పారావారము ధారుణిం బుడిసిటం బట్టంగ సామర్థ్య సం
భరంబుండిన నుండవచ్చు నొనరింపం బోవ నేకైక దే
శారంభంబు ఫలంబునున్ క్రమముగా స్వాధీనమౌ గాని ద్రా
క్స్ఫారవ్యక్తము గావు సర్వ జగతీ సంసృష్టి సంహారముల్.
(శీ.వి.నా.రా.క.వృ.కి.కాం.నూ.స.1- 45)
సముద్రాన్నీ భూమినీ పిడికిలితో పట్టే సామర్థ్యం మనకు ఉంటే ఉండ వచ్చు. కాని ఒక కార్యము చేయడానికి మొదలుపెడితే ఆ పనిని విభాగించుకొని ఒక్కొక్కటిగా చేయలి. అప్పుడే దాని ఫలం మనకు లభిస్తుంది. ఈ సృష్టి మాత్రం ఒక్క సారిగా పుట్టిందా? ఒక్కసారే హటాత్తుహా మాయమయ్యేదా?
ఉద్విగ్న హృదయుఁడైయున్న శ్రీరాముని యందు కొంత స్తిమిత భావం ఉదయించినట్లు మనకు పై పద్యం ద్వారా తెలుస్తుంది.ఎంతగా సీతా విరహ దుఃఖితుఁడు అయినా ఆయన తన ఆత్మ ధర్మమును వీడ లేదని గ్రహించ వచ్చును.
శ్రీరాముని సహజ స్వభావము ఎట్టిది? ఆయన వేద వేదాంగ తత్వజ్ఞుఁడు. మరియు నియతాత్ముఁడు. అదీనాత్ముఁడు. శత్రువునందు కూడా దయ చూపు స్వభావము కలవాఁడు.
అంతే కాదు.
విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియ దర్శినః.
కాలాగ్ని సదృశ్ః క్రోధే క్షమయా పృథివీ సమః.
శ్రీరాముఁడు పరాక్రమములో విష్ణువుతో, ప్రియ దర్శనములో చంద్రునితో, కోపమున ప్రళయాగ్నితో, ఓర్పున భూమితో పోల్చ దగిన వాఁడు.
నియతాత్మా మహా వీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ అని వాల్మీకము పేర్కొన్నది. నిశ్చయ స్వభావుఁడు. నిర్వికార స్వరూపుఁడు. స్వయం ప్రకాశ ప్రభావుఁడు. ప్రపంచమునే తన వశములో ఉంచుకొనిన సర్వేశ్వరుఁడు అని కీర్తింపఁ బడిన వాఁడు. (నియతాత్ములకే వశమగువాఁడు అని భావము.)
వాల్మీకము నందు వలెనే శ్రీరాముఁడు కల్ప వృక్షమునందు కూడా మానవుఁడు - దేవుఁడు అను రెండు భావములతోనూ కావ్య చమత్కార మార్గమున విశ్వనాథ అ పాత్రను తీర్చి దిద్దినాఁడు.
కల్ప వృక్షము లోని శ్రీరాముఁడు కొన్ని చోట్ల అచ్చము మన వలెనే ఒక సామాన్య మానవ మాత్రునిగా కనబడును. సుఖ దుఃఖములు లాభ నష్టములు యోగ వియోగములు కోప తాపములు శృంగార వీర కరుణ అద్భుత సన్నివేశములందు ఆయన ఒక సామాన్యుని వలె స్పందించును. అసామాన్యుని వలె కనిపించును. ఇట్లు తీర్చి దిద్దుట రస సాధన యందు ఒక భాగముగా విశ్వనాథ తలచెను. శ్రీరాముఁడు కేవలము నిర్వికార నిరంజన అవ్యయ సచ్చిదానంద పరమాత్మ స్వరూపముగా వర్ణించినచో రామాయణము కావ్యము కాకుండా పురాణము అయి ఉండెడిది.
కావున మహాకవి వాల్మీకి మార్గమును కొంత విస్త్రుతి పరచుచు శ్రీరాముని పాత్ర యందు పాఠకులకు ఆత్మీయత కలుగునట్లు చేసియున్నాఁడు.
పంపా సరస్సు నందలి సమగ్ర సౌందర్యాన్ని ఒక్క సారిగ చూచి మాటలతో చెప్పడానికి సాధ్యం కావడం లేదని మనస్సు ఒక్కొక్క వస్తువునే పరామర్శించుచున్నదని తలపోసిన శ్రీరాముఁడు ఇప్పుడు కార్య సాధన కూడా ఒక్కొక్క సోపానముగా జరుగ వలసి యున్నదని హఠాత్తుగా ఏదీ సంభవము కాదని ఆలోచన చేయుచున్నాఁడు.
సీతా విరహమునకాతరుఁడై దుఃఖితుఁడైన శ్రీరాముని యందు ఆ ఉద్విగ్న భావము శాంతించు చున్నప్పుడు స్వామిలో వివేక స్వరూపము ప్రకాశించుచుండుట మనము గమనింప వచ్చును. మాయావరణము తొలగినచో జ్ఞాన దర్శనమే కదా! మరియు శ్రీరాముని యందు ఈ చిత్త వృత్తియు తాత్కాలికమే. ఏమైనను పంపా సరోవర దర్శనమునందలి తన సౌందర్యానుభవ పరిధిరామునకొక గుణపాఠమై ఆయన యందు ఆవేశమునకు బదులుగా ఆలోచనను ప్రేరేపించినట్లు విశ్వనాథ వ్రాయుట బహు సూక్ష్మమైన శిల్ప విశేషముగా మనం గ్రహించ వచ్చును.
జై శ్రీరాం.
చూచాం కదండీ కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు వారి ఉపన్యాసమునుండి నలుబది ఐదవ పద్యంలో గల భావుకతను. తరువాత పద్యం అతి త్వరలో తెలుసుకొందాం.
జైహింద్