గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, మే 2011, మంగళవారం

శరజ్జ్యోత్స్న లో కవివతంస బులుసు తారాడిన క్షణాలు.

శరజ్జ్యోత్స్న
ఈ శరజ్జ్యోత్స్న నన్ను బంధించివైచె.
ఔను. కాకున్న కుటిల గాఢాంధకార
పథ విలగ్న మూర్తిని నేను పరమ మృదు శ
శాంక దీధితిలో నెట్లు సాగు చుంటి.
ఈ శర జ్జ్యోత్స్న నాకు కన్పించు మాతృ
దేవతా స్నిగ్ధ దరహాస దీప్తి వోలె
కాక యుండిన యింతట కరుగునే మ
దీయ పాషాణ హృదయమ్ము దీనిని గని.
ఈ శరజ్జ్యోత్స్న నీల కంఠేశ జటల 
పొంగులెత్తిన గంగా ప్రపూరమటుల
నాకు తోచును. కొండ కోనలను కూడ
తాను చైతన్య సీమగా నొనర్చి.
ఈ శరజ్జ్యోత్స్నలో పులకించి పోవు
చుంటి మిర్వురము, కుటీరమంటిఁ బ్రాకు
మల్లికయు నేను, చైతన్య మంజులార్ద్ర
కలిత నిశ్శబ్ద భావ మూర్తులము మేము.
ఈ శరజ్జ్యోత్స్న నాకు ఱేయెల్ల నెన్ని
గీతములు పాడి విన్పించెనో తెలియదు.
మౌన గీతము లవి యెల్ల మఱల మఱల
ఎదను మొదలంట నూపి దహించు నెపుడు.
చూచారా కవి వతంస దివ్యానుభూతిని? మీకూ ఇటువంటి మధుర క్షణాలు దివ్యానుభూతులు సంభవించకపోవటము కాని, అది అక్షర రూపంలో పొంగకుండా ఉండడం కాని జరుగదు. అలా పొంగే కవితామృత ధారకు ఆడ్డుకట్ట వేస్తారెందుకు మీరు? మీ నుండి ఉప్పొంగే కవితకు అక్షర రూపమివ్వండి. ఆంధ్రామృతంగా అందరికీ అందించండి. మొహమాటమెందుకు?
జై శ్రీరాం.
జైహింద్.
Print this post

4 comments:

మిస్సన్న చెప్పారు...

ఈ శరజ్జ్యోత్స్న వర్ణన మింపు గూర్చె
మదికి! విరియించె వెన్నెలల్ హృదయ మందు!
ప్రకృతి సౌందర్య దీప్తుల పరవశించి
యోల లాడిన కవికి మా వేల నుతులు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

కవివతంస శ్రీ బులుసు వారి శరత్ జ్యోత్స్న లొ మైమరచి పులకించి పరవశించి తరించాము . వారికి మా వేల వేల అభి వందనములు + అభి నందనలు

Pandita Nemani చెప్పారు...

రసోత్కర్ష

సరసాంధ్రామృత నామ్ని బ్లాగిది మహా సంస్కార భాస్వంతమై
కరమొప్పారును చిత్ర పద్య కవితల్ కమ్రార్థ శబ్ద ప్రభల్
నిరతంబున్ ప్రసరింప జేయును భువిన్ శ్రేయోభిలాషుల్ సుధీ
వరులెంతేనిని ప్రోత్సహింప దగు నీ బ్లాగున్ రసోత్కర్షతోన్

సరసాంధ్రామృత నామ్ని బ్లాగు నమితోత్సాహంబుతో గూర్చి శ్రీ
కర భావోన్నత చిత్ర పద్య కవితల్ జ్ఞాన ప్రకాశమ్ముతో
కరమొప్పారగ జూపు సోదర! సదా కాంక్షింతు నీ కున్నతుల్
దరహాసోజ్జ్వల సుప్రసన్నముఖ చింతా రామకృష్ణా! సుధీ!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శరజ్జ్యోత్స్నలో ఆనంద పారవశ్యులయే పాఠకాళికి మీ పద్యం కర్పూరశౌరభాలను గుబాళింప చేస్తోందండి మిస్సన్నగారూ! చాలా చాలా ఆనందంగా ఉంది మీ ప్రతిస్పందనకు. ధన్యవాదాలండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.