవము భక్తి పారవశ్యముతో సాగినది.
 ఉత్సవ సభలో ప్రసంగించుచున్న శ్రీ తనికెళ్ళ భరణి.
ముఖ్య అతిథి శ్రీ తనికెళ్ళభరణి గారి ఉపన్యాసము అత్యంత మనోహరముగా సాగి భక్తులను భక్తిసాగరముననోలలాడించినది.
    భాగవతము రూపకమును ప్రదర్శించుచున్న అంధబాలురు.
ఈ సందర్భముగా జ్ఞానచక్షువులైన అంధబాలురు ప్రదర్శించినభాగవతమురూపకము సభికులను ఆనందపరవశులను చేసినది.
ఈ సందర్భముగా పరమ భాగవతులు, శ్రీమతి కాకుమాము భూలక్ష్మి గారికి
భాగవతరత్న పురస్కార ప్రదాన మహోత్సవము సందర్భముగా  నాచే విరచింపఁబడిన
అభినందన చందన చర్చ.
శా. శ్రీమద్భాగ్య నిధాన సంయమివరుల్, చిన్మాన్య తేజోనిధుల్,
శ్రీమద్భాగవతోత్తమోత్తమ మహత్సేవామృతానందులీ
శ్రీమద్భాగవతోత్తమన్ బుధనుతన్, చిన్మూర్తి భూలక్ష్మినే
శ్రీమద్భాగవతాంధ్రరత్నముగ వర్ణించెన్, గనెన్ సాంబుఁడున్.  1.
శా. సూక్ష్మార్థంబు గ్రహింప భాగవతమున్ శోభాళిఁ జూపించు భూ
లక్ష్మీ! భాగవతార్ఘ రత్నముల,  స్త్రీలన్ గల్గు మాహాత్మ్యమున్
లక్ష్మీ తేజము భాసిలంగ జగతిన్ లక్ష్యంబుతో చెప్పితే!
లక్ష్మీశుండిక నీ మదిన్ నిలుచుతన్ లక్ష్యంబుతో శోభిలన్.  2.
ఆ.వె. కాకుమానులింటి కన్యగా ప్రభవించి - ఆలపాటియింటి నలర మెట్టి
పరమ భాగవతుల ప్రాభవంబునఁ జేసి - భారతి మది పొంగ వరలితీవు.  3.
కంద గీత గర్భ చంపకమాల.
వర కవితన్ సదా పరమ భాగవతోత్తమపాళిమెచ్చఁగా
నిరుపమ గాథలన్ కృతిని నిత్య వసంతము క్రేణి సేయ నే.
ర్పరి భువి నీవెయై కవిత వ్రాసి, విరాజిలు కాంక్ష తీర శ్రీ
కర నవలాలసజ్ జయము గాంచి వరించుత సన్నుతాత్మచేన్. 4.
మ. క్షితిపై భాగవతంబు, దిబ్య,భగవద్గీతామృతంబై జగత్
పతియున్ మెచ్చెడి రీతి నుండుము మహద్భాగ్యంబువై వెల్గుచున్.
స్తుతి చేయున్ జగమంత నిన్ను.భగవత్శోభల్ నినున్ జేరుతన్.
కృత పుణ్యాలయ! మంగళంబు కనుమా. కృష్ణుండె నీతోడాగున్.  5.
మంగళమ్.               మహత్.             శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ.
ఆ కృష్ణ పరమాత్మ మహదాశీస్సులు మీకు అపారముగా లభించ వలెనని కోరుకొనుచున్నాను.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.