గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, మే 2011, సోమవారం

పండిత నేమాని కృత "మాతృ వైభవం" దండకం.




మాతృ వైభవం. 
పండిత నేమాని 
మాతృ దినోత్సవం సందర్భంగా 
భరత మాత వైభవాన్ని వర్ణిస్తూ చెప్పిన దండకం.

జయ జయ జనయిత్రి! శ్రీ భారత క్ష్మాధినేత్రీ! సదా సస్య సంపన్న సౌవర్ణధాత్రీ! జనానీక సంక్షేమ సంభావితార్థ ప్రదాత్రీ! సుగాత్రీ! మహోత్తుంగ శృంగాఢ్య శీతాద్రి వింధ్యాద్రి ముఖ్యాద్రి వర్యాంఘ్రి సామీప్య రమ్యాటవీ మధ్య సంజాత భాగీరథీ సింధు గోదావరీ ముఖ్య భవ్యాపగా తీర శోభాయమాన ప్రశాంతామలారామ రాజత్తపోభూ ప్రభావ ప్రభా భాసితాంగీ! శుభాంగీ!
సదా ధర్మ సంరక్షణోద్యోగ తాత్పర్య గంభీర భావాంకితాత్మ ప్రజానీక సంక్షేమ ధౌరేయ శ్రీరామ భూమీశ కౌంతేయ ముఖ్య క్షమానాథ శౌర్య ప్రతాపాది సల్లక్షణోద్భాసితానంత కీర్తీ! మహోదాత్త చారిత్ర సంతాన బాహుళ్య సంశోభితానందమూర్తీ!
శ్రీవిక్రమాదిత్య హర్షాధిపాశోక శ్రీకృష్ణరాజేంద్ర ఝాన్సీ శివాజీ ప్రధానాశయ స్థాపితోత్కృష్ట ధర్మార్థ వత్సంప్రదాయాన్వితా! విశ్వ విఖ్యాత వేదాంత విజ్ఞాన సంగీత సాహిత్య వాణిజ్య ముఖ్యాఖిలోద్యోగ నైపుణ్య రత్నావళీ భూషితా! నిత్య సంతోషితా!స్వాతంత్ర్య సంగ్రామ సీమోచితోత్సాహ ధైర్య ప్రకాశాఢ్య సత్యాగ్రహాద్యాయుధోపేత గాంధీ మహాత్మాది ధన్యాత్మ సంపాదితాపూర్వ సౌభాగ్య సంపద్విశేషాన్వితా! రమ్య వర్ణత్రయోద్గీత సద్భావ సంకేత సంయుక్త చారుధ్వజా! సుప్రజా!లోకవిఖ్యాత ప్రద్యోత ప్రజ్ఞామయానేక ధీర ప్రజానాయక శ్రేణి సంవర్ధితాశేష ఖండాంతర వ్యాప్త సౌభ్రాత్ర సౌహార్ద భావాంచితా! లోక సంపూజితా! జ్ఞాన వైరాగ్య భక్త్యాది సన్మార్గ వైవిధ్య సంశోభితా! సాధు సంభావితా! దివ్య తేజోన్వితా! భారత క్ష్మా మహా దేవతా! శాంతి సౌభాగ్య సంపన్మహా పారిజాతా!నమో వేద భూమే - నమః పుణ్య భూమే - నమో ధర్మ భూమే - నమో ధన్య భూమే - నమో వీర భూమే -
నమో మాతృ భూమే -

నమస్తే - నమస్తే - నమస్తే - నమ:. 
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

మన భరత మాత మహోన్నత మైన సంతతిని గన్న రత్న గర్భ. అట్టి ప్రాముఖ్యతను పేరు పేరునా కన్నులకు గట్టి నట్టుగా అందమైన వర్ణనలతో మన ముందుంచిన పండితుల వారి దండకం కడు శ్లాఘనీయం . వారి కలంలో మన పుణ్య భూమి ధన్యు రాలు. సరస్వతీ పుత్రులకు పాదాభి వందనం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.