గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, ఫిబ్రవరి 2009, మంగళవారం

ఆట వెలది మీరు ఆడుతూ వ్రాయొచ్చు {పద్య రచనా శిక్షణ 1.}

ఆట వెలది మీరు ఆడుతూ వ్రాయొచ్చు.

ఆటవెలదినేర్చుకొందామా?

ఆటవెలది:-
ఆట వెలది మీరు ఆడుతూ వ్రాయొచ్చు.
తేట తేట తెలుగు మాట లల్లి.
ఎటుల వచ్చునంచు యీసడింపగ వద్దు
నేర్చుకొనుడు మీరు నేర్పుచుంటి.

ఆటవెలది:-
విశ్వదాభిరామ వినురవేమ యటంచు
విశద పరచె మనకు వేమన కవి.
పట్టు పట్టి మీరు పది పద్యములు నేర్వ
విశద మగును ఆటవెలది మీకు.

ఆటవెలది:-
ఇన గణ త్రయంబు యింద్ర ద్వయంబును
హంస పంచకంబు ఆటవెలది.
గణ గణములగు హంస గణములు. మఱి
హంస యన్న సూర్యుడయ్య. మఱియు

ఆటవెలది:-
నల . నగ . సల . . . . నాకాధిపతి గణాల్
ఇంద్ర గణములన్న యివియె. గాదె.
మూడు గణముల పయి ముఖ్యమయ్యా యతి.
ప్రాస యతియు చెల్లు . భవ్యులార!

ఆటవెలది:-
వ్రాసి చూపుడయ్య వక్ష్యమాణ విధిని
తేట తేట తెనుగు మాట లల్లి.
ఆట వెలది వ్రాయ నరసిన పిదపను
తేటగీతి మీకు తెలియ జేతు.

జైహింద్.gigil Print this post

8 comments:

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

ఆటవెలది యన్న అది యెంత సులభమో
తేటతెల్లముగను చెప్పినారు
ఆటలాడినట్టు పాటపాడినయట్టు
చిటికెలోన పట్టుదొరకునట్టు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆటవెలది :-
ఆటవెలది యన్న అది యెంత సులభమో
తేట తెల్లమవగ తెలిపినారు.
ఆటలాడినట్టు పాటపాడినయట్టు
చిటికెలోన పట్టు చిక్కి నట్టు

అని 2 వ పాదమును , 4వ పాదమును సరిచేయడం వలన యతి సరిపోతుంది కదా!
కొంచెం దృష్టి యతిమీద కూడా పెట్టితే నిర్దోషంగా మీరే వ్రాయగలరు.
అద్భుతంగా వ్రాసే సామర్ధ్యం మీకుందని ఆటవెలది పద్యాన్ని వెన్వెంటనే వ్రాసి నిరూపించుకొన్న మీకు
నా అభినందన మందారమాల.
మాటలరూపంలో అందిస్తున్నానందుకోండి.
ధన్య వాదాలు.

అజ్ఞాత చెప్పారు...

ఆటవెలది :-
ఆటవెలది యొక్క ఆసుపాసుల గూర్చి
తెలుసుకొన్న వాడ తెల్లముగను
సులువు గానె దీన్ని గెలువ జాలమా
మనసు పెట్టి మిమ్ము అనుసరిస్తే

అలానే దయచేసి, నా బ్లాగు ఒకసారి చూడండి మాస్టారు గారు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

{ భా } రవిగారూ!
ఆటవెలది :-
ఆటవెలది యొక్క ఆసుపాసుల గూర్చి
తెలుసుకొన్న వాడ తెల్లముగను
సులువు గానె దీన్ని గెలువ {జాలమా} జాలగ లేమొ?
మనసు పెట్టి మిమ్ము అనుస{రిస్తే}రింప
ఆటవెలది:-
మూడు నాల్గు పాదములనున్న దోషాలు
సరిగ చూడుమయ్య. సరస మతిరొ.
ఆసు పాసు కాదు ఆను పానులనంద్రు.
యతులు గూర్చినాడ వతులితముగ.
కందము:-
మీబ్లాగును చూచెదనయ.
నాబ్లాగును అనుసరించి నామది మెచ్చన్
మీబ్లాగున కవితామృత
మేబ్లాగున లేదనంగ తృప్తిగ నిడుమా.

అజ్ఞాత చెప్పారు...



కారు చీకటందు కాంతిపుంజము వోలె
ఎదురుపడితిరయ్య హృదికి గురిగ.
పట్టుకుదిరెనయ్య ఎట్టకేలకు నేర్వ
ఆటవెలది పలుకు హాయినొసగ.
UMA GANDHI MURAHARI RAO

Unknown చెప్పారు...

Thank you sir

డా.బిరుదు గంటి చెప్పారు...

కాకినంద వాడ అనెడి రెండవ మద్రాసు

డా.బిరుదు గంటి చెప్పారు...

కాకినంద వాడ అనెడి రెండవ మద్రాసు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.