గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, మే 2011, ఆదివారం

మాతృ దేవో భవ. మాతృ మూర్తులందరికీ శిరసు వంచి పాదభివందనం చేస్తున్నాను.


సుమధుర భావనామృత సుశోభిత మాతృ హృదంతమ్మదో
మమతల మందిరమ్ము, తరమా పరమాత్మకునైననిట్టి త్యా
గమయ ప్రజానురంజనము? గౌరవ కల్పక కల్పకమ్మదే.
సమరస భావ శోభితము. సంతత సంతతి యోగ దాయి తాన్.

తల్లిని మించు నట్టి పర దైవము లేదిల సృష్టి నెందు. రా
గిల్లుచు, ముద్దు పెట్టుకొను, క్షేమము కోరును. దైవ సన్నిధిన్ 
జల్లగ కావుమంచు మనసార పదింబది మ్రొక్కు చుండు. నా
తల్లి పదాబ్జముల్ శిరము తాకి నుతింతును భక్తియుక్తునై.

తల్లి పాలు త్రాగి తనువును పెంచిన
ధర్మవృత్తి నున్న తనయుడెపుడు
తల్లి ఋణము తీర్చ తహ తహ పడునయ్య!
తల్లి కన్న గొప్పదైన దేది ?

మల్లె మరిమళమ్ము, మహనీయ కస్తూరి,
ఘనత కన్న యట్టి కప్పురమ్ము
తల్లి ఘనతఁ బోల తహ తహ పడునయ్య!
తల్లి కన్న గొప్పదైన దేది ?

తల్లి దండ్రి లేని దైవంబు భూమిపై
తల్లి ప్రేమ గ్రోల తనయుఁడగుచు
పుట్టు చుండె కాదె పొంగుచు పలుమార్లు.
తల్లి కన్న గొప్ప దైన దేది ?

మా అమ్మగారు దైవాంశ సంభూతురాలైన చింతా వేంకట రత్నం పాదారవిందములకు ప్రణమిల్లుతూ,
దైవాంశ విరాజితులైన పుడమిఁ గల మాతృ మూర్తులందరికీ శిరసు వంచి పాదభివందనం చేస్తున్నాను.
మాతృ దేవోభవ.
జై శ్రీరాం.
జై హింద్.
Print this post

8 comments:

Pandita Nemani చెప్పారు...

ప్రపంచ మాతృ దినోత్సవము సందర్భంగా మీరు వ్రాసిన పద్యాలు బాగున్నాయి. మా రచనను తిలకించండి.

తే.గీ. అమ్మ పాదాలు మృదుల నవ్యాంబుజాలు
అమ్మ పాదాలు స్వఛ్ఛమ్ములద్భుతాలు
అమ్మ పాదాలు దివ్య శోభాకరాలు
అమ్మ పాదాలు కొండంత అండ నాకు

అమ్మ పాదాలు పరమ కృపాస్పదాలు
అమ్మ పాదాలు సద్వివేకార్ణవాలు
అమ్మ పాదాలు సకల విద్యాలయాలు
అమ్మ పాదాలు కొండంత అండ నాకు

అమ్మ పాదాలు సకల భయాపహాలు
అమ్మ పాదాలు సకల జయప్రదాలు
అమ్మ పాదాలు సతతాభయప్రదాలు
అమ్మ పాదాలు కొండంత అండ నాకు

అమ్మ పాదాలు తిమిర సంఘాంతకాలు
అమ్మ పాదాలు జన్మ దుఃఖాపహాలు
అమ్మ పాదాలు ధ్యేయమ్ము లమృత నిధులు
అమ్మ పాదాలు కొండంత అండ నాకు

అమ్మ పాదాలు నిరత శ్రేయప్రదాలు
అమ్మ పాదాలు రుచిర కామ్యప్రదాలు
అమ్మ పాదాలు దేవబృందార్చితాలు
అమ్మ పాదాలు కొండంత అండ నాకు

అమ్మ పాదాలు భక్త జనాశ్రయాలు
అమ్మ పాదాలు సంవిత్ప్రభాకరాలు
అమ్మ పాదాలు శక్తిత్రయాన్వితాలు
అమ్మ పాదాలు కొండంత అండ నాకు

అమ్మ పాదాలు నిగమ శీర్షాత్మకాలు
అమ్మ పాదాలు సుజన విహారవనులు
అమ్మ పాదాలు లోకత్రయావనాలు
అమ్మ పాదాలు కొండంత అండ నాకు

అమ్మ పాదాలువిశ్వ నియామకాలు
అమ్మ పాదాలుపరమ రహస్యనిధులు
అమ్మ పాదాలుమద్ధృదయస్థ మణులు
అమ్మ పాదాలు కొండంత అండ నాకు

అమ్మ పాదల సేవల నాచరింతు
అమ్మ పాదల కడ సౌఖ్య మభిలషింతు
అమ్మ పాదాల నిత్యమ్ము నాశ్రయింతు
అమ్మ పాదాలు కొండంత అండ నాకు


- పండిత నేమాని

గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

అందఱి మాతృ మూర్తులకు ప్రణతులు. శ్రీ చింతా రామకృష్ణరావు గారి కవితలు, శ్రీ పండిత నేమాని వారి కవితలు మధురముగా ఉన్నాయి. వారిరువురు శారదాంబ ముద్దు బిడ్డలు.

ప్రాణము నిడి, తనువుఁ ద్రాణంబు గూర్చును
నుదర మందుఁ బిదప నుర్వి పైన
తల్లి దేవతాయె దైవంబు గూర్చగాఁ
దల్లి మ్రొక్కఁ , బ్రీతి దైవ మొందు!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సరస్వతీ పుత్రులు , పాండితీ స్రష్టలు , ఒకరిని మించి మరొకరు కమనీయ మైన పద్య కుసుమాలతో చేసిన పాదాభి వందనములను అందుకొన్న అమ్మ ధన్యురాలు. పుణ్య మూర్తి . ఒక అమ్మగా " అభినందనలు. + కృతజ్ఞతలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! అవధాని వర్యా! నమస్తే.

నవ గీతాద్భుత మాతృ పాద మహిమల్ నవ్యాంధ్ర శోభాకరం
బవనిన్. బాఠక పాళి మీదు కవితన్, బ్రఖ్యాత సద్భక్తియున్,
దివిజుల్ మెచ్చెడి తీరు, మెచ్చు. జననీ దేదీప్య పాదాబ్జముల్
భువిలోనన్ దివిలోన మెచ్చి కొలువన్ పూజ్యంబుగా చేసిరే!

మీ అద్భుత మాతృభక్తికి ప్రతీకగా నిలిచే నవ గీతాలు నవ రత్నాలై ఆంధ్రామృతానికి అలంకారమయినవి. ధన్యవాదములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! గన్నవరపు నరసింహ మూర్తి గారూ! నమస్తే.

తల్లి మదిని గన్న వర పుత్రకులు మీరు.
మాతృ శక్తిని చూపిరి ధాత్రిపైన
నారసింహ! కవీశ్వర! నాదు కోర్కె
తీర పద్యము వ్రాసిరి దివ్యముగను.

ధన్యవాదములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అమ్మా! రాజేశ్వరక్కా! నమస్తే.
మీ ఆశీస్సులే, మీ అభినందనలే ఆంధ్రామృతం గా అయి ప్రవహిస్తుంది.
ధన్యవాదములు.

Pandita Nemani చెప్పారు...

మాతృ దినోత్సవము సందర్భంగా, భరతమాత వైభవాన్ని వర్ణిస్తూ చెప్పిన దండకము.


మాతృ వైభవం

జయ జయ జనయిత్రి! శ్రీ భారత క్ష్మాధినేత్రీ! సదా సస్య సంపన్న సౌవర్ణధాత్రీ! జనానీక సంక్షేమ సంభావితార్థ ప్రదాత్రీ! సుగాత్రీ! మహోత్తుంగ శృంగాఢ్య శీతాద్రి వింధ్యాద్రి ముఖ్యాద్రి వర్యాంఘ్రి సామీప్య రమ్యాటవీ మధ్య సంజాత భాగీరథీ సింధు గోదావరీ ముఖ్య భవ్యాపగా తీర శోభాయమాన ప్రశాంతామలారామ రాజత్తపోభూ ప్రభావ ప్రభా భాసితాంగీ! శుభాంగీ!

సదా ధర్మ సంరక్షణోద్యోగ తాత్పర్య గంభీర భావాంకితాత్మ ప్రజానీక సంక్షేమ ధౌరేయ శ్రీరామ భూమీశ కౌంతేయ ముఖ్య క్షమానాథ శౌర్య ప్రతాపాది సల్లక్షణోద్భాసితానంత కీర్తీ! మహోదాత్త చారిత్ర సంతాన బాహుళ్య సంశోభితానందమూర్తీ!

శ్రీవిక్రమాదిత్య హర్షాధిపాశోక శ్రీకృష్ణరాజేంద్ర ఝాన్సీ శివాజీ ప్రధానాశయ స్థాపితోత్కృష్ట ధర్మార్థ వత్సంప్రదాయాన్వితా! విశ్వ విఖ్యాత వేదాంత విజ్ఞాన సంగీత సాహిత్య వాణిజ్య ముఖ్యాఖిలోద్యోగ నైపుణ్య రత్నావళీ భూషితా! నిత్య సంతోషితా!

స్వాతంత్ర్య సంగ్రామ సీమోచితోత్సాహ ధైర్య ప్రకాశాఢ్య సత్యాగ్రహాద్యాయుధోపేత గాంధీ మహాత్మాది ధన్యాత్మ సంపాదితాపూర్వ సౌభాగ్య సంపద్విశేషాన్వితా! రమ్య వర్ణత్రయోద్గీత సద్భావ సంకేత సంయుక్త చారుధ్వజా! సుప్రజా!

లోకవిఖ్యాత ప్రద్యోత ప్రజ్ఞామయానేక ధీర ప్రజానాయక శ్రేణి సంవర్ధితాశేష ఖండాంతర వ్యాప్త సౌభ్రాత్ర సౌహార్ద భావాంచితా! లోక సంపూజితా! జ్ఞాన వైరాగ్య భక్త్యాది సన్మార్గ వైవిధ్య సంశోభితా! సాధు సంభావితా! దివ్య తేజోన్వితా! భారత క్ష్మా మహా దేవతా! శాంతి సౌభాగ్య సంపన్మహా పారిజాతా!

నమో వేద భూమే - నమః పుణ్య భూమే - నమో ధర్మ భూమే - నమో ధన్య భూమే - నమో వీర భూమే -
నమో మాతృ భూమే -
నమస్తే - నమస్తే - నమస్తే - నమః:


ఇట్లు,
పండిత నేమాని

Sanath Sripathi చెప్పారు...

మాస్టారూ !! నేమాని వారి తేటగీతి పద్యాలు, మీ పద్యాలూ చాలా బాగున్నాయి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.