గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, ఫిబ్రవరి 2009, శనివారం

మాతృ భాషా దినోత్సవ మనవి వినుడు.

క:-
కల్లా కపటము నెఱుగని
తల్లియె దీటైన గురువు తలపగ , నటులే!
ఉల్లాసము నుత్సాహము
వెల్లిఁ గొలుపు మాతృ భాష వేయి విధములన్.

క:-
మన జీవన మార్గంబును,
మన దగు సహ జాతమైన మహిమాదికముల్
మన రూపము మన సంపద
మనఁ దగు మనమైన మనము మనగనె యెపుడున్.

క:-
పుట్టుక తోడుత చర్మము,
పుట్టుకతో మాతృ భాష పుట్టిన యపుడే
పుట్టుచునుండును మనమది
ఎట్టుల మఱువంగ నగును యిల మన భాషన్?

తే.గీ:-
నేల విడిచిన సామది యేల మనకు?
మాతృ భాషను మఱచిన మార్గమేది?
మనకు గుర్తుగ నుండెడి మతృ భాష
మనము గుర్తింపకుండుట మంచి కాదు.

తే.గీ:-
మాతృ భాషాభిమానము మనము కలిగి
భాషణమునందు, మన పరిపాలనమున
నిత్యముపయుక్తమౌనట్లు నిండు మదిని
యత్న మొనరింపఁ దగునయ్య. అసదృశమది.

జైహింద్. Print this post

5 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఫిబ్రవరి 21 వ తేదీ. చరిత్రలో ఈ రోజు

* అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
* 1894: ప్రసిద్ధ శాస్త్రవేత్త శాంతిస్వరూప్ భట్నగర్ జన్మించాడు.
* 1971: ప్రసిద్ధ రంగస్థల నటుడు స్థానం నరసింహారావు మరణించాడు.

Sanath Sripathi చెప్పారు...

చిన్ని చిన్ని మాటలతో భావాన్ని, కర్తవ్యాన్ని బహు చక్కగా తెలియజెప్పరు. మీకు కృతజ్ఞతలు.

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

రామకృష్ణారావు గారు, చాలా రోజులనుంచి మిమ్మల్ని ఒక కోరిక కోరాలని వుంది. ఆ కోరిక ను ఈ సందర్భంగా వెలువరిస్తున్నాను. విషయానికి వస్తే పద్యాలు ఎలా వ్రాయాలో పద్య నడవడి, పదాల లాలిత్యము ఇవన్నీ చాలామంది చాలా వరకు పద్యాలు కంఠతా పెడితే తన్నుకుంటూ వస్తాయి అని చెప్తారు. నేనూ కొంత వరకూ ఏకీభవిస్తాను. కానీ పద్యాలు రాయాలనే కోరిక వుండి బుడి బుడి అడుగులు వేసే నాలాంటి చాలామందికి ఈ సూచన పని చేయదు. కారణం మా వద్ద పద్యాలకు సరిపడిన vacabulary వుండదు. వున్నా ఛందస్సు మధ్యలో పదాలు కిట్టించినట్టు ఇరుక్కుపోతాయి. నానార్థాల ప్రయోగాలు అసలే తెలియవు. సంధి సమాసాల మీద పట్టు వుండదు. ఇవన్నీ రాకుండా పద్యాలు వ్రాయడం ఎలా? వ్యాకరణ గ్రంధాలు వున్నాయని మీరనవచ్చు. వ్యాకరణము తెలిసినంత మాత్రానే పద్యాలు వ్రాయలేము కదా? అందుకని మీలాంటి వాళ్ళు పద్యాలు ఎలా వ్రాయాలి అనేది ఒక scientific manner లో మాలాంటి వారికి చిన్న చిన్న పదాలతో ( పద్య రూపంలో కాదు ) అర్థమయ్యేటట్టు ఏమైనా చెప్పగలరా?
పద్య రచన ఒక కళ, కాదనను కానీ ప్రతి కళ నేర్చుకోవడానికి కొన్ని పద్దతులు , పాఠాలు వున్నాయి. ( ఉదాహరణ గా సంగీతం తీసుకుంటే త్యాగరాజు గారి కృషి వల్ల ఒక క్రమ పద్ధతిలో చిన్న చిన్న పాఠాల నుంచి మొదలై గీతాలు,వర్ణాలు... ఇలా వుంటాయి కదా .... ) . మరి సామాన్యులు పద్యాలు వ్రాయడానికి ఇలాంటి కృషి మీరు చేస్తారని ఆసిస్తూ... www.haaram.com

Unknown చెప్పారు...

భాస్కర రామి రెడ్డి గారు అడిగిన విషయం గురించి ఆలోచించండి.మా బోంట్లకు బాగా ఉపకారంగా వుంటుంది.చాలా మందికి ఇటువంటిది ఒకటి వుంటే బాగుంటుందని అనిపిస్తుంది.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

1) ఆర్యా! భాస్కర రామి రెడ్డి గారూ!
మీ కుతూహలం చూచి నాకు చాలా ఆనందం కలిగింది. తప్పకుండా మీరు పద్యాలను హృద్యంగా వ్రాయ గలిగేలాగా నా ప్రయత్నం నేను చేయగలను.
పద్యాలలో చెప్ప వద్దన్నారు.

పద్యాలను వద్దంటేపద్యాలను వ్రాయుటెట్లు?
పలికేటపుడేపద్యాలవి వచ్చెస్తాయ్. పద్యాలే వ్రాయ గలరు పలుకుట కన్నా.

ఇది మీతో మాటాడినట్టూగావుంది కదూ?
ఇది కంద పద్యం.

పద్యాలను వద్దంటే
పద్యాలను వ్రాయుటెట్లు? పలికేటపుడే
పద్యాలవి వచ్చెస్తాయ్.
పద్యాలే వ్రాయ గలరు పలుకుట కన్నా.

సాధన అవసరం.
త్వరలో వీటిలో కిటుకులు మీకు తెలిజేయ యత్నింతును.

2) నరసింహగారూ.! తప్పకుండా మీసూచలను పరిశీలించి ప్రణాళికను త్వరలో సిద్ధం చేస్తానండి .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.