గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, మార్చి 2017, సోమవారం

ఇంతకీ హేమలంబి ఉగాది ఎప్పుడు? రాజపూజ్యం అవమానాల నిర్ణయం

జైశ్రీరామ్.
శ్రీ హేమలంబి ఉగాది ఎప్పుడు జరుపుకోవాలనే అంశంలో జరుగుచున్న తర్జన భర్జనలు మనలను సందేహంలో పడేస్తున్నాయి.
నేనైతే మధ్యేమార్గంగా ఒక మార్గాన్ని ఎంచుకున్నాను. అది ఎలాగ అంటారా? చూడండి.
28-3-2017 సూర్యోదయానికి ఫాల్గుణబహుళ అమావాశ్య ఉన్నది. హేమలంబి చైత్రశుద్ధ పాడ్యము 28-3-2017 రాత్రి అనగా 29-3-2017 సూర్యోదయానికి ముందే గతిస్తున్నది.
ఉదయాత్ ఉదయం వారం అన్నారు కదా! 29-3-2017 సూర్యోదయాత్ పూర్వం విదియ రాక మునుపే, పాడ్యమి పోకముందే ప్రాత: కాలీన కృత్యాలు ముగించుకొని ఉగాదు జరుపుకొంటే శాస్త్ర విరుద్ధమూ అవదు. అమావాశ్యతో కూడిన పాడ్యమీ అవదు. కాబట్టి నేను నన్ననుసరించు మిత్రబాంధవులతో ఇదే పద్ధతికి కట్టుబడి జరుపుకొంటున్నము. ఇక మీ విషయంలో మీ ఇష్టం. ఆత్మ బుద్ధిః సుఖంచైవ అన్నారుకదా!. శుభమస్తు.

పంచాంగాలలో ఇచ్చే రాజపూజ్యం అవమానాల నిర్ణయం
సంవత్సరంలో ప్రతి రాశి వారికి రాజపూజ్యం అవమానాలు ఈ క్రింది విధంగా నిర్ణయించాలి.
శ్లో:- రాశి సంఖ్యా నృపశ్చైక్యం త్రినిఘ్నం బాణ సంయుతం 
మునిభిర్భాజితం శేషం రాజా పూజ్యామిహేచ్యతే
తల్లబ్ధం పుర నిఘ్నంచ పంచ సంఖ్యాయుతం పదం
మునిభిర్భాజితం శేషం అవమానమితిస్మృతమ్ ΙΙ
రవ్యాది వారాధిపతులకు మనపూర్వులు ధ్రువాంకాలను నిర్ణయించారు.
రవి-6, చంద్రుడు-15, కుజుడు-8, బుధుడు- 17, గురువు-19, శుక్రుడు-21, శని-10.
ఈ ధ్రువాంకాలు మారవు. స్ధిరంగా ఉంటాయి. రాశి సంఖ్యను మేషాదిగా నిర్ణయించాలి.
సంవత్సర రాజపూజ్య, అవమానాలను గుణించే విధానం:-
రాశి సంఖ్యకు సంవత్సర రాజు యొక్క ధృవాంకాలను కలపాలి. వచ్చిన సంఖ్యను 3 చేత గుణించాలి. గుణించగా వచ్చిన సంఖ్యకు 5 కలపాలి. కలపగా వచ్చిన సంఖ్యను 7 చేత భాగించాలి. భాగించగా వచ్చిన శేషం రాజా పూజ్యమవుతుంది. భాగించగా వచ్చిన లబ్ధాన్ని 3 చేత గుణించాలి. గుణించగా వచ్చిన సంఖ్యకు 5 కలపాలి. కలపగా వచ్చిన సంఖ్యను 7 చేత భాగించగా వచ్చిన శేషం అవమానం అవుతుంది.
ఉదాహరణకు:- వృశ్చిక రాశి వారికి హేమలంబ నామ సంవత్సర రాజపూజ్య అవమానాలను నిర్ణయిద్దాం. హేమలంబ నామసంవత్సరం శుక్ల పాడ్యమి మంగళవారం కావున కుజుడి యొక్క ధృవాంకాలను -8, రాశి సంఖ్య మేషాదిగా 8 వది.
రాజపూజ్యం గుణించు విధానం
సంవత్సరాధిపతి రాజు అయిన కుజ ధృవాంకం -8, రాశి ధృవాంకం -8 కలపగా వచ్చిన సంఖ్య 16. కలపగా వచ్చిన 16 ను 3 చేత గుణించగా 48 వచ్చును. గుణించగా వచ్చిన సంఖ్యకు 5 కలపగా 53 వచ్చును. కలపగా వచ్చిన సంఖ్యను 7 చేత భాగించగా లబ్ధం 7 వచ్చును. శేషం 4 వచ్చును. శేషం 4 కాబట్టి హేమలంబ నామ సంవత్సరంలో వృశ్చికరాశి వారికి రాజపూజ్యం 4 అవుతుంది.
అవమానం గుణించు విధానం
రాజపూజ్యం గుణించినప్పుడు వచ్చిన లబ్ధం 7 ని 3 చేత గుణించగా వచ్చిన సంఖ్య 21. గుణించగా వచ్చిన సంఖ్యకు 5 కలపగా 26 వచ్చును. కలపగా వచ్చిన 26 సంఖ్యను 7 చేత భాగించాలి. భాగించగా వచ్చిన లబ్ధం 3. శేషం 5 అవుతుంది. కావున హేమలంబ నామ సంవత్సర వృశ్చికరాశి వారికి అవమానం 5 అవుతుంది.
హేమలంబ నామ సంవత్సర వృశ్చికరాశి వారికి రాజపూజ్యం 4 అవుతుంది. అవమానం 5 అవుతుంది.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.