గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, ఆగస్టు 2013, సోమవారం

పండిత నేమాని వారి శ్రీమదధ్యాత్మ రామాయణము గ్రంథస్థమగు చ్ఛందో వైవిధ్యము పరిశీలనము.

జైశ్రీరామ్.
ఆర్యులారా!పండిత నేమాని  రామ జోగి సన్యాసి రావు కవి కృత శ్రీమదధ్యాత్మ రామాయణము గ్రంథస్థమగు చ్ఛందో వైవిధ్యము పరిశీలనార్హమై ప్రయోగార్హమై యున్నవి. అందు వారు ప్రయోగించిన కొన్ని చ్ఛందములను మీ ముందుంచుచున్నంకు ఆనందముగానున్నది.ఇక పరిశీలింపుడు.
  1.అకారమయ (సర్వ లఘు)కందము - ౨౨౫ వ పుటలో
     నరవర! దశరథ నందన! - పరమ ఫలద! వనజ నయన! భవ భయ హరణా!
     ఖర హర! సమర భయంకర! - సరస వచన! కనక వసన! శశ ధర వదనా!
  2.అశ్వధాటి - ౧౯౮ వ పుటలో
     రామా! పవిత్రతమ నామా! విశిష్ట గుణ ధామా! మునీంద్ర హృదయా
     రామా! దినేశ కుల శోమా! సురారి గణ భీమా! వినీల జలద
     శ్యామా! దురాత్మక విరామా! త్రయీ భువన రామా! విదేహప సుతా
     కామా! నినుం దలతు నా మానసాబ్జమున ప్రేమాస్పదా! శుభ పదా!
  3.ఆటవెలది - 42 వ పుటలో
     రామ గీత యనగ రాజిల్లెడు పవిత్ర - తత్వ బోధ కలదు దాని మహిమ
     కేవలమ్ము శివునికే దెలియును దాన - సగము తెలియు శైల జాత కనఘ!
  4.ఇంద్రవంశ - ౩౧౭ వ పుటలో
     ఇందీవరశ్యామ! సర్వేశ్వరేశ్వరా! - బృందారక ప్రస్తుత విక్రమోజ్జ్వలా!
     మందస్మితాస్యాంబుజ! క్ష్మా సుతా ప్రియా! - వందారు మందార!భవ ప్రణాశకా!  
  5.ఇంద్రవజ్ర - ౮౮ వ పుటలో
     శ్రీరామ రామా! సరసీరుహాక్షా! - శ్రీరామ రామా! సుర సేవితాంఘ్రీ!
     శ్రీ రామ రామా! శ్రెత బృంద పోషా! - శ్రీ రామ రామా! నిను జేరి గొల్తున్.
  6.ఉపేంద్రవజ్ర - ౧౧౦  వ పుటలో
     నమోస్తు రామాయ! జన ప్రియాయ. - నమోస్తు సద్భక్త మనస్స్థితాయ.
     నమోస్తు తే రాక్షస నాశకాయ. - నమోస్తు తే శ్రీ రఘు నందనాయ.
  7.ఉత్పలమాల - ప్రశస్తము
  8.ఉత్సాహ - ౬౫ వ పుటలో
     వారిజాత లోచనుండు భద్ర మూర్తి ప్రీతుఁడై 
     భూరి కరుణ మెఱయ వినెను మొరలనెల్ల శీఘ్రమే.
     ధారుణిన్ నరత్వమొంది దశ ముఖున్ వధించుచున్
     భార మెల్ల దీర్చునంచు వసుధ పొంగె నెంతయున్.
9.కవిరాజవిరాజితము - ౭౨ వ పుటలో
     పరమ దయాపర! పావన భావన!భవ్య గుణాకర భక్త హితా!
     సరసిజ సంభవ చక్ర ముఖామర సంస్తుత శీల ప్రసన్న ముఖా!
     వర హృదయమ్మున ప్రస్తుతి సేయుదు భాను వరాన్వయ వర్ధక! నా
     భరమును మాన్పగ వచ్చిన నీకిదె వందన మాశ్రిత పాల విభూ!
10.చతుర్విధకందము - ౨౩౧ - వ పుటలో
     సుర రాజ వినుత నిర్మల - చరితా పరమాంతరంగ! సజ్జన వరదా!
     నరవర! విశేష పావన! - చరణా కరుణా నిధాన! సత్ పథ నిరతా! 
11.చతుర్ముఖవిరాజితగీతము - ౫౪౧  వ పుటలో
     రామ! శుభ నామ! శ్రీరామ! రామ! రామ! - రాజకుల సోమ! శ్రీ రామ! రామ! రామ!
     రాక్షస విరామ! శ్రీ రామ! రామ! రామ! - రామ! జయ ధామ! శ్రీ రామ! రామ! రామ!
12.చక్ర బంధ ఉత్పలమాల. 526 వ పుటలో.
     రా మనుజాధిపాభరణ. రా మదనాంతక ముఖ్య సన్నుతా.
     రా. మహనీయ భద్ర గుణ. రా మధుర ప్రియ వాగ్విభూషణా.
     రా మకరాంక కోటి సమ రాజిత సుందర దివ్య విగ్రహా.
     రా మహిత ప్రభా విభవ. రా మము బ్రోవగ రామ ప్రేమతో.
13.తరలము - ౭౭ వపుటలో
     అను దినమ్ము స్వధర్మ కార్యము లాచరించుచు రాఘవుం
     డనుపమాన యశమ్ము గాంచగ నట్లె యాతని తమ్ములున్,
     వినుతికెక్కిరి సద్గుణాఢ్యులు, వీర్య ధైర్య సమున్నతుల్
     ఘనులు క్షత్ర కులాగ్రగణ్యులుగా ధరన్వెలుగొందుచున్.ప్రశస్తము
14.తోటకము - ౩౫  వ పుటలో
     అవనీ తనయా హృదయస్తునకున్ - దివిజస్తుత కీర్తికి ధీనిధికిన్
     పవమానసుతార్చిత పాదునకున్ - రవి తేజునకున్ రఘు రామునకున్.
15.దండకము - ౭౩  వ పుటలో ప్రశస్తము.
16.ద్రుతవిలంబితము - ౧౧౨వ పుటలో.
      జయము రాఘవ! సద్గుణ వైభవా! - జయము విశ్రుత సత్య పరాక్రమా!
     జయము రాక్షస సంఘ వినాశకా! - జయము సద్ఘన సాధు జనావనా!
17.పంచచామరము - ౬౨  వ పుటలో
     సహస్ర శీర్ష శోభితాయ సత్య మూర్తయే నమః.
     సహస్ర దివ్య లోచనాయ జ్ఞాన మూర్తయే నమః.
     సహస్ర పాద పంకజాయ సౌఖ్యదాయతే నమః
     సహస్ర దివ్య నామ రూప సందృతాయ తే నమః.
18.పాదపము - ౩౨౭  వ పుటలో
     అంబుజ మిత్ర వరాన్వయ సోమా! - సాంబ శివ స్తుత సద్గుణ ధామా!
     అంబురుహాక్ష! దశాస్య విరామా! - తుంబురు సంస్తుత! తోషద! రామా!
19.పృథ్వి - ౬౧ వ పుటలో
     సరోరుహ వరాసనా! నిగమ శాస్త్ర సద్వందితా! 
     సుర ప్రముఖ సంస్తుతా! వరద! చూడుమా ననున్ గృపన్.
     మొరన్ వినుమ దుర్భరం బగుట మూర్ఖ దుష్కృత్యముల్
     బిరాన నను బ్రోవవే యనుచు పృథ్వి ప్రార్థింపగా!
20.భుజంగప్రయాతము - ౩౭౮  వ పుటలో
     నమస్తే సదా లోకనాథార్చితాయ. - నమస్తే గిరీశాయ నాద ప్రియాయ.
     నమస్తే భవానీ మనస్సంస్థితాయ - నమశ్శంభవే విశ్వ నాథాయ తుభ్యమ్.
21.మంగళమహాశ్రీ - ౫౪౦ వ పుటలో
     మంగళము రామ! జయ మంగళము శ్యామ! శుభ మంగళము భద్ర గుణ ధామ!
     మంగళము తాప హర! మంగళము చాప ధర! మంగళము ధర్మ మయ రూపా!
     మంగళము త్రాత! హరి! మంగళము జేత! నృప! మంగళము భవ్య వర దాతా!
     మంగళము వీర వర! మంగళము ధీర గుణ! మంగళము మంగళ మహా శ్రీ!
22.మందాక్రాంత - ౨౪౧  వ పుటలో
     సీతా!సీతా! యని యరచుచున్ శ్రీవరుండేడ్చు చుండన్.
     మాతా! మాతా! యని వెదకుచున్ లక్ష్మణుండేగుదెంచెన్.
     చేతోబ్జంబుల్ మిగుల నలగన్ చింతతోవంత తోడన్
     భీతిన్ జెందెన్ వన చరము నావేళ నక్కాన లోనన్.
23.మణిరంగము - ౪౨౦ వ పుటలో
     వాన రేశ్వర! వందిత కీర్తీ! - మానవాధిప! మంగళ మూర్తీ!
     దీన రక్షక దివ్య చరిత్రా! - భాను వంశజ! వారిజ నేత్రా!
24.మత్తకోకిల - ౯౧ వ పుటలో
     దేవదేవుఁడు వచ్చు శీఘ్రమె దివ్య తేజము తోడ భూ 
     దేవి చాల సుఖించు పూర్తిగ దీరిపోవును కష్టముల్.
     దేవతల్ తమ పూర్వ వైభవ దీప్తి గాంచెదరంచుస
     ద్భావమొప్పగ మత్త కోకిల పాడె నామని రాకతో.
25.మత్తేభము - ప్రశస్తము
26.మధ్యాక్కర - ౨౦౫ వ పుటలో
     చని రాజ మందిరమ్మునకు జన నాథు సన్నిధి చేరి
     వినయమ్ము మీర మ్రొక్కులిడి విజయ శబ్దము చేసినంత
     మనుజేశ్వరుండడిగెనుసుమమ్త్రును యాత్రము తోడ
     జనుదెంచితే మంత్రివర్య. సవివరముగ తెల్పుమయ్య.
27.మధురగతిరగడ - ౨౮౨  వ పుటలో
     రావా రావా రాక్షస హంతా
     వే వే రావా విశ్వ నియంతా.
     కావన్ రావా క్షత్ర వరేణ్యా.
     బ్రోవన్ రావా లోక శరణ్యా.
28.మహా స్రగ్ధర - ౩౭౭ వ పుటలో 
     జయహే వీరాధి వీరా.సకల శుభకరా సకల శత్రు సంహార ధీరా.
     జయహే వాతాత్మ జాతా. జలజ హిత హితా శాంతి సౌఖ్య ప్రదాతా.
     జయహే దివ్య స్వరూపా. సరస గుణ యుతా. జ్ఞాన యోగ ప్రదీపా.
     జయహే భక్తాగ్రగణ్యా. జగదఖిల నుతా. సంజయా. ఆంజనేయా.
29.మానిని - ౯౨  వ పుటలో
     ఎన్నడు వచ్చెద వీవు? పరాత్పర! యెన్నడు దుష్కృతులీల్గెదరో?
     యెన్నడు నాభర మెల్లను ద్రుంచెదొ?యెన్నడు చాల సుఖింతునొ? యం
     చెన్నియొరీతులనెంతొతపించుచు,నిప్పుడె నిన్ గని యేనెదలో
     జెన్నుగ నొందితి చిత్సుఖమున్. నతి చేయుదు నీకిదె చిద్విభవా.
30.మాలిని - ౪౩౪ వ పుటలో
     శరణు శరను రామా. సర్వ లోకాభిరామ.
     శరను శరణు శ్యామా. సాధు సంస్తుత్య నామా.
     శరణు సుగుణ ధామా. క్శత్ర వంశాబ్ధి సోమా.
     శరణు రిపు విరామా. శాంతిదా సార్వభౌమా.
31.ముక్తపదగ్రస్తకందము - ౩౫౯ వ పుటలో
     అవివేక మహాంధ రవీ.
     రవి వంశాంబోధి రాజ. రాజ కళాచూ
     డ వినుతసద్గుణ వైభవ.
     భవ చక్ర విరామ రామభద్ర నరేమ్ద్రా.
32.ముత్యాలసరాలు - ౧౨౪. వ పుటలో
     జయము జనక మహీశ తనయా.
     జయము కోసల రాకుమారా.
     జయము శోభిత హృదయులారా.
     జయము మంగళము.
33.మేఘ విస్పూర్జితము - ౬౦౬ వ పుటలో 
    ఘన శ్యామా. రామా. కమల నయనా. క్షత్రియాంభోద్శి సోమా.
    మునివ్రాత త్రాతా. పురహర హితా. మోక్ష యోగ ప్రదాతా.
    అనంతా. శ్రీమంతా. యమల చరణా. యాది దేవా. ప్రశాంతా.
    జన స్తుత్యా. నిత్యా. సరస వచనా. సత్య ధర్మ స్వరూపా.
34.రథోద్ధతము - ౧౧౫  వ పుటలో
    వారి జాత హిత వంశ వర్ధనా.
    వారిజాక్ష. శ్రిత పారి జాతమా.
    వారిజాత భవ వందితా. నమ్
    స్కారమో వరద. సద్గుణాకరా.
35.రాగిణి - ౫౬ వ పుటలో
    సరసిజేక్షణా. రామ. జ్ఞాన సాగరా.
    పరమ పురుషా. రామ. భక్త పాలకా.
    సరస వాఙ్మయా. రామ. జానకీ ప్రియా.
    సురవర సుతా. రామ. సుప్రభాతమౌ.
36.లయగ్రాహి - ౪౭౨ వ పుటలో
    కొందరను ద్రొక్కుచును, కొందరను మ్రింగుచును, కొందరనుబట్టి కపిబృందముల యందున్.
    కొందరను గూర్చుచును, కొందరను జీల్చుచును, కొందరను మొత్తునెడ దుందుడుకు మీరన్.
    కొందలమునొంది కపులందరును బర్వులిడ, నందరను దాటుచునుముందునకు నెంతే
    తొందరగ నాహవమునందునసురుండు చనె,నందరకు డెందములయందుభయదుండై.
37.వంశస్థ - ౩౬౫ వ పుటలో
    ధరా సుతా హృద్సుఖదా.శుభప్రదా.
    సురారి లోకాంతక శూర శేఖరా.
    నరాధిపా. వానర నాథ సేవితా.
    పురాంతకాప్తా. సిత పుష్కరేక్షణా.
38.వనమయూరము - ౫౪ వ పుటలో
    రామునకు మద్ధృదయ రాజిత పవిత్రా
    రామునకు భద్ర గుణ రత్నమయ తేజో
    ధామునకు ధర్మ ప్ర తంత్రునకు నబ్ద
    శ్యామునకు చిత్సుఖ మహాంబుధికి వేడ్కన్.
39.వసంతతిలకమదనరేఖ ఉభయగతి - ౫౫౭ వ పుటలో
    శ్రీ రామ చంద్ర. క్షితిజా ప్రియ. చిద్విలాసా.
    కారుణ్య సాంద్ర సుగుణాకర. కంజ నేత్రా.
    నీ రూపమే యలరుతన్ హృది నీల గాత్రా.
    శౌరీ విదేహప సుతేశ్వర. సచ్చరిత్రా.
40.వసంతతిలకము - ౧౯౨ వ పుటలో
    రాజీవ మిత్రకుల భాసుర రత్న దీపా.
    రాజీవ పత్ర నయనా. సుర రాజ వంద్యా.
    రాజద్యశోధన. సుశోభిత లక్షణాఢ్యా.
    పూజింతు నీదు పద పుష్కరముల్ మహాత్మా.
41.విద్యున్మాల - ౨౮౪ వ పుటలో
    శ్రీమన్మూర్తీ.శిష్ట త్రాతా.
    రామా. రాజద్రాజీవాక్షా.
    ప్రేమానందా. విశ్వ స్తుత్యా.
    శ్యామా. సీతా స్వాంతాబ్జార్కా.
42.శార్దూలము - ప్రశస్తము.
43.శాలిని - ౨౦౮ వ పుటలో
    రామా. రామా. రార. రారా కుమారా.
    రామా. రామా. వేగ రారా సుపుత్రా.
    రామా. రామా. చూడరా రామ భద్రా.
    రామా రామా. రార. రారా సుధీరా.
44.శిఖరిణి - ౪౪౧ - వ పుటలో
    నమస్తే సోమాయా. త్రిభువన శరణ్యాయచ నమో
    నమస్తే రుద్రాయత్రిదశనుతవిఝ్ఞాన నిధయే.
    నమస్తే శర్వాయప్రమథగణ వంద్యాయచనమో.
    నమస్తేతామ్రాయశ్రిత భవభయఘ్నాయచనమః.
45.శ్రీచక్రభూషణ గీతము - ౪౫౯ వ పుటలో 
    జగదధీశ్వర! శ్రీ రామ! సర్వ రక్ష!
    కమల లోచన! శ్రీశ! రక్షః ప్రణాశ!
    వరద! కాకుత్స్థ! శ్రీ ద!కృపా నిధాన.
    జనకజా వర! క్షత్రేశ! జ్ఞాన తేజ!
46.సరసాంకము - ౫౭౨ వ పుటలో
    పరమాంతరంగ నిలయా. పరమార్ధ తేజా.
    పరితోష రూప విభవా. పరిపూర్ణ. రామా.
    పరమేశ వర్ణిత కథా. ప్రకర ప్రశస్తా.
    సరసీరుహాప్త. వర వంశ శశాంక రామా.
47.సర్వ లఘు సీసము - ౫౫ వ పుటలో
    జలజ హిత కుల కలశ జలధి హిమ కిరణునకు, - దశరథుని తనయునకు, వశికి, హరికి,
    జనక సుత హృదయమున దనరు ప్రియ వదనునకు - జన హృదయ నిలయునకు, సహృదయునకు,
    దివిజ గణ వినుతునకు, దితిజ గణ శమనునకు - జగదవన నిరతునకు, జన హితునకు,
    భవ భత్యములను దొలచి, పరమ సుఖములనొసగు - పరమ పురుషునకు, పురహర సఖునకు,
గీ: వనజ దళ నయనునకు, శుభ చరితునకు - సవన ఫలదునకు, నిగమచయ నుతునకు,
    దశ వదన ముఖ సుర రిపు తపనజునకు, - కలిత భుజునకు, విభునకు కపి హితునకు, 
48.సర్వ విభక్తిమయ సీసము - ౨౨౧ వ పుటలో  
    జ్యేష్ఠుండు, రఘు కుల శ్రేష్ఠుండు రాముండు, - రాజాధిరాజ విరాజితుండు.
    రామునే తలచెద రామునే కొలిచెద, - రామునే మ్రొక్కెద స్వామి యనుచు,
    రాముని చేతనే రాజిల్లు నిరతమ్ము - ఘనముగా మా వంశ గౌరవమ్ము.
    రాముని కొఱకు నే ప్రార్థించి సాదర - వందనంబు లొనర్చుచుందు నెపుడు.
గీ: రాముగంటెను వేరొక్క ప్రభువు లేడు.
    రామునకు చేయు సేవమాత్రమ్మె చాలు.
    నందులో నేను ధన్యత్వమొందువాడ.
    నో భరద్వాజ. సురభూజ. యోగిరాజ.
49.సీసము - ప్రశస్తము.
50.సీస గర్భ ఆటవెలది. ౫౮౮ వ పుటలో.
    అఖిలలోకమునకునాధారభూతమై
    వెలుపలయును లోన నలరుచుండు.
    సకల నిగమ శీర్ష సార. ధామ విహార.
    పరమ పురుష రామ భవ విరామ.
51.(సుదీర్ఘ) సీస మాలిక ౫౭౩ వ పుటలో.
52.సుగంధి - ౧౨౦వ పుటలో
    ఆ మహా ధనుస్సు చూడుమా మునీంద్రా. దానినిన్
    రామచంద్రుఁడెక్కుపెట్టి లాగి నారి గూర్చుచో
    నా మహాత్ము బ్రస్తుతించి యాత్మ జాత నిచ్చి నే
    ప్రేమ మీర జేయువాడ పెండ్లి వారికొప్పుగా.
53.సురనర్తకి - ౫౩౬ వ పుటలో
    సారసాక్ష రవి వంశ వారి నిధి చంద్రమా.నృవర చంద్రమా.
    వారిజాత భవ వాసవాది సుర వందితా నిగమ నందితా.
    వైరి వీర మద భంజనా. సుజన పాల మౌని రంజనా.
    శ్రీ రమా రమణ సత్కృపాభరణ. శిష్ట రక్షణ. సనాతనా.
54.సురసుగంధి - ౨౫౬  వ పుటలో
    అతి పవిత్ర గౌతమీ తటాంచలంబునందునన్
    చిత సమున్నత స్థలాన శీష్ట వాసయోగ్య ప
    ద్ధతి చెలంగ గట్టె నొక్క తాళ పర్ణ శాల సు
   వ్రతుడు లక్ష్మణుండు భవ్య లక్షణాన్వితమ్ముగా.
55.స్రగ్ధర - ౪౩౫ వ పుటలో
    రామా. రాజాధి రాజా. రసమయ హృదయా. రమ్య రాజీవ నేత్రా.
    భూమానంద స్వరూపా. భువన హితకరా. భూమిజాప్రాణ నాథా.
    స్వామీ మీ పాదపద్మాశ్రయుడనుకృపతో సాకుమా దేవ దేవా.
   వ్యామోహ చ్ఛేద రక్షా. భ్రమల దొలచుచున్ భద్రమున్ గూర్చుమయ్యా.
56.స్రగ్విణి - ౩౦౦ వ పుటలో
    దేవ దేవా. సదా దీన సంరక్షకా.
    నీవె దిక్కంచు నే నీ కృపన్ గోరుదున్.
    పావనంబయ్యెమా ప్రాంగణంబో ప్రభూ.
    రావయారావయా రామ చంద్ర ప్రభూ.
57.స్వాగతము - ౧౧౮  వ పుటలో
    మౌని వర్య.జన మాన్య చరిత్రా.
    జ్ఞాన సార నిధి స్వాగతమయ్యా.
    మాననీయ గుణ. మంగళ దాతా.
    పూని నీ పదము మ్రొక్కెద స్వామీ. 
    స్వస్తి.
జైహింద్.
Print this post

6 comments:

varaprasad చెప్పారు...

That is sree panditha nemani sir special

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

పూజ్యులు పండిత నేమానివారి శ్రీమదధ్యాత్మరామాయణ మందలి యాణిముత్యముల నేర్చి కూర్చిన సుకవి మిత్రులు శ్రీ చింతా రామకృష్ణారావుగారికి శుభాభినందనలు. రామనామామృత పానముచే నుత్తేజితులై విరచించిన యీ కావ్య మందంతటను శ్రీ నేమానివారి భక్తిపారవశ్యమే కానవచ్చుచున్నది. వారి పద్యరచనా కౌశల్యము భగవద్దత్తమే గాని వేఱొండు కాదు. ఇంత చక్కని గ్రంథము నందించిన గురువుగారికి మనమేమివ్వఁగలము, పాదాభివందనము తప్ప? ఇంతటి యవకాశము దక్కిన తమరు ధన్యులు! సాహితీవందనములతో.......

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

పూజ్యులు పండిత నేమానివారి శ్రీమదధ్యాత్మరామాయణ మందలి యాణిముత్యముల నేర్చి కూర్చిన సుకవి మిత్రులు శ్రీ చింతా రామకృష్ణారావుగారికి శుభాభినందనలు!గురువుగారి భక్త్యమృతసారమును గ్రోలఁ గల్గినందుల కెంతయు సంతోషముగ నున్నది. ధన్యోస్మి.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవధాన సరస్వతు లైన శ్రీ పండితుల వారి గ్రంధము వారి చేతుల మీదుగా నేను పొంద గలగడం నా జన్మ సుకృతం ..శ్రీ చింతా వారికి కృతజ్ఞతలు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

భగవద్భక్తి భాగ్య శాలి శ్రీ గుండు మధుసూదన్ సాహితీ మిత్రులకు శ్రీమద్భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
నిరుపమ రామ భక్తి, వరణీయ గుణ గ్రహణాది సత్పథా
వరణ పునీత జన్ములును, భవ్యమనస్కులు మీరు. మీదు స
చ్చరితము వ్యక్తమయ్యె తమ చక్కని మాటల తేనె సోనలన్.
నిరుపమ వాక్ప్రభావ మహనీయ. నమస్కృతి. ధన్యవాదముల్.
మీ
రామ కృష్ణా రావు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

తేజోమయ. సద్గుణ స
ద్భాజిష్ణ.వదాన్య. సుజన వందిత యగు మా
రాజేశ్వరి సోదరికిన్
నేఁ జేతును వందనములు నిరుపమ భక్తిన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.