గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, ఫిబ్రవరి 2020, శనివారం

అభినవ నన్నయ్య మధునాపంతుల...రచన శ్రీ ముదిగొండ శివప్రసాద్‌

జైశ్రీరామ్.
మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి శతజయంతి సందర్భముగా..
అభినవ నన్నయ్య మధునాపంతుల
రచన శ్రీ ముదిగొండ శివప్రసాద్‌
మధునాపంతుల వారి తెలుగు నుడికారము ఒజ్జబంతి. తెలుగు జాతి చరిత్రకు ‘పెద్దబాల శిక్ష’ వంటిదైన ఆ మహాకవి ఆంధ్ర పురాణము.. అష్టాదశ పురాణాల సరసన కూర్చుండ తగిన అద్భుత పురాణం అనుటలో అతిశయోక్తి లేదు. ఆనాడు వ్యాసుడు కూడా దక్షా వాటికకు వచ్చి పురాణ రచన చేసినట్లు ప్రతీతి.

సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరం, వంశానుచరితం అని పురాణమును పంచలక్షణాత్మకంగా వర్ణించారు. మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి రచించిన ‘ఆంధ్ర పురాణం’, ప్రాచీన అష్టాదశ పురాణాల సరసన ‘వంశాను చరితం’ లక్షణానుసారంగా నిలుస్తుంది. సంస్కృత పంచమహాకావ్యాలు, తెలుగు పంచమహాకావ్యాలు అందరికీ తెల్సినవే. కొంతకాలం క్రితం హైదరాబాద్‌లో ఆధునిక ‘పంచ మహాకావ్యాలు’ అనే శీర్షికతో ‘ఆంధ్రపురాణం’పై ప్రసంగంతో సహా ‘ఉపన్యాస లహరి’ నిర్వహించారు.

1947కు ముందు భావ కవిత్వోద్యమకాలంలో గడియారం శేషశాస్త్రి, రాజశేఖర శతావధాని ‘ప్రబంధములు రాయడం యుగధర్మమేనా? ఉంటే ఇందలి రాణా ప్రతాపసింహుడు, గాంధీ, నేతాజీ, శివాజీలకు ప్రతీకలు. అలాగే స్వరాజ్యాన్ని, సురాజ్యంగా మార్చుకునే నిమిత్తం వీరభద్రమూర్తి ‘వందేమాతరం’ మధునాపంతుల వారి ‘ఆంధ్రపురాణం’ అవతరించాయి. మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి సాత్త్వికులు. కవిత్వ రచనలో, అక్షర రమ్యతలో ‘లోనారసికులు’ అనునట్లు రచించిన శిల్పం ఆకళింపు చేసుకొన్నవారు రాజమహేంద్రవరంలో ఉన్నప్పటికీ వీరు తిక్కనశైలిని బాగా అధ్యయనం చేశారు. నానా రుచిరార్థ సూక్తితో తాను నేర్చిన భంగి చెప్పి వరణీయుడైనాడు. ఈ ‘మధుకోశము’ (తేనెపట్టు)లో ప్రధానమైనది ‘ఆంధ్రపురాణం’. ఇది నవఖండ భూమండలాకృతి. నవధృరాసుకృతి. ఐతరేయబ్రాహ్మణము నాటి చరిత్రతో మొదలుపెట్టి, శాతవాహన కాకతీయ, విజయనగర, తంజావూరు, ఆంధ్రసామ్రాజ్య వైభవమును కావ్యగానం చేశారు. 1950 దశకంలో తొలిసారి రచించబడి ఎన్నోసార్లు పునర్ముద్రణకు నోచిన ఈ గ్రంథము తెలుగు జాతి చరిత్రకు ‘పెద్దబాల శిక్ష’ వంటిది.

‘శ్రీకారంబును జుట్టినాడ కృతినాశీర్వాదము సేయుమమ్ము కామేశ్వరీ’ అంటూ ఇలవేల్పును స్మరించి, ద్రాక్షారామం, శ్రీశైలం, కాళేశ్వరం వేలుపులను స్తుతిస్తూ సమస్త భూ మండలాన్ని స్తుతించారు. హరిశ్చంద్రుని కాలం నాటి చరిత్రను గుర్తు చేశారు. రుద్రమదేవి పౌరుషానికి నీరాజనం పలికారు.. శ్రీకృష్ణ దేవరాయలకు అక్షరాభిషేకం చేశారు. విజయనగర సామ్రాజ్యం అంతరించాక దక్షిణాంధ్ర యుగం ప్రారంభమైనది.

‘విజయనగర రాజ్య విభవంబు పూచిన పూలలో రెండింటిని తునిమి కొప్పునందు తురుముకొనుచూ తెలుగుపడతి సింహావలోకనము చేసుకున్నది అనే అందమైన భావంతో...’ మధునాపంతులవారి భావుకత అవగతమవుతున్నది. వారి తెలుగు నుడికారము ఒజ్జబంతి. వీరి ఆంధ్రపురాణము, అష్టాదశ పురాణాల సరసన కూర్చుండ తగిన అద్భుత పురాణము అనుటలో అతిశయోక్తి లేదు. ఆనాడు వ్యాసుడు కూడా దక్షా వాటికకు వచ్చి పురాణ రచన చేసినట్లు ప్రతీతి.
శ్రీవాణీ గిరిజాశ్చరాయ... అంటూ నన్నయ్య వేయి సంవత్సరాల క్రితం కావ్యరచన చేసిన ప్రదేశంలోనే వీరు రచన చేయడం యాదృచ్ఛికమే అయినా సాహితీ ప్రియులచే అభినవ నన్నయ్యగా కీర్తించబడే రచన చేసిన ఘనులు మధునాపంతులవారు.

ఆంధ్ర రచయితలు, శ్రీఖండం, తోరణాలు, బోధివృక్షం వంటి పద్యకావ్యాలు కల్యాణతార (నవల) ‘మధునాపంతుల వ్యాసాలు’ వంటి వ్యాస సంపుటాలను వెలువరించి, ‘కథా పుష్కరిణి’ పేరిట కథా సంపుటులను రచించి త్రివిక్రములుగా పద్య, గద్య, నవల రంగాలలో తనదైన శైలిలో తెలుగు భారతిని అర్చించారు. ‘ఆంధ్రకుటీరం’ పేరిట సాహితీ విద్యాలయం ద్వారా తెలుగు భాషా బోధన, ‘ఆంధ్ర’ సాహిత్య పత్రిక ద్వారా తెలుగు కవులెందరికో వేదికను కల్పించారు. రాజమహేంద్రవరంలో వీరేశలింగం పంతులు ఆస్తిక ఉన్నత పాఠశాలలో మూడు దశాబ్దాలు ఆచార్యులుగా సేవలందించారు. ‘ఆంధ్ర కల్హణ’, ‘అభినవ నన్నయ్య’, ‘కళా ప్రపూర్ణ’ బిరుదులతో సాహితీ లోకం వీరిని సత్కరించింది. 72 ఏళ్ల వయస్సులో 1992లో నవంబర్‌ 7న మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి శివైక్యం చెందారు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.