గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, ఫిబ్రవరి 2009, శనివారం

మనం కూడా సమస్యా పూరణ చేద్దామా? 3

ఆర్యులారా! నమస్తే.
క్రిందటి పర్యాయం ఇవ్వ బడిన మూడు సమస్యలకు చక్కని పూరణ లందించిన రచయిత లందరికీ హృదయ పూర్వక అభినందనలు మరియి ధన్య వాదములు.
ఇప్పుడు మరొక సమస్య మన ముందుకొస్తోంది. దానిని కూడా చక్కగా పూరించడంద్వారా మనం ఆత్మ విశ్వాసాని పెంపొందించుకొందాం. మరి సమస్య చూద్దామా?

--------> కొడుకునకుం కూతునిచ్చె కోమలి ముదిమిన్. <--------

ఈ సమస్య కంద పద్య పాదమని మనకు చెప్ప కుండానే తెలిసిపోతోంది కాబట్టి ఇంక ఆలస్యమెందుకు? పూరణకి ఉపక్రమీద్దాం!
మీ పూరణలను వెన్వెంటనే కామెంట్ ద్వారా పంప బోతున్న మీకు నా కృతజ్ఞతలు.
జైహింద్. Print this post

6 comments:

ఊకదంపుడు చెప్పారు...

ఒడి నుండుబాల యదివడి
వడిగా ఎదిగిగె సొగసును వయసును బొందన్
అడిగియె, అన్నయ్యచివరి
కొడుకునకుం కూతునిచ్చె కోమలి ముదిమిన్

జిగురు సత్యనారాయణ చెప్పారు...

కందము:
కడు నెయ్యపు వరుడు, సదా
యెడంద శోభిల్లు పేర్మి, యీడుకు జోడౌ,
ముడి పెట్టగనాడపడచు
కొడుకునకుం కూతునిచ్చె కోమలి ముదిమిన్!!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

1) ఆర్యా! నమస్తే.
తేటగీతి:-
వూకదండు నిపుణత మాకు తెలిసె.
ఎంత చక్కని పూరణ! ఎరుకగలిగి
కంద పద్యము వ్రాయుట నందమొదవె.
ధన్యవాదము నీకునో పుణ్య మూర్తి.

2) శ్రీ సత్య నార్యా! నమో నమః.
ఆటవెలది:-
ఆడ పడుచు కొడుకు కమ్మాయినిప్పించి
జిగురు సత్యనార్య సుగుణ మొప్ప
బంధు ప్రేమ చూపె. భళి భళీ యని మెప్పు
లందు కొనెను మహిత కంద మహిమ.

రాఘవ చెప్పారు...

గుడిగుడిగుంతల ప్రాయము
చిడిపితనము పోని వయసు చేయగ పెండ్లిన్
జెడలల్లి బొమ్మలకు తన
కొడుకునకుం గూతునిచ్చెఁ గోమలి ముదిమిన్.

ఉడుమండలపతిముఖునికి
వడిగలవానికి దశరథవరతనయునకున్
పుడమి తననేలు భూపతి
కొడుకునకుం గూతునిచ్చెఁ గోమలి ముదమున్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అద్భుతమ్మయ రాఘవా! అసదృశముగ.
బొమ్మలకు పెండ్లి చేయించి భూమి చేత
రామునకు సీత నిప్పించి రమ్యముగను
పెండ్లి జరిపించి నావయ్య. మృదుల హృదయ.

పుష్యం చెప్పారు...

కం//
గుడగుడ ఉడికెడి బియ్యము
అడుగంటునొ ఏమొ ననుచు ఆడించనుచున్
వడివడిగా పిలచుచు తన
కొడుకునకుం కూతునిచ్చె కోమలి ముదిమిన్!!

తను వంటచేస్తున్నప్పుడు, ఆడించమని నాకంటే ఆరున్నర సంవత్సరాలు చిన్నదైన
నా చెల్లెలిని మా అమ్మగారు నాకు అప్పచెప్పటం ఇప్పడికీ నాకు బాగా గుర్తు :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.