గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, జులై 2009, శుక్రవారం

ఓ ఆంధ్ర భాషాభిమానీ! మరి మీరేమంటారు?

ఆంధ్రామృతాస్వాదనాలోలురందరికీ వందనం అభివందనం.
ఆంధ్ర రాష్ట్రానికే కేంద్రమైన భాగ్యనగరంలో ఆంధ్ర భాషలో మాటాడేవారి శాతం ప్రక్కన పెట్టి, మాటాడే వారిలోనైనా భాషాభిమానం గలవారి శాతమెంతుంటుందో ప్రశ్నించుకొంటే మనకు సంతృప్తినే యిస్తుందో, లేక అసంతృప్తినే కలిగిస్తుందో తెలియదు. కారణం బహుశా జీవన గమనంలో అనివార్య పరిస్తితులే అయి వుండ వచ్చు. ఐనప్పటికీ నేడు మన భాషనీ, రాబోయే కాలంలో మన చిఱునామానే మరచిపోయే స్థితి ఉంటుందనే యదార్థం మనం జీర్ణించుకో లేని నిజం కాదంటారా?

సౌజన్య మూర్తులనేక మంది తమకు గల భాషాభిమానం తమ బ్లాగుల ద్వారా భాషకు జీవం పోస్తూ తమ మాతృభాషాభిమానాన్ని చాట గలుగు తున్నారు. ఆ పుణ్య మూర్తులందరికీ అభినందనలు.

మాతృ భాష లోనే మహనీయమైన స్ఫూర్తిని కలిగించడం సులభతరం. అది కూడా ప్రాచీన మహాకవులాశ్రయించిన పద్య రచనలో చేసినట్లయితే అది పటిష్ఠమై శాశ్వితప్రయోజనకారి కాగలదేమో ఆలోచించ వలసి వుంది. మానసిక ఉల్లాసం మనకి ఉన్నప్పుడు మనం సునిశితమైన జ్ఞానాన్ని ప్రదర్శించే అవకాశం చాలా ఎక్కువ. మనకి మనంగా పద్యం వ్రాయ గలిగిన నాడు మనకి మానసిక మైన విశ్వాసంతో పాటు, మనో వికాసం కూడాకలుగు తుందని మనం భావించ వచ్చు ననుకొంటాను.

గద్య రచన చాలా చక్కని మార్గం మన భావం యితరులకు తెలియ జేయడానికి. ఐతే అది తాత్కాలిక ప్రయోజన కారి మాత్రమే. అదే మనం పద్య రూపంలో ఉన్న మహా కవుల భావావేశ పూరిత బోధనలు నిత్య నూతనోత్తేజకాలనడంలో సందేహం ఉండదనుకొంటాను. అందుచేత మనం సులభ పద్ధతిలో పద్య రచన చేసిన వేమన లాంటి మహాకవుల జాడలో నడవడం ద్వారా ఉడుతా భక్తిగా నైనా మనం భాషాభిమానాన్ని చాట గలమేమో ఆలోచించుకొంటే కొంతైనా చేయగలమేమో.

ఇప్పుడు మనం సులభ తరంగా వుండే ఆట వెలదిలో గాని, తేటగీతిలో గాని మన భావాలను తెలిపే ప్రయత్నం ఎందుకు చేయ కూడదు. ఆలోచించి -- -- --
మీ అభిప్రాయాన్ని ఛందోబద్ధం చేసి వ్యాఖ్యగా పంపే ప్రయత్నం చేయండి. అలా చేయడం ద్వారా మన శక్తి మనకు తెలియడమే కాక, మనకు తెలియని అనేక విషయాలు తెలుసుకొనే అవకాశం మనకు కలుగుతుంది. అనేక మంది మనభావాలను అర్థం చేసుకోవడంతో పాటు, వారి అమూల్యమైన అభిప్రాయాలతో మనకు జ్ఞాన ప్రబోధ కూడా చేస్తారు. మరైతే ఆలస్యమెందుకు? మీరు మీ అభిప్రాయాల్ని పోష్టు చేయండి. ధన్య వాదాలు నమస్తే.
జైహింద్. Print this post

2 comments:

అజ్ఞాత చెప్పారు...

క్షమించండి. మీకు నచ్చినా నచ్చకున్నా నేను తెలుగువాడినే.కానీ,నాకు ఛందస్సు తెలీదు.పద్యం రాయటం అంతకన్నా రాదు.అందుచేత నా భాషాభిమానాన్ని అలా చెప్పలేను.నాకు నచ్చిన నా తెలుగు భాషలో నేచెప్తే వినే ఓపిక మీకుంటే, నా బ్లాగు మొత్తం చదవండి.

భాషాభిమానుల్లో కొందరు పద్యాలనిష్టపడతారుగానీ, భాషాభిమానులంతా పద్యాలు రాయలేరు.మున్ముందు అసలే రాయలేరనేది నా అనుమానం.కానీ, పద్యాలు కూడా జనాలకి అలవోకగా వచ్చేలా రాయలంటే, నాకు ఓ మార్గం తోస్తోంది. రోజువారి విషయాలనేవైతే నాలాంటివారిష్టపడి చదువుకుంటామో, ఛందస్సు తెలిసిన మీలాంటివారలాంటి విషయాలను సులభ పద్యరూపంలో చెబుతూ పోతే,విషయం మీదున్న ఆసక్తి వల్ల కాస్త చదువుతారేమో!కానీ ఆ ఛాన్సు కూడా చాలా చాలా తక్కువ.
బహుసశా - సానియా, ఇలియానా లాంటి గ్లామర్ కోషియంటున్న విషయాలతో, వాటి బొమ్మలతో ప్రయత్నిస్తే, దీన్ని సాధించవచ్చు.కానీ, ఆధ్యాత్మిక మార్గంలో ఆరితేరిన మనకి, ఈ గ్లామర్ కోషియంటు గురించి పట్టింపు ఉండదు గావున, మన విషయాలలో ప్రజలకి అంత ఇష్టం ఉండదుగావున, పద్యంలో మీర్రాసింది చదివే ఆసక్తి కూడా జనాలకి ఉండకపోవచ్చునని భవదీయుడి తుచ్చ అభిప్రాయము. అందుచేత, మీ ఆలోచనని కొనసాగించినా, ఈ ఆలోచన అందరికీ ఆమోదయోగ్యము కాదన్న సత్యమును గ్రహించి,మరియొక ఆలోచననేదైన చెప్ప దొడంగినచో, వినమ్రుడై విని తరించెదను.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

క:-
రవిరాజా! మీ మాటలు
సవినయముగ నెఱిగినాడ! సజ్జన నుత! మీ
వివవరణ నిజమే యగునయ.
భువిపై మన భాషకెటుల ప్రోత్సాహమగున్?
క:-
ఛందము నెఱుగం దలచిన
సుందరముగ నేర్వ వచ్చు. సుగుణాంభోధీ!
అందరి వాడగు వేమన
సుందరముగ చెప్పలేదె? శోభిల కవితల్!

చ:-
వచనము లోన చెప్పనగు. వద్దనలేదు. గ్రహించిరేని. మీ
రచనలు పద్యమందు వివరంబుగ నిత్యము కాగ వ్రాయగా
సుచరితులైన మిమ్ము, తమ సుందర పద్యము లందు గాంచుచున్
రచనలు చేయ నేర్చుచు, విరాజిలు లోకులు. నిక్కమే కదా!

క:-
గద్యము పెక్కురు గాంతురు.
పద్యము కను కొందరేను. ప్రస్ఫుట ఫణితిన్
పద్యము నిలుచును నిత్యము.
గద్యము తత్కాల శోభ గాంచి నశించున్.

క:-
ఔనన్నా కాదన్నా
జ్ఞానంబు నొసంగు పద్య కవితను విడినన్
ప్రాణము భాషకు నిలుచునె?
దీన స్థితి పొంది, మనదు తేజము పోదే?

వచన కవితను వద్దన లేదు. పద్య రచన ద్వారా మన భావాల్ని శాశ్వితంగా స్థిరంగా నిలుపగలుగ వచ్చని నా భావన మీరు గ్రహించే వుంటా రనుకొంటాను. నమస్తే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.