గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, జూన్ 2010, ఆదివారం

అంతరంగం - శ్రీ బులుసు వేంకటేశ్వర్లు. తే.04 - 06 - 2010.

ఆధునిక కవుల్లో నాకు విశ్వనాథ అభిమాన కవి. వారు రచించిన తెలుగు ఋతువులు నేను చదవడంతో ప్రారంభమైన ఆ అభిరుచి నాలో దినదిన ప్రవర్ధమానమై; పెద్దల ఉపన్యాసాలు వినడం వల్లా; వారు చేసే వ్యాఖ్యానాలవల్లా మరింత ఎదిగి కల్పవృక్షము అయింది. చివరికి అది నా యింటికి పేరై కూర్చొంది.
క్రమేపి ఆ విశ్వనాథ సాహిత్య విశ్వరూపం నన్ను కష్టాల్లో ఓదార్చింది. సుఖాల్లోనూ తోడయింది. ఎన్ని పద్యాలు! ఏమి సృష్టి! ఎంత భావుకత! ఒక పద్యం మనకి నచ్చిందంటే అది తలచుకోగానే మనకు వెఱ్ఱి ఆనందం కలుగుతోందంటే కారణం ఏమిటి? ఆ భావం మనకు నచ్చిందా? పద్యం నడక బాగుందా? కల్పన మిన్ను ముట్టిందా? హృదయాన్ని తట్టిందా?
ఏదో ఒక విలక్షణత ఉండే ఉంటుంది. ప్రతి మహా కవి వాక్కులోనూ వ్యక్తమౌతున్న కాంతి సర్వాంగీణంగా ద్యోతకమౌతూనే ఉంటుంది. ఆ కావ్య నాదంలో కరగిపోయి బాహ్య జగత్తుకు రాగానే విచారణ ప్రారంభమౌతుంది. సుఖ దుఃఖాలను మనిషి ఒక్కడే భరించ లేడు. ఎవరితోనో పంచుకోవాలి. అదిగో అప్పుడు ప్రారంభమౌతుంది చర్చ.
ఆ పద్యంలో ఏ అలంకారముంది? రీతి ఏటువంటిది? రసమేమిటి? ఔచిత్య స్థాయి ఎంత? ఈ మూల్యాంకనలో సగం ఆనందం ఆవిరి అవుతుంది. ఇక మిగిలింది సగం. ఆ సగంలోను అనిర్వాచ్యమైన ఆనందాన్ని తూచడానికి మనం ఉపయోగించే నీరస పదాల వల్ల మరో సగం ఆనందం అదృశ్యం. ఇక మిగిలింది నాలుగో వంతు మాత్రమే. ఆ మాత్రానికే సహృదయుఁడు ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నాఁడు. ఉద్వేగానికి గురి అవుతున్నాఁడు. కళ్ళు చెమర్చుతున్నాఁడు.
అటువంటి సహృదయుల వల్లనే ఈ కావ్య ప్రపంచం సృష్టింపఁబడింది. కవిత్వ రచన మినహా మిగిలిన అర్హతలన్నీ కవితో పాటు కలిగినవాఁడు సహృదయుఁడు. కవితో సమానమైన హృదయం కలవాఁడు సహృదయుఁడు. అంటే మంచివాఁడని అర్థం కాదు. (కవి సహృదయాఖ్యం విజయతే)
రామాయణ కల్ప వృక్షంలో కిష్కింధ కాండ నూపుర ఖండం లోని ఒకటి నుండి ఏభై పద్యాలు నేను "కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత" పేరున వ్యాఖ్యానిస్తూ ఉపన్యాసాలిచ్చాను. ఇస్తున్నాను కూడా.
మిత్రులు శ్రీ చింతా రామ కృష్ణా రావు గారు విశ్రాంత ఆంధ్ర ఉపన్యాసకులు, స్వయంగా ప్రతిభ కల కవులయి ఉండి కూడా నా యందు ప్రేమతో ఈ వ్యాసాలు వ్రాయమని కోరారు. మొదట సరే అని దిగినా క్రమంగా విశ్వనాథ భావుకతలోని లోతు నాకు తెలియ వచ్చింది. ఇది నా వల్ల కాదు అనిపించింది. దిగితే కాని లోతు తెలియదని ఊరికే అన్నారా?
మిత్రులు శ్రీ చింతా వారు వారం వారం నన్ను ప్రోత్సహిస్తూ ప్రపంచ వ్యాప్తంగా సాహిత్య ప్రేమికుల ‘కామెంట్స్’ వినిపిస్తూ వెన్ను తట్టారు. మొత్తం మీద విశ్వనాథ భావుకత శీర్షిక పూర్తి చేయించారు. అట్టి రామ కృష్ణా రావు గారికి; ఈ నా వ్యాసాలు చదివి సూచనలతో శుభాకాంక్షలతో స్పందించిన సాహిత్యాభిమానులకీ; నా హృదయ పూర్వక నమో వాకాలు. ధన్యవాదాలు.
నా వ్రాతలో ఏమైన తప్పులుంటే పొరపాట్లు దొల్లితే మన్నించి - నాకు తెలుపుతారని ఆశిస్తున్నాను.

"కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత" ఒక పుస్తక రూపంలోకి తీసుకు వచ్చినప్పుడు మరింత సరళతరం చేస్తానని మనవి చేసుకొంటున్నాను. మీరు ఆంధ్రామృతంలో ఈ నా వ్యాసాలపై చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకొనగలనని మనవి చేయుచున్నాను.
ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రామృతం బ్లాగు నిర్వాహకులు, మిత్రులు శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి నమస్కారాలు తెలుపుకొంటున్నాను. జై శ్రీరాం.
సెలవ్.
మీ

బులుసు వేంకటేశ్వర్లు.(సెల్. 9949175899.) 
కల్పవృక్షం.
ESIహాస్పటల్ దగ్గర.
చిట్టివలస.
విశాఖపట్టణం జిల్లా.
పిన్. 531162.
హిందూదేశము.
పాఠక మిత్రులారా! చూచారు కదా ఆ సహృదయ కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారి అంతరంగం. మీ అంతరంగాన్ని కూడా వెలువరించండి.
జైహింద్.

Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.
" ఆంధ్రామృతం " అంటే ముందుగ " విస్వనాధ వారి భావుకతనె " చదవాలి అనుకుని ప్రతి రోజు ఉదయం లేవగానే ముందుగా చదవడం అలవాటై పోయింది
పాత్రలొ జీవింప జేసి,నవరసములొలికించిన ప్రకృతి వర్ణనలతొ , అందమైన అలంకారములతొ పరవశించి పులకింప జేసిన ఇంత చక్కటి కావ్యాన్ని మళ్ళీ మళ్ళీ చదివి సాహితీ పిపాసను తీర్చు కొవాలి ఇంతటి అమృతాన్ని ఎంతో శ్రమ కోర్చి మాకందించిన శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారికి , తన కలము నుంచి ఈ అమృతధారను కురిపించిన తమ్ముడు చిరంజీవి చింతా రామకృష్ణకి అభినందనలు.+ ధన్య వాదములు.

డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

కవి మిత్రులు ’బులుసు వేంకటేశ్వర్లు’ గారికి
నమః
బాగున్నారా ?
విశ్వనాధ వారి భావుకతపై మీ వ్యాసాలు చదివి చాలా ఆనందించాను.
మీకు నా ప్రత్యేకాభినందనలు !

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.