గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, జూన్ 2010, సోమవారం

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 48.

పాపమ్మీ పులి పీట వెట్టుకొని యీ బాటం దువాళించెడున్
వేపుచ్ఛాహతి తర్జనోగ్ర రదనావిర్భూతి రక్త చ్ఛవిన్
చాపంబెత్తక హస్త కర్షణముగా జ్యావల్లి మ్రోయింపుమీ 
ప్రోపుంజెందుత దాని దారి నది పోవుం జంపగా నేటికిన్?
(వి.రా.క.వృ.కి.కా.నూ.స. 1- 48)
శ్రీరాముఁడు లక్ష్మణునితో యిట్లనుచున్నాఁడు.
చూడవయ్యా! పాపం ఈ పులి ఈ బాట ప్రక్కనే పీట పెట్టుకు కూర్చున్నది. తోకను భూమిపై కొడుతూ కోరలు కనపడునట్లు రక్త కాంతులతో గర్జిస్తూ మనల్ని భయపెడుతున్నది. ధనుస్సును ఎక్కుపెట్టుము. అల్లెత్రాడు మీటి చప్పుడు చేయుము. చాలు. దాని దారినదే పోవును.
సుతీక్ష్ణుని ఆశ్రమము నందు శ్రీరామునకు సీత చనువుతో అహింసా ధర్మమును ఆచరించమని బోధించెను. రాక్షసులతో; క్రూర మృగములతో విరోధము ముని ధర్మమునకు విరోధమని చెప్పెను. మన భాగ్యమీ విధముననున్న నియ్యది చాలనట్లు నెత్తికిఁ గొని తెచ్చుకోనయిన తీరుననున్నవి యీ విరోధముల్ అని చెప్పినది. అటు మానవుల్లాగ కనిపిస్తారు.ఇటు క్రూర మృగాలకంటె ఘోరంగా ప్రవర్తిస్తారు రాక్షసులు. వారి తలకు నూనె కారు. త్రాగుటకు నేయి కారు. అట్టివారితో మనకు విరోధము ఎందుకు? అని వచించెను.
సీత చెప్పిన మాటలు శ్రీరామునకు గుర్తుకు వచ్చినవి కాబోలు. లక్ష్మణునితో జ్యావల్లి మ్రోగించి పులిని భయపెట్టుము చాలును. దాని దారిన అదే పోవును. అనినాఁడు. సీతాసక్త హృదయుఁడైన స్వామి అన్య కార్యములందు నిరాసక్తుఁడగుట పై పద్యము వలన మనకు విశదమగుచున్నది. 
సీతాన్వేషణములో సూక్ష్మ భావ దశలను మహా కవి ప్రదర్శించుట శ్రీరాముని యందు వానిని రూఢిపరచుట కావ్యమునందలి కవి నైపుణ్యమునకు సూచన.
నిరుపమ దుఃఖేర్ష్యాదుల
నిరతము జనియించు నరతి నిర్వేదమగున్.
దుఃఖము వలనను; అసూయ వలనను తత్వ జ్ఞానాదుల చేతను కలిగిన నిష్ఫలత్వ బుద్ధి నిర్వేదము అనఁబడును.
కంటికి కనబడకుండా దాగియుండి కూయుచున్న కోయిల కూత వలన శ్రీరాముఁడు పునః దుఃఖితుఁడై యున్నందున దాని వెన్నంటి ఈ నిర్వేద భావము పులిని చూచి చెప్పిన మాటలలో వ్యక్తమైనది.
వాల్మీకి రామాయణములో సీత మునివృత్తిలో నున్న వారికి శస్త్ర సంయోగము కూడదని శస్త్ర సంబంధము అగ్ని సంబంధము వలె ప్రమాద కారి యని హెచ్చరించినది. 
అపరాధం వినా హంతుం లోకాన్ వీరన కామయే.( ఏ అపకారము చేయని వానిని చంపుట నాకు సమ్మతము కాదు) అన్నది.
అంతే కాదు. స్త్రీ సహజమైన ప్రకృతితో ఆమె ఒక చక్కని కథ చెప్పి రాముని మెప్పించినది. 
పూర్వం ఒక పచ్చని అడవిలో ఒక ముని తపస్సు చేయుచున్నాఁడు. దేవేంద్రుఁడు ఆ ముని తపస్సును పరీక్షింపఁ గోరి ఒక గొప్ప వాడియైన ఖడ్గమును ఇచ్చెను. ఆ మునికి జప తపములపై శ్రద్ధ సడలి ఈ దేవేంద్ర న్యాసమైన ఖడ్గమునందే ఆసక్తి ఎక్కువైనది. ఖడ్గము పట్టిన మౌనియందు క్రమముగా సాత్విక గుణము మాయమై అతఁడు క్రూరుఁడై అధర్మాచరణము చేత నరకము పొందెను. ఇది సీత రామునికి చెప్పిన కథ. 
అందుచే మనము ముని వృత్తి ధర్మమునే పాటించుదము గాక అనెను. 
ధర్మాదర్థః ప్రభవతి - ధర్మాత్ ప్రభవతే సుఖం.
ధర్మేణ లభతే సర్వం - ధర్మసారమిదం జగత్. 
అన్నది సీత.
ధనుస్సును పట్టుట క్షత్యియ ధర్మ మనియు క్షత్రియులకు ఆర్త త్రాణ పరాయణత ప్రథమ ధర్మ మనియు వాదించి ఆనాడు సీతను ఒప్పించిన శ్రీరాముని మనస్సులో ఏ మూలనో సీత ఉపదేశము తళుకు లీనుచునే ఉన్నది.
ఆ మహాత్ముఁడు సీత మాటలను మన్నింప దలచెను. మన్నించెను.
ఒక్కొక్కప్పుడు కథలోని చమత్కారమే ఒక శిల్పముగా రూపొంది కావ్యమునకు వింత రుచులను ప్రసాదించును.
జ్యావల్లి మ్రోగింపుమీ చంపగా నేటికిన్ అను మాటలు కవి అర్థాంతర వివక్షచే ప్రయోగించెను.
జై శ్రీరాం.
చూచాం కదండీ విశ్వనాథవారి కల్ప వృక్షంలో నిబిడీకృతమైయున్న భావుకతను. తదుపరి భాగములను మరొక పర్యాయం కలిసినప్పుడు చూద్దాం.
జైహింద్.     Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

విశ్వనాధ వారి గజారోహాణ చిత్రం చూడగలిగినందులకు సంతోషం గా ఉంది." కాళి దాసు అశ్వధాటి " ఐనా " విశ్వనాధ వారి భావుకత " ఐనా " ఛందశ్శాస్త్ర మైనా " అవలీలగా అందించ గలిగిన చింతా వారు అభినంద నీయులు చదివి ఆనందించ గల అదృష్టం లభించినందుకు భగవంతునికి సదా కృతజ్ఞతలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.