గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, ఆగస్టు 2013, శుక్రవారం

శ్రీ మద్దూరి వారి అవధానం అద్భుతం.

జైశ్రీరామ్.
ఆర్యులారా! ఈ మాసమున ఆరవ తేదీన రవీంద్ర భారతిలో శ్రీ మద్దూరి రామ మూర్తి అవధానిగారి అవధానం చాలా సమర్ధవంతంగా నిర్వహింపబడింది.
డా.రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు ఈ కార్యక్రమమును ప్రారంభించారు.
ఆచార్య కశిరెడ్డి వేంకట రెడ్డి గారు ఈ కార్యక్రమమునకు సంచాలకత్వం వహించారు.
ప్రారంభోపన్యసము, పరిచయాదులు పూర్తయేసరికి సరిగ్గా 7-04 నిమిషములయింది. అప్పుడు అవధానిగారు అవధానాన్ని ప్రారంభించారు. పృచ్ఛకులలో శ్రీ దొరవేటి గారు నిషిద్ధాక్షరి నిర్వహించగా నేను వ్యస్తాక్షరి నిర్వహించాను.
ముందైతే నేను న్యస్తాక్షరి నిర్వహించాలని తెలియ జేసినప్పటికీ, కార్యక్రమం ప్రారంభానికి కొద్దిగా ముందు న్యస్తాక్షరి కాదు వ్యస్తాక్షరి నిర్వహించమని నిర్వాహకులు చెప్పడంతో నేను అవకాశం నాదగ్గరి కొచ్చేసరికి ఇలా చెప్పాను.
వందనముల్ మహా సభకు. వందనమోయవధాన భాస్కరా!
సుందరమైన భావములు శోభిల పద్య సుమాల సౌరభం
బందరి మన్ననల్ గొనగ వర్ధిల చెప్పి వధాన ప్రక్రియన్
బంధము వ్యస్త వర్ణములు పాదముగా యొనరించి చెప్పరే!
అని అభ్యర్థించి,. పదునారక్షరముల నిడివి గల సంస్కృత శ్లోక పాదమును అస్త "వ్యస్తంగా’ వారికి అప్పుడప్పుడు వినిపించేవాడిని. 
ఈ లోగా సమయం కుదిరినప్పుడెల్లా శ్రీ కామేశ్వర రావు గారు అప్రస్తుత ప్రసంగం చేస్తూ అవధానిగారి ఏకాగ్రతకు భంగం కలిగించేవారు.
ఐనప్పటికీ అవధానిగారు సంయమనంతో, సమర్థతతో ఎనిమిది మంది పృచ్ఛకులకూ తగిన విధంగా అడిగిన వాటికన్నిటికీ సమాధానాలు చెప్పారు.
ధారణ కూడా సమర్థవంతంగా చేసారు.
ఇంతకీ నేనిచ్చిన శ్లోక పాదమేదా అని మీకు తెలుసుకోవాలనుందికదా? చూడండి.
యోగవాశిష్ఠములోని శ్లోకము.
మోక్ష ద్వారే ద్వార పాలాః  -  చత్వారః పరికీర్తితః.
ఈ పాదం ఒక్కటే ఇచ్చాను.
దీని రెండవ పాదం
శమో విచారః సంతోషః  -  చతుర్తః సాధు సంగమః.
వ్యస్తాక్షరి ఇచ్చిన అంశమును చూచి, అవధానిగారు ప్రశంసించారు.
నేను వారికి
అష్ట దిక్పతులే పృచ్ఛకావళి యగుచు  -  అడుగు ప్రశ్నలకన్నింటి కద్భుతముగ
జ్ఞాన శోభిత సత్ సమాధానములను  -  పలికి మాకీర్తి దశదిశల్ నిలిపితీవు.
అవధానాద్భుత సత్కళాశ్రిత సమాహారంబె నీవైతివో?
సు వధానంబు నమోఘరీతిని సభన్ శోభిల్లగా జేసి,యీ
ప్రవిభాసాంధ్ర రవీంద్ర భారతి మహత్ ప్రాచూర్యమున్ నిల్పి, సత్
సువిధేయుండుగ కీర్తిపొందిన కవీ! శోభిల్లుమెల్లప్పుడున్.
అని నా ధన్యవాదాలను తెలియజేసాను.
ఏడు గంటల నాలుగు నిమిషాలకు ప్రారంభించిన అవధానం ఎనిమిది గంటలకల్లా పూర్తి చేయగలిగిన సమర్ధులగు అవధాని గారికి అభినందనలు.
శ్రీ సాధన నరసింహాచార్య,
శ్రీ మావుడూరు సూర్యనారాయణ మూర్తి,
శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ,
శ్రీ వి.వి. సత్య ప్రసాద్,
శ్రీ ఎం.వీ.ఆర్ శర్మ           ల సంయోజకత్వంలో  కార్యక్రమాలు అత్యద్భుతంగా జరుగుచున్నందుకు వారిని మనసారా అభినందిస్తున్నాను.
ఈ కార్యక్రమంలో పృచ్ఛకునిగా నన్ను ఆహ్వానించి సముచిత సత్కారము చేసిన నిర్వాహకులకందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకొనుచున్నాను.
నిజానికి నేను అడగ దలచుకొన్నదానిలో ఒకటి
ఆంధ్ర భాషా ప్రాశస్త్యమును ఉత్పల మాలలో వర్ణించండి.
1వ పాదంలో 10వ అక్షరం ద్వ్య; 14వ అక్షరం ర్థ,    
2వ పాదంలో 4వ అక్షరం ణీ;20వ అక్షరం శో,          
3వ పాదంలో 2 అక్షరం గ్ర; 11వ అక్షరం ల్హి,             

4వ పాదంలో 5 అక్షరం ణ్య; 11వ అక్షరం త్కృ,
దీనికి నా పూరణ.
అగ్ర సుపూజ్య మాంధ్రమిది. ద్వ్యర్థము, త్ర్యర్థము లొప్ప కావ్యముల్
సు గ్రహణీయ మాంధ్రమున. సువ్రత సత్ ఫల భాగ్య మిద్ది. శో
భా గ్రథితంపు తేజస ప్రవల్హిక రాజిని వెల్గుచుండి, భా
షాగ్ర సుగణ్యమై జగతి సత్కృతులందుట తెల్లమే కదా!
రెండవది
గురువులో ఉండ వలసిన సల్లక్షణాలు సర్వ లఘు కందలో , రెండు నాలుగు పాదాల చివర పొల్లు అక్షరములు వచ్చే విధంగా వివరింప మనవి
1వ పాదంలో 10వ అక్షరం గు.;  -  2వ పాదంలో 6వ అక్షరం రు;14వ అక్షరం వ 15వ అక్షరం ర
3వ పాదంలో 6 అక్షరం ప్ర;  -  4వ పాదంలో 2 అక్షరం ణ; 10వ అక్షరం తు 11వ అక్షరం లు








గు







రు

















ప్ర














తు
లు








దీనికి నా పూరణ.
గణుతికి, భవితకును గురులె  -  మణులగుదురు ప్రథములు ప్రథమ వరదు లగుచున్
కనుక వర ప్రభను కలిగెడి,  -  గుణ గణులగు వర హితులురు గురువులనదగున్.
    మీరూ పూరణలు చేసి పంపినచో పాఠకులకానందప్రదులగుదురని భావిస్తున్నాను.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవధానపు సౌరులను కనులకు గట్టినట్లు వివరించిన శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.