గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, ఫిబ్రవరి 2012, మంగళవారం

చినపాచిలిలో అష్టావధాన ప్రశ్నలు.

జైశ్రీరామ్.
సదసద్వివేక సంపన్నులారా!
తే.౩౦ - ౧౧ - ౨౦౧౧ దీ న  విశాఖపట్టణం జిల్ల రావికమతం మండలం చినపాచిలి గ్రామంలో శ్రీ వైష్ణవీదేవి ప్రతిష్టాపన సందర్భంగా అష్టావధానం జరిగింది.
అవధాని శ్రీమాన్ భద్రం వేణు గోపాలాచార్యులు గారు.
ఈ అవధానంలో పృచ్ఛకుల ప్రశ్నలను ముందు చూద్దాము.
తరువాత అవధానం జరిగిన విధానం మీ ముందుంచగలను.
౧. సమస్యా పూరణముః-
భార్యకు మీసముల్ మొలిచె. బాపురె భర్తకు గర్భమయ్యెనే.
౨. దత్త పదిః-
తాజా. - బాజా. - వాజా. - రాజా.
కందపద్యంలో వైష్ణవీదేవి స్తుతి.
౩. వర్ణనముః-
విదేశీ వ్యామోహంలో కొట్టిమిట్టాడుతున్న మనవారికి మన దేశ ఔన్నత్యాన్ని తెలుపుతూ సందేశమివ్వండి.
౪. ఉద్దిష్టాక్షరిః-
వైష్ణవీ పీఠ వ్యవస్థాపకులు సత్యనారాయణమూర్తి గారిని ఆశీర్వదించండి.
౩వ అక్షరం -  నా.
౮వ అక్షరం - ర్తి.
౧౨వ అక్షరం - ల్లి.
౧౫ వ అక్షరం - న్వ.
౨౧ వ అక్షరం - ఖ.
౧౪ వ అక్షరం - తి.
౨౭ వ అక్షరం - లి.
౩౧ వ అక్షరం - ద్మ.
౫. ఆశువుః-
౧. హిందూ దేశమునకు మూల బిందువేది?
౨. వైయ్యస్మరణముపై మీ అభిప్రాయం?
౬. పురాణముః-
౧. హరియను రెండక్షరములు పద్యం ఎందులోనిది? భావమేమిటి.
౨.హరిశ్చంద్రుఁడు ధీరోదాత్తుఁడు.నాటకములో ఎందుకు దుఃఖిస్తాఁడు?
౭. ఘంటా గణనముః-
౮. అప్రస్తుత ప్రసంగముః-
౧. శ్రీ రాముఁడు ఏక పత్నీ వ్రతుఁడు కదా! మరి ఈ వైష్ణవీదేవి రాకతో రాముఁడు ఏక పత్నీవ్రతుడుగా ఉంటాడా?
౨. గొఱ్ఱె పిల్ల గన్నది గొఱ్ఱె గొఱ్ఱె.
బఱ్ఱె పిల్ల గన్నది బఱ్ఱె బఱ్ఱె. అంటే ఏమిటి?
మిత్రులారా! చూచారు కదా? ప్రశ్నలు.
మీరు వీటికి సమాధానాలు వ్రాసి పంపగలిగితే పాఠకులకు అపురూపమైన సాహిత్యానుభూతి కలిగించినవారవతారు.
మీ సమాధానాలకై ఎదురు చూడనా? నమస్తే.
శ్రీమాన్ భద్రం వేణుగోపాలాచార్యులవారి అవధాన విశేషాలను నరువాత మీ ముందుంచ గలను.
జైహింద్.
Print this post

17 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సమస్యః-
భార్యకు మీసముల్ మొలిచె. బాపురె భర్తకు గర్భమయ్యెనే.
నా పూరణముః-

కార్య వివేక హీనతను కానమి, మందులు సంతు పొందగా
భార్యది భర్తయున్ మరియు భర్తది భార్యయు మ్రింగినారు. సౌం
దర్యము మాసిపోయినది. ధర్మ విరుద్ధ శరీర తత్వమై
భార్యకు మీసముల్ మొలిచె, బాపురె భర్తకు గర్భమాయెనే.

దత్త పదిః-
తాజా. - బాజా. - వాజా. - రాజా.
కందపద్యంలో వైష్ణవీదేవి స్తుతి.
దీనికి నా పూరణము.
కః-
తా జాణగ శ్రీవైష్ణవి
బాజాలవి మ్రోగుచుండ భాసించెను. దే
వా! జానకి వైష్ణవి కద!
రాజా! శ్రీవైష్ణవినిక రంజిల కనుమా.

వర్ణనముః-
విదేశీ వ్యామోహంలో కొట్టిమిట్టాడుతున్న మనవారికి మన దేశ ఔన్నత్యాన్ని తెలుపుతూ సందేశమివ్వండి.
దీనికి నేను చేసిన వర్ణనముః-
సనాతనప్రతిష్టగల్గి, సంప్రదాయ సంపదన్
మనోజ్ఞ రీతి దేశ కీర్తి మండలాంతరంబులున్
గనంగ నొప్పుభారతాంబ గౌరవంబు కానరా?
గనంగ రారె? మాతృ దేశ గౌరంబు నెంచుచున్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఉద్దిష్టాక్షరిః-
వైష్ణవీ పీఠ వ్యవస్థాపకులు సత్యనారాయణమూర్తి గారిని ఆశీర్వదించండి.
౩వ అక్షరం - నా.
౮వ అక్షరం - ర్తి.
౧౨వ అక్షరం - ల్లి.
౧౫ వ అక్షరం - న్వ.
౨౧ వ అక్షరం - ఖ.
౧౪ వ అక్షరం - తి.
౨౭ వ అక్షరం - లి.
౩౧ వ అక్షరం - ద్మ.
దీనికినా సమాధానముః-

సత్య నారయ సన్మూర్తి నిత్య మల్లి
నవ న్వ యయినట్లు సుఖ సద్గతి వరలి, భువి,
పద్మ నేత్రుని కృపఁ గను. భాగ్యమొందు.
సత్యనారయుఁడొందునౌన్నత్యమిలను.

ఆశువుః-
౧. హిందూ దేశమునకు మూల బిందువేది?
౨. వైయ్యస్మరణముపై మీ అభిప్రాయం?
వీటికి నా సమాధానముః-

హిందువులకు మూలంబగు
బిందువె ఓంకారమయ్య. వేల్పుల నిధియై
బిందువు హిందువుగాయెను.
సందేహంబేల నీకు సదసద్జ్ఞుండా!

రాజశేఖరుడెనలేని రాజసమున
నిండి యున్నాడు మనలోన గుండె నిండ.
రాజకీయము చేయగారాదు మీరు.
సత్య మరయుఁడు నిత్యమౌన్నత్యము గన.

Zilebi చెప్పారు...

స్త్రీ వాది సంఘం జరిపిన కలియుగ
'పుత్రికామేష్టి' యాగ విచిత్రము జూతము రారె!
ఈ యాగ మహత్వము వశమున
భార్యకు మీసముల్ మొలిచె, బాపురె భర్తకు గర్భమాయెనే!


(స్త్రీ వాది సంఘము వారు మీ బ్లాగు పై దుమికిన నేనందులకు ఎట్టి భాద్యత తీసుకోజాలను!!)

జిలేబి.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

పెద్దవారల గౌరవమ్మును పెంచురీతుల నుండుమా!
ముద్దుగారెడి పిల్లపాపల ముద్దుకృష్ణుని గాంచుమా!
హద్దెఱుంగుచు నీదువర్తన నందగించగ నెన్నడున్
సద్దుచేయక మంచి బుద్ధుల సంపదల్ మఱి పెంచుమా!

పెద్దవారిని గౌరవించుట, పిల్లల లాలించుట, సమాజం పట్ల మంచిబుద్ధితో హద్దెఱిగి ప్రవర్తించుట మనదేశ సంస్కృతి బోధించే పాఠాలు. ఇవి మానవాళి కంతా నేర్చుకోదగ్గవి.

శ్యామలీయం చెప్పారు...

రామకృష్ణారావుగారూ
నా శ్యామలీయం బ్లాగులో పోష్టు చేసిన
హైదరాబాదు మియాపూరులో విగ్రహప్రతిష్ట - ఆహ్వానము.

http://syamaliyam.blogspot.in/2012/02/blog-post.html

మీరు circulate చేయవలసినది.
(స్పష్టంగా తెలియదు, దీనికి నేమానివారు రావచ్చునని వార్త.)

శ్యామలీయం చెప్పారు...

జిలేబీగారి పుత్రకామేష్టి పాయింటు పట్టుకుని చేసిన పూరణ. (ఎందుకైనా మంచిదని స్త్రీవాద సంఘాలజోలికి పోకుండా!)

శా. ధైర్యము చేసినా రిచట దంపతు లిర్వురు నూత్నవైద్య దు
ష్కార్యము లీసడించి కడు ఛాందస బుధ్దిని పుత్రకామము
న్నార్య విధానమున్ స్వరము లక్కట తప్పులు గల్గినందుచే
భార్యకు మీసముల్ మొలిచె, బాపురె భర్తకు గర్భమాయెనే!

శ్యామలీయం చెప్పారు...

జిలేబీగారి పుత్రకామేష్తి ఐడియా వాడుకుని, నా పూరణ:

శా. ధైర్యము చేసినారు గద దంపతు లిర్వురు నూత్నవైద్య దు
ష్కార్యము లీసడించి కడు ఛాందస బుధ్దిని పుత్రకామము
న్నార్య విధానమున్ స్వరము లక్కట తప్పులు దొర్లినందుచే
భార్యకు మీసముల్ మొలిచె, బాపురె భర్తకు గర్భమాయెనే!

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

చింతా వారికి నమస్కారములు.అష్టావధాన వివరములను ఇచ్చు చున్నండులకు ధన్యవాదములు.
సమస్యా పూరణకు నా చిన్ని ప్రయత్నము....

భార్యకు గర్భమున్ మరియు భర్తకు మీసము లేదు చూడగా
ధైర్యము జెప్పి లోపమును దిద్దగ బూనెను వెజ్జు భర్తకున్

భార్యకు, మీసముల్ మొలిచె బాపురె భర్తకు, గర్భమాయెనే
భార్యకు వైద్య శేఖరుని ఫలితము నిచ్చెడి మంచి మందుతో.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

రా జాలును తల్లిని గన
తా 'జాగా' నిచ్చి మదిని దర్శిం పన్ రా
వా జాలిన్ వైష్ణవి యని
బాజా బాజంత్రి మ్రోత భక్తులు సలుపన్.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

రా జాలును తల్లిని గన
తా 'జాగా' నిచ్చి మదిని దర్శిం పన్ రా
వా జాలిన్ వైష్ణవి యని
బాజాలను మ్రోయ తల్లి వరముల నిచ్చున్.

రవి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రవి చెప్పారు...

భార్యను పెండ్లియాడి తొలి పండుగ విందున భక్ష్యభోజ్యమా
ధుర్యపుటంచులన్ గనియు తుందిలుడౌ పతి ప్రీతి తోడ- "స
త్కార్యము సీ!హసా" దనిన గర్వముఁ దృప్తియుఁ బెంపు వొందుచోన్
భార్యకు మీసముల్ మొలిచె. బాపురె భర్తకు గర్భమయ్యెనే.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

తాజాగా వెలసెను గుడి
బాజాలవె మ్రోగుచుండె భక్తిగ హృదికిన్ !
రాజాలగ నందరు నిటు దే
వా జాదర దెచ్చితి ప్రియముగ వైష్ణవి గొలువన్ !

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఇతర దేశము లందున్న వెతలు పడక
మాతృ భాషను విడనాడ మనకు తగదు
వేద నిధులకు కాణాచి విభవ మొసగు
తెలుగు సాంప్రదాయ మనంగ వెలుగు జిలుగు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.
అవధాన విశేషములను మా కందింఛి ఆనందాన్ని కలిగిస్తున్నందులకు శ్రీ చింతా వారికి అభినందనలు + కృతజ్ఞతలు .

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఆర్యుల మాటలన్ వినక నాశగ మందులు సంతు కోసమై
భార్యకు నీయబోయి తనవారడి చేతని తానుమ్రిం గ గా
వీర్యము పుష్టి నొంది తనువెంతయొ శోభను సంతరిం చుచున్
భార్యకు మీసముల్ మొలిచె బాపురె భర్తకు గర్భమయ్యెనే
-----------------------------------
వారడి = లోపము .

Pandita Nemani చెప్పారు...

భరత దేశము ఖ్యాతి గాంచెను పావనంబగు సీమగా
భరత సంస్కృతి వేదజాతము భద్రయోగద మొప్పుగా
భరత నేతలు ధర్మమూర్తులు భక్తిభావము వెల్గగా
భరత మాతను గొల్వ రండు శుభమ్ములొంది తరించుడీ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.