గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, నవంబర్ 2015, బుధవారం

మాడుగులానిలు మహనీయ పూరణ కవిపుంగవులకెల్ల కమ్ర ఫలము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! 
మాడుగులానిలు మహనీయ పూరణ కవిపుంగవులకెల్ల కమ్ర ఫలము.
వారికి నా హృదయ పూర్వక అభినందనలు.
డా. మాడుగుల అనిల్ అవధానిశేఖరుల అనుభూతిని వారి మాటలలోనే విన్న తరువాత ఈ విషయాన్ని మీరే ఒప్పుకుంటారు.
ఇక చూడండి వారేమి చెప్పారో.
ఇటీవల బ్రహ్మశ్రీ ఆచార్య డా.శలాక రఘునాథ శర్మగారు ఇంటికి విచ్చేశారు.
మాటల మధ్యలో వారు శృంగేరిలో బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ గారి సంస్కృత అవధానంలో సమస్యకు పృచ్ఛకులుగా వ్యవహరించినట్లు తెలిపి
బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ గారికి వారు ఇచ్చిన శార్దూలవిక్రీడిత సమస్యను చెప్పారు.
ఆ సమస్య –
అజ్ఞానాదిహ మోక్షసిద్ధిరితి సిద్ధాంతశ్చ వేదాంతినామ్ II
“అజ్ఞానము వలన మోక్షము కలుగుతుంది అని వేదాంతుల సిద్ధాంతము” అని ఈ సమస్యకు అర్థము.
నన్ను సమస్య పూరించమని వారు చెప్పలేదు. కాని
విన్న వెంటనే పూరించాలనే ఉబలాటం సహజంగానే నాకుంది.
ఆ సమస్యను నేనిలా పూరించాను.
లోకే మానవ సేవయా చ భగవత్ సేవాఫలం లభ్యతే 
తస్మాన్నాస్తిక వాదినామభిమతం విద్యాత్ తథా దేవతా
ద్యజ్ఞానాదిహ మోక్షసిద్ధిరితి ; సిద్ధాంతశ్చ వేదాంతినా 
మద్వైతామరవాదినాం స భగవాన్ బ్రహ్మైవ జీవేతి హి II
భావము :- లోకంలో మానవ సేవతో కూడ భగవంతుని సేవిస్తే కలిగే సేవాఫలం లభిస్తూ ఉన్నది. అందుకే మానవ సేవయే మాధవ సేవ అన్నారు. అందుకే దేవతల విషయంలో అజ్ఞానం (దేవుడిని తెలియక పోవడము) మోక్ష కారకము, ప్రజా సేవతో భగవంతుడిని పొందవచ్చు అని నాస్తిక వాదుల అభిమతమై ఉండవచ్చు. అద్వైతామర వాదులైన వేదాంతుల అభిమతం కూడ అదే కదా! “జీవో బ్రహ్మైవ నాపరః” అని. జీవుడే బ్రహ్మ. బ్రహ్మయే జీవుడు. కావున అజ్ఞానంతో మోక్షసిద్ధి కలుగుతుంది.
ఆ తరువాత బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ గారికి అవధానానికి ముందు ఇచ్చిన మరొక తెలుగు సమస్యను నా ముందుంచారు.
ఆ సమస్య –
మద విభ్రాంత వివేక శీలునకు సంప్రాప్తించు మోక్షంబిలన్ II
మదము పట్టిన వివేక శీలునికి మోక్షము లభిస్తుంది అని ఈ సమస్యకు అర్థము. దానిని నేనిలా పూరించాను.
పెదవుల్ శ్రీహరి నామ కీర్తనమునన్ విప్పారి చెన్నొందగా 
పదముల్ పంకజ నాభు చెంతకని దేవస్థానముంజేర , ని
చ్చెదనార్జించిన సొమ్ము పేదకనుచున్ శీఘ్రమ్ముగా వెళ్ళు కా 
మద విభ్రాంత వివేక శీలునకు సంప్రాప్తించు మోక్షంబిలన్ II
భావము :- పెదవులు శ్రీ హరినామ కీర్తనలో సాఫల్యాన్ని పొందుతూ ఉండగా, కాళ్ళు దేవుని చేరడానికని దేవస్థానాల వైపు వెళ్తుండగా, తాను కష్టపడి ఆర్జించిన ధనాన్ని పేదవారికి పంచి పెట్టడానికి వెంటనే వెళ్ళి, కోరిన కోరికలు తీర్చడానికి యాచకులకు పిచ్చిగా దానము చేసే వానికి మోక్షము లభిస్తుంది.
మరల
బ్రహ్మశ్రీ ఆచార్య డా.శలాక రఘునాథ శర్మగారు
చిర్రావూరి శ్రీ రామ శర్మ గారికి ఇచ్చిన సంస్కృత సమస్యను చెప్పారు.
ఆ సమస్య –
చిత్తుకాపికదేందిరా II
చిత్ తు కా అపి క దా ఇందిరా ఇవన్నీ మహాలక్ష్మికి విశేషణ పూర్వ పదాలు. ఏకాక్షరాలు. వాటిని శలాక వారు తెలియజేస్తే తప్ప నేను తెలుసుకోలేను.
కాని
ఎక్కడైనా అవధానాలలో అట్లా ఇస్తే ఏమి చేయాలి ? 
అందుకే నా మార్గంలో నేను పూరించి చూపాను. నా పూరణ –
పరీక్షామలిఖత్ ఛాత్రః గ్రంథం దృష్ట్వా , తదా గురుః I
అపృచ్ఛదాంధ్ర బాలం తం చిత్తుకాపికదేందిరా II
భావము :- పిల్లవాడు పుస్తకాన్ని చూస్తూ పరీక్ష వ్రాస్తున్నాడు. అయ్యవారు దానిని చూశాడు. ఆ బాలుడు తెలుగువాడు. అందుకే తెలుగులో “చిట్టీ పెట్టి వ్రాయడానికి అదేమిరా పుస్తకమే పెట్టి వ్రాస్తున్నావు ?” అని అడిగినాడు.
శలాక వారు అప్పుడు సమస్య సంస్కృతంలో ఉంది కదా! అని నవ్వుతూ కలగజేసుకున్నారు.
అపృచ్ఛదాంధ్ర బాలం తం (తెలుగు పిల్లవాడిని అడిగినాడు) అని కదా నేను పూరించాను అన్నాను.
అందుకు వారు ఆనందించారు.
ఇవన్నీ ఒక వైపు ఇద్దరు కూడ world cup semi final చూస్తూ జరిపినవి.
వారు మరొక సమస్యను –
భీమో భీమః సురపతిసుతం దంతకూరే జఘాన II అని ఇచ్చారు.
భీముడు రణరంగ భీముడు అర్జునుని యుద్ధంలో చంపినాడు అని ఈ సమస్యకు అర్థము.
దానిని నేనిలా పూరించాను. –
సుగ్రీవోsసౌ జనకతనయా వల్లభం చాశ్రయిత్వా
తస్మిన్ పార్శ్వే సమరసుముఖః హంతుకామో జగామ I
వీరో వాలిః బత! విధివశాత్ దుర్బలోs భూత్ తదా హి
భీమోsభీమః సురపతిసుతం దంతకూరే జఘాన II
భావము :- వాలికి భయపడి రాజ్యము కోల్పోయి పారిపోయిన సుగ్రీవుడు శ్రీరాముని ఆశ్రయించినాడు. శ్రీరాముడు చెంతనుండగా యుద్ధము చేయడానికి సుముఖుడై వాలిని చంపడానికి వెళ్ళినాడు. అయ్యో! అప్పుడు వీరుడైన వాలి దైవబలం వలన దుర్బలుడైనాడు. యుద్ధ రంగంలో భీముడైన వాలి అభీముడైనాడు. అప్పుడు ఇంద్రుని కుమారుడైన వాలిని సుగ్రీవుడు యుద్ధంలో చంపినాడు.
ఈ సమస్యలకు నా పూరణలను వినిన
ఆచార్య బ్రహ్మశ్రీ ఆచార్య డా.శలాక రఘునాథ శర్మగారు బాగున్నది అని ఊరికే చెప్పి చాలించలేదు.
మరుసటి దినము క్రొత్త శాలువ తీసుకొని వచ్చి సన్మానించి దీవించారు.
 అన్ని సన్మానాలకన్నా ఉప్పొంగి వచ్చిన ఆనందంతో వారు చేసిన సన్మానము చిరస్మరణీయము.
ఇట్లు
మీ మాడుగుల అనిల్ కుమార్.
జైహింద్.
Print this post

3 comments:

vsrao5- చెప్పారు...

అవును అవును అనిలిగారు!. . ఆచార్యవరేణ్యులు శలాక రఘునాథశర్మగారి మెప్పు పొందిన మీరు ఆంధ్రామృత వితరణకు తగిన విశిష్ఠులే . . అందుకోండి, శుభాభినందనలు, శుభాశీస్సులు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ అనిల్ గారికి శుభాభి నందనలు

P. S. Satyanarayana చెప్పారు...

అవధాని అనిల్ కుమార్ గారికి శుభాకాంక్షలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.