గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, ఫిబ్రవరి 2020, బుధవారం

తేనియల్ చిందు నా భాష తెలుగు భాష. డా. నలవోలు నరసింహా రెడ్డి తెలుఁగు సాహితీ పీఠము

జైశ్రీరామ్.
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష.
  డా. నలవోలు నరసింహా రెడ్డి 
తెలుఁగు సాహితీ పీఠము
గీ. విశ్వమందు నజంతమై వెలుగు లీని
తనరు పదగతుల ప్రమోదంబు నింపి
నవ నవోన్మేష సచ్చిదానంద మగుచు
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష       1

గీ. ప్రబల ఛందో నియతి గల్గి, ప్రాస గలిగి,
యతులు గలిగి, సుందర పద గతులు గలిగి,
యలర నెడద లూపు రస పద్యములు   గలిగి,
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష       2

గీ. పద్య, వచన, గేయ, కవిత,  ప్రక్రియలుగ
సుందరంబైన రస భావ సుధలు గురిసి
ముగ్ధ మోహన పదబంధ ముద్దు లొలికి
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష      3

గీ. మంజుల రస ఝరుల్ మృదు మధురమైన
పద్య శిల్పము దివ్యాను ప్రాస గలిగి
యింపు లయల తోడ హొయలు నింపి హృదికి
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష      4

గీ. మంజు మంజుల మంజీర శింజితముల
కింకిణీ క్వాణ విన్యాస కిన్నెరగుచు
పద సుశోభిత ధ్వానమ్ము పరిఢవిల్లి
తేనియల్ చిందు నా  భాష  తెలుగు భాష     5

గీ. మాండలికములు, సూక్తులు మార్దవంపు
పలుకు బడులు, ధ్వనులు, శబ్ద పల్లవములు
మిగుల సుందరమైన సామెతలు గలిగి
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష      6

గీ. కమ్రపు  చలోక్తులు, పొడుపు కతలు నిండి
గేయ కతలు, జాతీయాల  కెంపు లుండి
రమ్య భరిత మైన నుడికారములు పండి
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష       7

గీ. వన్నె దరుగని సొమ్ములై చెన్ను మీరి
సొంపు గూర్చెడు శబ్దార్థ శోభ లలర
యిమ్ముగా నలంకారము లింపు గూర్ప
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష      8

గీ. ఆది కవి నన్నయార్యుచే నవతరించి
యిల "మహా భారతము'' పేర వెలిగి పోయి
ఉరు పంచమ వేదమై యుప్పతిల్లి
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష -  9

గీ. రమ్య మైన నానా రుచిరార్థ సూక్తి
తా  ప్రసన్న కథా కలితార్థ యుక్తి
సొబగు నక్షర రమ్యత సోంపు నింపి
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష - 10
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.