గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, నవంబర్ 2011, బుధవారం

రవి కాననిచో కవి గాంచునే కదా! ఈ సమస్యను ఐచ్ఛిక ఛందస్సులో పూరించండి


ఆంధ్రామృత పాన లోలులారా! మీ సాహితీ ప్రియత్వాన్ని అభినందిస్తున్నాను. మీ పద్యరచనాసక్తి నాకు చాలా ఆనందం కలిగిస్తోంది.
ఈ క్రింది సమస్యను శ్రీ నేమాని వారు సూచించారు.
ఈ సమస్యను పూరించి వారి సూచనపై మనకు గల సదాసక్తిని కనబరుద్దాము.
వారిచ్చిన సమస్యను చూడండి. 
రవి కాననిచో కవి గాంచునే కదా! 
ఈ సమస్యను ఐచ్ఛిక ఛందస్సులో పూరించనగును
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

17 comments:

Pandita Nemani చెప్పారు...

మిత్రులారా!
ఈ సమస్య రాయల వారి కాలము నాటిది. ఒకనాడు తెనాలి వారు ముక్కు తిమ్మన గారి ఇంటికి వెళ్ళి వారితో చమత్కారముగా "తాతా! ఊతునా" అని అడిగి, వారు తన్నితే తెనాలి రామలింగనికి పన్ను ఊడినదిట. ఆ పంటికి బదులుగా దుప్పికొమ్మును అరగదీసి చిన్న పన్నుగా చేయించుకొని ఊడిన పంటి స్థానములో పెట్టుకొనెనట. అలాగ ఆతనికి ఒక ఉపాయము తెలిసినది. మరి సూర్యునికి అట్టి ఉపాయము తెలియకే తన పండ్లు అన్నీ ఊడిపోయినా అలాగే వదలి వేసెనట. ఈ భావముతో అప్పటిలో ఇలాగ ఆ సమస్యను పూరించారు:

ఆ రవి వీరభద్రు చరణాహతి డుల్లిన బోసి నోటికిన్
నేరడు రామకృష్ణ కవి నేరిచెబో మన ముక్కు తిమ్మరాడ్
క్రూర పదాహతిన్ దెగిన కొక్కిరి పంటికి దుప్పి కొమ్ము పల్
గారచియించె నౌర! రవి కాననిచో కవి గాంచునే కదా!.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

జవరాలి మనమును గనెను
కవనములుగ వెలువరించి కనుకొలకులలో
ని విరహ గాథలఁ దెలిపెను
రవి కాంచనిచోటులెల్ల రచయిత గాంచెన్.

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

నామదిలోనియూహలు,సనాతనధర్మమునందునిచ్చ,నా
రామునియందు భక్తి,మధురంబగు ప్రేమవిషేషణంబులున్,
ధీమతకౌశలంబును మదీయ వివేక విచక్షణంబు, సం
గ్రామమునందు శక్తి, రవి గాననిచో కవి గాంచునే కదా.

కొన్ని అంతరంగతరంగాలలో ఉన్నటువంటి ఊహలను, ఆలోచనలను కవి ఐనవాడే తెలుసుకొంటాడు కానీ రవి కాదు కదా అనే భావముతో వ్రాసినాను. తప్పులుంటే మన్నించవలసి నదిగా ప్రార్థన. ( ఇతరులకు చెప్పగలిగిన వాడూ కవే కదా, చూసినది చెప్పకపోతే చూసి ఉపయోగము లేదు, చూడని దానితో సమానము అనే భావనతో )

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

భ్రాంతిని వీడి మానవుడు బ్రహ్మపు తత్వము నేర్చినంతనే
శాంతిని కూర్చు లోకమున శాశ్వత తత్వము సిద్ధి పొందగా
నంతరమందు నిల్చు పరమాత్ముని గాంచును దివ్య దృష్టితోన్
కాంతులు జిమ్ముచున్న రవి కాననిచో కవి గాంచునే కదా

గురువుగారూ మన్నించాలి. పాండిత్యం లేకనే పద్యాలు వ్రాయాలనే తపనతో
వ్రాస్తున్నవాడిని. 3 వ పాదంలో అఖండ యతి వేసినాను.

కవి = వాల్మీకిమహర్షి బ్రహ్మతత్వం సిద్ధించి అంతర్ముఖుడైన పరమాత్మను దర్శించినాడు అనే భావంతో వ్రాసినాను. తప్పులను పండితవర్యులు దయతో సవరించ ప్రార్థన.

Pandita Nemani చెప్పారు...

అయ్యా! శ్రీపతి శాస్త్రి గారూ! అఖండ యతి గురించి చింతించకండి.
అదేమీ పెద్ద పొరపాటు కాదు. పూర్వ కవి ప్రయోగాలు కూడా ఉన్నవి.
రామకృష్ణారావు గారూ!
చేతురు, కోతురు వంటి ప్రయోగములు అసాధువులు. గాంచనొనర్తురు అని మారిస్తే బాగుంటుంది అని నా మనవి.
నేమాని సన్యాసిరావు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ సమస్యకు నా పూరణము.

గుణవరణాభిశోభితుని, గోప కిశోరుని కంటి చూపులో
తొణికిసలాడు ప్రేమ రవి కాంచగ నేరఁడు, సత్కవీశ్వరుల్
ఘనమగు వర్ణనాదులను గాంచనొనర్తురదెంత భాగ్యమో!
కనులఁ దొలంగు ప్రేమ రవి కాననిచో కవి గాంచునే కదా!

Pandita Nemani చెప్పారు...

రవి కవు లందభేదము విరాజిలు నా మనమందు నిల్చి యా
రవి నిడిపించె నా కలము రాజిల ప్రేముడి భావదీప్తితో
సువిధి సమస్య నింపెనిది చూచితి వీవెకదా యభేదమో
కవివర! బాగు బాగు, రవి కాననిచో కవి కాంచునే కదా

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

గురువుగారు,
మన్నించండి. ఉదయం సరిగా గమనించకుండా భావము మాత్రము ఇచ్చారని కందంలో పూరణ చేశాను. ఇప్పుడు ఇతర పూరణలు గమనించాక తెలిసినది.


ఆమని యందముల్ గనగ నాశలు చెప్పుట రాని వారలౌ
భామల మానసమ్మునను భావములెట్టుల యుండునోగనున్
కోమల శబ్దముల్ వరుస కూరిచి చెప్పెడి విద్యలందునన్
కమ్మని రీతి గానురవి కాననిచో కవి గాంచునే కదా!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీ నేమాని వారు చక్కని వృత్తాంతాన్నిమనకు వివరించారు. వారికి ధన్యవాదాలు.

మందాకిని గారూ!
మీరు సమస్యను మార్చి వ్రాసినా బాగానే ఉంది. సమస్యను మరల పూరించినది కూడా చక్కగా ఉంది.
అభినందనలు.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ! మీ హృదయంలోని భావన చక్కగా తేటతెల్లం చేసారు. పూరణ బాగంది. అభినందనలు.

శ్రీపతి శాస్త్రి గారూ! మీరన్నట్టుగా మూడవ పాదంలో ఉన్నది అఖండ యతి కాదు. స్వర యతే.
(నంతరమందు నిల్చు పరమాత్ముని గాంచును దివ్య దృష్టితోన్)
అంతరమందు - పరమ + ఆత్మ. చూచారు కదా! సరిపోయింది.
పద్యం కూడా చక్కగా వ్రాసిన మీకు అభినందనలు.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

చిన్న సవరణతో..
ఆమని యందముల్ గనగ నాశలు చెప్పుట రాని వారలౌ
భామల మానసమ్మునను భావములెట్టుల యుండునోగనున్
కోమల శబ్దముల్ వరుస కూరిచి చెప్పెడి విద్యనేర్చి దా
కమ్మని రీతి గానురవి కాననిచో కవి గాంచునే కదా!

రవి చెప్పారు...

రవి యను పేరు నాతనికి; రాజితసుందరభావనామనో
జ్ఞవిశిఖలన్ విహారములఁ సల్పు కవీంద్రుడు; స్నేహమున్ సదా
యవిరళ భంగి పంచు సతి; యర్మిలి దంపతులిద్దరున్ సరా
గవిధులఁ నిచ్చకంబుల ప్రకారము నుండ ప్రరాగి తాఁ గ
న్గవనిడె లీలగాను రవికాననిచో కవి కాంచునే కదా!

(పద్యంలో శ్లేష లేదా అమంగళార్థం ధ్వనిస్తే ప్రచురించకండి)

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఒంటిగ నాల్గు గంటలకు నొప్పుగ స్నానమునాచరించి మా
కంటిన పీడ దొల్గగ గ్రహంబుల స్తోత్రము నేను జేసితిన్
మింటిని జూచి తేను గన మిత్రుని, చుక్కయె గాను పించెగా
కంటిని భాగ్య మిద్ది , రవి కాననిచో కవి గాంచునే కదా!

చుక్క = కవి = శుక్రుడు
మిత్రుడు = సూర్యుడు

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

రవి గారూ,

మీ పద్యమాద్యంతము పదగుంభితమై, విశిష్టపదమాలికసంగతమునై విరాజిల్లుచున్నది. నాదొక్క మనవి. నాల్గవ పాదములో చివర గణము సరిపోలేదనుకుంటాను. తెలియపరచవచ్చునో లేదో............ మన్నించాలి.

రవి చెప్పారు...

సంపత్ కుమార్ శాస్త్రి గారు, మన్నించవలసిందేమీ లేదండి. నేనూ ఔత్సాహికుడనే. మీ సూచన కరెక్టే. నాలగవ పాదంలో గణభంగం జరిగింది. సవరించాను. చివరి పాదంలో శ్లేష ఇక్కడ ఎవరూ గమనించలేదనుకుంటాను. (అదీ మంచిదే. :))
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

రవి యను పేరు నాతనికి; రాజితసుందరభావనామనో
జ్ఞవిశిఖలన్ విహారములఁ సల్పు కవీంద్రుడు; స్నేహమున్ సదా
యవిరళ భంగి పంచు సతి; యర్మిలి దంపతులిద్దరున్ సరా
గవిధులఁ నిచ్చకంబుల ప్రకారము నుండ ప్రరాగియయ్యు క
న్గవనిడె లీలగాను రవికాననిచో కవి కాంచునే కదా!

కమనీయం చెప్పారు...

భువి ,పతి పత్నియున్ ,చనెడి పోకడలున్ సరసోక్తులాడుటల్,
తవిలి ప్రియుల్ రహస్సులను దాచు నిగూఢ విలాస చర్యలన్ ,
తివిరి దురాశ దుర్జనులు తీవ్రముగా నొనరించు తంత్రముల్,
కవులకె యూహ దోచు ,రవి కాంచనిచో కవి కాంచునే కదా !

Pandita Nemani చెప్పారు...

Congratulations to all the friends who have participated in this column

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.