గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, ఏప్రిల్ 2019, శనివారం

శ్రీమద్వికారి నూతన వత్సరారంభ శుభ వేళ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.

 జైశ్రీరామ్.
ఆర్యులకు శుభోదయమ్.
శ్రీమద్వికారి నూతన వత్సరారంభ శుభ వేళ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
శ్రీమదనన్య భాగ్యద ప్రసిద్ధ వికారికి స్వాగతమ్ము. సం
క్షేమము జీవకోటికి ప్రసిద్ధిగ గొల్పఁగ వచ్చి మమ్ములన్
ధీమతిపూర్ణరూపులుగ దీపిత ధర్మమనంగ చేయుచున్
ప్రేమను దైవ భక్తిని నవీన సుచేతనమబ్బనీయుమా.
ఎన్నికలందు సజ్జనులనెన్నుకొనంగను జాతికంతకున్
మిన్నగు బుద్ధినిచ్చుచు, భ్రమింపఁగనీయక మేలు కొల్పుమా.
కన్నులముందు దైవములు జ్ఞానులు వారిని గౌరవించుచున్
మన్ననతోడ మెల్గునటు మానవకోటికి బోధఁ గొల్పుమా
నిరతమనంత సంతసమునే పదిమందికి పంచుచుండి, సుం
దర దరహాస చంద్రికలుదారముగాప్రసరించుచుండి, యా
దరమున పేదసాదలను, ధాత్రిని వెల్గెడి స్త్రీలనందరిన్
గరువము లేక, గౌరవముగా కను సద్గుణమబ్బఁ జేయుమా. 
స్వాగతమ్మన వచ్చియుంటివి సద్గుణాల వికారి! నీ
వేగతిన్ నడయంగఁ జేసిన నీకు గౌరవమబ్బునో
ఆగతిన్ నడిపించు మమ్ములనందరిన్. సుఖశాంతులన్
భోగభాగ్యములందు తేల్చుచు పూజలందుమ నిత్యమున్.
మంగళంబగు మానవాళికి మాన్యపాళికి మంగళం
బంగరంగ సువైభవంబులనందుచుండుత సజ్జనుల్.
మంగళాంగులు స్త్రీలు నిత్యము మంగళంబులె కాంచుతన్
మంగళంబు వికారి నీవిక మంగళంబులె కొల్పుమా.
స్వస్తి.
జైశ్రీమన్నారాయణ.
వందే భాతరమాతయమ్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.