గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, డిసెంబర్ 2014, గురువారం

సరళమైన తెలుగు పద్యములలో గీతా మాహాత్మ్యము.

జైశ్రీరామ్.
గీతా మాహాత్మ్యము

నారాయణునితో భూదేవి ఇట్లు పలికినది. 
క. ప్రారబ్ధ కర్మ బద్ధుల  -  కే రకముగ భక్తి యబ్బు నీశ్వర! యనుచున్
చేరి ధర హరిని యడుగగ  -  నారాయణుఁ డిట్లు చెప్పె నమ్మిక మీరన్. ౧.

ధరాదేవితో శ్రీమన్నారాయణుఁడు ఈ విధముగ పలుకుచుండెను.
క. ప్రారబ్ధ కర్మ బద్ధులు  -  తీరికగా గీత చదివి తృప్తిగ నాపై
భారము వేసిన, కర్మలు  -  వారల కంటవు. విముక్తి వారికి కలుగున్. ౨.

క. గీతా ధ్యానము చేయు పు  -  నీతుల కఘమంట బోదు. నీరముఁ గన నే
రీతినిఁ దామర కంటునె?  -  యాతీరుగ  నిదియు. నిజము నరయుము దేవీ! ౩.

క. గీతా గ్రంథ మదెచ్చట,  -  గీతా పారాయణెచట కీర్తి ప్రదమై
భూతలమందున నుండును  -  నా తలమున పుణ్య తీర్థ మమరిక నుండున్. ౪.

గీ. ఎచట గీతపారాయణంబెలమి జరుపు  -  నచట దేవతల్, ఋషి వరు లఖిల యోగు
లఖిల నాగులు గోపిక లఖిల గోప  -  కులును నారదోద్ధవులు కొలుపు మేలు. ౫.

గీ. గీత పఠన పాఠన ములు, గీత స్మరణ  -  మెచట శ్రవణమున్ జరుగునో యచట నేను
నిష్టతో నుండి కాతును నేర్పు మీర.  -  గమ్య మార్గము  చూపుదు. కనుమ! పృథ్వి! ౬.

ఆ. గీత నాశ్రయించి క్రీడింతు జగమున.  -  గీతయే గృహముగ  ప్రీతి నుందు.
గీత నాశ్రయించి ఖ్యాతి ముజ్జగముల  -  నేలు చుంటి నేను మేలుగాను. ౭.

గీ. గీతయే నా పరమ విద్య. ఖ్యాతిఁ గనిన.  -  గీత బ్రహ్మస్వరూపము. కీర్తి ప్రదము.
ప్రణవమందున నాల్గవ పాదమైన  -  అర్థ మాత్ర. నిత్య సుశాశ్వితానుపమము. ౮.

గీ. కృష్ణుఁ డర్జునునకుఁ జెప్పె గీత  కృపను   -  మూడు వేదాల సారము. మూడు లోక
ములకు నానందప్రదమిది. కలుగచేయు  -  తత్వ విజ్ఞానమును తనన్ దలచినంత. ౯.

గీ. ప్రీతి నష్టా దశాధ్యాయి ఖ్యాతి నెఱిగి,  -  పఠన చేయు నా నరుఁడు తా బ్రహ్మ పథము
నొందు. సందేహమే లేదు. మంద మతియు  -  దీని పఠియించి మోక్షంబు తాను పొందు. ౧౦.

గీ. శక్తి హీనులు గీతను భక్తి తోడ  -  సగము చదివిన చాలును సత్ ఫలమిడు.
గంగి గోదాన ఫలమిచ్చు. గాన  చదివి  -  సత్ ఫలంబును గాంతురు సహృదయులిల. ౧౧.

గీ. గీత మూడవ వంతైన ప్రీతి తోడ  -  చదువ స్వర్గంగ స్నాన ఫలదము. నిజము.
గీతనారవ భాగము ప్రీతిఁ జదువ  -  సోమ యాగ ఫలంబిచ్చు. శుభము లొసగు. ౧౨.

గీ. ఒక్క అధ్యాయమైనను నిక్కముగను  -  గీత ప్రతిదినంబు చదువఁ బ్రీతి తోడ
రుద్ర లోకము పొంది తా రుద్ర గణము  -  నందు నొకఁడగు. నివసించునం దనిశము. ౧౩.

గీ. నిత్య మధ్యాయ పాదము నేర్పు మీర  -  చదువ నుత్కృష్ట నర జన్మ చక్క నొదవు
నొక్క మన్వంతరము. కాన నొప్ప చదువు  -  భక్తి తోడను గీత సద్భక్తు లెల్ల. ౧౪.

ఆ. గీత పదియొ, యేడొ, భ్రాతి నైదో నాల్గొ,  -  మూడొ, రెండొ, యొకటొ, ముచ్చట పడి
యర్థ శ్లోకమయిన నర్ధితో చదివిన  -  యమర సుఖములబ్బు నరసి చూడ. ౧౫.

గీ. వారు చంద్రలోకమునందు వరలు నిజము  -  వేయి పదులవత్సరములు ప్రీతితోడ.
గీత చదువుచు మృతి చెంద ఖ్యాతి నతఁడు  -  ఉత్తమంబగు నరజన్మ నొనర పొందు. ౧౬.

గీ. అట్టి నర జన్మ పొందిన దిట్ట మరల  -  గీత పఠియించి పఠియించి ఖ్యాతిగాను
మోక్షమును పొందు, గీత పూజ్యాక్షరములు  -  పలుకుచుండి గతించిన వచ్చు ముక్తి. ౧౭.

క. పాపాత్ముఁడయిన గీతను  -  దీపించెడి యర్థమెఱిగి తీరగ వలవన్
ప్రాపించు విష్ణులోకము  -  ప్రాపించును సుఖములచట భక్తియునొడమున్. ౧౮.

క. గీతార్థ నిరత చింతన  -  ఖ్యాతిగ కల నరుడు కర్మ గతినున్నను వి
ఖ్యాతిగ కను పరమ పదము  -  నే తరి గన దేహ పతన మిది సత్యమిలన్. ౧౯.

క. జనకాదులుముక్తిని గని  -  రనితరమగు గీతనరసియమలిన మతులన్
జనియించిన నరులు పునర్జ  -  ననము గన రరయ గీత. సత్యంబిదియే. ౨౦.

క. గీతా పఠన మహత్యము  -  నేతరి చదువకను గీత నెంత చదివినన్
ఖ్యాతిని గొలపదు. సరికద  -  యాతని శ్రమ వ్యర్ధమిలను. హరినుత భక్తా! ౨౧.

క. గీతా మాహాత్మ్యముతో   -  గీతను పఠియించువారు కీర్తితమగు వి
ఖ్యాతమగు ఫలములు గని పు  -  నీతంబగు పరమునొందు నిరుపమగతితోన్. ౨౨.

సూతుడు చెప్పెను.
క. ఋషులారా! గీత చదివి  -  యసమాన సు గీత మహిమ నరసి చదివినన్
ప్రసరిత సత్ ఫలమహిమ  -  న్నసదృశ శుభతతియు కలుగునని సూతుఁడనెన్. ౨౩.

వరాహ పురాణమునందలి గీతా మహత్యము సమాప్తము. 
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.