గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, జూన్ 2010, శుక్రవారం

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 50.



ఇదిగో నిల్చిన పాటు నిల్చినటు లిట్లే చేరుకొంటిన్ వియ
త్పదమాలంబముగాగ దైత్య పద విధ్వస్త ప్రదేశంబునే
మొదలన్ సర్వ చరాచరంబు విలువంపున్ మీటునన్ దేల్తున
న్నది కాదంటివి. పోవనిమ్మ యిపుడైనన్ నా సతిన్ జూడగన్.
(వి.రా.క.వృ.కి.కాం.నూ.స. 1-50)
సీతా వియోగంతో దుఃఖితుఁడైన శ్రీరామునిలో అత్యుత్కటమైన క్రోధావేశం పొంగిపోయినది. 
లక్ష్మణా! నిలిచిన వాఁడిని నిలిచినట్లుగానే నేను ఆకాశము దాకా ఎగిరిపోయి ఆ రాక్షస దేశాన్ని చూసి సీతను కనుక్కొంటాను. ఇంతకు ముందు నా ధనుస్సు చేత ఈ చరాచర ప్రపంచాన్ని నాశనం చేసి; సీతను తీసుకు వస్తానంటే నీవు వారించావు. ఇప్పుడైనా నన్ను పోనీవయ్యా నా సీతను చూడడానికి.
శ్రీరాముని హృదయం ఆవేశ బంధురమై ఉంది. సీతా వియోగం హృదయాన్ని మండింప జేస్తోంది. బాహ్యావరణ విచ్ఛేదం జరిగినప్పుడు రాముని మనసు అన్య విషయాసక్తమైనను అది క్షణికమే.
సముద్ర గర్భం నుండి గర్జించుచూ పరువులెత్తుకొని వచ్చుచున్న మహోత్తుంగ తరంగముల వంటి సీతా స్మృతి పరంపరలచే సంచలితుఁడైన రాముఁడు తాను ఆకాశ మార్గాన పోయి సీతను కనుగొందునని పలుకును. ఇది వరకు స్వామి ప్రపంచమునే నాశనము చేస్తానన్నాఁడుట. ఎప్పుడు(అరణ్యకాండమున) ? రావణుఁడు సీతను అపహరించుకు పోయిన పిదప పర్ణశాలకు వచ్చిన శ్రీరాముఁడు ఆమెను గానక క్రోధాత్ముఁడై సృష్టినే నశింపఁ జేసెద ననెను.  
ఈ సందర్భమున భాస్కర రామాయణమున ఇట్లు వ్రాయఁ బడినది.
అస్మచ్చాప విముక్త బాణముల నుద్యద్భూతలంబంతయున్ 
భస్మీభూతము జేసి యిందు భగణ ప్రద్యోత నాకాశమున్
విస్మిత్యన్విత బాహు శౌర్యమున నుర్వింగూల్చి కల్పాంతకో
గ్రస్మర్తవ్య మహోగ్రతిన్ సకల లోక ప్రాణులం ద్రుంచెదన్.
(భా.రా. 3 - 332)
ఇట్టి క్రోధ మూర్తియైన శ్రీరాముని గతములో లక్ష్మణుఁడు అనునయించి సాంత్వనపరచినాఁడు. ఆ ఘట్టమును స్మరించి శ్రీరాముఁడు ఇప్పుడు నేను ఆకాశము అంత ఎత్తుకు ఎదిగి సీత ఎక్కడుందో చూస్తాను. నన్ను పోనీ. అనుచున్నాఁడు.
ఇది ఔత్సుక్యము అను సంచారీ భావము. ఔత్సుక్యమనగా సమయాక్షమత్వము. అనగా కాల విడంబము (ఆలస్యము)ను ఓర్వకపోవుట. ఇది విప్రలంభ శృంగార నాయకుని స్థితికి పరాకాష్ఠ.
పద్యము వలన సీతారాముల అద్వైత స్థితి మనకు తెల్లమగుచున్నది. రాముఁడు సీతను చూడ లేకపోయినను ఆయన హృదయమున ఆమె లేని క్షణము లేదు. ఒకే దేహమున పార్వతీ పరమేశ్వరులు. ఒకే హృదయములో సీతారాములు. వీటికి ఎడము లేదు. విరహము లేదు. దూరస్థితి లేదు. ఆస్థితి వచ్చినచో జగత్ప్రళయమే.
ఈ రహస్యమును మొదట తెల్లము జేసినాఁడు హనుమంతుఁడు.
అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్యచాస్యాం ప్రతిష్ఠితం.
తేనేయం సచ ధర్మాత్మా ముహూర్తమపి జీవతి.
(సుం.కాం. 15 - 52.)
( ఈ సీతమ్మ హృదయమున శ్రీరాముఁడు ఆ శ్రీరాముని హృదయమున సీతమ్మ ప్రతిష్ఠితులై ఉన్నారు. కావుననే ఆ ధర్మాత్ముఁడు జీవించి యున్నాఁడు. )
ఒకే తటాకమున చక్రవాకముల జంట ఉన్నది. రెండూ ఒకే తామరతూడును మెసవినవి. ఒకే తామరాకు గొడుగు క్రింద నిద్రించినవి. రెండూ ఒక పద్మమునందలి మధువునే త్రాగినవి. భిన్న ప్రయత్నములతో పర్యాయముగా కూయుచున్న ఆ చక్రవాక మిధునము యొక్క కూత ఏక కంఠముగానే విన వచ్చుచున్నది. శారీరకముగా ద్వైతమై కనిపించుచున్నను ఆ పక్షి జంట అద్వైతమును వ్యాఖ్యానించు చున్నదని ‘ఘన కవి’ వర్ణించి యున్నాఁడు. విశ్వనాథ తన వర్ణనల యందు ఈ రహస్యమును మరువ లేదు. 
ఈ విధముగ విశ్వనాథ తన స్వీయ ప్రతిభతో మూల రామాయణమునకు తన కల్ప వృక్షము అనువాదము కాని విధముగా రామాయణమునకు  గల ప్రసిద్ధ వ్యాఖ్యానములకు రామ కథా నాటక కర్తల భావములకు అనువాదముగా తీర్చి దిద్దుచునే స్వంత మార్గములో కల్ప వృక్షమును వెలయించినాఁడు. 
సీతా వియోగ స్థితిలో నున్నశ్రీరాముని లక్ష్మణుఁడు తన మధుర ప్రియాలాపములతో ఊరడించి ఆయన మనస్సును శాంతపరచును. 
ఈ విధముగా వసంతము ఒక వంక అధిక దుఃఖమును; మరొక వంక ఆత్మానందమును కల్పించు చుండగా ఆ శ్రీరామ చంద్రుఁడు పొందిన భావ సంఘర్షణను విశ్వనాథ అనితర సాధ్యమైన భావుకతతో కవితా సృష్టి కావించి యున్నాఁడు. 
ఇతి శమ్.
ఓ శ్రీరామచంద్రా!
నీ దయ లేక యేరికిని నిన్ గ్రహియించుట శక్యమౌనె? నీ
పాద సరోరుహ ద్వయము భావన సేయుట శక్యమౌనె? నీ
మేదుర కార్యముల్ మదికి మేలనిపించుట శక్యమౌనె? నా
పై దయ చూపినావొ? ప్రభువా! హృదయమ్మున కల్పవృక్షమై.
జై శ్రీరాం.
ఇంతటితో  "ఏబది భాగములు గా నే చెప్పఁ బూనిన ‘శ్రీమద్రామాయణ కల్ప వృక్షము నందలి’ విశ్వనాథ భావుకత"  నేటికి సంపూర్ణమైనదని తెలుపుటకు ఆనందిస్తున్నాను.
ఇట్లు
సుహృద్విధేయుఁడు;
బులుసు వేంకటేశ్వర్లు.(సెల్. 9949175899.) 
కల్పవృక్షం.
ESIహాస్పటల్ దగ్గర.
చిట్టివలస.
విశాఖపట్టణం జిల్లా.
పిన్. 531162.
హిందూదేశము.
ఆంధ్రామృతాస్వాదనా లోలులారా!
కల్పవృక్షము క్రింద సేద తీరిన కవి వతంసుల కమనీయమగు కంఠధ్వనిగా వెలువడిన విశ్వనాథ భావుకత ఏబది భాగములు రసజ్ఞులగు పాఠక పుంగవుల కందించేలా ఆ శ్రీరామ చంద్రుఁడు నాచే చేయించి తన భక్తులపై తాను చూపించే  అవ్యాజానురాగాన్ని రుజువు చేసుకొన్నాఁడు. అట్టి శ్రీరాములవారికి సీతమ్మకు పాదాభివందనం చేస్తున్నాను.
సాహితీ ప్రియులారా! 
ఈ ఏబది భాగములూ పరి పూర్ణముగా చదివి మీ అమూల్యమైన వ్యాఖ్యానమును మీరు మీ ఆంధ్రామృతమునకందించినట్లైతే అవి కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లుగారు ముద్రించబోవుచున్న పుస్తకమునందు మీరు చూపిన ఆదరణపై గల గౌరవభావంతో మీ వ్యాఖ్యాన రూపంలో ఉండు వ్యాసాల్ని ప్రచురింపనున్నారు. 
కావున అత్యంత శ్రద్ధ చూపి మీరు మీమీ వ్యాఖ్యానాలు వ్రాసి పంప గలందులకు మనసారా కోరుచున్నాను.
ఎంతో శ్రమించి ఎంతో ఉత్సాహంతో నిరంతరాయంగా ఏబదిభాగములుగా ఉపన్యాసాలిచ్చిన ప్రియ సాహితీ మిత్రులగు కవి వతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారికి ఆంధ్రామృతం తరపున అభినందనలతో పాటు హృదయ పూర్వక కృతజ్ఞతలను కూడా తెలియఁజేసుకొంటున్నాను.   
ఆదరించిన పాఠక లోకానికి కూడా కృతజ్ఞతలు తెలియఁ జేసుకొంటున్నాను.
జైహింద్.

Print this post

6 comments:

bulusu venkateswarlu చెప్పారు...

అంతరంగం
బులుసు వేంకటేశ్వర్లు. తే.04 - 06 - 2010.
ఆధునిక కవుల్లో నాకు విశ్వనాథ అభిమాన కవి. వారు రచించిన తెలుగు ఋతువులు నేను చదవడంతో ప్రారంభమైన ఆ అభిరుచి నాలో దినదిన ప్రవర్ధమానమై; పెద్దల ఉపన్యాసాలు వినడం వల్లా; వారు చేసే వ్యాఖ్యానాలవల్లా మరింత ఎదిగి కల్పవృక్షము అయింది. చివరికి అది నా యింటికి పేరై కూర్చొంది.
క్రమేపి ఆ విశ్వనాథ సాహిత్య విశ్వరూపం నన్ను కష్టాల్లో ఓదార్చింది. సుఖాల్లోనూ తోడయింది. ఎన్ని పద్యాలు! ఏమి సృష్టి! ఎంత భావుకత! ఒక పద్యం మనకి నచ్చిందంటే అది తలచుకోగానే మనకు వెఱ్ఱి ఆనందం కలుగుతోందంటే కారణం ఏమిటి? ఆ భావం మనకు నచ్చిందా? పద్యం నడక బాగుందా? కల్పన మిన్ను ముట్టిందా? హృదయాన్ని తట్టిందా?


ఏదో ఒక విలక్షణత ఉండే ఉంటుంది. ప్రతి మహా కవి వాక్కులోనూ వ్యక్తమౌతున్న కాంతి సర్వాంగీణంగా ద్యోతకమౌతూనే ఉంటుంది. ఆ కావ్య నాదంలో కరగిపోయి బాహ్య జగత్తుకు రాగానే విచారణ ప్రారంభమౌతుంది. సుఖ దుఃఖాలను మనిషి ఒక్కడే భరించ లేడు. ఎవరితోనో పంచుకోవాలి. అదిగో అప్పుడు ప్రారంభమౌతుంది చర్చ.
ఆ పద్యంలో ఏ అలంకారముంది? రీతి ఏటువంటిది? రసమేమిటి? ఔచిత్య స్థాయి ఎంత? ఈ మూల్యాంకనలో సగం ఆనందం ఆవిరి అవుతుంది. ఇక మిగిలింది సగం. ఆ సగంలోను అనిర్వాచ్యమైన ఆనందాన్ని తూచడానికి మనం ఉపయోగించే నీరస పదాల వల్ల మరో సగం ఆనందం అదృశ్యం. ఇక మిగిలింది నాలుగో వంతు మాత్రమే. ఆ మాత్రానికే సహృదయుఁడు ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నాఁడు. ఉద్వేగానికి గురి అవుతున్నాఁడు. కళ్ళు చెమర్చుతున్నాఁడు.


అటువంటి సహృదయుల వల్లనే ఈ కావ్య ప్రపంచం సృష్టింపఁబడింది. కవిత్వ రచన మినహా మిగిలిన అర్హతలన్నీ కవితో పాటు కలిగినవాఁడు సహృదయుఁడు. కవితో సమానమైన హృదయం కలవాఁడు సహృదయుఁడు. అంటే మంచివాఁడని అర్థం కాదు. (కవి సహృదయాఖ్యం విజయతే)


రామాయణ కల్ప వృక్షంలో కిష్కింధ కాండ నూపుర ఖండం లోని ఒకటి నుండి ఏభై పద్యాలు నేను "కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత" పేరున వ్యాఖ్యానిస్తూ ఉపన్యాసాలిచ్చాను. ఇస్తున్నాను కూడా.
మిత్రులు శ్రీ చింతా రామ కృష్ణా రావు గారు విశ్రాంత ఆంధ్ర ఉపన్యాసకులు, స్వయంగా ప్రతిభ కల కవులయి ఉండి కూడా నా యందు ప్రేమతో ఈ వ్యాసాలు వ్రాయమని కోరారు. మొదట సరే అని దిగినా క్రమంగా విశ్వనాథ భావుకతలోని లోతు నాకు తెలియ వచ్చింది. ఇది నా వల్ల కాదు అనిపించింది. దిగితే కాని లోతు తెలియదని ఊరికే అన్నారా?


మిత్రులు శ్రీ చింతా వారు వారం వారం నన్ను ప్రోత్సహిస్తూ ప్రపంచ వ్యాప్తంగా సాహిత్య ప్రేమికుల ‘కామెంట్స్’ వినిపిస్తూ వెన్ను తట్టారు. మొత్తం మీద విశ్వనాథ భావుకత శీర్షిక పూర్తి చేయించారు.


అట్టి రామ కృష్ణా రావు గారికి; ఈ నా వ్యాసాలు చదివి సూచనలతో శుభాకాంక్షలతో స్పందించిన సాహిత్యాభిమానులకీ; నా హృదయ పూర్వక నమో వాకాలు. ధన్యవాదాలు.
నా వ్రాతలో ఏమైన తప్పులుంటే పొరపాట్లు దొల్లితే మన్నించి - నాకు తెలుపుతారని ఆశిస్తున్నాను.


"కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత" ఒక పుస్తక రూపంలోకి తీసుకు వచ్చినప్పుడు మరింత సరళతరం చేస్తానని మనవి చేసుకొంటున్నాను. మీరు ఆంధ్రామృతంలో ఈ నా వ్యాసాలపై చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకొనగలనని మనవి చేయుచున్నాను.
ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రామృతం బ్లాగు నిర్వాహకులు, మిత్రులు శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి నమస్కారాలు తెలుపుకొంటున్నాను.
సెలవ్.
మీ
బులుసు వేంకటేశ్వర్లు.
చిట్టివలస.
విశాఖపట్టణం జిల్లా

సురేష్ బాబు చెప్పారు...

ఇంతటి మహోన్నత భక్తిభావాలను పొంగిపొరల్చే భావనలను కోల్పోతున్న వారిదే కదా దౌర్భాగ్యము.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీ బులుసు వేంకటేశ్వర్లుగారికి.
ఆర్యా!
కవి వతంస! మీ అంతరంగమును నేను
అంతరంగంబు పేరిడి యచ్చు చేసి
బ్లాగునందున నుంచితి భవ్య మూర్తి!
వీలు కలిగిన చూడుడు వివరముగను.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సురేష్ బాబూ సంతోషం. మీకు నా ధన్యవాదములు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఇంతటి మహత్తర రసవత్తర కావ్యాన్ని చదవ గల అదృష్టం నా పూర్వ జన్మ సుకృతం

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
కవి సమ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి భావు కతను [ సోదర తుల్యులు ] కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారు తమ ఉపన్యాసముల ద్వార అందించిన కృషిని [ సోదరుడు చిరంజీవి ] శ్రీ చింతా రామకృష్ణా రావు గారు " మందార ,మకరంద ,మాధుర్యమున దేలు " అన్నట్లు అందమైన చందస్సులు ,రసరమ్య మైన అలంకారములు,చక్కని చిక్కని సమాసములు ,తమ కవిత్వము నందు రంగరించి మనోల్లాస భరిత మైన భావ పరం పరలను తమ కలము నందలంకరించి అమృతపు జల్లులు కురిపించి అందరినీ,ఎందరినో అలరించి భావ జగత్తులొ ముంచి పులకించి తరింప జేసారు.
అంతటి మహత్తర మైన కావ్యాన్ని రాముని విరహ వేదనలొ కనుపించిన ప్రకృతిని ఎప్పటి కప్పుడు అత్యంత రమణీయంగా కన్నుల ముందుంచి రాముని పాత్రలొ లీనమై జనించి జీవించి తరింప జేసారు .ఒకవైపు వసంత మాసపు ప్రకృతి అందాలు మరొక వైపు భరించ లేని రాముని వేదన లోనె పొందిన ఆత్మానందము .అదే కాబోలు " బాధే సౌఖమనే భావన అంటే " నిజంగా చదువు తున్నంత సేపు ఆ ప్రకృతిలొ రామునితొ బాటుగా ఉన్నామేమొ అన్నంత బ్రమ
నిజంగా చెప్పాలంటే ఇంత గొప్ప మహత్తరమైన కావ్యాన్ని ఏ " గ్రంధాలయంలొ " మాత్రం చదవగలం ? ఇంత సులభంగా ,ఇంత విపులంగా, ఇంత రసవత్తరంగా ఇలా చదవ గలగడం మా పూర్వ జన్మ సుకృతం .ఈ అమృత భాండాన్ని మాకందించిన ఘనత శ్రీ కవివతంస బులుసు వేంకటేశ్వర్లు గారు మరిత మెరుగులు దిద్ది కృషి చేసిన చింతా వారు మిక్కిలి ప్రసంస నీయులు ." రాముడు సీత వేరుకాదని ఇద్దరి మధ్య యెడ బాటన్నది లేదని రెండు హృదయాలు ఒకటేనని చక్కగా వివ రించారు.
ఏబది భాగములు పూర్తిగా చదివిన పిమ్మట ఎంతో నిరుత్సాహం ఎంతో ఆత్మీయతను పోగొట్టుకున్న బాధ రామునితో గల ఆత్మీయకు దూరమై పోతున్న నిర్లిప్తత ఏదో నిధి మననుంచి వీడి ఫొతున్న వేదన ఇలా ఈ నీరస భావాన్ని చెప్పుకుంటూ పోతె దరి దొరకదు
ఇంతటి భావయుక్త మైన కావ్యాన్ని మళ్ళీ అందించ గలిగితె ఎంత అదృష్టం ? మాకా అదృష్టాన్ని కలిగించ మని కోరుతూ కృతజ్ఞతా భి వందములు తెలుకుటున్నాను నాది ఒక చిన్న కలం ఎంతో రాయాలని ఉన్నా దానికి లేదంత బలం.ఏదైనా పొరబడితే మన్నించ గలరు సెలవు రాజేశ్వరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.