గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, సెప్టెంబర్ 2017, ఆదివారం

చామకూర. చమత్కారాలు.

  జైశ్రీరామ్.
చామకూర సంభాషణా చాతుర్యం
ఉ. "అంటకుమీ లతాంగి నను" "నంటిన నేమి మనోహరాంగ? నే
నంటు పడంగ లేదనుచు నంటెద నిన్ను" ; నంటంట గాదు; న
న్నంటఁగఁ జల్లునే జనకు నంటిన పిమ్మట? "" నైన నేఁడు నీ
యంటున నంటి గామి నెటులంటును గెంటక మేఁన బ్రాణముల్
(చిత్రాంగి, సారంగధరుల సంభాషణ. సారంగధర చరిత్రము-- చామకూర వేంకటకవి)
సారం: లతాంగీ నన్ను అంటకుమీ
చిత్ర: మనోహరాంగ. అంటిననేమి? నేను అంటు పడంగ లేదనుచున్- పరపురుష స్పర్శ చేత మైలపడలేదని, నిన్ను అంటెదన్-నిన్ను ముట్టి ప్రమాణము చేస్తాను.
సారం: అటు అంట కాదు. నేనట్లనుటలేదు. జనకు నంటిన పిమ్మట నన్నంట జెల్లునే (అనుచున్నాను)
చిత్ర: ఐనన్-అట్లైనయెడల ; నీఅంటునన్-నీతోటి స్నేహమున; అంటుకామిన్- సంబంధము పడకపోతే (నీ చెలిమి లభించక పోతే) ప్రాణముల్, గెంటక-చలింపక(లేచిపోక), మేనన్-నాశరీరమున, ఎటులంటును- ఎట్లు నిలచును?
(నిలువవు కావున నేను నిన్నంటుకొనక మాననని భావం)

ఉ: " కన్నియఁగాని వేరొకతెఁ గాను , మనోహర రూప! నీకు నే
జన్నియ పట్టియుంటి నెల జవ్వన మంతయు నేఁటిదాఁక, నా
కన్నులయాన , నా వలపు కస్తురి నామముతోడు; నమ్ము ; కా
దన్నను నీదుమోవి మధురామృత మానిట బాసఁజేసెజన్!
                                విజయవిలాసము- ప్రథమాశ్వాసం- 179 పద్యం;; చామకూర వేంకట కవి;
అర్జునిని మొదటి మజిలీ గంగాతీరం. అక్కడ అతని సౌందర్యం చూచి మోహించింది నాగ కన్య ఉలూచి. మాయచేసి నాగలోకానికి తీసికెళ్ళింది. మోజుపడిన యతనిని అనేక విధములైన మాటలతో తన వలపు నంగీకరించేలా
ప్రయత్నించింది.
ఇక్కడ చామకూర తన సంభాషణా చాతుర్యాన్ని ప్రదర్శించినాడు.
ఉలూచిని జూచి క్రీడి కూడా మోజుపడినాడు. కానీ వ్రత భంగ శంక కొంత పీడించినది.దానితరువాత ఈమె యన్య
యేమో నను శంక గలిగినది. అన్య ఇతరుల భార్య. పరస్త్రీ సంగమము మహాదోషము. దానిని తొలగించుటకై ఉలూచి యిట్లు పలుకు చున్నది.
అర్జునా! నేను కన్యనే! అన్యను గాను. అన్నది. ఋజువులు కావలెనుగదా! ఆఋజువులను జూపుచున్నది.
"ఓమనోహరాకారా! నేను కన్యనే యన్యను గాను. నేఁటివరకు నాలేత వయస్సంతా నీకొఱకే ముడుపుకట్టి యుంచాను.
నాకన్నులపైయాన, నా వలపులీను( సువాసనలువీచు) బొట్టుపై నొట్టు. నమ్ము.ము. అదీ కాదన్నావా? ఇక ఉన్నదొక్కటేదారి. అదిప్రమాణము. నీమధురమైన అధరామృత పానము చేసి నేకన్యనే యని ప్రమాణింతును అపుడు నమ్మకుండుటకు నీకు వేరు దారిలేదనుచున్నది'"
లోకంలో మనకు పరిచయమే దోషారోపణనెదురికొనేవారు ప్రమాణాలు చేస్తూఉంటారు." నేను తప్పుచేసినట్లయితే ,
నాకళ్ళేపోతాయి. నాబొట్టే చెదరిపోతుంది. వీటికీ ఒప్పకపోతే విషంతాగుతా అప్పుడైనా ఒప్పుకుంటారా నాదోషంలేదనీ"- అంటూ ప్రమాణాలు చెయ్యటం మనకు వినిపిస్తూ ఉంటుంది) కవి ఆవ్యవహారాన్ని యిక్కడ వాడుకొన్నాడు.
వలపు కస్తురి నామము-- కస్తురి బొట్టు నల్లగా ఉంటుంది. పెళ్ళికాని పిల్లలకు అదోగుర్తు . కన్య యనటానికి. ఉలూచి కస్తురితో తిలక ధారణచేసింది. మాచిన్నట పెళ్శికాని ఆడపిల్లలకు చాదు అని నల్లని బొట్టును వాడేవారు.యిప్పుడు
దాన్ని పాటించేవారు తక్కువయ్యారు కాబట్టి యెవరెవరో తెలియకుండా పోతోంది. పాములు విషయుక్తములే కాబట్టివిషంకాక,అమృతపానంతో ప్రమాణంచేస్తానని నాయికచే చెప్పించాడు.
ఈవిధంగా లౌకిక ప్రమాణాచారాలను కావ్యంలో నిపుణంగా చొప్పించి ఉలూచిచే చెప్పించి,అతనిని మెప్పించియతనివలపును పంచుకొన్న నాయికగా కవి ఉలూచిని తీర్చి దిద్దినాడు..

చామకూర చమత్కారం
శ్లేష- చమత్కారాల మధ్య చాలాతేడా ఉంది. శ్లేషంటే కేవలం రెండు అర్ధాలు పొదగటం. శబ్దానికి ఉన్న నానార్ధముల నాధారంగా దీనిని యేర్పాటు చేయవచ్చు.*రాఘవపాండవీయము, హరిశ్చంద్ర నలోపాఖ్యానమూ ఇలాంటి
శ్లేషకావ్యాలు. వీనికి ద్వర్ధికావ్యాయాలుగా లోకంలో ప్రసిధ్ధి.
చమత్కారం అలాకాదు. భావనాకాశంలో మెరిసే మెఱపులాంటిది. లోకోత్తరమైన ఉల్లాస భరితమైన అర్ధవిశేషాన్ని, లేదా భావనను ఆవిష్కరించటం చమత్కారం. చతురులైన వారిమాటలలో యిది మాటిమాటికి తొంగిచూస్తూ ఉంటుంది. అలాంటి కవిత్వం చెప్పటంలో మొనగాడు చామకూర వేంకట కవి.
అతడు వ్రాసిన విజయ విలాసం ,సారంగ ధరచరిత్రములు చమత్కారమునకు నెలవగు కృతులు. . మన మిప్పుడు సారంగధర చరిత్రములోని రెండు పద్యములను పరిశీలించి యతనిచమత్కార
కవితా తత్వము నవలోకింతముగాక!
చిత్రాంగి సారంగధరుని వలచిన రాచకన్నె. ఆమెసోయగమునకు మురిసి వృధ్ధుడగు రాజేంద్రుడామెను పెండ్లాడెను.కానీ,
సారంగధరుని కొరకు చిత్రాంగి వేచియుండెను. అనుకొననిరీతిగా నొకనాడు పావురమునకై సారంగ ధరుడామె యంతఃపురమునకు
వచ్చెను. మంచిసమయము దొరికెనని చిత్రాంగి యతనిని వలపించుటకు ప్రయత్నించు చున్నది.
ఉ: నిక్కుగఁ జూడు చిత్రమిది , నెమ్మది వేడుక నోలలాడు ,న
మ్మక్కల గుట్టు బట్టబయలై గనుపింపగ శౌరి "కొమ్మపై
నెక్కి రమించు చున్కి, అవులే ! మగువా! యిది చిత్రమౌట దా
నిక్కము; కృష్ణలీలగద నీవిపుడెన్నిన మార్గమంతయున్ ;
సారంగధర చరిత్రము-- చామకూర వేంకటకవి!
చిత్రాంగి వలపుల కళ్ళెమును బిగించుటకు ప్రయత్నించుచుండ ,నైతిక జీవన పరాయణుడగు సారంగధరుడు ఆమాటలకు అన్యార్ధమును గలిపించి యాగండమునుండి తప్పించు కొనుటకు యత్నించుచుండుటవిషయము.
1 చిత్రము 2 అమ్మక్కలగుట్టు బట్టబయలగుట 3 కొమ్మపై నెక్కి రమించుట - యను మూడింటిలోనే యీపద్యములోని
విషయమంతయు దాగియున్నది.
చిత్రాంగి పడకటింటిలో నొక కుడ్య చిత్రమును జూపుచు ,సారంగధరా! ఈ చత్రమును చూడుము గోపికల మానచోరుడైనకృష్ణడు చేయుకొంటెపనులు . ఆకొమ్మపై నెక్కిరమించుట చిత్రముగానున్నదిగదా? యనుచున్నది. ఇటనామెభావము
కృష్ణుడు గోపికలతో జరపు మిధున కార్యమును జూపుట. "జయదేవుని ' శ్లిష్యతికామపి చుంబతి కామపి రమయతి కామపి రామామ్" అన్నది గుర్తుకు తెచ్చుకోవాలి. అదిగో కుడ్యచిత్రంలో ఉన్నవిషయమంతా అది. సహజంగా అలాంటిదృశ్యాలు యువకులకు కామోద్రేకాన్ని కల్గిస్తాయికదా! అందుకు యెత్తు వేసింది. కానీ ఆమె యెత్తు పారలేదు.
ఔనులే! నీవుచెప్పినది నిజమే! యిది చిత్రమే! (చిత్తరువే ) యేమున్నది? యివన్నియు కృష్ణలీలలని
సారంగ ధరుని సమాధానము. (ఇది ఫొటోయేకదా యదార్ధదృశ్యము కాదుగదా!) ఇంతకు అవి భగవత్కృత్యములు. అనితప్పించుకొనెను.
చిత్రము అనునొక్కమాటతో కృష్ణుడు గోపికలతో నొనరించిన కాముక కృత్యములను మరుగున పడవేయుట యిందలి చమత్కారము. ఆహా! చామకూర యెంతటి ప్రతిభాశాలి!! యని యతడొనర్చిన చమత్కారమునకు అంజలి ఘటింపకమానముగదా!.
స్వస్తి!
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ చేమకూర వేంకట కవి గారి విజయ విలాసము రసరమ్యముగా నుండును . చక్కని ఘట్టములను కన్నులవిందు జేసినందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.