గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, డిసెంబర్ 2019, బుధవారం

దండక గర్భ హనుమత్ సీసమాలిక....

జైశ్రీరామ్.
ఓం నమో నారాయణాయ.
రామభక్త హనుమంతా!
జయము. జయము.

దండక గర్భ హనుమత్ సీసమాలిక.

శ్రీ యాంజనేయుండ! శ్రీరామచంద్రుండు నీమానసంబందె నిరుపమముగ

వాసంబు చేయంగ భక్తాళికాస్వామి నేరీతిఁ గన్పించు హృద్యముగను?

నీ నామమున్ విన్న నిన్నే మదిన్ గన్న నీ యందె యున్నట్టి నిత్యుఁడయిన

శ్రీరాముఁడే మమ్ము సీతమ్మతో కూడి కాంచున్గదా తాను కరుణఁజూపి,

కావంగ రాఁడేమి కన్పించడా యేమి? మాదోషమేముండె మనసు లేదొ?

మాయందు తప్పున్న మాముందు తా నిల్చి మా తప్పులన్ జెప్పి మదికినెక్క

మంచిన్ బ్రబోధించి మించంగ సద్భక్తి, కుంచించు మాలోన కుదురుగాను

ధైర్యంబునే కొల్పి తప్పున్న మన్నించి తత్వంబు బోధించి ధాత్రిపైన

ధర్మప్రవృత్తిన్ సదా దైవ భక్తిన్ సు ధాపూర్ణ వాగ్ధాటి సరసమతిని

సద్భావనాశక్తి సత్కల్పనా యుక్తి సచ్ఛీల సంపత్తి సమధికమగు

దీనాళిపై రక్తి దేశంబుపై భక్తి దీపింపనీయంగ తేజమెలర

రాకుండుటేమయ్య? రక్షింప మమ్మింక రాముండు రాకున్న రమ్యమతిని

మాకేది దిక్కింక? శ్రీకాంతునాత్మన్ బ్రకాశింపఁగా దాచి మమ్ము మరచి

నీ తృప్తికై నీవు నిత్యంబు యోచింప నిర్భాగ్యులన్ గావ నిరుపమగతి

నెవ్వండు కల్గున్? మహేశుండవీవంచు నిన్నే మదిన్ నిల్పి  నేర్పుమీర

సేవించు భక్తాళి కీవేకదా దిక్కు రావేమి నీవైన రమ్య హృదయ!

రక్షించ మమ్మింక రాముండొ, కాకున్న రావచ్చు నీవైన ప్రముదముగను

ప్రార్థించు మమ్మున్  బరంధాముఁడారాముడో నీవొ మమ్మెన్ని యుద్యమించి

కావంగ వే రండు.గమ్యంబుచేర్చుండు.కారుణ్యమున్ జూపి.ఘనతరముగ

శ్రీయాంజనేయా! హసించున్ జనానీక మీవింక రాకున్న నీశతేజ!

నే రామకృష్ణుండ నీపైన భక్తిన్ మ హద్దండకంబేనుననుపమగతి

సీసంబులో నింపి యాశించితిన్ వ్రాసి నీదర్శనంబింక నిర్భయదుఁడ!

కన్పింపుమింకన్ బ్రకాశా ! నమస్తే న మస్తే నమస్తేనమః వనచర!

తే.గీ. దండకాన్విత సీసంబు ధరణినెవరు

భక్తితోడను పఠియించువారికిలను

హనుమ సత్కృప లభియించు ననుపమగతి

సుఖము సంతోషమును గల్గి శోభ కలుగు.
జైహింద్.
Print this post

2 comments:

Sanath Sripathi చెప్పారు...

🙏🙏 అద్భుతంగా ఆవిష్కరించారు బాబాయి గారు !!!

Shan Konduru SAFe Agilist (SA), CSP, CSM, 6σ GB చెప్పారు...

చాలా బాగుంది, రేపు సోమవారం హనుమత్ వ్రతము, ఈ పద్య రాజాన్ని చదివి భక్తులు ధన్యులు కాగలరు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.