గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, డిసెంబర్ 2015, సోమవారం

ముక్కోటి ఏకాదశీ పర్వదినమైన నేడు మీ అందరికీ శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
పరమ పవిత్ర ముక్కోటి ఏకాదశీ పర్వదినమైన నేడు మీ అందరికీ శుభములు కలుగవలెనని కోరుచు, ఆ పరమాత్మ కరుణ మీకు ప్రాప్తించవలెనని ఆశించుచు మిమ్ములనభినందించుచున్నాను.
ఓం నమో నారాయణాయ.
ఎనలేనట్టి దయాంతరంగ హరి తానీ ఉత్తర ద్వార ద
ర్శనమున్గొల్పుచు భక్తపాళికొసగున్ శశ్వన్మహా భాగ్యముల్.
చని దర్శింపుడు శ్రీహరిన్ సకల పూజా భాగ్య సంప్రాప్తికై
కనుడెల్లప్పుడు శోభనాళి హరి సత్ కారుణ్య సంప్రాప్తులై.
ప్రతీ సంవత్సరమూ 24 ఏకాదశులు వచ్చును. సూర్యుడు ఉత్తరాయణమునకు మారే ముందు వచ్చెడి ధనుర్మాసమున శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అందురు. సూర్యుడు ధనుర్లగ్నములో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణము వరకు జరిగే 'మార్గం' మధ్య ముక్కోటి ఏకాదశి వచ్చుచుండును. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉండునని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారము వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థము వేచి ఉందురు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకమునకు దిగివచ్చి భక్తులకు దర్శనమిచ్చును కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చినది. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందున దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడ అందురు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలము, అమృతము పుట్టినవి. ఈ రోజునే శివుడు హాలాహలము మింగి చతుర్దశ భువనములను రక్షించెను. మహాబారత యుద్ధములో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించెనని అందురు.

ఈ రోజున వైష్ణవ ఆలయములలో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగములు ఉండును. ఉపవాసము, జాగరణ.జపము, ధ్యానము.ఈ రోజున చేయుదురు.

విష్ణుపురాణము ప్రకారము ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకముగా ఉన్నప్పటికీ మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచి ఉంచెనని, తమ కథ విని, వైకుంఠ ద్వారము ద్వారా వచ్చుచు విష్ణు స్వరూపమును చూసిన వారికి వైకుంఠ ప్రవేశము కల్పించవలెనని వారు కోరిరని. అందుజేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేయుదురనియు ప్రతీతి. మామూలు రోజులలో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసియే ఉంచుదురు. ఈ రోజు మాత్రము భక్తులు ఆ ఉత్తరద్వారము ద్వారా ప్రవేశించి స్వామివారి దర్శనము చేసుకొందురు.
జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అందరికీ ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు .

కంది శంకరయ్య చెప్పారు...

ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని చక్కగా వివరించారు. ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.