గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, డిసెంబర్ 2014, మంగళవారం

గీతా మాహాత్మ్యము

జైశ్రీరామ్.
గీతా మాహాత్మ్యము
ధరోవాచ.
శ్లో. భగవాన్! పరమేశాన! భక్తిరవ్యభిచారిణీ!|
ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హేప్రభో || 1 ||
క. ప్రాబ్ధ కర్మ బద్ధుల
కే రకముగ భక్తి యబ్బు నీశ్వర! యనుచున్
చేరి ధర హరిని యడుగగ
నారాయణుఁ డిట్లు చెప్పె నమ్మిక మీరన్.
భూదేవి విష్ణుభగవానుని గూర్చి ఇట్లు ప్రశ్నించెను. ఓ భగవానుడా! పరమేశ్వరా! ప్రభూ! ప్రారబ్ధము అనుభవించే వానికి అచంచలమైన భక్తి ఎట్లు కలుగగలదు?
శ్రీవిష్ణురువాచ:
శ్లో. ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరతస్సదా |
స ముక్త స్స సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే || 2 ||
క. ప్రారబ్ధ కర్మ బద్ధులు
తీరికగా గీత చదివి తృప్తిగ నాపై
భారము వేసిన, కర్మలు
వారల కంటవు. విముక్తి వారికి కలుగున్.
ఓ భూదేవీ! ప్రారబ్ధము అనుభవిస్తున్ననూ ఎవరు నిరంతరము గీతాభ్యాసమందు నిరతుడై ఉండునో అట్టివాడు ముక్తుడై కర్మలచే అంటబడక ఈ ప్రపంచమునందు సుఖముగా ఉండును.
శ్లో. మహాపాపాదిపాపాని గీతాధ్యానం కరోతి చేత్ |
క్వచిత్ స్పర్శం న కుర్వంతి నలినీదళమంభసా || 3 ||
క. గీతా ధ్యానము చేయు పు
నీతుల కఘమంట బోదు. నీరముఁ గన నే
రీతినిఁ దామర కంటునె?
యాతీరుగ  నిదియు. నిజము నరయుము దేవీ!
తామరాకును నీరంటనట్లు గీతాధ్యానము చేయు వానిని మహాపాపములు కూడా కొంచమైనను అంటవు.
శ్లో. గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే
తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై || 4 ||
క. గీతా గ్రంథ మదెచ్చట,
గీతా పారాయణెచట కీర్తి ప్రదమై
భూతలమందున నుండును
నా తలమున పుణ్య తీర్థ మమరిక నుండున్.
ఎచ్చట గీతా గ్రంధము ఉండునో మరియు ఎచ్చట గీతా పారాయణము జరుగుచుండునో అచ్చట ప్రయాగ మొదలగు సమస్త తీర్ధములు ఉండును. 
శ్లో. సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చ యే |
గోపాల గోపికా వాపి నారదోద్ధవ పార్షదైః
సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే || 5 ||
గీ. ఎచట గీతపారాయణంబెలమి జరుపు
నచట దేవతల్, ఋషి వరు లఖిల యోగు
లఖిల నాగులు గోపిక లఖిల గోప
కులును నారదోద్ధవులు కొలుపు మేలు. 
ఎచ్చట గీతాపారాయణము జరుగుచుండునో అచటికి దేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపికలు, గోపాలురు భగవత్స్పర్శ్యాస్యాసక్తులగు నారద, ఉద్ధవాదులు వచ్చి శీఘ్రముగా సహాయమొనర్తురు. 
శ్లో. యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శ్రుతం |
తత్రాహం నిశ్చితం పృథ్వి నివసామి సదైవ హి || 6 ||
గీ. గీత పఠన పాఠన ములు, గీత స్మరణ
మెచట శ్రవణమున్ జరుగునో యచట నేను
నిష్టతో నుండి కాతును నేర్పు మీర.
గమ్య మార్గము  చూపుదు. కనుమ! పృథ్వి!
ఓ భూదేవీ! ఎచట గీతను గూర్చి విచారణ, పఠనము, భోధన, శ్రవణము జరుగుచుండునో అచట నేను ఎల్లప్పుడు తప్పక నివసింతును. 
శ్లో. గీతాశ్రయేహం తిష్ఠామి గీతా మే చోత్తమం గృహమ్ |
గీతాజ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహమ్ || 7 ||
ఆ. గీత నాశ్రయించి క్రీడింతు జగమున.
గీతయే గృహముగ  ప్రీతి నుందు.
గీత నాశ్రయించి ఖ్యాతి ముజ్జగముల
నేలు చుంటి నేను మేలుగాను.
నేను గీతనాశ్రయించి ఉన్నాను, గీతయే నాకు ఉత్తమగు నివాస మందిరము మరియు గీతాజ్ఞానమును ఆశ్రయించియే మూడు లోకాలను నేను పాలించుచున్నాను. 
శ్లో. గీతా మే పరమా విద్యా బ్రహ్మరూపా న సంశయః |
అర్ధమాత్రాక్షరా నిత్యా స్వనిర్వాచ్య పదాత్మికా || 8 ||
గీ. గీతయే నా పరమ విద్య. ఖ్యాతిఁ గనిన.
గీత బ్రహ్మస్వరూపము. కీర్తి ప్రదము.
ప్రణవమందున నాల్గవ పాదమైన
అర్థ మాత్ర. నిత్య సుశాశ్వితానుపమము.
గీత నాయొక్క పరమవిద్య అది బ్రహ్మస్వరూపము దీనిలో సందేహము లేదు, మరియు అది ప్రణవములో నాలగవ పాదమగు అర్ధమాత్రా స్వరూపము, నిత్యమైనది, నాశరహితమైనది, అనిర్వచనీయమైనది.
శ్లో. చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖతోర్జునమ్ |
వేదత్రయీ పరానందతత్త్వార్ధజ్ఞానమంజసా || 9 ||
గీ. కృష్ణుఁ డర్జునునకుఁ జెప్పె గీత  కృపను 
మూడు వేదాల సారము. మూడు లోక
ములకు నానందప్రదమిది. కలుగచేయు
తత్వ విజ్ఞానమును తనన్ దలచినంత.
సచ్చిదానంద స్వరూపుడగు శ్రీ కృష్ణ పరమాత్మచే స్వయముగా అర్జుననుకు ఉపదేశింప బడినది. ఇది మూడు వేదముల సారము, పరమానందమయినది, తన్నాశ్రయించిన వారికి శీఘ్రముగా తత్వజ్ఞానాన్ని కలుగచేయును. 
శ్లో. యోష్టాదశ జపేన్నిత్యం నరో నిశ్చలమానసః |
జ్ఞానసిద్ధిం స లభతే తతో యాతి పరం పదమ్ || 10 ||
గీ. ప్రీతి నష్టా దశాధ్యాయి ఖ్యాతి నెఱిగి,
పఠన చేయు నా నరుఁడు తా బ్రహ్మ పథము
నొందు. సందేహమే లేదు. మంద మతియు
దీని పఠియించి మోక్షంబు తాను పొందు. 
ఏ నరుడు నిత్యమూ గీతయందలి పద్దెనిమిది అధ్యాయములను పఠించునో అతడు జ్ఞానసిద్ధిని పొంది తద్వారా పరమ పదమును (మోక్షమును) పొందును.
శ్లో. పాఠే సమర్థస్సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ |
తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః || 11 ||
గీ. శక్తి హీనులు గీతను భక్తి తోడ
సగము చదివిన చాలును సత్ ఫలమిడు.
గంగి గోదాన ఫలమిచ్చు. గాన  చదివి
సత్ ఫలంబును గాంతురు సహృదయులిల.
గీతని మొత్తము పఠించలేని వారు అందులో సగమైనను పఠించవలెను దీనివలన అతడికి గోదాన ఫలము వలన కలుగు పుణ్యము లభించుననుటలో సందేహము లేదు. 
శ్లో. త్రిభాగం పఠమానస్తు గంగాస్నానఫలం లభేత్ |
షడంశం జపమానస్తు సోమయాగఫలం లభేత్ || 12 ||
గీ. గీత మూడవ వంతైన ప్రీతి తోడ
చదువ స్వర్గంగ స్నాన ఫలదము. నిజము.
గీతనారవ భాగము ప్రీతిఁ జదువ
సోమ యాగ ఫలంబిచ్చు. శుభము లొసగు.
గీతయొక్క మూడవభాగము(ఆరు అధ్యాయములు) పఠించినవానికి గంగా స్నాన ఫలము లభించును, ఆరవ భాగము(మూడు అధ్యాయములు)పఠించువారికి సోమయాగ ఫలము లభించును.  
శ్లో. ఏకాద్యాయం తు యో నిత్యం పఠతే భక్తిసంయుతః |
రుద్రలోకమవాప్నోతి గణోభూత్వా వసేచ్చిరమ్ || 13 ||
గీ. ఒక్క అధ్యాయమైనను నిక్కముగను
గీత ప్రతిదినంబు చదువఁ బ్రీతి తోడ
రుద్ర లోకము పొంది తా రుద్ర గణము
నందు నొకఁడగు. నివసించునం దనిశము.
ఎవడు గీతయొక్క ఒక అధ్యాయము భక్తితో పఠించునో అతడు రుద్రలోకమును పొంది రుద్ర గణములలో ఒకడుగా శాశ్వతముగా నివసించును. 
శ్లో. అధ్యాయశ్లోకపాదం వా నిత్యం యః పఠతే నరః |
స యాతి నరతాం యావన్మనుకాలం వసుంధరే! || 14 ||
గీ. నిత్య మధ్యాయ పాదము నేర్పు మీర
చదువ నుత్కృష్ట నర జన్మ చక్క నొదవు
నొక్క మన్వంతరము. కాన నొప్ప చదువు
భక్తి తోడను గీత సద్భక్తు లెల్ల.
ఓ భూదేవీ ఎవరు గీతనందలి ఒక అధ్యాయమునందలి నాల్గవ భాగమును నిత్యమూ పఠించునో అతడు ఉత్కృష్టమైన మానవ జన్మ ఒక మన్వంతర కాలము పొందును. 
శ్లో. గీతాయాః శ్లోకదశకం సప్త పంచ చతుష్టయమ్ |
ద్వౌత్రీనేకం తదర్ధం వా శ్లోకానాం యః పఠేన్నరః || 15 ||
ఆ. గీత పదియొ, యేడొ, భ్రాతి నైదో నాల్గొ,
మూడొ, రెండొ, యొకటొ, ముచ్చట పడి
యర్థ శ్లోకమయిన నర్ధితో చదివిన
యమర సుఖములబ్బు నరసి చూడ.
ఎవరు గీతనందలి పది శ్లోకములను కానీ, ఏడుశ్లోకములను కానీ, ఐదు శ్లోకములను కానీ, నాలుగు శ్లోకములను కానీ, మూడు శ్లోకములను కానీ, రెండు శ్లోకములను కానీ, ఒక శ్లోకమును కానీ, అర్ధ శ్లోకమును కానీ నిత్యము ఏవరు పటింతురో, 
శ్లో. చంద్రలోకమవాప్నోతి వర్షాణామయుతం ధ్రువమ్ |
గీతాపాఠ సమాయుక్తో మృతో మానుషతాం వ్రజేత్ || 16 ||
గీ. వారు చంద్రలోకమునందు వరలు నిజము
వేయి పదులవత్సరములు ప్రీతితోడ.
గీత చదువుచు మృతి చెంద ఖ్యాతి నతఁడు
ఉత్తమంబగు నరజన్మ నొనర పొందు.
వారు చంద్రలోకములో పదివేల సంవత్సరములు సుఖముగా జీవించుననుటలో సందేహము లేదు మరియు గీతను పఠిస్తూ ఎవరు మరణిస్తారో అతడు ఉత్తమ మగు మానవ జన్మను పొందుట నిశ్చయము.
శ్లో. గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమాం |
గీతేత్యుచ్చారసంయుక్తో మ్రియమాణో గతిం లభేత్ || 17 ||
గీ. అట్టి నర జన్మ పొందిన దిట్ట మరల
గీత పఠియించి పఠియించి ఖ్యాతిగాను
మోక్షమును పొందు, గీత పూజ్యాక్షరములు
పలుకుచుండి గతించిన వచ్చు ముక్తి.
అట్లాతడు మానవుడై జన్మించి గీతాభ్యాసమును మరల మరల గావించి ఉత్తమమగు మోక్షమును పొందుననుటలో సంశయము లేదు. గీతా గీతా అనుచు ప్రాణమును వదలువాడు సత్గతిని పొందుననుటలో సందేహము లేదు.  
శ్లో. గీతార్థశ్రవణాసక్తో మహాపాపయుతోపి వా |
వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే || 18 ||
క. పాపాత్ముఁడయిన గీతను
దీపించెడి యర్థమెఱిగి తీరగ వలవన్
ప్రాపించు విష్ణులోకము
ప్రాపించును సుఖములచట భక్తియునొడమున్.
మహా పాపాత్ముడైనను అతడు గీతార్ధమును తెలుసుకొనుటలో ఆసక్తుడైనచో అతడు విష్ణు లోకమును పొంది శ్రీమహా విష్ణు సన్నిధిలో ఆనందమును అనుభవించుచూ ఉండును. 
శ్లో. గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః |
జీవన్ముక్త స్స విజ్ఞేయో దేహాంతే పరమం పదమ్ || 19 |
క. గీతార్థ నిరత చింతన
ఖ్యాతిగ కల నరుడు కర్మ గతినున్నను వి
ఖ్యాతిగ కను పరమ పదము
నే తరి గన దేహ పతన మిది సత్యమిలన్.
ఎవడు గీతార్ధమును నిత్యము చింతన చేయుచుండునో అతడు అనేక కర్మల నాచరించిననూ జీవన్ముక్తుడేనని చెప్పబడెను, మరియు దేహ పతనానంతరము పరమ పదమును(కైవల్యమును) పొందును. 
శ్లో. గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయః |
నిర్ధూతకల్మషా లోకే గీతా యాతాః పరమం పదమ్ || 20 ||
క. జనకాదులుముక్తిని గని
రనితరమగు గీతనరసియమలిన మతులన్
జనియించిన నరులు పునర్
జననము గన రరయ గీత. సత్యంబిదియే.
ఈ ప్రపంచమున గీతను ఆశ్రయించి జనకాది రాజులు అనేకులు పాపరహితులై ముక్తిని పొందియున్నారు.
శ్లో. గీతాయాః పఠనం కృత్వా మాహాత్మ్యం నైవ యః పఠేత్ |
వృథాపాఠో భవేత్ తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః || 21 ||
క. గీతా పఠన మహత్యము
నేతరి చదువకను గీత నెంత చదివినన్
ఖ్యాతిని గొలపదు. సరికద
యాతని శ్రమ వ్యర్ధమిలను. హరినుత భక్తా!
గీతని పఠించి పిదప మహత్యమును ఎవరు పఠించకుందురో అట్టి వారి గీతా పఠనము వ్యర్ధమే(నిష్ఫలమే). అట్టివారి గీతాపఠనము శ్రమ మాత్రమేనని చెప్ప బడినది.
శ్లో. ఏతన్మాహాత్మ్యసంయుక్తం గీతాభ్యాసం కరోతి యః |
స తత్ఫలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్ || 22 ||
క. గీతా మాహాత్మ్యముతో 
గీతను పఠియించువారు కీర్తితమగు వి
ఖ్యాతమగు ఫలములు గని పు
నీతంబగు పరమునొందు నిరుపమగతితోన్.
గీతా మహత్యముతో గీతా పారాయణము చేయువారు పైన చెప్పబడిన ఫలములను పొంది, దుర్లభమగు సద్గతిని పొందుతురు.
సూత ఉవాచ:
సూతుడు చెప్పెను.
శ్లో. మాహాత్మ్యమేతద్గీతాయా మయా ప్రోక్తం సనాతనమ్ |
గీతాంతే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్ || 23 ||
క. ఋషులారా! గీత చదివి
యసమాన సు గీత మహిమ నరసి చదివినన్
ప్రసరిత సత్ ఫలమహిమ
న్నసదృశ శుభతతియు కలుగునని సూతుఁడనెన్.
శౌనకాది ఋషులారా! ఈ ప్రకారనముగా సనాతనమైన గీతా మహత్యమును మీకు తెలుపుచున్నాను. దీనిని గీతా పారాయణానంతరము ఎవరు పఠింతురో అతడు పైన చెప్పిన ఫలమును పొందును.
ఓం ఇతి శ్రీవరాహపురాణే గీతామాహాత్మ్యం సంపూర్ణమ్.
ఇట్లు వరాహ పురాణమునందలి గీతా మహత్యము సమాప్తము. 
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.