గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, జులై 2009, ఆదివారం

సమస్యా పూరణ చేసి చూద్దాం.


సాహితీ బంధువులారా!

మనమీ మధ్య సమస్యాపూరణములను చేయాలనే ఆకాంక్ష ఉన్నప్పటికీ అలసులమై ఉన్నామనిపిస్తోంది కదా! ప్రస్తుతం ఒక సమస్య మన ముందుకొస్తోంది. పరిశీలించండి.

కృపణుని తోడ దానమున గెల్వగ నెవ్వరు గల్గు నిద్ధరన్!

చంపక మాల వృత్తంలో నున్న ఈ సమస్యను మనం ప్రయత్నిస్తే సునాయాసంగానే పూరించ వచ్చేమో ప్రయత్నించి చూద్దామా? మరెందు కలస్యం? వెంటనే ప్రయత్నించి పూరించి, పంపండి.
జైహింద్.

Print this post

6 comments:

కంది శంకరయ్య చెప్పారు...

సమస్య:- కృపణునితోడ దానమున గెల్వఁగ నెవ్వఁడు గల్గు నిద్ధరన్.
పూరణ (1):-
చం. ఎపుడయినన్ దయామతుల కెవ్వనితోడను స్నేహమొప్పదో?
కృప గల సూర్యసంభవుఁడు కీర్తి వహించిన దెట్టి కార్యమౌ?
నెపము గణింపకన్ మిగుల నిక్కెడి మూర్ఖుని రీతి యెట్టిదో?
కృపణునితోడ దానమున గెల్వఁగ నెవ్వఁడు గల్గు నిద్ధరన్.

పూరణ (2):-
చం. కృపకు సముద్రుఁడై విమల కీర్తికి పాత్రత పొందునట్టి చ
ర్యల నొనరించుచున్ జనుల కక్కరఁ దీర్చుచు లేదు కాదటం
చలుఁగక నర్థి లోకమున కన్ని యొసంగెడు కర్ణు నిర్దయా
కృపణునితోడ దానమున గెల్వఁగ నెవ్వఁడు గల్గు నిద్ధరన్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

కంది శంకరయ్య కమనీయ పూరణ
లందు మొదటిదుండె నద్భుతముగ.
ప్రాస తప్పకున్న ప్రథమము నకు మించి
యుండెగాదె చూడ రెండవదియు.

కంది శంకరయ్య చెప్పారు...

నన్నిపుడు రామకృష్ణా
మన్నింపుము, ప్రాసదోషమయమగు పద్యం
బెన్నడు వ్రాయని నేనిపు
డన్నన్నా వ్రాసి తెట్టు లాశ్చర్యమయెన్.

ఎట్టి యాలోచనల్ నన్ను చుట్టుకొనెనొ
పద్యమును వ్రాయునప్పుడు ప్రాసదోష
మొదవె; మీరు చెప్పెడివర కెదకుఁ దోచ
దట్టి పద్యమున్ సవరించి పెట్టుదు నిక.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శంకర!చింత చెందకుము.సాధు జనావళి తోడనుండినన్
వంకర వర్తనుల్ మనదు వంకనుజూచిన చాలు వచ్చుగా
వంకర టింకరల్గలుగు వాగ్ఝరి. వచ్చును దోష సంహతుల్.
జంకును మాని వ్రాయుడు. ప్రజల్ మిము మెత్తురు తప్పకుండగన్.

కంది శంకరయ్య చెప్పారు...

రామకృష్ణారావు గారూ, నా సవరించిన పద్యం ఇది ....
కృపకు సముద్రుఁడై విమల కీర్తికి పాత్రత పొందుచున్ సతం
బుపకృతు లెన్నొ చేసెడి మహోన్నతుఁ డాతఁడు కర్ణుఁడే; జనం
బెపుడును మెచ్చ నింద్రునకు నేనియు దాతగ నిల్చు నిర్దయా
కృపణుని తోడ దానమున గెల్వఁగ నెవ్వఁడు గల్గు నిద్ధరన్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

కంది వరాన్వయా! కమల గర్భిని రాణి వశంబునున్నదా!
ఎందును ఇంతచక్కనగు ఇట్టి ప్రపూరణ చేయజాల రిం
కెందుకు, మీదు శక్తి గన నించుకయాశజనించె. తెల్పుడీ
జంకును లేక ఎట్టు తమ చక్కనికైతలు వెల్వరింపనౌన్?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.