గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, జులై 2012, బుధవారం

మహనీయులకు ఘన నివాళులు.

భారత దేశ జాతీయ పతాక నిర్మాత శ్రీ పింగళి వెంకయ్య.
ప్రియ భారతీయ సహోదరసహోదరీమణులారా! ఏ దేశానికైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా గౌరవింపఁ బడేది ఆదేశ జాతీయ పతాకము. ఆ పతాక నిర్మాత ఎవరో అతఁడు అత్యంత గౌరవ పాత్రుఁడు.
మన భారత దేశానికి చూడగానే కళ్ళల్లో మెఱిసే అతి మనోహరమైన త్రివర్ణ పతాకాన్ని నిర్మించిన మహానుభావుఁడు శ్రీ పింగళి వెంకయ్య. ఆ మహోదయుఁడు తన జీవిత కాలమంతా దేశ భక్తితోనే దేశం కోసమే జీవించాఁడు. ఐతే అటువంటి వ్యక్తి తేదీ. 02 - 8 - 1878 ని జన్మించగా   దివంగతుఁడైన రోజు తేదీ. 04 - 7 - 1963  అనగా ఈ రోజే తేదీ.04-7-2012. వారి వర్ధంతి.
" నా అంత్య దశ సమీపించింది. నేను చనిపోయిన తర్వాత త్రివర్ణ పతాకాన్ని నాభౌతిక కాయంపై కప్పండి. శ్మశానానికి చేరిన తర్వాత ఆ పతాకం తీసి అక్కడ ఉన్న రావి చెట్టుకు కట్టండి. ఇది నా తుది కోరిక "
అని తన చరమ కాంక్షను తెలుపుకొన్నాఁడు మన వేంకయ్య.జాతీయ పతాకం నిర్మించి, తెలుగు జాతికే వన్నె తెచ్చిన మన వెంకయ్యగారి వర్ధంతి నాడైనా మన దేశం కాని, కనీసం మన తెలుగు జాతి కాని స్మరించుకోకపోవడం దురదృష్టకరం అనక తప్పదు. అతఁడు తెలుగువాఁడైన కారణంగానే దేశ స్థాయిలో పొంద దగినంత గౌరవం పొందలేకపోయి ఉండవచ్చుననుకుందామన్నా కనీసం మన  ప్రభుత్వం ఈ అంశాన్ని స్పృశించకపోవడం శోచనీయం కాదంటారా?
మహానుభావుఁడు వెంకయ్య  తన జీవిత చరమాంకంలో అత్యంత దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించాడంటే అది మనకిప్పుడు నమ్మలేని నగ్న సత్యం. 
జీవితాంతం దేశం కొకు స్వాతంత్ర్యం కొఱకు పోరాడిన వెంకయ్య చివరి రోజుల్లో తిండికి కూడా మొహం వాచి నానా అగచాట్లు పడినట్లు ' త్రివేణి ' సంపాదకులు డా. భావరాజు నరసింహారావుగారు పేర్కొన్నారు. అంతిమదశలో విజయవాడలో డా. కె.ఎల్.రావు, డా.టి.విఎస్.చలపతిరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు మున్నగు పెద్దలు 15-1-1963 న వెంకయ్య గారిని సత్కరించి వారికి కొంత నిధిని అందించారు. ఆ సత్కారం తరువాత ఆరు నెలలకే వెంకయ్య దివంగతుడయ్యాడు. బ్రతికి ఉండగా ఎలా జీవించారో మనకు ప్రస్తుతం ప్రత్యక్షంగా తెలియకపోయినప్పటికీ, ఇప్పుడు సమాజం అతనిపట్ల చూపుతున్న నిర్లిప్తత అత్యంత బాధాకరంగా ఉంది. దేశభక్తులకు ఇదేనా మనసమాజం అందించే నివాళి? 
ఆ మహనీయునికి ఆంధ్రామృతం ఘనంగా నివాళులందిస్తోంది.
మరుగునపడిన మాణిక్య సన్నిభుఁడితడొకడే కాదు.
ఈ రోజు మన్యవీరుఁడు శ్రీ అల్లూరి సీతారామ రాజు యొక్క జయంతి.

మన్య వీరుఁడు అల్లూరి సీతారామరాజు.
ఇతడూ మన తెలుగు వీరుఁడే. భారత దేశ స్వాతంత్ర్య సమరంలో ఆంగ్ల ప్రభుత్వాన్ని గడగడ లాడించిన మన్య వీరుఁడు మన అల్లూరి సీతా రామ రాజు.
ఆ మహనీయుని జయంతి ఈ రోజే. ఆంధ్ర జాతికే గర్వ కారణమైన మన అల్లూరిని కన్న మన ఆంధ్ర మాత కడు ధన్యురాలు. 
మన్యవీరునికి ఘన నివాళులర్పిస్తున్నాను.
మరో మహనీయుఁడు శ్రీ స్వామీ వివేకానందుని వర్ధంతి కూడా నేడే.
స్వామీ వివేకానంద.
మన భారత జాతికే ఈ విశాల విశ్వంలో ఒక గుర్తింపు తెచ్చిన శ్రీ స్వామీ వివేకానంద భారత మాత పుణ్య గర్భాన పుట్టినది తేదీ.12 - 01 - 1863. కాగా ఆ పరమాత్మలో ఐక్యమైనది తేదీ. 04 - 7 - 1902. అంటే అతని వర్ధంతి నేడేనన్నమాట, 
యువతకు యావద్భాతీయులకు స్ఫూర్తిప్రదాత ఐన శ్రీ వివేకానందునికి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాను.
జైశ్రీరామ్.
జైహింద్. 
Print this post

4 comments:

Jai Gottimukkala చెప్పారు...

వెంకయ్య గారు తయారు చేసింది జాతీయ పతాకం కాదు, కాంగ్రెస్ పార్టీ జండా మాత్రమె. ఆ తరువాత కొద్ది మార్పులతో దేశానికి జండా చేసారు.

Pandita Nemani చెప్పారు...

ధర నల్లూరి మహామహాత్ముడగు సీతారామరాజున్ ప్రభా
కర తేజోవిభవున్ పవిత్ర భరత క్ష్మామాతృసత్పుత్రునిన్
పర మత్తేభ మహోగ్రసింహ నిభునిన్ స్వాతంత్ర్య దీక్షాపరున్
దొరలన్ భీతిలజేసినట్టి మహితాత్మున్ నే ప్రశంసించెదన్

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

పండితవర్యు పల్కులకు భ్రాంతి జనించి,జనించఁగాంచు భూ
మండలమందు సజ్జన సమన్విత జీవన మెన్ని. పండితో
న్మండిత! భావ రమ్యమగు మత్తగజంబు రచించి పాండితీ
భాండమ!మేలుఁ గొల్పిరయ!భవ్యులనాదివినున్నవారలన్.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

దేశం కోసం త్యాగం జేసిన మహ నీయులకు నివాళు లర్పిం చడం మాట అటుంచి , ఉన్న విగ్రహాలను పగుల గొట్ట కుండా ఉంటే గొప్ప. ఇక ముందు తరాల వారికి మనదేశ చరిత్ర , సంస్కృతీ సాంప్ర దాయాలు , మన పురాణ గ్రంధాలు , నాటి కవులు , అంతా మరుగై పోకుండా ఉంటే ముదావహం. ఇక ఈ దేశ చరిత్ర ఎటు వైపు పయ నిస్తుందో అంతు దొరకని ప్రశ్న .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.