గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, మే 2019, గురువారం

పాండురంగ విభుని పదగుంఫనము. . . . బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణ

జైశ్రీరామ్.
ఆర్యులారా! పాండురంగ విభుని పదగుంభనను బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణ మహోదయులు కనులకు కట్టించిన విధానమును తిలకించండి.
పాండురంగ విభుని పదగుంఫనము
మ: గతి మధ్య స్తన కుంతల స్తబక వీక్షాగర్వ దుర్వార , యీ
సతిచే మానము యూనమయ్యె ; నిఁక నిస్సారంపు ప్రాణంబు దా
ల్చు తగుల్గాదని రోసి , యావృషలి వాలుంజూపుఁ గ్రొమ్మంట కా
హుతియౌ, బర్హి మృగేంద్ర కుంభి చమరీయూధంబు నేణంబులున్.
పాండురంగ మాహత్మ్యము-3 ఆ: 86 వ-పద్యం; తెనాలి రామకృష్ణుడు!
రాయల కాలంలో వికట కవిగా పేరొందినా ప్రౌఢకవిత్వ రచనారీతులలోగూడ తనను మించినవాడు లేడని నిరూపించినవాడు రామకృష్ణకవి. అతని ఉద్భటారాధ్య తరిత్రము; పాండురంగ మాహాత్మ్యములు ఆమహాకవి పదగుంఫనమునకు
నెలవులై "పాండురంగ విభుని పదగుంఫనమ్ము- వేరెవరికి? దక్కు నను ఖ్యాతినొందెను. ప్రస్తుత పద్యము పాండురంగ మాహాత్మ్యములోనిదియై , యతనిపద గుంభనారీతుల కద్దము పట్టుచున్నది. ఈపద్యంలో నిగమశర్మ మనసుబడి యడవికి గొనివచ్చిన 'కాపు పడచు' ఆఖేట (వేట) సామర్ధ్యముతోబాటు ఆమెయందమును వ్యంగ్యరీతులతో వివరించుచున్నాడు.
నడకలు - నడుము - కుచ కాఠిన్యము- కేశసంపద - చూపుల గర్వోన్నతిచే నీమె ఆవనములోని నెమళ్ళకు, సింహములకు ,కరి కుంభములకు, చమరీమృగములకు , లేడికదుపులకు గెలువరానిదై యవమానమును గల్గించుచున్నదట.! అయ్యో !ఈకాపుదానియందము మనకవమానమును గూర్చినదే! ఇఁక నీబ్రతుకేల ?యని బ్రతుకుపై రోతపుట్టి ఆమృగములన్నియు ఆకాపుపిల్ల కంటిచూపులనే మంటలలో బడి తమకుతామె మడియు చున్నవని కవి చమత్కారవర్ణనము.
వృషలి యను పదమునుప్రయోగించి, . ఆమె మాంసాహారి. వేటాడుట యామెకుసహజమేననుటను వివరించి ,దొరికిన జంతువును
దొరకినట్లు వేటాడి చంపుచున్నట్లుగా సూచించెను. జరుగుచున్నవిషయమది. దానిని కవి తనయూహతో కవితామయం చేస్తున్నాడు. ఇలా, ఆమె కున్నకొన్ని సౌందర్యలక్షణ ములను ప్రకటించుచు, మరియొక నూతన విషయాన్ని ఆవిష్కరిస్తున్నాడు. అవేమిటో చూడండి.!
నడకలు- నెమలి నడకల నధిగమించుట.
నడుము: సింహ మధ్యమమును అధఃకరించుట.
కుచకాఠిన్యం: కుంభి కుంభముల నెదిరించటం.
కేశసంపద: చమరీ వాలములను వెనక్కి నెట్టటం.
చూపులు: లేడిచూపుల డిందుపరచటం.
ఇదిగో ఇవికారణాలుగా ఆమృగాలకు అవమానం జరిగినట్టుగా అవిభావించాయట. పరాభవానికి ప్రతీకారం తీర్చేదారే వాటికి లేదు. కాబట్టి దానికంటిమంటలకు ఆహుతియౌతున్నాయని కవి సమర్ధన!
" ప్రాణానపి పరిత్యజ్య మానమేవాభిరక్షతు
ప్రాణాః తరంగ చపలాః మాన మాచంద్ర తారకమ్! - అని పెద్దలు చెపుతున్నారు కాబట్టి మృగాలైనా మంచిపనే చేస్తున్నట్టు మనకుతోచవచ్చు. నిజానికిదంతా కవిత్వంలో భాగమే! ఒక వంక ఆమెసౌందర్యం-మరొక వంక ఆమెలోని క్రూర స్వభావాన్ని
ఒకేమారు ఆవిష్కరిస్తున్నాడు కవి. అందుకు సాధనంగా "వాలుంజూపు" అనేపదాన్ని వాడాడు.సాధారణంగామనం వాలుచూపుకు ఓరచూపుగా అర్ధంచెపుతాం ఇక్కడ అలాక్కాదు. కత్తిలాంటి చూపు (వాలువంటి చూపు) అనే అర్ధంచెప్పుకోవాలి. అప్పుడు వాలు శస్త్రం కాబట్టి దానినే వేటాడు పరికరంగా ఆమె ఉపయోగించినది అనేభావం వస్తుంది. పైగా అదిక్రొమ్మంటయట! దావానలం వంటిది.
యింకెక్కడికి పోగలవు ?దానికళ్ళబడిన మృగమల్లా మరణానికి గురియౌతోంది.
ఈవిధంగా పదప్రయోగ విషయంలో చక్కని చాతుర్యమును ప్రదర్శించి లోకోత్తరమైన వర్ణనము నావిష్కరించినాడురామకృష్ణకవి.
1క్రమాలంకారం
2కావ్యలింగము.
నాన్యతోదర్శనీయమైన పదప్రయోగచాతుర్యంతో నవీనభావావిష్కరణమునొనర్చెడు తెనాలివారికి విబుధాంజలులను సమర్పిస్తూ!
స్వస్తి!
  జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
తెనాలి వారి పాండురంగ విభుని కావ్యమును వర్ణించి నందుకు ధన్య వాదములు .ఇవి ఎన్నిసార్లు చదివినా ఇంకా ఇంకా చదవాలనే ఉంటుంది . శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారికి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.