గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, జూన్ 2017, గురువారం

పద్య పక్షమ్ ఛందస్సు ( 7 ) దశ దోషములు

జైశ్రీరామ్.
పద్య పక్షమ్ ఛందస్సు  ( 7 )
శ్రీ మదాంధ్ర పద్య రచనాభిలాషులారా! వందనములు.
ఇంతవరకు మనము
పద్య పక్షమ్. ఛందస్సు (1) లో శ్రీకారము  కృత్యాదిని కలిగినచో దాని ప్రభావము. / కృతి రచనకుఁ బ్రశస్త వారములు, గురు లఘువుల స్వరూపము,
పద్య పక్షమ్ ఛందస్సు ( 2 ) లో గణ స్వరూప నిరూపణము. గణముల కుదాహరణములు,
సూర్య - ఇంద్ర - చంద్ర గణములు వివరణ.
పద్య పక్షమ్ ఛందస్సు ( 3 ) లో యతులు యతికి పర్యాయపదములు.. స్వర యతులు . 
పద్య పక్షమ్ ఛందస్సు ( 4 ) లో . వ్యంజన యతులు.
పద్య పక్షమ్ ఛందస్సు ( 5 ) లో ఉభయ యతులు.
పద్య పక్షమ్ ఛందస్సు ( 6 ) లో ప్రాసలు మనము తెలుసుకొన్నాం కదా.
ఇప్పుడు
  పద్య పక్షమ్ ఛందస్సు ( 7 ) లో దశ దోషములు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాము.
  సాధారణముగా మనలో చాలామందికి ఛందోబద్ధముగా చక్కగా పద్యము వ్రాయవలెనను    సంకల్పము ఉండి ఉంటుంది. మనము ఛందశ్శాస్త్రపరిజ్ఞానమును బడసి పద్యరచనను సాధన చేయుచుందుము.
 కుమ్మరి కుండలను చేయునప్పుడు ప్రారంభమందే ఘటాకృతి సంతరించుకొనదు.
 ముందుగా ఎంత గొప్ప కుమ్మరి ఐనను మృత్పిండమునే గ్రహించి ఘట నిర్మాణము చేయును.
 ఆనిర్మాణము కొంచెము కొంచెముగా మలచగా మలచగా క్రమ క్రమముగా ఘటాకృతి  సంతరించుకొనును.ఐనను దానిని కొలిమిలో కాల్చి చల్లర్చిన పిదప నీరంధ్రమో కాదో పరీక్షించుటకు అందు  జలమునుంచ అది జలము చమర్చెనేని ఆఘటము నిరుపయోగమేకదా!  
 అటులనే మనము ఎంతటి జగరూకులమై పద్యరచన చేయ సమకట్టినను అదిఎన్ని  గుణములు కలిగి ఉన్నప్పటికీ,  
 దోషరహితముగా ఉన్నప్పుడు మాత్రమే సభారంజకమగును. చక్కని పద్యములో దోషమనునది  అమృతాహారమున  
 కలిసిన విషబిందువు వంటిది.
 కాన మనము పద్యములో గుణములు ఏవి అని తెలుసుకొనుటకంటే కూడా ఏవి దోషములు?  అనే అంశమును మిక్కిలి జాగ్రత్తగా గ్రహించ వలసి యున్నదని నాకనిపించుచున్నది.
 ఈ కారణముగా మనము ఇప్పుడు తెలుసుకొనబోవుచున్న దోషములు తప్పక గుర్తుం చుకొనవలెను.
దశ దోషములు
 1. ఛందో భంగము.
 గురువుండ వలసిన చోట లఘువు; లఘువుండ వలసిన చోట గురువు ప్రయోగించిన ఛందో  భంగము అను  
 దోషమగును.
 దా. గోవింద యనవలసిన చోట ముకుంద యనిన ఛందోభంగము అను దోషమగును.

 2. యతి భంగము.
 యతి ఉండవలసిన చోట కాక మరియొక చోట పాటింప బడనిచో యతి భంగము అను దోషము.
 దా. ఆంధ్ర ప్రజల సాటి రయ లేరు. అన వలసిన చోట ఆంధ్ర ప్రజల సాటిని రయముగ!

 3. విసంధికము.
 సమాస గతములగు పదముల మధ్య సంధి చేయనిచో విసంధికము అను దోషము.
 దా. అమృతోదధి శయన అని ఉండవలసిన చోట అమృత ఉదధి శయన అని వ్రాసినచో  విసంధికము అను దోషము.

 4. పునరుక్తి దోషము.
 ఇది రెండు విధములు.
 శబ్ద పునరుక్తి;
 అర్థ పునరుక్తి.
 తొలుత పలికిన శబ్దమునే మరల పలికిన శబ్ద పునరుక్తి.
 దా. కాంతి చంద్రుఁడతఁడు కళలు జిందెడి శశి. అనినచో శబ్ద పునరుక్తి దోషము.
 పూర్వోక్తమగు అర్థమే పునరుక్తమైన అర్థ పునరుక్తి దోషమగును.
 కాంతినమృత చంద్రుడని యశో మృగాంకుడనినచో అర్థ పునరుక్తి దోషమగును.

 5. సంశయము.
 పద్యమున భావము నిస్సంశయముగా నుండునట్లు వ్రాయబడ వలెను. ఆ విధముగ కాక
 భావము సంశయాస్పదమైనచో అది సంశయము ను దోషము.
 దా. అతని కలయిక వలన కదా ఇంతపట్టు జరిగినది? జరిగినది లాభమా? నష్టమా?  సందేహముగానున్నందున  
 సంశయము అను దోష మిందు కలుగు చున్నది.

 6. అపక్రమము.
 క్రమాలంకారము ఉండవలసిన చోట అపక్రమముగనున్న అపక్రమ దోష నఁబడును.
 దా. విష్ణువు హృదయము నాభికమలము పాదము గంగ లక్ష్మి బ్రహ్మల నివాస స్థానములు.  ఇందు క్రమ  
 విరుద్ధముగ నున్నందున అపక్రమ దోషము కలిగినది.
 విష్ణువు హృదయము నాభికమలము పాదము లక్ష్మి బ్రహ్మ గంగల నివాస  స్థానములు  అనిన  సక్రమము.

 7. న్యకుమ. లేదా వ్యర్థము.
 మొదట పలికిన పదముల కనుగుణము కాని వ్యర్థ పద ప్రయోగము చేసిచో న్యకుమ లేదా  వ్యర్థము అను దోషము
 దా. నీవు త్యాగివి. నాలుగు కాసులెవ్వరికీ ఈయవు.
 ఇందు త్యాగికి  సరిపడు గుమునకు విరుద్ధముగ పిసినారి యను పద ప్రయోగము వలన
 పరస్పర విరుద్ధమైనందున ఇది వ్యర్థము అను దోష భూయిష్టము.

 8. అపార్థము.
 వాక్యమునందలి పదముల కన్యోన్యాకాంక్ష యుండ వలెను. అట్లు లేకపోయినచో  సముదాయార్థము  
 స్ఫురింపనందున అపార్థము అను దోషమగును.
 దా. కరిచర్మము గైరిక శిల సురగిరి అని వ్రాసినచో పరస్పరాన్వయము లేనందున  అపార్థము  ను దోషమిందు  
 కలుగు చున్నది.

 9.అప శబ్దము.శబ్ద నిర్మాణమునందు కలుగు దోషములు కారణముగా  అవి  అపశబ్దములుగా   గణింపఁబడును. 
 అవి
 ౧. కుసంధి;
 ౨. దుస్సంధి;
 ౩. చుట్టుంబ్రావ;
 ౪. వైరి వర్గము;
 ౫. నిడుదలకాకుదోషము;
 ౬. కుఱుచ కాకు;
 ౭. తెలుగునకు జొరని సంస్కృత క్రియల దుష్ప్రయోగములు;
 ౮. సర్వ గ్రామ్యములు
 ప్రయోగింపఁబడిన
 అప శబ్ద దోషమనఁబడును.

 ౧. కుసంధి.                                                                     దీని + ఒడయడు = దీని యొడయడుసాధువు. దీనొడయడు అసాధువు

 ౨. దుస్సంధి.
 అతడు + అతడు = అతడుతడు. సాధువు. అతడున్నతడు. అసాధువు

 ౩. చుట్టుంబ్రావ.
 అసలారు వందలకు వడ్డీ మూడు వందలు బలాత్కారముగ లాగుకొని జీవించువాడు ఇదిగో  వచ్చు చున్నాడు. అని  
 ఈ విధముగా చెప్పభడినచో చుట్టుంబ్రావ యను దోషము.

 ౪. వైరి వర్గము.
 సంస్కృత పదమును తత్సమము చేసి తెలుగు పదముతో సమసింప జేయుట సరి అయిన  పద్ధతి.
 అట్లు గాక పూర్వ పదమున కాంధ్ర విభక్తి చిహ్నము చేర్చక సంస్కృత ప్రాతిపదికమునకే తెలుగు  పదము చేర్చి  
 సమాసము చేసినచో వైరివర్గము అను దోషమగును.
 దా. పుష్ప విల్లు. వైరి వర్గము. ముజ్జగములు. ముల్లోకములు మున్నగునవి నిర్దోషములు.
 వాటిపై మరల ముజ్జగద్వంద్యుఁడు; ముల్లోక పూజ్యుఁడు అని యుండిన వైరివర్గమున చేరును.

 ౫. నిడుదలకాకుదోషము.
 హ్రస్వముండవలసిన చోట దీర్ఘముంచినచో అది నిడుదల కాకు దోషమగును.
 దా. పొగడ దండలు అను చోట పొగాడ దండలు అని ప్రయోగించరాదు.

 ౬. కుఱుచ కాకు.
 దీర్ఘములుంచ వలసిన చోట హ్రస్వముంచుట.
 దా. నాయెడన్ కు బదులు నయెడన్ అనిప్రయోగింపరాదు.

 ౭. (తెలుగునకు జొరని సంస్కృత క్రియల) దుష్ప్రయోగములు.
 సంస్కృత విభక్త్యంత పదములను తెలుగు విభక్త్యంత పదములతోఁ గలిపి ప్రయోగించుట.
 దా. సత్వరము నృపస్య పదం గత్వాయాతఁడు నిహత్యకంటకుల సఖీ భూత్వా మెలగెడు. అని  ప్రయోగింపరాదు.

 ౮. సర్వ గ్రామ్యములు ప్రయోగింపఁబడుట.
 గ్రామీణుల వాడుక భాషను ప్రయోగింపరాదు.

 10. విరోధములు. ఇవి ఆరు విధములు.
 ౧. సమయ విరోధము.
 ౨. ఆగమ విరోధము.
 ౩. లోక విరోధము.
 ౪. కాల విరోధము.
 ౫. కళా విరోధము.
 ౬. దేశ విరోధము.

 ౧. సమయ విరోధము.
 ఆచార విరుద్ధము య విరోధముని గ్రహింప వలెను.
 దా. బాహువుల యందు కుండలములు ధరించినాఁడు అని వ్రాసిన సమయ విరోధముగా  గ్రహింపదగును.

 ౨. ఆగమ విరోధము.
 అనగా శాస్త్ర విరోధము.
 దా. హింసా పరమో ధర్మః అనిన అది ఆగమ విరోధముగా గ్రహింపనగును.

 ౩. లోక విరోధము.
 లౌకికమునకు విరోధముగ వ్రాసిన లోక విరోధము అను దోషము.
 దా. నయునకు పాద సేవను తల్లి చేసె. అనిన దోషము.

 ౪. కాల విరోధము.
 దేశ కాలానుగుణముగా వ్రాయ వలసినదిగా నియమముండగా తద్విరుద్ధముగా వ్రాసినచో
 కాల విరోధము దోషమగును.
 దా. సుగుణాకర పట్ట పగలు చుక్కలు పొడిచెన్.

 ౫. కళా విరోధము.
 ఏయే కళలకు తగిన పరికరముల నాయా కళలందు చెప్ప బడుటకు బదులు
 తద్విరుద్ధముగా చెప్పుట కళా విరోధము.
 దా. తాళము బట్టక చదువును, పుస్తకము పట్టక పాడు ఘనుడీతడు. అనిన దోషమే కదా!

 ౬. దేశ విరోధము.
 ప్రదేశమును బట్టి కాక తద్విరుద్ధముగా చెప్పిన దేశ విరోధము దోషము.
 దా. ఎడారిలో నూతులనుండి నీరు పొంగి ప్రవహించు చున్నదని చెప్పినచో దోషము.

 స్వస్తి.
 జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఛందస్సును అందలి దశ దోషములను వివరముగా తెలియజేసి నందులకు , శ్రీచింతా సోదరుల కృషికి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.