గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, జూన్ 2010, మంగళవారం

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 49.

 రిక్షాపై వున్నది కవిసామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు. ఇది గుంటూరులో తీసిన పోటో.
చంపుట చంపుటే యనును జానకి హేతు వివక్షచే ఫలం
బింపగుఁ గాని యిప్పటికి నేమగునో యఘమేమొ యన్న వా
క్యంపు యదార్హమున్ జరిగె నక్కట  తాదృశ సీతఁ బాసి సై
రింపులు దక్కి యుండుట భరింపగ జాల నిమేష మేనియున్.
(వి.రా.క.వృ.కి.కా.నూ.స. 1 - 49)
గతములో పంచవటి ప్రాంతమున సీత తనతో పలికిన మాటలనే భావించు చున్నాఁడు శ్రీరాముఁడు. సీత యేమనినది?
ఏ కారణము కానీయండి. చంపడము చంపడమే. కొన్ని జీవులను ఆకలి కోసం చంపుతున్నారు. కొందరు రాక్షసులను ధర్మ రక్షన పేరున చంపుతున్నారు. ఇలా కారణములు చెప్పుకోవడం వల్ల మనస్సు సమాధాన పడుతుందేమో కాని పాపమేమో?  ఈ హింస వల్ల మున్ముందు మనకు ఏమి యగునో? అని బోధించు సీతను ఎడబాసి ఈ విరహాన్ని సహిస్తూ ఒక్క నిమిషం కూడా ఉండ లేనయ్యా లక్ష్మణా ! అన్నాఁడు శ్రీరాముఁడు.
ప్రతి నిమిషం జానకీ స్మరణమున ఆమె చేష్టలూ సంభాషణలు జ్ఞాపకం వచ్చి తత్ భావనల యందు వివశుఁడగుచున్న శ్రీరాముని ఇక్కడ మనం దర్శించ వచ్చును. 
అప్పటి శ్రీరాముఁడు మునుల కోరికపై వారి ధర్మ రక్షణ కొఱకు ఆయుధము పట్టితినని సీతతో పలికిన రాముఁడు ప్రాణి హింస ఫలితముగానే ఈ సీతా వియోగము సంభవించినదేమోనను ఆలోచన చేయుచున్నట్లు భావింప వచ్చును. 
సీత మాటలు ఎట్టివో భవభూతి తన ఉత్తర రామ చరిత్ర నాటకమున రామునితో ఇట్లు పలికించినాఁడు.
మ్లానస్య జీవ కుసుమస్య వికాసనాని సంతర్పణాని సకలేంద్రియ మోహనాని
ఏతాని తే సువచనాని సరోరుహాక్షి కర్ణామృతాని మనసశ్చ రసాయనాని.
(వాడిపోతున్న జీవ కుసుమానికి నీ మాటలు వికాసములు. తృప్తిని కలిగించేవి. సకలేంద్రియములను మోహింపఁ జేయునవి. అంతే కాదు. ఓ సీతా! నీ పలుకులు కర్ణామృతములు. మనసునకు మధుర రసాయనము వంటివి.)
యథా రసాయనస్య రసమయత్వాత్ భోగ్యత్వం ఔషధత్వాత్ భోగ నివర్తకత్వం చ ఏవ మేతేషామపి ప్రియత్వం హితత్వంచేతి రసాయనత్వోక్తిః. అని వ్యాఖ్యానింపఁ బడినది.
సీత సుతీక్ష్ణనుని ఆశ్రమములో శ్రీరామునకు హింస చేయవలదని చెప్పిన మాటలలోనిదీ పద్యము.
క్రూర మృగంబులున్ దితిజ కోటియు కానన హింస్రజంతువుల్
క్రూరత సింహముల్ పులులు ఘోణులు గుంపులు కట్టి యుండ నా
క్రూర మృగంబులందున నొకొండు వధించినఁ దక్క నన్నియున్ 
వారక కోప మూని పగఁ బట్టి చరింపవె మూక లెత్తుచున్.
(అరణ్య. కాం. 1 - 200)
(క్రూర మృగాలైన పులులు; సింహాలు; అడవి పందులు; మరియు రాక్షసులు అడవిలో గుంపులు కట్టి తిరుగాడుచుండగా ఆ మృగాలలో ఒక్క దానిని నీవు చంపినచో మిగిలినవన్నీ పగఁ బట్టి దండెత్తి రాకుండా ఉండునా?) 
 " ఏ స్పృహా సందోహమ్ములచే చలించి యిది ఈ జ్యావల్లి సంధించుటల్"
(ఏ కోరికతో అల్లె త్రాటిని సంధించు చున్నావో చెప్పుము) అని ప్రశ్నించిన సీత మాటలకు ప్రభావితుఁడైన శ్రీరాముఁడు గత పద్యములో జ్యావల్లిని మ్రోగింపుము చాలును అనినాఁడు.
పద్యములో జానకి పద ప్రయోగము సాభిప్రాయము. జనకుఁడు రాజర్షి. సత్వ గుణ ప్రథానమైన ఆర్జవ జీవితమును గడుపువాఁడు. ఆయన కూతురైన జానకి ఆ గుణములు పుణికి పుచ్చుకొన్నదని ధ్వని. సీతను వదలి వియోగాగ్నిని భరిస్తూ సహిస్తూ నిమిషమైనన్ నిలువ లేనని శ్రీరాముఁడు పలుకుట పరాకాష్టకు చెందుచున్న విప్రలంభ అవస్తకు సూచనము.
మూలములో 
త్వంహి బాణ ధనుష్పాణిః భ్రాతా సహ వనం గతః
దృష్ట్వా వన చరాన్ సర్వాన్ కశ్చిత్ కుర్యాశ్శరవ్యయం.
(నీవు లక్ష్మణునితో కలిసి ధనుష్పాణివై అడవికి వెళ్ళి రాక్షసులను చూచి బాణములను వేయుచుందువు. )
అని యుండగా కేవలము శ్లోకము లోని వన చరాన్ అను మాటను ఆధారము చేసుకొని విశ్వనాథ సీత మాటలను ఎంత మనోహరముగా తీర్చినాఁడో పాఠకులు గమనించ గలరు.
శ్రీమద్రామాయణ కల్ప వృక్షమును విశ్వనాథ నా సకల ఊహ వైభవ సనాథము అని పేర్కొనినాఁడు. నిజమే కదా!
జైశ్రీరామ్.
గౌరవ పాఠకులారా! కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీమద్రామాయణ కల్ప వృక్షము రచనలో తనకు గల సాహితీ ప్రకర్షనంతనూ చొప్పించి రచించారు. అది మనమెంతగా చదివినా అర్థం చేసుకున్నాం అనుకున్నా మళ్ళీ మళ్ళీ తరిచి తరిచి చూస్తున్నకొద్దీ మనకు కొత్త క్రొత్త భావాలు స్ఫురిస్తూనే ఉంటాయన్న మాట అనుభవైకవేద్యమేకదా! అటువంటి విశ్వనాథ వారు తన రామాయణ కల్ప వృక్షమున చొప్పించిన భావుకతను కవివతంస శీ బులుసు వేంకటేశ్వర్లు గారు చాలా కృషి చేసి ఉపన్యాస రూపంలో సాహితీ ప్రియులకదించడమన్నది ఒక మహద్భాగ్యంగా భావిస్తున్నాను. అట్టి వ్యాసాలలోని సారాంశాన్ని ఒక ఏభై భాగాలుగా నిరంతరాయంగా అందించాలనే నా ప్రయత్నం  రాబోయే మరొక్క భాగంతో నెరవేరబోతున్నందుకు ఆనందంగా ఉంది.
సాహితీ ప్రియులైన మీరు " శ్రీ బులుసు వేంకటేశ్వర్లు" అనేలేబిల్ తో ఉన్న ఈ వ్యాసాలను ఆకళింపు చేసుకొని మీ మీ అభిప్రాయాలను వ్యాస రూపంలో ఆంధ్రామృతానికి అందించ గలరని ఆశిస్తూ మీ వ్యాసాలకై ఎదురు చూస్తుంటాను. మీరు పంపే వ్యాసాలను ఆంధ్రామృతం బ్లాగు ద్వారా పాఠకుల కందరికీ అందుబాటులోకి తేవాలనే నాభిప్రాయాన్ని మీరు గౌరవిస్తారని భావిస్తున్నాను.
జైహింద్  Print this post

2 comments:

కథా మంజరి చెప్పారు...

విశ్వనాథ సత్య నారాయణ గారి అపురూప చిత్రరాజాన్ని అందించినందుకు మీకు నా ధన్యవాదాలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

విశ్వనాధ వారి చిత్ర పటాన్ని అందించి నందుకు ధన్య వాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.