గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, డిసెంబర్ 2014, బుధవారం

పాకిస్తాన్‌లో పేట్రేగిన తాలిబన్ల కాల్పులలో విగత జీవులైన అనేకమంది విద్యార్థులు.

జైశ్రీరామ్.

ఆర్యులారా! కౄర మృగాలు తమకు ఆహారం కోసం మాత్రమే  జీవహింసకు పాల్పడుతున్నప్పటికీ కూడా తమ జాతి మృగాల జోలికి పోవు. కాని ఈ నాడు మితి మీరిన మత మౌఢ్యాలకు,  అర్థ రహిత భావావేశాలకు దాసుడౌతున్న మానవుడు కౄర మృగాలకంటే కూడా హీనంగా స్వజాతి ఐన మానవ జాతినే మటుమాయం చేసే ఘోరమైన పరమ హింసా మార్గాన్నే ఎన్నుకొని, సాటివారిపై ఏమాత్రం జాలి దయ లేకుండా కాల్చి చంపుచుండడం, తాము కూడా ఆత్మాహుతు చేసుకోవడం వంటివి చూస్తుంటే మానవ జాతి భవిత ప్రశ్నార్థకమౌతోంది.
ప్రపంచంలో ఏ దేశంవారైనను అవ వచ్చును, ఏ ప్రాంతంవారైనను అవ వచ్చును, ఏ మతం వారైనను అవవచ్చును. భూమిపై అందరితో పాటు హాయిగా బ్రతకాలి. ఎవరి స్వేచ్ఛకు ఎవరూ భంగం వాటిల్లకుండా సమున్నత  భావనతో మెలగాలి. అంతే కాని తాము నమ్మినమార్గమే మూఢంగా  శిరోధార్యంగా భావించి, సాటివారిని చంపుతూ, వారూ మరణిస్తూ, సాధిస్తున్న దేముంటుంది. నిన్నను పెషావర్లో సైనిక విద్యార్థుల పాఠశాలలో దొడ్డి దారిని ప్రవేశించి, పరీక్షలు వ్రాస్తున్న విద్యార్థులపై అత్యంత కౄరంగా గుళ్ళవర్షం కురిపించి అనేక మంది ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులు ఏమి సాధించారు? ఎందరు తల్లితండ్రులు ఎంతటి దుఃఖాక్రాంతులయ్యరో ఒక్కసారైనా ఆలోచిస్తున్నారా?
ఆ ఆలోచన చేయడానికి మనసుకు కొంచెం సమయమిచ్చుకొని ఉంటే వారూ మరణించనవసరం లేదు, ఇందరు తల్లిదండ్రుల గర్భ  శోకానికి వారు కారణమవనవసరం కూడా లేదు.
మన సోదరులైన పాకిస్తానీయుల బిడ్డలు ఉగ్రవాదుల గుళ్ళ వర్షానికి బలి కావడం యావజ్జనానీకానికీ బాధ కలిగిస్తోంది.
ఇప్పటికైన ఉగ్రవాద మార్గం పట్టినవారు దయచేసి కొంచెం ఆలోచించి, సాటి మానవులను చంపే కార్యక్రమాలకు చరమగీతం పాడాలని ఆశిస్తున్నాను. ప్రాధేయ పూర్వకంగా కోరుకొంటున్నాను.
మరణించిన వారి కుటుంబాలకు  నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడినవారు వేగంగా క్రోలుకోవాలని మనసారా కోరుకొంటున్నాను. ఆ పరమాత్మ మనలో నెలకొల్పి ఉంచిన మంచితనం వెలుగు చూచుగాక. యావజ్జనావళి సుఖ సంతోషాలతో వర్ధిల్లుదురు గాక. ఉగ్రవాదులు తమ ఉగ్ర మార్గం వీడి, సాధు జీవన స్రవంతిలో కలియుదురుగాక.
జైహింద్.

Print this post

1 comments:

సురేష్ బాబు చెప్పారు...

కనీసం మంచివాళ్ళ ఆక్రందనలు అన్నీ కలిసి అయినా అలాంటి వాళ్ళ మనసులను మారుస్తుందని ఆశిద్దామండీ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.