గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, జులై 2009, ఆదివారం

దారిద్ర్యన్ని రూపు మాప గలిగేదెవరో! ఎప్పుడొస్తారో!

ప్రజా జీవితాలకు చుట్టు ముట్టిన యీ దారిద్ర్యాన్ని మాపే దెవరు?

శ్లో:-
దగ్ధం ఖాండవ మర్జునేనచ వృథా దివ్యౌషధైర్భూషితం!
దగ్ధా వాయు సుతేన హేమ రచితా లంకా పురీ స్వర్గ భూః!
దగ్ధః సర్వ సుఖాస్పదశ్చ మదనో హాహా! వృథా శంభునా!
దారిద్ర్యం ఘన తాప దం భువి నృణాం కేనాపి నో దగ్ధ్యతే!

ఉ:-
దగ్ధము చేసె ఖాండవము దర్పము జూపుచు నర్జునుండు. తా
దగ్ధము చేసె లంక నల దండన జేయుచు నాంజనేయుడున్.
దగ్ధము చేసె మన్మధుని తా పరమేశుడు. ధాత్రిపై నిటన్
దగ్ధము జేయ నేర్వరుగదా! పురి విప్పెడి యీ దరిద్రమున్.

భావము:-
దివ్యౌషధ స్థావరమైన ఖాండవ వనమును అర్జునుడు దగ్ధము చేసెను. భూలోక స్వర్గమైన లంకను హనుమంతుడు దగ్ధము చేసెను. సర్వ సుఖాస్పదుడగు మన్మధుని ఆ పరమేశ్వరుడు దగ్ధము చేసెను. లోకములో అత్యంత బాధాకరమగు దరిద్రమును మాత్రము ఎవ్వరునూ దగ్ధము చేయు జాలకుండిరి కదా!

రోజు రోజుకూ పెరిగి పోతున్న నిత్యావసర వస్తువులు కొన జాలక దరిద్ర దేవత చేజిక్కి బాధ పడుచున్న దీన జన జీవన యానము మిక్కిలి కష్ట తరము. అత్యంత బాధా కరము. ఈ దారిద్ర్యమును బాపగల దైవాంశ సంభూతులు ఎప్పుడు ముందునకు వచ్చి కార్యోన్ముఖులగుదురో యని, తమ దారిద్ర్యమెప్పుడు బాపుదురో యని దీన జనులు ఉపేక్షించుచున్నారు.

జైహింద్.
Print this post

4 comments:

durgeswara చెప్పారు...

అప్పుడేనా సాధుహింస ఇంకాపెరగాలి కదా ఆసమయము మనకు ముందుకొస్తూనే కనపడుతున్నది కదా ?

కంది శంకరయ్య చెప్పారు...

మంచి శ్లోకాన్ని పరిచయం చేసారు. ధన్యవాదాలు. అయితే ఈ శ్లోకం ఎక్కడిదో చెప్పలేదు. మొదటి పాదంలో "దివ్యౌపిదైర్భూషితం" అని కాక "దివ్యౌషధైర్భూషితం" అని ఉండాలనుకుంటాను.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

క:-
దుర్గేశ్వర మీ మాటల
స్వర్గాధిపు డైన గాని చక్కగ మెచ్చున్.
దుర్గుణ గణ సంచారము
భర్గుడు కనకున్నె? పట్టు పట్టక యున్నే?

క:-
దివ్యౌషిధమన దోషము.
దివ్యౌషధమనగ నొప్పు. దీపిత మయ్యెన్
దివ్యంబుగ మీ కృపచే.
భవ్యాత్మా! శంక రాఖ్య వరగుణ వర్యా!

సరి చేసితి నా దోషము.
సరస గుణా! చదువు చుండి , చక్కగ నాకున్
సరియగు సూచనలిచ్చుచు
చరియించెడి మీకు శుభము జరుగుత! యెపుడున్.

కంది శంకరయ్య చెప్పారు...

రామకృష్ణారావు గారూ,
"దగ్ధం ఖాండవ మర్జునేన ...." శ్లోకం, దానికి మే అనువాదం చాలా బాగున్నాయి. ఏదో బాల్య చాపల్యంతో నేనూ దాన్ని అనువదించి పంపుతున్నాను. గుణదోషవిచారణ చేసి దాన్ని వ్యాఖ్యానించ వలసిందిగా మనవి.

సీ. దివ్యౌషధుల్ గల్గి తేజరిల్లెడు ఖాండ
వారణ్యముం గాల్చె నర్జునుండు
స్వర్ణమయంబయి భాసించు నా లంక
నగ్నిపా లొనరించె నాంజనేయుఁ
డానందకారకుఁడై యొప్పు కుసుమాస్త్రు
బూడిదగాఁ జేసె పురవిరోధి
(అతిలోక సౌందర్య మలరారు తన దేహ
మగ్ని కాహుతి చేసె నయ్యొ సతియు
తే. అంద మానంద మారోగ్య మందఁ జేయు
నట్టివానినిఁ గాల్చుట వ్యర్థమయ్యె
నన్ని దుఃఖంబులకు హేతు వైనయట్టి
పాడు దారిద్ర్యమును గాల్చు వారె లేరు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.