గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, జులై 2009, మంగళవారం

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 28

ప్రియ సాహితీ బంధువులారా! విశ్వనాధ భావుకతను శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారు వివరించిన 28వభాగాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

దిగంతమువరకు వ్యాపించి యున్న పంపా సరోవర సౌందర్యము శ్రీరాముని మనస్సును లోగొని - కొన్ని క్షణములు సీతా వియోగము దుఃఖమును మరపింప జేసినది. పంపా సరస్సు ఎట్లున్నది?

పంపా సరస్సు నందలి నీరు స్వచ్ఛమై నీలి వర్ణమున ప్రకాశించు చున్నది. దానిపై తెల్లని హంసలు తమ ఎఱ్ఱని కాళ్ళతో బంగారు రంగు ఱెక్కలతో నీటిని కదుపుచూ ఎగురు చున్నవి. గుంపులుగా ఎగురు చున్న హంసల ఱెక్కలు, కాళ్ళు తగిలి నీటి బిందువులు (తుమ్పరలు) వ్యాపింపగా వానిపై బాల సూర్య కిరణములు ప్రతిఫలించు చున్నవి. రాత్రి అంతయు ముకుళిత పద్మములందు బందీలైపోయిన తుమ్మెదలు తమ నల్లని రెక్కలపై పద్మ పరాగములను పూసుకొని, పైకి ఎగురుచున్నవి. రామణీయకతా వారి రాశి. (అందాల నీటి నెలవు) యైన పంప అమృత వీధులకు ప్రాణములు "పంప"గా చూచు చున్నాను.

నీటి నీల వర్ణము ఆకాశము కాగా హంసల కాళ్ళు ఎఱుపు రంగు రెక్కల చివరల పసిడి రంగు తుంపురులపై లేయెండ తుమ్మెదలపైని పుష్ప రాగపు పసుపు రంగులు ఇవి అన్నియు వివర్తతములై క్షణ కషణావర్తిత అర్థ వృత్త సందర్శనములై రామునకు పంపా సరస్సుపై విరిసిన అనిర్వచనీయ సౌందర్యమైన ఇంద్ర ధనుస్సు కనిపించినది.

హంసలు ఒక చోటు నుండి మరొక చోటునకు ఎగురునప్పుడు ఱెక్కలు సాచి అర్థ వృత్తాకారమున నీటి ఉపరి తలమున నడచినట్లే నడచి సరోవర జలమును కల్లోలము చేయుచు లేచు చున్నవి. ఆ సందర్భమున ఎక్కడి కక్కడ అవి జల బిందువుల యందు చిన్న చిన్న హరివిల్లులను సృష్టించుచునే మొత్తముగా సరస్సును చూచునప్పుడు మనోజ్ఞమైన పంపా సరస్సుపై ఇటు నుండి అటు ఇంద్ర ధనుః ఖండమును సృష్టించు చున్నవి.

ఇంత మనోహర దృశ్యము శ్రీరామునకు సీతా వియోగ దుఃఖమును మరపించినది.

ఈ చక్కని విషయాన్ని నిక్షిప్తం చేసిన విశ్వనాధ వారి పద్యం ఇదీ.
సీ:-
నీటి మట్టము గాగ నీలముల్ పరి లఘుల్ - జలముల ఱెక్కల చరణములను,
కదుపుచు నెగురు నీ మద మరాళంబులు - కాళ్ళ యెఱ్ఱనయు ఱెక్కల చివళ్ళ
పసిడి కాంతియు పరిప్లవమాన శీకర - గత బాల మార్తాండ కర నివహము,
పంపైక దేశంబు పాకారి నవ చాప - ఖండ మనోజ్ఞ రేఖన్ దనర్చు.
గీ:-
వారిజాంతరోచ్చలిత బంభర గరుత్ ప - రాగ సాధు కిర్శీర వర్ణములు కలసి
రామణీయ కతా వారి రాశి పంప - అమృత వీధుల యందు ప్రాణములు పంప. { వి.రా.క.వృ.కి.కాం.నూ.౨౮}

రామాయణ కల్ప వృక్షములో ఇది అద్భుత పద్యము అన వచ్చును. లోకోత్తర పద్య రచన అన వచ్చును. అపూర్వ భావ నిర్మాణ నైపుణ్యమని చేతులు జోడించ వచ్చును. అనిదం పూర్వ భావుకత అని మూదలించ వచ్చును. అనితర సాధ్యమైన కవిసమ్రాట్ కావ్య సృష్టిగా నిరూపించ వచ్చును.

మనం సాహిత్యంలోని సౌందర్య భావ బంధురమైన ఒక్క పద్యం స్మృతికి తెచ్చుకొని మనం జీవితమున ఆనందింప దలచినచో తత్ క్షణమే కంఠస్థము చేయ దగిన పద్యం ఇది.

చూచాం గదండీ! ఇక ఆలస్యమెందుకు ఈ పద్యాన్ని మనం ఇప్పుడే కంఠస్థం చేసేద్దాం.
జైహింద్. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.