గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జూన్ 2010, మంగళవారం

శ్రీ రామ నామ వైభవము ( సీస మాలిక )

సహజ కవి; అష్టావధాని ఐన శ్రీ నేమాని రామ జోగి సన్యాసి రావు ; విశాఖ పట్టణం వాస్తవ్యులు. విశ్రాంతాగ్లోపన్యాసకులు. వీరు శ్రీమదధ్యాత్మ రామాయణమును ఆంధ్ర భాషలోనికి అనువదించారు.
ఆ మహోత్కృష్ట గ్రథంలో ఉత్తర కాండలో నవమ సర్గాంతమున వ్రాసిన  శ్రీరామ నామ వైభవము శ్రోత్ర పేయంగా చక్కని శైలితోనొప్పారియున్నందున  నద్దానిని పాఠక పుంగవులకందింప నెంచి; ఈ ఆంధ్రామృతాన్ని మనసారా ఆస్వాదించే భక్త జన హృదయానందకరంగా ఇందుంచినాడను.
సీll
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనినచో - రామ చంద్రుని దయా రసము గలుగు.
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనినచో - త్రికరణమ్ములకు సిద్ధించు శుద్ధి.
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనినచో - తాపత్రయములు సత్వరము తొలగు.
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనినచో - నంతరంగమ్మున శాంతి గలుగు.
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనినచో - దోషమ్ములన్నియు దొలగి పోవు.
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనినచో - చింతలన్నియును నశించి పోవు.
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనినచో - నజ్ఞాన తిమిరమ్ములంతరించు.
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనినచో - శాత్రవ గణ వినాశనము గలుగు.
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనినచో - సంసార భయ విమోచనము గలుగు.
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనినచో - స్వాంతమ్మునందు స్థైర్యమ్ము చెలగు.
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనినచో - వేనూరులట్లు ప్రాప్తించు ఫలము.
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనినచో - సకల సౌభాగ్యముల్ సంతరించు.
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనినచో - విజయ పరంపరల్ వెలయు చుండు.
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనినచో - ప్రజ్ఞాన తేజమ్ము పరిఢవిల్లు.
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనినచో - చిన్మయానంద సంసిద్ధి యొదవు.
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనినచో - పరమ పదమ్ము సంప్రాప్తమగును.
తే.గీll
రామ నామమ్ము పీయూష రసము మించు.
రామ నామమ్ము సజ్జన రంజకమ్ము.
రామ నామ విశేష కీర్తన ఫలమ్ము
లతుల యోగ ప్రదమ్ములు నద్భుతములు.
శ్రీ నేమాని రామ జోగి సన్యాసి రావు గారి ఫొన్ నెంబర్. 08912565944.(విశాఖపట్టణం)
జైహింద్.
Print this post

4 comments:

రవి చెప్పారు...

పద్యం చాలా అందంగా వుంది. సీస మాలికలు కూడా వ్రాయవచ్చునని ఇప్పుడే తెలుసుకున్నాను.

durgeswara చెప్పారు...

జై శ్రీరాం

కత పవన్ చెప్పారు...

బాగుంది పద్యం నైస్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

రామ నామము మంచి ఔషధము. " రామ " అని పలుకగానె పాపములు నశించును కదా ? సొగసైన సీస మాలికలొ మరింత సొగసు గా ఉంది " జై శ్రీ రాం "

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.