గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, జులై 2012, గురువారం

హనుమంతుని గుండెలలో నెలకొన్న సీతారాములకు ప్రతీకగా కంద గీత గర్భ ఉత్పలమాల పద్యము.

జైశ్రీరామ్.
శ్రీ రామ భక్త హనుమాన్.
(హనుమంతునుద్దేశించి)
కంద గీత గర్భ ఉత్పల మాల:-
అంజన భాగ్యమై జన నిరంజన వర్ధన సల్పు వేల్ప! 
న్మంజులవాక్ సుధా మధుర మాన్య వదాన్య సమస్త సాక్షివై
రంజన రాడ్విభూసతి కిరణ్మణి సీత లసద్విరామ మా
తం జనవే కనన్? సుగుణ ధామ కృపన్ మముఁ జూడఁ గొల్తు నిన్!

(శ్రీరామునుద్దేశించి)
ఉత్పలమాల గర్భస్థ కందము:-
జన భాగ్యమై, జనని రం
జన వర్ధన సల్పు వేల్ప! సన్మంజుల వాక్ 
జన రాడ్విభూసతి కిర
ణ్మణి సీత లసద్విరామ మాతన్ జనవే !

(సీతామాతనుద్దేశించి) 
ఉత్పలమాల గర్భస్థ తేటగీతి:-
జనని రంజన వర్ధన సల్పు వేల్ప!
మధుర మాన్య వదాన్య సమస్త సాక్షి
సతి కిరణ్మణి సీత లసద్విరామ !
సుగుణ ధామ కృపం మముఁ జూడఁ గొల్తు.
జైహింద్.
Print this post

4 comments:

మనోహర్ చెనికల చెప్పారు...

చాలా బాగుంది.

Pandita Nemani చెప్పారు...

శ్రీరామున్ జనకాత్మజాతను మనఃక్షేత్రమ్మునన్ భక్తి పూ
ర్ణారామంబున నిల్పి సంతతము తన్నామమ్ము కీర్తించు నో
సారోదార గుణాకరా! హనుమ! రక్షా దక్ష! నిన్ గొల్తు దే
వా! రామాయణ మాలికా మణివరా! భద్రమ్ములన్ గూర్చుమా

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

హనుమ మది నిండిన సీతా రాములకు భక్తితో సమర్పించిన మకరందపు మాలలు సౌదామినులై వెలయు చున్నవి .

Pandita Nemani చెప్పారు...

శ్రీరామున్ జనకాత్మజాతను మనః క్షేత్రమ్మునన్ భక్తి పూ
ర్ణారామంబున నిల్పి సంతతము తన్నామమ్ము కీర్తించుచో
సారోదార గుణాకరా! మది నమస్కారంభులన్ గూర్తు దే
వా! రామాయణ మాలిక మణివరా! భద్రమ్ములన్ గూర్చుమా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.