గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, డిసెంబర్ 2015, శనివారం

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కలాశాలలో సంస్కృత సంభాషణా శిబిరము.

 జైశ్రీరామ్.
ఆర్యులారా! మాన్యశ్రీ మేడసాని మోహన్ వంటి ప్రముఖులను సమాజానికందించిన అత్యంత మహిమాన్విత మైన తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కలాశాల ఆవిర్భవించిన నాటి నుండి నేటికినీ అసాధారణ ప్రతిభా పాటవాలతో నిరంతరము పరిఢవిల్లుతూనే ఉంది. ఈ నిరంతర విద్యా ప్రదాన యజ్ఞ దీక్షా బద్ధులగు గురువుల అసాధారణ సేవా నిరతి అక్కడి విద్యార్థినీ విద్యార్తులలో సంస్కృత భాషాభిరతి పెంచుటయే కాక అనర్గలముగా సునాయాసముగా సంభాషింప సమర్థులగునట్లు శిక్షణనిచ్చుచు ప్రశంశింపఁబడుచున్నది. ఆ కలాశాల అధ్యక్షులు శ్రీ సురేందర్ గారు, సంస్కృత భాషాశాఖాధిపతులు డా.మాడుగుల అనిల్ గారు, డా.భూపతి గారు, శ్రీ భాస్కర శర్మ గారు, శ్రీ సుబ్రహ్మణ్య శర్మ గారు, శ్రీమతి భద్రకాళి మున్నగు ఉపన్యాసక వర్గము కళాశాలలో సంస్కృత సంభాషణ శిబిరం నిర్వహించిన, విద్యార్థులనుత్తేజితులను చేయుచున్న వార్త మీరూ చూడండి.
నిజమే.
సత్యము చూపు సంస్కృతము. సత్యము తెల్పె సురేంద్రవర్యులున్.
నిత్యము సంస్కరింపఁగల నిర్జర భాషయె మానవాళి యౌ
న్నత్యము పెంచుఁ గావున సనాతన సంసంస్కృత భాషణంబునన్
నిత్యమనన్య సాధనను నేర్పరులై సుగతుల్ గనందగున్.
అని నా అభిప్రయము.
మాడుగుల మురళీధర శర్మ, 
సిద్ధిపేట-9440478439.
ఇలా అభిప్రాయపడ్డారు.
సంస్కృతమ్ముజనని-సర్వభాషలకెల్ల!
సంస్కరించు మదిని-
సత్వరమ్ము!
సంస్కార విద్యలు-సంతరించిననాడు!
జనజాగృతియునొందు-
జగతిలోన!
ఆకాశ వీధిలో-ఆవిష్కృతాలన్ని-
శాస్త్రసాంకేతిక - చదువులన్ని!
దేశవి దేశాల దేవద త్తపుభాష-
సంస్కృత మూలమై- శాశ్వతమ్ము!

జనని చూపెడు ప్రేమలు చెప్ప నలవె!
ధనము కరుణను దాతృత్వ దయను పంచి!
విశ్వ విఖ్యాత విఫణిలో వేగిరమ్ము!
కీర్తి గాంచుట లోతోడు క్షేమ మిచ్చు! 
దీనిపై నా అభిప్రాయము.
మురళీధర! పలుకులలో 
సరళత, సంస్కృతప్రశస్తి, చక్కగ నొప్పెన్.
సురుచిర సీసమునందున
వరలించిరి కవన ప్రతిభ. వందనమార్యా!
ఆ కలాశాల దినదినాభివృద్ధిపథంలో నడిపే దమ్ముగల ఈ ఉపాధ్యాయ వర్గానికి నా కైమోడ్పులు.
కంద గీత గర్భ చంపక మాల.
ధర నుతమై సదా సకల దక్షత కన్గొన సంస్కృతంబుగా!
వరమదియే, సదా జయముఁ గొల్పెడి భాషయు సంస్కృతంబదే!.
సురనుతమౌ ప్రభన్ సభల శోభితమౌనది సంసంస్కృతంబు. వే
ద రమయగున్. మనన్ జనులు తప్పక నేర్చుడు సంస్కృతంబునే.
చంపక గర్భస్థ కందము..
నుతమై సదా సకల ద
క్షత కన్గొన సంస్కృతంబుగా! వర మదియే.
నుతమౌ ప్రభన్ సభల శో
భిత మౌనది సంసంస్కృతంబు వేద రమయగున్. 
చంపక గర్భస్థ తేట గీతి.
సకల దక్షత కన్గొన సంస్కృతంబు
జయముఁ గొల్పెడి భాషయు సంస్కృతంబ!
సభల శోభిత మౌనది సంసంస్కృతంబు. 
జనులు తప్పక నేర్చుడు సంస్కృతంబు.
జయతు సంస్కృతమ్. 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సంస్కృత భాషను గురించి ప్రముఖుల ఉపన్యాసములను వినగలగడం ముదావహం ఉపాధ్యాయ వర్గమునకు సమర్పించిన కంద ,గీత , గర్భ చంపకములు పరిమళ భరితములు . ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.