గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, మే 2011, ఆదివారం

పండిత నేమాని రచిత ఆంధ్ర శివ కేశవం.

ఒక శివ స్తుతిచేసే శ్లోకములో ప్రతి నామములోను ఆద్యక్షరమును తీసి వేస్తే కేశవ స్తుతి వచ్చేటట్లుగా ఒక ప్రాచీన కవి వ్రాసిన శ్లోకము చూడండి:
గవీశ పత్రో నగజార్తి హారిః
కుమార తాతః శశిఖండమౌళిః
లంకేశ సంసేవిత పాదపద్మః
పాయాదనాదిః పరమేశ్వరో మాం

అర్థము:
గవీశ పత్రః: నంది వాహనుడు; వీశ పత్రః: గరుడ వాహనుడు 
నగజార్తి హారిః: పార్వతి ఆర్తిని పోగొట్టిన వాడు
గజార్తి హారిః: గజేంద్రుని ఆర్తిని పోగొట్టిన వాడు
కుమార తాతః: కుమారస్వామియొక్క తండ్రి;  మార తాతః: మన్మధుని తండ్రి
శశిఖండ మౌళిః: చంద్రధరుడు;  శిఖండమౌళిః:  శిఖిపింఛము ధరించినవాడు
లంకేశ సంసేవిత పాద పద్మః: రావణునిచేత సేవింపబడు వాడు
కేశ సంసేవిత పాద పద్మః: క (బ్రహ్మ) ఈశ (శివుడు) లచేత సేవింపబడు వాడు
అనాదిః (లేక) నాది(న+ఆది) = ఆదిలేని వాడు (పుట్టుక లేనివాడు/ఆది అక్షరము లేని వాడు)
పరమేశ్వరః: శివుడు;  రమేశ్వరః: విష్ణువు
నన్ను రక్షించును.
దీని భావమును అనుసరించి నేను చెప్పిన పద్యమును చూడుడు:
త్రిభువనాధీశ్వరుడు నగజ భయహారి
ప్రస్తుత దయానిధి గవీశ వాహనుండు
సారస పదయుగళుడు కుమార తాత
యగు ననాదిని పరమేశు నాత్మ దలతు
స్వస్తి.
పండిత నేమాని.

చూచారు కదండీ.
మీరూ ఇటువంటివి వ్రాసినట్లైతే ఆంధ్రామృతం ద్వారా వెలుగులోకి తేగలరు.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పండితులు శ్రీ నేమాని వారి శివ కేశవం రసరమ్యం . ఒకే పదానికి ఒక అక్షరం కలిపితే ఒక అర్ధం , అదే అక్షరాన్ని తీసే వేస్తె మరొక అర్ధం బహు చిత్రం . అంతటి విద్వాంసుల కృతులను చదవ గల భాగ్యం , మా పూర్వ జన్మ సుకృతం. మీరంతా సరస్వతీ పుత్రులు. ఇంకా ఇంకా ఇలాంటి కావ్యాలతో ఆంధ్రామృత ఝరి వెల్లి విరియాలని

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.