గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, ఫిబ్రవరి 2012, శుక్రవారం

భీష్మఏకాదశి సందర్భంగా పాఠకాళికి శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
భీష్మ ఏకాదశి సందర్భంగా దివ్య సహస్ర నామ విరాజిత  శ్రీ విష్ణు దేవుని  కరుణాకటాక్ష వీక్షణాలు అపారంగా మీ అందరిపై ప్రసరించాలనీ, అది మీకు అమందానందప్రదం కావాలనీ, మంగళప్రదం కావాలనీ ఆశిస్తున్నాను.
ఇట్టి విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని మాహాత్మ్యాన్ని తెలియ జేసిన ఆ భీష్ముడు శ్రీమదాంధ్రమహాభారతము - అనుశాసనిక పర్వమ - పంచమాశ్వాసము లో ప్రశంసింప బడిన విధము ఇప్పుడు చూద్దాము.
సకరుణదివ్యచిత్త పరి శాంతమహత్త్వవిధానవిత్త ని
ర్వికృతవిలాసహృద్య శ్రుతివిస్తరవిస్ఫురణైకవేద్య పా
వకబహుభవ్యనామ పరివర్ధనసంక్షయదూరధామ వి
శ్వకలితతోషణా సుభగ సాత్యవతేయ వచోవిభూషణా. 482,
సత్సేవ్యచరణ శమవ
ద్వాత్సల్యాభరణ ధర్మతత్త్వోద్ధరణా
హృత్సంగతభక్తిక దురి
తోత్సారణధుర్యదృఙ్మయూఖవిసరణా 483.
స్మయవిరహితపూజ్యా మంత్రగీతాధిరాజ్యా
నయనహిమగుసూర్యా నైష్ఠికక్షేమధుర్యా
దయితభువనరక్షా దాంతిసంపద్యతాక్షా
నియమ నికటవర్తీ నిష్కళానందమూర్తీ 484.
జైహింద్.
Print this post

2 comments:

Pandita Nemani చెప్పారు...

అయ్యా! మంచి విషయమును చూపించేరు. అభినందనలు. మా స్పందన పద్యములో చూడండి:

వరహృదయమ్మునన్ భువనవల్లభు నిల్పి నదీసుతుండు సా
దరమున జేసె స్తోత్రమును తామరసాక్ష సహస్ర నామముల్
సరస పవిత్ర భావ పద సంపద లింపెసలారు రీతిగా
పరమపదప్రదమ్మగుచు భాసిలె తత్కృతి ముజ్జగమ్ములన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

భీష్మ ఏకాదశీ పర్వ దినాన " అస్త్ర శస్త్ర విద్యా కోవిదుడు " మహాను భావుడు భీష్మా చార్యుల వారిచిత్ర పఠాన్ని అందించిన చింతా వారు ధన్యులు. శ్రీ పండిత నేమాని వారి పద్యం ప్రశంస నీయం. వందనములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.