నమస్తే. రాబోతున్న 21-9-2008 వ తేదీనే గురజాడ జయంతి.ఈ జయంతి సందర్భంగా అతని జన్మ స్థలమైన సర్వసిద్ధిరాయవారంలో అతని జయన్తివేడుకలు జరుపుతున్నాం. ఆ ప్రజా కవి స్ఫూర్తితో మనం కూడా మన రచనలతో గురజాడ అడుగు జాడలలో నడిచే వారికి ప్రోత్సాహాన్నిద్దాం. " ఆధునిక కవితా వైతాళికుడు " మన గురజాడ.
ప్రాచీన సంప్రదాయానువర్తులు గేయాల్ని సంప్రదాయవిరుద్ధ రచనలుగా గణించి ఆదరిమ్పకున్దురుగాక. యదార్థానికి ప్రాచీన గ్రంధస్థ భాష పంచదార పానకంలాగా పరిమిత ప్రయోజనం కలది. వాడుక భాష మంచినీరులాగా బహుళ ప్రయోజనం కలది.ఈ సత్యాన్ని గ్రహించారు కాబట్టే గిడుగు, గురజాడ మున్నగువారు వ్యావహారిక భాషా ఉద్యమానికి నడుం కట్టారు.కృతకృత్యులయ్యారు. అలాగని వారు ఛందో బాహ్యంగా కవితలు చేసారనుకోవడం సరికాదేమో. గురజాడ గేయాలలో మాత్రా ఛందస్సు గోచరిస్తుంది. " దేశమును ప్రేమించుమన్నా.....మంచి అన్నది పెంచుమన్నా...... వట్టి మాటలు కట్టిపెట్టోయ్....... గట్టి మేల్ తలపెట్టవోయ్. ఇది పరిశీలిస్తే లయ బద్ధమయిన మాత్రా బద్ధత కనిపిస్తుంది. ఇది ఛందో బద్ధం కాదని యెలాగనగలమ్?దీనిని సంప్రదాయచందాల్లో " మత్తకోకిల " తో తైపారువేసి చూసుకోవచ్చు. .......
మత్త :-పుట్టి పుట్టడు నేడు దొంగిల బోయి మాయిలు సొచ్చి తా
నుట్టి యందక రోళ్ళు పీటల నొక్క ప్రోవిడి యెక్కి చే
పెట్టజాలక కుండక్రిందొక పెద్ద తూటొనరించి మీ
పట్టి మీగడ పాలు చేరల పట్టి ద్రావె తలోదరీ. ....................ఇది భాగవతం లోని పద్యం. ...కొంచం పరిశీలించి చుడండి. అంట వరకు ఎందుకు. ఛందో నిబద్దం కాని లేదా మాత్రానిబద్ధం కాని కవితలు ప్రజల నాల్కలమీద నర్తన ఏ రకంగా చేయగలవు? అంటే వాడుక భాషోద్యమం ఛందస్సుకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం కాదని, వాడుక భాషను బహుళ ప్రయోజనాన్ని ఆశించి నడిపిన ఉద్యమమని అనుకో వచ్చునేమో. .........అటు ప్రాచీనులకు విరుద్ధం కాని, ఇటు వ్యావహారిక విరుద్ధం కాని విధంగా వ్యవహారిక ఛందో బద్ధ కవిత్వం సముచితమనిపిస్తోంది. మరి మీరేమంటారు?
గురజాడ రచనల స్ఫూర్తితో వెలువడే మీ రచనలకై నేనెదురు చూడనా?మళ్ళీ కలుసుకొందాం. నమస్తే.
చింతా రామ కృష్ణా రావు.
ఆంధ్రామృతం.
Print this post
9, సెప్టెంబర్ 2008, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.