గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఏప్రిల్ 2014, గురువారం

గుణాః గుణజ్ఞేషు గుణీ భవంతి,మేలిమి బంగారం మన సంస్కృతి 179.

జైశ్రీరామ్.
శ్లో. గుణాః గుణజ్ఞేషు గుణీ భవంతి, తే నిర్గుణం ప్రాప్య భవంతి దోషాః
సుస్వాదు తోయాః ప్రవహంతి నద్యః, సముద్రమాసాద్య భవత్యపేయాః.
క. గుణములు గుణవంతుని కడ
ఘనముగ భాసించు నవియె ఖలుఁ దరి నున్నన్
ఘన దోషములగును. జలము
లు నదిని తీయన. జలధిఁ గలుషితములునగున్
భావము. గుణవంతులతో కలిస్తే , గుణాలు సద్గుణాలుగానే ఉంటాయి. నిర్గుణులను చేరి తే అవే దోషాలౌతాయి. నదులలో తీయగా ఉండే నీళ్ళు , సముద్రాన్ని చేరి , త్రాగేందుకు పనికి రానివౌతున్నాయి కదా.
 జైహింద్
Print this post

5 comments:

పుష్యం చెప్పారు...

మంచి నీతి పద్యము. రెండవ పాదములో యతి??

కందుల వర ప్రసాద్ చెప్పారు...

శ్రీ చింతా రామ కృష్ణా రావు గురుదేవులకు పాదాభి వందనములతో ...

గురువుగారు మీ శిష్యరికమున నా వంటి పామరులకు పామరత్వము నశించు చున్నది.

మంచి విషయములు తెలియ జేయు చున్న మీకు ధన్యవాదములు .
శిష్య పరమాణువు

వరప్రసాదు .

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మనకున్న స్నేహితులను బట్టి మనలను అంచనా వేయ వచ్చును అంటారు అది ఖచ్చిత మైన నిజం . మంచి ఆణి ముత్యం

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

పుష్యం గారూ! యతి సరిపోయిందికదా?

శ్యామలీయం చెప్పారు...

చింతావారికి నమస్కారాలు. ఈ శ్లోకానికి నా శైలిలో అనువాదం చిత్తగించగలరు.

కం.గుణవంతుని కడ గుణములు
గుణములుగా మిగుల వెలుగు గుణహీనుండౌ
జనునంట జలధి గలసిన
వినుతనదీజలము లటుల విగుణంబులగున్

ఒక్క మనవి. ఇది, మీ పద్యానికి పోటీగా వ్రాయాలని వ్రాయలేదు. నేను కూడా ఒక ప్రయత్నం చేయాలనే ఆసక్తితోడనే చేసాను. గుణాః గుణజ్ఞేషు గుణీ భవంతి అన్నదానిని యథామక్షికానువాదం చేయవచ్చునా అని చూసాను. అదొక కారణమూ. నాకు వ్యక్తిగతంగా దేశిఛందస్సుల్లో వీలైనంతవరకు పదాలను పాదోల్లంఘనం వంటివి చేయకపోవటమే సొగసు అన్న అభిప్రాయం‌ ఉండటం‌ మరొక కారణమూ ఈ‌ పునః ప్రయత్నానికి. అంతకంటే మరేమీ లేదు.

ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.