గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, ఫిబ్రవరి 2009, బుధవారం

రుద్ర కవచము.

మానవుడు నిరంతర జీవన పోరాటంతో చాలా అలసట చెందుతూ తనకు ఊరటనిచ్చే మార్గం కోసం
నిరీక్షిస్తూ వుంటాడు. ముఖ్యంగా తాను అన్ని విధముల రక్షణ పొంద గలిగితే తాను జీవన పోరాటంలో ధైర్యం గా పాల్గొంటాడు.
ఐతే అన్ని విధములా ఆ పరమాత్మ తనకు రక్షణ కవచమై నిలిచేలా చేసే ఒక చక్కని ప్రక్రియ వుంది.
అదే రుద్ర కవచ పఠనము. ఆ విధంగా పఠనయోగ్యంగా వుండే రుద్ర కవచమ్ ఇప్పుడు మీ ముందుంచుతున్నాను.

దీనిని
నమ్మమని నేను కోఱ లేదు.
చదవమని ప్రార్ధించడం లేదు.

దీనిని విశ్వసించే వారు , కావాలని దీని కొఱకై తపించే వారు చాలా మంది నన్ను అడిగిన కారణంగా అట్టి వారికుపకరిస్తుందని వ్రాస్తున్నాను.

అక్కర లేనివారు దయచేసి చదవడం మానేయండి. అనవసరమైన విపరీత వ్యాఖ్యలు చేయ నవసరం లేదని సవినయంగా విన్నవించుకొనుచున్నాను.

రుద్ర కవచం.
దుర్వాస ఉవాచ:-
శ్లో:-
ప్రణమ్యామి శిరసా దేవం స్వయం భుం పరమేశ్వరం.
ఏకం సర్వ గతం దేవం సర్వ దేవ మయం విభుం.

భావము:-
తనకు తానుగా ఉద్భవించిన వాడును, అంతటను నిండి యున్న యేకైక దైవమును,
సకల దేవతా స్వరూపుడును, అగు పరమేశ్వరునకు శిరసు వంచి నమస్కరింతును.

శ్లో:-
రుద్ర వర్మ ప్రవక్షామి అంగ ప్రాణస్య రక్షయే.
అహో రాత్ర మయం దేవం రక్షార్థం నిర్మితం పురా.

భావము:-
అంగ ప్రాణముల రక్షణ కొఱకు రుద్ర కవచమును - అహో ర్త మయుడైన దేవ దేవుని చేత రక్షణ కొఱకు అతి పురాతన కాలములోనిర్మింప బడిన రుద్ర కవచమును అంగ ప్రాణ రక్షణ కొఱకు చెప్పు చున్నాను.

శ్లో:-
రుద్రో మే చాగ్రతః పాతు ముఖం పాతు మహేశ్వరః
శిరో మే యీశ్వరః పాతు లలాటం నీలలోహితః

భావము:-
రుద్రుడు ముందు నన్ను రక్షించు గాక. నా ముఖమును మహేశ్వరుడు రక్షించు గాక. నా శిరమును ఈశ్వరుడు రక్షించు గాక. నా లలాటమును నీలలోహితుడు రక్షించు గాక.

శ్లో:-
నేత్రయోస్త్రయంబకః పాతు ముఖం పాతు మహేశ్వరః
కర్ణయోః పాతుమే శంభుర్నాసికాయాం సదాశివః.

భావము:-
నా నేత్రములను త్ర్యంబకుడు రక్షించు గాక. నా ముఖమును మహేశ్వరుడు రక్షించు గాక.
నా చెవులను శంభుడు రక్షించు గాక. నా ముక్కును సదా శివుడు రక్షించు గాక.

శ్లో:-
వాగీశః పాతు మే జిహ్వా మోష్ఠా పాతంబికాపతిః
శ్రీ కంఠః పాతు మే గ్రీవాం బాహూంశ్చైవ పినాక ధృత్.

భావము:-
నా నాలుకను వాగీశుడు రక్షించు గాక. నా పెదవులను అంబికా పతి రక్షించు గాక.
నా కంఠమును శ్రీ కంఠుడు రక్షించు గాక. నా బాహువులను పినాక ధారి రక్షించు గాక.

శ్లో:-
హృదయం మే మహా దేవ ఈశ్వరో వ్యాత్ స్తనాంతరం
నాభిం కటిం వక్షశ్చ పాతుస్ఛర్వ ఉమాపతిః

భావము:-
నా హృదయమును మహా దేవుడు రక్షించు గాక. నా స్తనాంతరమును ఈశ్వరుడు రక్షించు గాక.
నా నాభిని, కటిని, వాటితో పాటు వక్ష స్తలమును ఉమా పతి రక్షించు గాక.

శ్లో:-
బాహు మధ్యాంతరంచైవ సూక్ష్మ రూపస్సదా శివః
సర్వం రక్షతు సర్వేశో గాత్రానిచ యధా క్రమం

భావము:-
బాహు మధ్యాంతరమును కూడా సూక్ష్మ రూపి యైన సదా శివుడు రక్షించు గాక.
నా శరీరమును యధా క్రమముగా అన్నిటినీ సర్వేశ్వరుడు రక్షించు గాక.

శ్లో:-
వజ్ర శక్తి ధరంచైవ పాశాంకుశధరం తధా.
గండ శూల ధరం నిత్యం రక్షతు త్రి దశేశ్వరః

భావము:-
వజ్ర శక్తిని ధరించిన వాడును, పాశమును అంకుశమును ధరించిన వాడును
గండ శూల ధారియు నగు త్రిదశేశ్వరుడు నన్ను నిత్యము రక్షించు గాక.

శ్లో:-
ప్రస్థానేషు పదే చైవ వృక్షమూలే నదీ తటే
సంధ్యాయాం రాజ భవనే విరూపాక్షస్తు పాతు మాం.

భావము:-
ప్రయాణముల యందును, మార్గముల యందును, వృక్ష మూలమునందు, నదీ తటముల యందు,
సంధ్యా సమయము లందు, రాజ భవనముల యందు, నన్నా విరూపాక్షుడు రక్షించు గాక.

శ్లో:-
శీతోష్ణాదధ కాలేషు తుహిన ధ్రుమ కంటకే
నిర్మానుష్యే సమే మార్గే త్రాహి మాం వృషభ ధ్వజ.

భావము:-
సీతా కాలమునందు, వేసవి కాలము నందు, మంచునందు, వృక్ష కంటకములయందు,
నిర్మానుష్య ప్రదేశములయందు,సమ మార్గమునందు, వృషభ ధ్వజుడు నన్ను రక్షించు గాక.

శ్లో:-
ఇత్యేతద్రుద్ర కవచం పవిత్రం పాప నాశనం
మహాదేవ ప్రసాదేవ దుర్వాసో ముని కల్పితం.

భావము:-
అను యీ విధమైనటువంటి రుద్ర కవచము పవిత్రమైనదియు, పాప నాశనమును కూడ.
మహా దేవుని ప్రసాదము చేత దుర్వాస మునిచే కల్పింప బడినది.

శ్లో:-
మమాఖ్యాతం సమాసేన భయం విందతే క్వచిత్.
ప్రాప్నోతి పరమారోగ్యం పుణ్యమాయుష్య వర్ధనం

భావము:-
నా చేత సంక్షిప్తముగా చెప్ప బడిన దీనిని భయ భక్తులతో యెవరు వింటారో
పరమ ఆరోగ్యము పొందుతారు.పుణ్యము, ఆయుర్దాయము, పెరుగును.

శ్లో:-
విద్యార్థీ లభతే విద్యా ధనార్థీ లభతే ధనం.
కన్యార్థీ లభతే కన్యాం భయం విందతే క్వచిత్.

భావము:-
విద్య కోరు వారికి విద్య లభించును. ధనము నాశించు వారికి ధనము లభించును.
కన్య నాశించు వారికి కన్య లభించును.భయ రహితులై యుందురు.

శ్లో:-
అపుత్రో లభతే పుత్రం మోక్షార్థీ మోక్షమాప్నుయాత్
త్రాహి త్రాహి మహా దేవ త్రాహి త్రాహి త్రయీ మయ.

భావము:-
సంతానము లేని వారికి సంతానము కలుగును. మోక్షము కోరు వారికి మోక్షము లభించును.
రక్షించు మహాదేవా రక్షించు. రక్షించు త్రయీమయా రక్షించు.

శ్లో:-
త్రాహి మాం పార్వతీ నాథ త్రాహి మాం త్రిపురాంతక
పాశం ఖట్వాంగ దివ్యాస్త్రం త్రి శూలం రుద్రమేవచ.

భావము:-
పార్వతీ పతీ! నన్ను రక్షించుము. త్రిపురాంతకా! నన్ను రక్షించుము.
పాశము, ఖట్వాంగ దివ్యాస్త్రము, త్రిశూలము ధరించిన రుద్రునకు నమస్కరింతును.

శ్లో:-
నమస్కరోమి దేవేశ త్రాహి మాం జగదీశ్వర
శత్రు మధ్యే సభా మధ్యే గ్రామ మధ్యే గృహాంతరే.

భావము:-
దేవేశా! నమస్కరిస్తున్నాను. జగదీశ్వరా! శత్రు మధ్యమున, సభా మధ్యమున, గ్రామ మధ్యమున, గృహాంతరమున, నన్ను రక్షించుము.

శ్లో:-
గమనాగమనేచైవ త్రాహి మాం భక్త వత్సల
త్వం చిత్తం త్వం మానసంచ త్వం బుద్ధిస్త్వం పరాయణం.

భావము:-
భక్త వత్సలా! ప్రయాణ సమయములలో వెళ్ళి వచ్చే సమయములందు నన్ను కాపాడుము.
నీవే చిత్తము, నీవే మనస్సు, నీవే బుద్ధి. సర్వము నిన్నే పరాయణుడిగా కలవాడను.

శ్లో:-
కర్మణా మనసాచైవ త్వం బుద్ధిశ్చ యధా సదా
జ్వర భయం ఛింది సర్వ జ్వర భయం ఛింది గ్రహ భయం.

భావము:-
కర్మ చేత, మనసు చేత, బుద్ధి చేత ఎల్లప్పుడూ నాకు నీవే సుమా.
జ్వరభయము నశించు గాక, సమస్త జ్వర భయము నశించు గాక. గ్రహ భయము నశించు గాక.

శ్లో:-
ఛింది సర్వ శత్రూన్నివత్యాపి సర్వ వ్యాధి నివారణం.
అస్య రుద్ర లోకం గచ్ఛతి శ్రీ రుద్ర లోకం గచ్ఛతి.

భావము:-
నమస్త శత్రువులను నశింపఁ బడును సమస్త వ్యాధులు నివారింపఁ బడును.
ఇది పఠించిన వారు రుద్రలోకమును చేరుదురు. అట్టి వారు తప్పక రుద్ర లోకమును చేరుదురు.

ఓం నమః ఇతి
స్వస్త్యస్తు.

ఈ పోష్టులో చాలా దోషాలుండ వచ్చు. తెలియని కారణంగాను, నిపుణతా లోపం వలనను, దోషాలు చోటు చేసుకొని వుండ వచ్చు. సహృదయులు అట్టి దోషములను సరి చేసి కామెంట్ పంపగలిగితే దోషములను సరిచేయ గలనని సవినయంగా మనవి చేసుకోంటున్నాను.
జైహింద్ . Print this post

4 comments:

సురేష్ బాబు చెప్పారు...

నేను ఈ రోజే రుద్ర నమక,చమకాలు ఆడియో డౌన్‌లోడ్ చేసుకొన్నాను. ఇప్పుడు మీరు రుద్ర కవచం వ్రాశారు. ధన్యవాదాలండీ.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సురేష్ బాబూ!
క:-
నమకము చమకము వినిన వి
నమితుడగుచు పరమశివుడు నయమును మనకున్
సమయమునకు తగిన యటుల
సముచితముగ సలుపు. నిజము. చతురుడవు కదా!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చరిత్రలో ఈ రోజు

ఫిబ్రవరి 18 వ తేదేన

* 1836: రామకృష్ణ పరమహంస జన్మించాడు.
* 1906: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూర్వ సర్‌సంఘ్‌చాలక్ గురు గోల్వాల్కర్ జన్మించాడు.
* 1911: భారత్లో మొదటిసారిగా ఫ్రీక్వెల్ అనే ఫ్రెంచి దేశస్థుడు అలహాబాదు నుండి నైనీ వరకు విమానాన్ని నడిపాడు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

"మనం కూడా సమస్యా పూరణ చేద్దామా? 4" పోస్ట్‌పై ౨౦౦౯ ఫిబ్రవరి ౨౦ ౨౧:౪౬ న, ఫణి ప్రసన్న కుమార్ క్రొత్త వ్యాఖ్యను ఉంచారు:

చిన్న మార్పు:
మారుతి యేగె ద్వారకకు మాధవు జూడగ ద్వాపరంబునన్
ఆ రఘు రామభక్తు నయనంబుల కాతడు రాముడే అయెన్
ధారణ జేయ గోపికలు ధాత్రిజ బోలు యనేక కాంతలై
శ్రీ రఘు రాము డొక్కరుడె చేకొనె స్త్రీలననేక మందినే!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.