గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, డిసెంబర్ 2011, సోమవారం

డా. అనుమాండ్ల భూమయ్య.


డా. అనుమాండ్ల భూమయ్య.

శ్రీరస్తు.                   శుభమస్తు.         అవిఘ్నమస్తు.
శ్రీ అనుమాండ్ల భూమయ్య 
(విశ్రాంత ఉప కులపతి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము) వారికి 
తే.25 - 12 - 2011 న
ఆంధ్ర పద్య కవితా సదస్సు విశాఖపట్టణము జిల్లాశాఖ 
సాదరముగా సమర్పించుకొనిన 
 నవరత్న మాలిక.
  రచన:- భాషాప్రవీణ చింతా రామ కృష్ణా రావు. M.A., ( Cell No.92472 38537 )

1. క:-  అనుమాండ్ల భూమయాఖ్యా!
అనకాపల్లి సుకవీంద్రు లందరి మెప్పున్
గొనినారు. మిమ్ము సమ్మో
హనమగు పద్యాల భూమయ యనుచు నెంతున్.

2. చంపక, కంద గీత ఆటవెలది గర్భ సీసము.
వర గుణ గణ్యుఁడా! వరలు ప్రాక్తన భాషయ ప్రక్వణమ్ముగా సుప్రసిద్ధి.
వరదుఁ డిడెన్ గనన్ ధరణి పండిత వర్యులు భ్రాంతి నేర్వగా,  శుభ్ర తేజ!
పరి జన సేవకై మురిసి ప్రార్థన దీనిని ప్రోది చేసిరా సుప్రశస్త! 
చిర ఘనతన్ గనన్? వరలఁ జేసిరొ శిష్యుల బ్రహ్మతేజమున్ లక్ష్యము గొని?
సకల సుగుణ వరులు సరసన నిలువగ
మంచి బోధ వలన మాన్యమైన భవిత.  
రమ్యమైన బ్రతుకు రవరవ మెఱియగ
చేసినారు మీరు చెలిమి జేసి నిజము. 

2a. సీస గర్భస్థ చంపకమాల.
వర గుణ గణ్యుఁడా! వరలు ప్రాక్తన భాషయ ప్రక్వణమ్ముగా 
వరదుఁ డిడెన్ గనన్ ధరణి పండిత వర్యులు భ్రాంతి నేర్వగా.
పరి జన సేవకై మురిసి ప్రార్థన దీనిని ప్రోది చేసిరా 
చిర ఘనతన్ గనన్. వరలఁ జేసిర శిష్యుల బ్రహ్మ తేజమున్?

2b. సీస గర్భస్థ కందము
గుణ గణ్యుఁడా! వరలు ప్రా
క్తన భాషయ ప్రక్వణమ్ముగా వరదుఁడిడెన్.
జన సేవకై మురిసి ప్రా
ర్థన దీనిని ప్రోది చేసిరా చిర ఘనతన్?

2c. సీస గర్భస్థ తేటగీతి. 
వరలు ప్రాక్తన భాషయ ప్రక్వణమ్ము
ధరణి పండిత వర్యులు భ్రాంతి నేర్చు
మురిసి ప్రార్థన దీనిని ప్రోది చేసి
వరలఁ జేసిరొ శిష్యుల? బ్రహ్మతేజ!

2d. సీసావసాన తేటగీతి గర్భస్థ ఆటవెలది. 
సకల సుగుణ వరులు సరసన నిలువగ
మంచి బోధ వలన మాన్యమైన
రమ్యమైన బ్రతుకు రవరవ మెఱియగ
చేసినారు మీరు చెలిమి జేసి . 

3. శ్రీచక్ర బంధ తేటగీతి.
మన్ననలు గాంచు శ్రీ జ్ఞాన మున్న సామి! 
వసుధ సత్పూజ్య శ్రీ కావ్య భాగ్య జాల!  
లక్షణ సువేద్య! శ్రీ కర లక్ష్య మాన్య!
మరువ జాలము మిమ్ముల మాన్య భూమ!  

4. నక్షత్ర బంధ కందము:- ( సుజనవర - భూమయ బుధ  )
సుర నుత మధు మయ రచనల్
నర మాన్య బుధాళి ధర తనర కొలువన్ భూ
స్థిర మహనీయ జనావళి 
యరసి, బుధ కవి వరుని సుధ యను, భూమయ ధీ !

5. చ"తురంగ"గతి బంధ కందము:- ( కవివర - శుభకర - కవితలు - కనుముర )
సుమధుర కవితల సుకవివి
ర! మురహరి వినుత ఘనుడవుర. వరలు సుకవిన్ 
క్రమ శుభములు తనుపు నభయ
దమవి. ప్రవర కవన సుకవి! ధరణిని గనగన్. 

6. గోపుర బంధము:- ( శ్రీ కరుఁడ! సుకవీ)
భూతిన్ మహనీయ! యలఘు  
ప్రీతిన్ సుకవీశ్వరులను ప్రియ విభవమునన్     
ధాతిరి గని వరల సలుపు
ధాతవనన్ గాదె రాణ దర్పించు నినున్!

7. క:- అనుమాండ్ల భూమయా! స
ద్వినయాన్విత తెలుఁగు విశ్వ విద్యార్థిలకున్
గుణ పోషణఁ జేయుచు పా
లనఁ జేసితి వీవనంత లక్ష్మీపతివై.

8. క:- నిహిత మహాద్భుత సత్కవి
మహితులకున్ భూమయాఖ్య మహితుఁడు. కన మా
బహుమాన్యపు భూమయ! యీ
బహుమాన్యుఁడు భూమయ యని పలుకగ వినరే?          

9. ఉ:- ఎన్నని యెంచ మాకునగు నెన్నికతో తమ గ్రంధరాజముల్.
మన్ననలెన్ని చేయనగు? మాన్యుఁడ! మీ బిరుదుల్ గణించుచున్.
గ్రన్నన మీ ప్రబోధముల రాజిలు శిష్యులనెన్ననౌనె? మా
కన్నయ మీరు? మంగళము కల్గుత మీకిల భూమయాఖ్యుఁడా ! 

మంగళం                                                  మహత్. 
శ్రీ  శ్రీ  శ్రీ  శ్రీ  శ్రీ

Print this post

2 comments:

సో మా ర్క చెప్పారు...

చాలా చాలా బాగున్నాయి పద్యాలు.అభినందనలు

సో మా ర్క చెప్పారు...

చిలి చాలా బాగున్నాయి సార్ పద్యాలు అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.