గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, జనవరి 2011, సోమవారం

చక్కని పేరు సూచించండి.

7 comments

పూజ్య ఆంధ్రామృత పాఠకులారా! సుహృజ్జనులారా! నమస్తే. 
ఆ జగన్మాత కటాక్షం వలన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ఐన మా కోడలు స్త్రీ శిసువుకు జననమిచ్చింది. నేను తాతనయ్యాను. ఆ జగజ్జనని అవ్యాజానురాగానికి శత సహస్ర వందనములు.
తేదీ. 28 - 01 - 2011.
సమయం:- గం.10 - 48.ని..లు.
జనన స్థలము. వనస్థలి పురం.
నక్షత్రము:- అనూరాధ ద్వితీయ చరణము.
లగ్నము:- కన్య.
(నా అర్థాంగి విజయ లక్ష్మి జన్మ నక్షత్రము కూడా అనూరాధ. అంతా ఆమె  పోలికే అని అంటూంటే , ఆమె, ఆమెతో పాటు మా అబ్బాయి కూడా ఆనందిస్తున్నారు. ఆ విషయం నాకూ ఆనందం కలిగించింది.)
నా విన్నపము:-
మా మనుమరాలుకు నామకరణం చేయడం కోసం మన సంప్రదాయ బద్ధమైన ఆలోచనలకనుగుణంగా ఆధునికుల ఆలోచనలకు తగినట్టు చక్కని పేరు ఏది పెట్టితే బాగుంటుందో మీ సూచనలను పరిగణించి, మా చిరంజీవులకు సూచించాలని నాకుంది. 
దయచేసి సూచించ గలందులకు నా మనవి.
ఇట్లు,
భవదీయుఁడు,
చింతా  రామ కృష్ణా రావు.
జైశ్రీరాం.
జైహింద్.

28, జనవరి 2011, శుక్రవారం

ఈ క్రింది పద్యం ఏ గ్రంథంలోదో, ఏసందర్భంలో ఎవరు ఎవరితో పలికినదో చెప్పుకోండి చూద్దాం?

4 comments

దీనులకుయ్యాలింపను
దీనుల రక్షింప మేలు దీవన బొందన్
దీనావన నీకొప్పును
దీన పరాధీన దేవదేవ మహేశా !

జై శ్రీమన్నారాయణా!
జైహింద్.

27, జనవరి 2011, గురువారం

గర్భ కవిత్వాన్ని సాధన చేయుచున్న వల్లభవఝల నరసింహ కవి.

2 comments

సుజనులారా! శ్రీ వల్లభ వఝల నరసింహ మూర్తి కవి సాధన చేసి వ్రాసిన కంద గీత గర్భ చంపక మాలను తిలకించండి.
చూచారు కదా ఎంత సులభంగా బంధించారో. మీరూ ప్రయత్నించి అద్భుతమైన బంధ కవితలతో ఆంధ్రామృతాన్ని దశ దిశలా ప్రవహింప జేయండి. నమస్తే.
జైశ్రీరాం.
జైహింద్.

26, జనవరి 2011, బుధవారం

సర్వ సత్తాక గణ తంత్ర సామ్రా జ్య దిన శుభాకాంక్షలు.

2 comments


సహృదయ భారతీయ సహోదరులారా! శుభోదయం.
సర్వ సత్తాక గణ తంత్ర సామ్రాజ్య దినోత్సవము సందర్భముగా దేశ భక్తి ప్రపూర్ణులైన మహనీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
జైహింద్.
జైశ్రీరామ్.

22, జనవరి 2011, శనివారం

ఓంనమశ్శివాయ అంటే ముందుగా నారాయణుడొచ్చాడేంటీ?

4 comments

సీll
ఓంకార వేద్యుండు నోంకార పూజ్యుండు - (నోం)ఓంకార రూపుండు నోం ప్రవర్తి. 
మకంబునందొప్పు, చమకంబునందొప్పు - లినాక్షిపార్వతి కలలనొప్పు. 
మోదక ప్రియుఁడుతా ముదమార కొలిచి, న - మఃశివాయన పొంగు మాన్యుఁ డతఁడు.
నారాయణుండు శివారాధనను జేయ - శిరమొంచి మున్నిల్చి క్షేమ మొసగు.
రాజ మౌళియె హరి చేతి - వాజి, కొలువ.
ముఁడినే యెదిరించి, ప్రి - ముగ నొక ప్ర
ణామమును చేయు భక్తులఁ -  బ్రేమఁ గాచు.
తుల కగుపించు హరియు స - ద్గతియు నతడె.
ఆర్యులారా!
ఈ పద్యము వివిధ పద గోపనము అనఁబడే చిత్రకవితారీతి కలిగి యున్నదని మీరు గ్రహించియే యుందురు.ధన్యోస్మి.
జైశ్రీరాం.
జైహింద్.

19, జనవరి 2011, బుధవారం

మీరు షడ్లఘు సీసరచన చూద్దామనుకొంటున్నారా? ఐతే ఇదిగో.

3 comments

పాఠక మాన్యా! బ్రహ్మశ్రీ వల్లభవఝ నరసింహమూర్తి కవి పుంగవుల రచనలైన షడ్లఘు సీసముతో పాటు సర్వ లఘు సీసము కూడా ఇక్కడ మీరు చూచి మీ అమూల్యమై అభిప్రాయాన్ని వ్రాయండి.


చూచారు కదా! మరి మహనీయమైన మీ సూచనలన్తో పాటు మీరు మీచే రచింపడిన సర్వ లఘు సీసమును పంపించగలరని పాఠక లోకానికి అది అందివ్వాలనీ ఆశిస్తున్నాను.
జై శ్రీరాం.
జైహింద్.

17, జనవరి 2011, సోమవారం

పండిత నేమాని వారి శ్రీమదధ్యాత్మ రామాయణం మీకు కావాలా?

2 comments

ఆంధ్రామృత పాన లోలులారా! మకర సంక్రాంతి అనంత కాంతులు మీకు ప్రసాదించినట్టుగా భావిస్తున్నాను. ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకొన్న మీకందరికీ నా అభినందనలు.
శ్రీమదధ్యాత్మ రామాయణ కర్త శ్రీ మాన్ పండిత నేమాని రామ జోగి సన్యాసి రావు గారిని గూర్చి మనంఅనేకమార్లు మన ఆంధ్రామృతంలో ప్రస్తావించుకొన్నాం కదా! ఆ మహనీయుని అనువాదమైన శ్రీమదధ్యాత్మ రామాయణం ఆవిష్కరణ సందర్భంగా వారికి సభికులు సమర్పించిన ప్రశంసా పత్రములనిది వరకు చూచాము. ఇప్పుడు వారి గ్రంథావిష్కరణకు సంబంధించిన చిత్తరువులను విపులంగా ఈ క్రింది పికాసా వెబ్సైటులో చూడ గలందులకు మనవి చేయు చున్నాను.
http://picasaweb.google.com/lh/sredir?uname=venkatavijay123&target=PHOTO&id=5531911142234179218&aid=5531911052487057393&authkey=Gv1sRgCITGrsq67tHyfQ&feat=email
మీ కొక శుభవార్త.
వారు ఆంధ్రీకరించిన శ్రీమదధ్యాత్మ రామాయణం కావలసిన వారు తమ చిఱునామాలను పంపగలరు.ఈమెయిల్ ఎడ్రస్సు కూడా పంపగలరు.
ఇప్పుడు వారి రచన లోని ఒక చిన్న అమృత గుళికను చూపిస్తాను రుచి చూడండి.
శ్రీమదధ్యాత్మ రామాయణము బాలకాండ ద్వితీయ సర్గలో 
రాక్షస సంహారార్థము అవతరించ వలసినదని శ్రీమన్మహావిష్ణువును ప్రార్థించుటకై వచ్చిన వారు శ్రీహరిని చూచిరి.  బ్రహ్మ ఆ హరిని కీర్తించిన సందర్భములోనున్న 20వ పద్యము.
పంచ చామరము.
సహస్ర శీర్ష శోభితాయ సత్య మూర్తయే నమః.
సహస్ర దివ్య లోచనాయ జ్ఞాన మూర్తయే నమః.
సహస్ర పాద పంకజాయసౌఖ్యదాయతే నమః.
సహస్ర దివ్య నామ రూప సంధృతాయతే నమః.
చూచారుగా ఎంత అద్భుతంగా ఉందో. గ్రంథము ఆద్యంతమూ ఇంత అద్భుతంగానూ ఉందంటే అది చదివిన వారికే నమ్మబుద్ధి పుట్టే నగ్న సత్యం.
నమస్తే.
జైశ్రీరాం.
జైహింద్.

ఎందుకయ్యా అంత కోపం? అది చాలా ప్రమాదం సుమా!

4 comments


శ్లోll
ఉత్తమే క్షణకోప స్స్యాత్, మధ్యమే ఘటికాద్వయం
అధమే స్యా దహోరాత్రం, పాపిష్ఠే మరణాంతకమ్
తే.గీll
ఉత్తముని కోప మొక క్షణ ముండు. నిజము.
మధ్యమునకు రెండుఘడియల్మసలు కోప
మధమునకురాత్రి పగలుండి యంతమగును.
పాపిమరణించు వరకును కోపముండు.
భావము:-
ఉత్తమునకు వచ్చెడి కోపము ఒక్క క్షణ కాలముండి పోవును. మధ్యమునకు వచ్చు కోపము రెండు ఘడియల కాలము మాత్రమే ఉండి పోవును. అధమునకు వచ్చుయ్ కోపమైతే ఒక రాత్రి, ఒక పగలు ఉండును. కాని పాపాత్ములకు వచ్చు కోపము మాతర్ము వారు మరణించు వరకూ ఉండును.
తన కోపమె తన శర్తువు. అన్నారు పెద్దలు. కావున మనం పై విషయం గ్రహించి శాంతాత్ములమై వర్తించే ప్రయత్నం చేయడం ఎంతైనా అవసరం.
జై శ్రీరాం.
జైహింద్.

14, జనవరి 2011, శుక్రవారం

మహనీయులారా! మకరసంక్రాంతి శుభాకాంక్షలు.

10 comments

మహిమోపేత ధరాతలంబునను సన్మాన్యుల్, జగద్వందితుల్,
బహు సత్కార్య  సుసాధనా ప్రతిభులున్, భక్తిప్రపత్తిస్థిరుల్,
మహనీయుల్ గలరిద్ధరన్. మదిని సంభావింతు నవ్వారలన్
రహిఁ గాంచున్ గద వారలీ మహిత సంక్రాంతిన్ మహద్భాగ్యులై.
ఆ మహనీయు లెవరో కాదు. 
మీరే. 
ఆంధ్రామృత పాన లోలురైన మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియఁ జేస్తున్నాను. 
ఈ మంచి సమయంలో శ్రీమాన్ వల్లభవఝల అప్పల నరసింహమూర్తి కవి శ్రేష్టుల సర్వలఘు సీసము... కాదు కాదు సర్వలఘువులతో నొప్పారు చున్న పరమార్థ రహస్యామృతమును మీ కందించు చున్నందుకు ఆనందంగా ఉంది. 
ఆ కవీశ్వరులకు నా ధన్యవాదములు.

లోకాఃస్సమస్తాస్సుఖినో భవంతు.
జైశ్రీరాం.
జైహింద్.

12, జనవరి 2011, బుధవారం

యువతకు స్ఫూర్తినిచ్చే వివేకానందుని జన్మ దినం నేడే.

2 comments

ఈ రోజు సామీ వివేకానంద జయతి అన్న విషయం యావద్భారతీయులకూ ఆనందం కలిగించే విషయం. ముఖ్యంగా ఈ రోజును యువజన దినోత్సవంగా నిర్ణయించి, యువతకు స్ఫూర్తిని గొలిపే అత్యుత్తమమైన రోజు.
ఈ సందర్భంగా ముందుగా యావద్భారతీయ యువతీ యువకులకు నా మనఃపూర్వక అభినందనలు.
"నీ శక్తే నీ జీవితం... నీ బలహీనతే నీ మరణం..." అన్నారు స్వామీ వివేకానంద. 
యువత నిర్వీర్యమైతే జాతికి చీడపట్టినట్టే. యువత ఆత్మ చైతన్యాన్నిపొందే విధంగా ఉండే శ్రీ వివేకానందుని అమృత వాక్కులసారాన్ని వరి గ్రథముల నుండి గ్రహిస్తూ, ఆత్మ చైతన్యం పొంది, యావత్ జాతికీ ముందుండి నడుపుతూ, ఆదర్శప్రాయ జీవనం సాగించడం ద్వారా భారతీయ ఔన్నత్యాన్ని ప్రాచ్య పాశ్చాత్య దేశాలలో యినుమడింప చేయాలి.
తమలో నిబిడీకృతమై యున్న అనంత శక్తి యుక్తులను నిర్వీర్యం కానీకుండా ఉండాలంటే ముందుగా సామాజికమైన దౌర్భాగ్యపు అతఃపతన మార్గాలవైపు నెట్టే దురదృష్టకర స్వార్థైక జీవన, దుర్వ్యసనాదులను ప్రేరేపించే సినీమాలకు, దూరదర్శన కార్యక్రమాదులకూ, అంతర్జాలముద్వారా ప్రత్యక్షమయ్యే అనాహ్వానిత దృశ్యశ్రవణాదులకు దూరంగా ఆత్మస్థైర్యంతో అన్నిటికీ అతీతంగా ఉంటూ మన కన్న తల్లి భరతమాత మహద్భాగ్యనిధానమా అన్న విధంగా కష్ట స్ధ్యమైన అతీంద్రియ శక్తులను  సంపాదించుకొని సామాజిక సన్మార్గదర్శకులుగా తమను తాము మలచుకొని తద్విధంగా మెలగాలనీ అట్టి మన భరత యువతను గని కన్న తల్లిదండ్రులూ, సమాజము మాతృ దేశము గర్వపడేలా పురోగమించాలనీ ఆశిస్తూ అభినందనలు మరొక్క సారి తెలియ జేస్తున్నాను. 
జైహింద్.

భావన లేనట్టి పూజ ఫలము నొసగునే?.

0 comments


శ్లోll
భావేషు విద్యతే దేవో నపాషాణే న మృణ్మయే
నఫలం భావ హీనానాం తస్మాత్ భావోహి కారణం.
కll
భావన చే నెఱుగంబడు 
దైవము.మరి మట్టి రాయి, దారువులందున్
భావనచేయక కొలిచిన
దేవుఁడు ఫలమీడు. తెలిసి దేవునిఁ గనుమా.
భావము:-
మనుష్యుఁడు భావించే భావన లోనే దేవుఁడున్నాఁడు. కాని రాతియందు కాని, మట్టియందు కాని చిత్రమునందు కాని దేవుఁడు లేడు.కనుక భావింప లేని వానికి ఫలము లేదు.
జైశ్రీరాం.
జైహింద్.

10, జనవరి 2011, సోమవారం

నీలోనే నేనున్నా. అన్నీ చూస్తున్నా. ఆలోచింప జేస్తున్నాను.

0 comments

అంతర్ చక్షువు నేన యంచు గనుమా! ఆశాదులన్ వీడుమా!
కాంతున్నేను నిజంబు. దుష్ట చయమౌ కామాదులన్ వీడుమా!
భ్రాంతిన్ వీడిన కానిపింతు మదిలో. భక్తిన్ ప్రవర్తింపుమా!
సాంతంబున్నను నమ్మలేని జనముల్ సాధింపలేరెద్దియున్. 

8, జనవరి 2011, శనివారం

ధూర్తుల యొక్క లక్షణములు.ముఖం పద్మ దళా కారం.మేలిమిబంగారం మన సంస్కృతి 108.

6 comments

శ్లోll
ముఖం పద్మ దళా కారం - వచశ్చందన శీతలం.
హృత్కర్తరి సమం చాzతి వినయం ధూర్త లక్షణం.
కll
సుందర ముఖ పద్మమ్ములు,
నందంబగు పలుకులందు నమృతపు జల్లుల్.,
డెందమ్ములు చుర కత్తులు,
ముందుగనతి వినయమొలయు మూర్ఖుఁలు ధూర్తుల్.
భావము:-
చక్కని ముఖ వైఖరి, చల్లని మెత్తని మాటలు, కత్తెర బోను వంటి హృదయము, అతి వినయము ఇవన్నియు ధూర్త లక్షణములు.
ఇట్టి ధూర్తుల విషయంలో మిక్కిలి జాగరూకతతో మనం ప్రవర్తించాలి.
జైశ్రీరాం.
జైహింద్.

6, జనవరి 2011, గురువారం

కుచేలుని పేదరికానికి కారణం?

6 comments

కుచేలుని పేదరికానికి కారణం వివరిస్తున్న కృష్ణుఁడు
శ్లోll
ఏకయేవ న భుంజీత - యదిచ్ఛేత్ సిద్ధిమాత్మనః.
ద్విత్రిభిర్బహుభిస్సార్ధం భోజనంతు దివా నిశమ్.
కll
భుజియింపగ రాదొంటిగ.
నిజమిది రాత్రింబవళులు. నిరుపమగతి సత్
స్వజనులనిద్దరి, ముగ్గురి
భుజియింపగ తోడు గలిగి భుజియింప వలెన్.
భావము:-
పగలు కాని, రాత్రి కాని, ఒంటరిగా భుజింప కూడదు. ఇద్దరు, ముగ్గురు కలసి భుజిస్తున్న పంక్తిలో కూర్చొని భుజించాలి.ఇది శ్రేయస్కరమైన పద్ధతి. అని పెద్దలు చెప్పుదురు.
కుచేలుఁడు తన బాల్యమున కృష్ణుఁడు మున్నగు వారికి పెట్టకుండా చాటుగా ఒంటరిగా భుజించిన కారణముననే పెద్దైన తరువాత పేదరికం అనుభవించ వలసి వచ్చిందని పండితులు చెప్పెడి మాటలు సత్య దూరములు కావని ఈ శ్లోకము వలన మనకు తెలియుచున్నది.
జైశ్రీరామ్.
జైహింద్.