గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, నవంబర్ 2011, శనివారం

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము 1.

సాహితీ ప్రియ మిత్రులారా!
డా. దేవ గుప్తాపు సూర్య  గణపతిరావు గారు చిత్ర కవితాభిరతులనే విషయం ఇదివరలో ఆంధ్రామృతం ప్రచురించిన ఈ కవిగారి నాగ బంధం చూచిన మీకు తెలిసిన విషయమే.
వృత్తి రీత్యా వీరు సుప్రసిద్ధ వైద్యులు.
ఐనప్పటికీ వీరి ప్రవృత్తి చిత్రకవితా రచన ద్వారా మన  తెలుగు భాషలో గల కవిత్వ మహనీయతను లోకానికి చాటడం.
ఈ మహా చిత్ర కవి రచించిన పద్మ వ్యూహం అనే దశావతార బంధ ప్రబంధమున గల వినాయక స్తుతి ఓంకార బంధమును గమనించండి.
ఇటువంటివి వీరు రచించినవి సుమారు 73 ఉన్నవి.
మనము కూడా ప్రయత్నిస్తే ఇటువంటి పద్యములను తప్పక అద్భుతంగా వ్రాయకలము. మీరూ ప్రయత్నించండి. చిత్ర కవితాభివృద్ధిరస్తు అని ఆ శారదాంబ శుభాశీస్సులు మనకు లహించును గాక.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

6 comments:

Pandita Nemani చెప్పారు...

గణపతి దేవ కవీంద్రుడు
గణపతి రావనెడు బంధకవి నేడిలలో
ఘృణిమయ పద్యతతులతో
మణిహారము వాణికిచ్చి మన్ననలందెన్

మిస్సన్న చెప్పారు...

ఆర్యా ! డాక్టరు గణపతిరావు గారు సాధించిన ప్రక్రియ అనన్య సామాన్యము మీ బోటి సాహితీ ద్రష్టలకును, కవిస్రష్టలుకునూ తప్ప.

పద్మవ్యూహము తన కర
పద్మమ్ముల రూపు దాల్చి ప్రఖ్యాతి గనెన్
పద్మాసన వారల హృ-
త్పద్మమ్మున నిల్చియుంట పండితవర్యా!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! సన్యాసిరావు గారూ!

ఘృణిమయ హృదయాబ్జమ! మన
గణపతి కవి నుగ్గడించి కమ్మని కందం
బనుపమ గతి నొడివిన మీ
కొనరింతున్ వందనంబులురుగుణ గణ్యా!

ప్రియమైన మిస్సన్న గారూ!

పద్మాసననే కవి హృత్
పద్మమ్మున నిలువ కోరు పండిత! మీ హృత్
పద్మమ్మున నిలిచిన యా
పద్మాసనయే కవితను పలికించినదా?

ఏది యేమైనా మీ పద్యం హృద్యంగా ఉంది. అభినందనలు.

గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

తేనె లూరెడి రంగుల తెలుగు విరులు
జిలుగు కవితల బంధించి చెలువు గొలుపు
సరులు గూర్చివొ గణపతి సత్కవీంద్ర
శారదాంబకు గంఠంబు సత్ ప్రభలిడ !

గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

తేనె లూరెడి రంగుల తెలుగు విరులు
జిలుగు కవితల బంధించి చెలువు గొలుపు
సరులు గూర్చివొ గణపతి సత్కవీంద్ర
శారదాంబకు గంఠంబు సత్ ప్రభలిడ !

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

వ్యూహము లెన్నో' పద్మ
వ్యూహ' మ్మే నేర్పె మాకు నుత్సాహముతో
నోహో గణపతి వర్యా
ఊహలనే మించె జూడ నుత్తమ చరితా !

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.