గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, సెప్టెంబర్ 2012, మంగళవారం

మా మంచి మాష్టారు శ్రీ ఏ. గోపాలరావు గారు.

జై శ్రీరామ్.
 మా మంచి మాష్టారు  డా. ఏ. గోపాలరావు గురుదేవులు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మా మంచి మాష్టారు శ్రీ ఏ.గోపాలరావుగారికి పాదాభివందనములు.
శ్రీరస్తు                                           శుభమస్తు                           అవిఘ్నమస్తు
శ్రీ గురుభ్యోనమః.
1.కంద గీత గర్భ ఉత్పల మాల.
శ్రీ గురు దేవ మీ చరణ సేవ రహిం గనఁ జాల నేను.స
చ్ఛ్రీఁ గొలుపున్ గదా! సుజన సేవిత పాద! విశుద్ధ చిత్త! స
ద్ధీ గురు వంద్య! ఈ భువి సుధీవర! మీ కృపఁ బొందితేను. భ
వ్యా! గణనన్ సదా సుజన పాల! నమస్కృతి శుభ్ర తేజసా!

౧.ఉత్పల గర్భస్థ కందము:-
గురు దేవ మీ చరణ సే
వ రహిం గనఁ జాల నేను. సచ్ఛ్రీఁ గొలుపున్.
గురు వంద్య! ఈ భువి సుధీ
వర! మీ కృపఁ బొందితేను. భవ్యా! గణనన్. 

౨.ఉత్పల గర్భస్థ గీతము:-
చరణ సేవ రహిం గనఁ జాల నేను. 
సుజన సేవిత పాద! విశుద్ధ చిత్త!  
భువి సుధీవర! మీ కృపఁ బొందితేను. 
సుజన పాల! నమస్కృతి శుభ్ర తేజ!

2.ద్విపద - మత్త కోకిల - కంద గర్భ సీసము:-
ఓ దయామయ! జ్ఞాన మొప్పుగ నుండగా - మది నెంచుచున్, గురు మాన్య తమరు
బోధఁ గొల్పిరి మాదు పుణ్యము పొంగఁగా! - సుజనాళిలో మేము శోభిలంగ!
మీ దయాశ్రయ మేధ మేదిని మిన్నగా  - గన నొప్పునే కద! వినుతముగను.
మీదు పాద యుగంబు మిన్నగు మేలు కొల్తుము దేవరా! గోప ప్రముఖ నామ!
గీ:-
ప్రముఖ గురు దేవ మీ దయ యమలము తమ
జ్ఞాన సుధ మహాద్భుతమగును గాదె! మహిని.
సుజనులు పొగడన్ దమ బోధ సులభ గతిని
ముదముగ కనంగ నగునయ! మురియుచునిల.

౧.సీస గర్భస్థ ద్విపద:-
ఓ దయామయ! జ్ఞాన మొప్పుగ నుండ  
బోధఁ గొల్పిరి మాదు పుణ్యము పొంగ! -  
మీ దయాశ్రయ మేధ మేదిని మిన్న!  
మీదు పాద యుగంబు మిన్నగు మేలు! 

౨.సీస గర్భస్థ మత్తకోకిల:-
ఓ దయామయ! జ్ఞాన మొప్పుగ నుండగా  మది నెంచుచున్,
బోధఁ గొల్పిరి మాదు పుణ్యము పొంగగా! - సుజనాళిలో!
మీ దయాశ్రయ మేధ మేదిని మిన్నగాఁ  - గన నొప్పునే !  
మీదు పాద యుగంబు మిన్నగు మేలు కొల్తుము దేవరా!

౩.సీస గర్భస్థ కందము:-
ప్రముఖ గురు దేవ మీ దయ 
యమలము తమ జ్ఞాన సుధ మహాద్భుతమగును గా 
దె! మహిని. సుజనులు పొగడన్ 
దమ బోధ సులభ గతిని ముదముగ కనంగన్ !

3. నిరోష్ఠ్య ఆట వెలది:-
సరస! సకల శాస్త్ర సాన్నిధ్య సహృదయ! 
రస జగాన శిష్య రాజి నునిచి,
జగతి కీర్తి నెదిగి చక్కగా నిలిచిన
జ్ఞాన దాన నిరత! జయ నిధాన!

4. శ్రీ చక్ర బంధ తేట గీతి:-
సకల పూజిత శ్రీ కవి చంద్ర భాస !  
ధరణి దేవుఁడ శ్రీకర ధర్మ మోద !
విశ్వ కవి శేవ్య శ్రీ గోప వేద్య నామ !  
సవిధ సేవిత సత్పద సామ భాస !


5. చతురంగ బంధ కందము:-  ( గురువరు - పదములు - సుకవికి - వరములు )
సుమ సమ మృదుల వర గురు ప
దములు ఘన రుచిని వరలు బుధ వరులు నవనిన్
తమ పదవికి విజయ మొదవు. 
తమ కవితలు ముదము వసుధ తనరును సతమున్.


6. నక్షత్ర బంధ కందము:- ( సుగుణ వర వందనములు )
సుమ సహృదయ! మనమున ప్రా
ణముగా మములన్ నిలుప తనర కవిసత్ వం
శము దయఁ గని గుర్తించిరి
నమనమున విభవ! ప్రణతులు నయ వంశ శశీ!

7. క:- గురువర! మీ పాదాబ్జము
లరసి కొలువ కవిత ధార లసదృశ రీతిన్
పొరలుచు వచ్చును. నిజమిది.
కరుణనుఁ గను మిమ్ముఁ బోలు ఘను లిలఁ గలరే!

8. క:- దోషము లున్నను సైచెడి
మీ సము లెవరయ్య భువిని? మేల్తరమగు మీ
ధ్యాసను కలిగినవా రిల
భూషణులగు భారతికిని. పూజింపఁ బడున్.
స్వస్తి.
ఇట్లు
మీ ప్రియ శిష్యుఁడు 
చింతా రామ కృష్ణా రావు.
ఇందలి చిత్రకవితలకు చిత్రములు నిర్మించి పద్యముల నమర్చి సహకరించిన చిరంజీవి లంక రవీంద్ర కు నా అభినందనలు తెలియ జేసుకొనుచున్నాను.
జైహింద్.
Print this post

7 comments:

మిస్సన్న చెప్పారు...

ఆర్యా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా సత్కవి గురువరులైన మీ పాదపద్మాలకు నమస్కృతులు. శుభాకాంక్షలు.

Pandita Nemani చెప్పారు...

మిత్రులారా!
ఈనాడు గురువరులకు సన్మానము చేయ వలసిన పర్వము. గురు పదములో సుమారు 40 సంవత్సరములు అలరించిన మాన్యులు మన శ్రీ చింతా రామకృష్ణా రావు మాష్టారుకి అనేక శుభాభినందనలు.

మన పురాణ ప్రపంచములోకి వెడలినచో --
అఖిల ప్రపంచములకు ఆది గురువు శ్రీ శంకరుడే. ఆ స్వామికి శతకోటి ప్రణామములు.

వందే ప్రజ్ఞాననిధిం
వందే పరమార్థ తత్త్వ భాసుర మభవం
వందే గౌరీనాథం
వందే పరమేశ్వరం భువనగురు మాద్యం

వందే మునిజనవినుతం
వందే భక్తాంతరంగ పద్మ విహారిం
వందే జనార్దనహితం
వందే పరమేశ్వరం భువనగురు మాద్యం

వందే శాంతాకారం
వందే జ్ఞానాంబకం శివం సర్వేశం
వందే లోకాధారం
వందే పరమేశ్వరం భువనగురు మాద్యం

వందే భుజగాభరణం
వందే వృషవాహనం శుభప్రద మూర్తిం
వందే గణసంసేవ్యం
వందే పరమేశ్వరం భువనగురు మాద్యం

వందే కైలాసపతిం
వందే ముక్తిప్రదం శివాహృదయేశం
వందే మాయాతీతం
వందే పరమేశ్వరం భువనగురు మాద్యం

స్వస్తి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! మిస్సన్న గారూ! నాలో పరమాత్మను చూచి పాదాభివందనము ప్రకటించిన మీ సుస్వభావానికి చాలా ఆనందించి మీ వందనములు ఆపరమాత్మునకే అందించాను. ఆ పరమాత్మ కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ మీపై ప్రసరించాలని కోరుకొంటూ మీకు నా ధన్యవాదములు తెలియజేసుకొంటున్నాను. శుభమస్తు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! పండిత నేమాని సన్యాసిరావుగారూ!
మీ అవ్యాజానురాగానికి పులకరించిపోయాను.
సహృదయ శిరోమణీ!
ఆది గురువు శ్రీ శంకరునిపై ప్రకటించిన మీ శ్లోక రాజము త్రికాల పఠనీయము. ఈ విధముగ మాకు లభించుట మా అదృష్టముగా భావిస్తున్నాను.
ధన్యవాదములు.

ఏల్చూరి మురళీధరరావు చెప్పారు...

మాన్యులు శ్రీ రామకృష్ణారావు గారికి నమస్కారములు!

చాలాకాలం తర్వాత ఈ రోజు ఒకప్పుడు మీరు పంపిన ఈ బ్లాగు నాందీముఖం ద్వారా దీనిని దర్శించి, మీ రచనలను గుఱించి తెలుసుకొనే అవకాశం కలిగింది.

అమోఘమైన మీ పాండిత్యవైభవానికి, నిరంతరాయితమైన వ్యాసంగానికి ఆశ్చర్యం కలిగింది.

సహృదయంతో మీరు ప్రకటించిన క్రొత్తపల్లి వారి ద్వ్యర్తికృతి వంటి అపురూపమైన రచనావళిని, మీ చిత్రకవితలను, ఇతర రచనలను చదివి ఎంతో ఆనందించాను.

మీకు నా హృదయాంజలి!

ఏల్చూరి మురళీధరరావు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సహృదయ శిరోమణి శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారూ! నమస్సులు.
మీరు ఎంతో ఆప్యాయతతో మీ స్పందనను తెలియఁ జేసి నాకెంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగించారు. మీ సహృదయతకు ధన్యవాదములు.
కంద గీత గర్భ ఉత్పలమాల:-
సారస భావనా సుగుణ సార సమంచిత సుందరాక్షరా!
ధీరవరా! సుధీ వరుఁడ! దివ్యగుణాశ్రయ! భవ్య భావ ర
మ్యా! రస కావ్యసద్ గుణ ప్రియా!ఇసుమంతయుగొప్పలేని యే
ల్చూరి వరాన్వయా! ఘనుఁడ! చోద్యము నీ గుణ గౌరవంబులున్.
క:-
రస భావనా సుగుణ సా
ర సమంచిత సుందరాక్షరా!ధీరవరా!
రస కావ్యసద్ గుణ ప్రియా!
ఇసుమంతయుగొప్పలేని యేల్చూరి వరా!
గీ:-
సుగుణ సార సమంచిత సుందరాక్ష!
వరుఁడ! దివ్యగుణాశ్రయ! భవ్య భావ
గుణ ప్రియా!ఇసుమంతయుగొప్పలేని
ఘనుఁడ! చోద్యము నీ గుణ గౌరవంబు!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఉపాధ్యాయ దినోత్సవ సందర్భముగా , గురువులు శ్రీ , డా. ఏ . గోపాల రావుగారికి పాదాభి వందనములు . పరిచయం జేసిన సోదరులు , సరస్వతీ పుత్రులూ , పండితులూ , ఐన శ్రీ చింతా వారికి హృదయ పూర్వక అభి నందన మందారములు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.