గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, డిసెంబర్ 2011, శుక్రవారం

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము53 రథ బంధము.

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.  
ఈ చిత్ర కవి చేసిన రథ బంధమును చూడండి.
సీ:-
సూర్యార్య సురసంగ శోభిత సద్గుణ పార్థ సారథి నామ పద్మనాభ.
ధీసార కాసార తిరు వేంకటాకృతి చారు చక్ర ధరా ప్రశాంత వదన.
నాదాల వేణువు నూదేటి యదు రాజ  పెను కృష్ణ సర్ప మర్దన గిరిధర.
శ్రీ వైష్ణవ గణ సుధీవస్తు నిర్దేశ. సరస సమర నీతి సారసాక్ష.
గీ:-
సమర శంఖము పూరించు సవ్యసాచి.
క్షత్రియాన్వయ ధర్మ దీక్షలను వీడ
సార్థముగ గీత బోధించు సాధు శరణ.
వందనము జేతు నందుకో మంద హాస.

చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

1 comments:

Pandita Nemani చెప్పారు...

బంధకవి సూర్య గణపతిరావు గారికి శుభాశీస్సులు.

బొమ్మలను గీసి తగు ప
ద్యమ్ముల నందందు పేర్చి యలరించెను హృ
ద్యమ్ముగ గణపతిరావని
నెమ్మనమున నభినుతింతు నే నా సుకవిన్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.